తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్ వివాదానికి ఫుల్‌స్టాప్ పడలేదు సరికదా, మరింత ముదిరింది. ఫలితంగా అరుదైన, అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ వర్గాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇక, అధికార వర్గాల్లో అయితే వణుకు మొదలైంది. ఎందుకంటే, గవర్నర్ తమిళిసై నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలపై కన్నెర్ర జేస్తున్నారు. అధికారులను నేరుగా నివేదికలు కోరుతున్నారు. దీంతో, తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థకు, అధికార వ్యవస్థకు మధ్య అంతరం మరింత పెరిగిందన్న విశ్లేషణలు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల కాలంగా పలు బలవన్మరణాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట తల్లీ కొడుకులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. మరోచోట ఓ బీజేపీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు, కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు, బెదిరింపులు, వేధింపులపై నిత్యం వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి రాజకీయంగా ప్రకంపనలు చెలరేగు తున్నాయి. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. ఏం జరిగిందో సమగ్రంగా నివేదికలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.
కొన్ని నెలలుగా గవర్నర్ తమిళిసై, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య పరోక్షయుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా నువ్వా? నేనా? అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. రాజ్‌భవన్ రాజకీయ వేదికగా మారిందని సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ నేరుగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు, గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అటు ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ కొద్దిరోజుల క్రితమే కేసీఆర్ తీరుపై బహిరంగంగా మాట్లాడారు. గవర్నర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ సర్కారుతో రాజ్‌భవన్‌కు నెలకొన్న వివాదం తేటతెల్లమయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన, కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించడం, ప్రధాని నరేంద్రమోదీ సహా హోంమంత్రి అమిత్‌షాను కలవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించాయి. అంతేకాదు, ప్రధాని, హోంమంత్రితో భేటీ తర్వాత తమిళిసై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సై అంటే సై అన్నట్లుగా తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో, గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ నేతల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన మొదలయింది. గవర్నర్ కేంద్రానికి ఏ నివేదిక ఇచ్చారో, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అన్న చర్చ అంతర్గతంగా మొదలయింది. అందుకే తమిళిసై ఢిల్లీ పర్యటన తర్వాత అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గవర్నర్‌పై నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలపై గవర్నర్ తమిళిసై టిట్ ఫర్ టాట్ అన్న మాదిరిగా స్పందిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థనే టీఆర్‌ఎస్ పార్టీ అవమానపరుస్తున్న తీరుపై కన్నెర్ర జేస్తున్నారు. స్వయంగా విద్యాధికురాలు, వైద్యురాలు కూడా అయిన గవర్నర్.. తనకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలు, అధికారాలను వినియోగించుకుంటున్నారు. ప్రజాదర్బార్‌కు మరింత పదును పెట్టారు. దీంతో, తెలంగాణలో పరిణామాలు ఆసక్తికరంగా, ఓ మాదిరి ఉత్కంఠ భరితంగా మారాయి.
గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చర్చనీయాంశంగా మారిన అంశాలపై స్పందిస్తున్నారు. తనకున్న అధికారాలను ప్రయోగిస్తున్నారు. అధికార వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దుష్పరిణామాలు పునరావృతం కాకుండా ఉండటమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడు సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు కామారెడ్డి జిల్లాలో తల్లీ కొడుకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు సంఘటనల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపైనా, పోలీసులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు వేధించారన్న విమర్శలు వచ్చాయి. న్యాయం చేయాల్సిన పోలీసులే వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు దొరికాయి. అయినా, చర్యలు లేవంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఈ సంఘటనలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడైన సాయి గణేష్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, సర్కారు ప్రజావ్యతిరేక చర్యలను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పోలీసులు అతనిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధించారని, నిత్యం నరకయాతన పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రోద్బలంతోనే పోలీసులు సాయి గణేష్‌ను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిగణేష్ మరణంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుడి తరపు బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, స్పందించిన హైకోర్టు.. సాయిగణేష్ ఆత్మహత్య కేసులో మంత్రి అజయ్‌కి నోటీసులు కూడా జారీచేసింది. మరోవైపు.. ఇదే అంశంపై గవర్నర్ తమిళిసై నివేదిక కోరారు.
ఇక, కామారెడ్డిలో తల్లీ, కొడుకులు పద్మ, సంతోష్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో సూసైడ్ వీడియో కీలకంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్‌తో పాటు మరికొందరి వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంతోష్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. వ్యాపారంలో తనను మోసం చేసిన వాళ్లతో కుమ్మక్కై తీవ్రంగా వేధిస్తున్నారని, ఏమేం జరిగిందన్న విషయాలన్నీ సెల్ఫీ వీడియోలో వివరించాడు. ఈ సంఘటనలోనూ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా గవర్నర్ తమిళిసై జిల్లా అధికారులను నివేదిక కోరారు.
అంతేకాదు, సాయిగణేష్ కుటుంబ సభ్యులతో గవర్నర్ తమిళిసై స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. మొన్న వరంగల్‌లో యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రేమోన్మాది విషయంలోనూ గవర్నర్ జోక్యం చేసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు.. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో వివరాలు తెలియజేయాలంటూ అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా గురించి కూడా గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ అధికారులను, వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా, నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. వాస్తవానికి వారం రోజులుగా మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన కొన్నేళ్లుగా పలు కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేస్తూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్న విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు నిత్యం నిరసనలు చేపడుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మీడియాలో వస్తున్న వరుస కథనాలతో గవర్నర్ ఈ అంశంపైనా స్పందించారు.
మొత్తానికి తెలంగాణలో నెలకొన్న ఈ పరిణా మాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ తరహాలో సాగు తున్న యుద్ధంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్