(ఆరోగ్యం:ఆనందం)
తాంబూలం తతంగం
‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ అంటాడు గురజాడవారి కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావుధాన్లు. ఇంట్లో ఆడవారికి ఒక్క ముక్కా చెప్పకుండా ఎనిమిదేళ్ల పిల్లని 60యేళ్ళ ముసలాడికి కట్టబెట్టేందుకు వీధరుగు మీదే తాంబూలాలిచ్చేసిన ఘనుడతను. అగ్నిహోత్రావుధాన్లు తాంబూలం ఇచ్చేసినంత తేలిక్కాదు, ఒకరాజుగారు కవికో, యోధుడికో, సామంతుడికో తాంబూలం ఇచ్చి గౌరవించటం అంటే! దాని వెనక చాలా తతంగం ఉంటుంది.
రాజు శుచిగా స్నానం చేసి, తాంబూలాధికారి (అడపంగారు)ని పిలిచి తాంబూల ప్రదానానికి సిద్ధం చేయిస్తాడు. మేఘవర్తిపురంలోనూ, ఈశ్వరపురం లోనూ, కారటీపురంలోనూ పండిన వక్కల్ని తెప్పించి, రాజు సమక్షంలో వాటిని ఉడికిస్తారు. వక్కకాయలు కొద్దిగా ఎర్రగా అయ్యేవరకూ ఉడికించి ఆరబెడతారు. మామిడితొడిమ రసం, గంధం పొడి, కర్పూరం కలిపిన నీళ్లలో వీటిని నానబెడ్తారు. పైన పొరని చెక్కి, నీడన ఆరబెడతారు. ఏడాదికన్న ఎక్కువ వయసున్న తీగనుండి పెద్దవిగా తెల్లగా లేతవిగా ఉన్న తమలపాకులు తీసుకుని వాటిమీద రాజుగారు నదీజలం చల్లి సంప్రోక్షణం చేస్తాడు.
వివిధ ఆకారాలలో తాంబూలం మడవగల నిపుణుల్ని పిలుస్తారు. ఆకుల తొడిమల్ని కొనల్ని తీసేసి మధ్య ఈనె దగ్గర చీలుస్తారు. శైలోదకం (చన్నీళ్లు)తో తడిపిన మంచి ముత్యాల భస్మాన్ని ఆకులకు రాసి. మామిడివాసన కలిగి మలయా చలంలో పుట్టిన శ్రేష్ఠమైన పచ్చకర్పూరాన్ని, గంధం పొడిని తగుమోతాదులో ఆ ఆకులమీద ఉంచుతారు.
‘‘కస్తూరీ శశి తక్కోలం జాతీఫల సుచూర్ణకం/ఖదిరక్వాథ చూర్ణంతు కస్తూరీ తక్కోలమిశ్రితం
శ్రీఖండ కల్క సంయుక్తం కర్పూర రజసమన్వితం /మేళయిత్వా సమ్యక్ భాగైః గుళికా కల్పితా శుభా’’
కస్తూరి, తక్కోలం, జాజికాయ, కాచు, వీటిని కూడా ఈ ఆకులమీద ఉంచి, అందమైన ఆకృతులలో మడుస్తారు.
తాంబూలాన్ని ఏ హోదా కలిగిన వ్యక్తికి ఇస్తున్నారో ఆ స్వీకర్త హోదాని (ప్రోటోకాల్) బట్టి ఎన్ని ఆకులు వెయ్యాలి, ఎన్ని వక్కలు వెయ్యాలి లాంటి నియమాలుండేవి. దేవాలయ సిబ్బందిలో శుభ్రపరిచే వారికి మంగళ వాద్యకారులకు, పూజారులకు ఇలా ప్రతీ ఒక్కరికీ ఇన్ని ఆకులు, ఇన్ని వక్కలు అని నిర్దేశిస్తూ వ్రాసిన శాసనాలున్నాయి.
వాణిజ్య శ్రేణులవారు తమని ఫలానా నగరాధీశులుగా చెప్పుకునేవారు ‘‘తెలికిశ్రేణి అంటే నూనె వ్యాపారుల సంఘం. తాము బెజవాడ ప్రభువులం అనీ, అయోధ్య ఇక్ష్వాకు వంశజులం అనీ ఈ తెలికి వర్గం వారు చెప్పుకున్నారు. ‘తెలికి వేవురు చేసిన శాసనము’ అంటే వెయ్యిమంది తెలికి శ్రేణి (గిల్డ్ లాంటిది) సభ్యులు చేసిన శాసనాన్ని ప్రభువు కూడా అంగీకరించేవాడు. తెలికి సామాజికవర్గం ప్రము ఖులు వెయ్యిమంది చేసిన నిర్ణయం ప్రకారం ఏ రాజైనా సరే, తెలికివారింట వివాహం జరుగుతుంటే రాజు ఆ ఇంటివారిని ఆహ్వానించి తాంబూలం ఇచ్చి గౌరవించి పంపాలనే కట్టడి ఉండేది.
రాజ్యంలో ప్రముఖులకు ఆదరణనీయులకు తాంబూల గౌరవాలివ్వటం రాజులకూ ఇష్టమైన విషయమే! వృత్తిపరంగా నిపుణులు (•తీ•ఱ•అ), వ్యాపారుల గిల్డు చేసే సూచనలను తీర్మానాలను ప్రభువు అంగీకరించి, తన సంఘీభావం ప్రకటించే వాడు. ప్రభుత్వాలకు ఇప్పటికన్నా ఎక్కువగానే పౌర సంబంధాలు ఉండేవారోజుల్లో! ‘‘కప్పురపు వీడియంబును కైరవళ్లు నొసగె’’ కర్పుర తాంబూలం కైరవళ్లు ఇచ్చి గౌరవించేవారట.
బీడా ఎత్తటం
బీడా అనేది విడెము (తాంబూలం)కు పర్షియన్ రూపం. హిందీలో ‘‘బీడా ఉత్తాన్’’ అంటే తాంబూలం తీసుకుని కష్టసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేయటం. దీన్నే తెలుగులో కూడా ‘బీడాఎత్తటం’ అంటారు. వీర తాంబూలం అని మనవాళ్లు అన్నది దీన్నే! దీన్ని మొఘల్ పాలకులూ అవలంభించారు. సుల్తానులు కూడా పాటించారు. విజయనగర కాలంలో ఇది ప్రధానమైన ఆచారంగా మారింది. దసరా రోజున ఆయుధ పూజ చేసే అలవాటు వెనుక ఈ వీర తాంబూలం పాత్ర ఉంది.
వానల వలన యుద్ధాలకు అనుకూలత తక్కువ కాబట్టి, సైనిక శక్తిని సమృద్ధం చేసుకోవటానికి రాజులకు కావలసిన విరామం వానాకాలంలో ఉంటుంది. వానలు వెనకబడగానే యుద్ధ భేరీ భాంకారాలు మార్మోగుతాయి. విజయదశమి నాడు ఆయుధపూజ చేస్తారు. రాజు తన సైనికబలగాన్ని సమీక్షించుకుంటాడు. తగిన వ్యూహాన్ని రూపొందిం చుకుని యుద్ధానికి బయల్దేరేందుకు విజయదశమిని ఒక ముహూర్తంగా ఎంచుకుంటాడు. వీరాధివీరు లైన సైనికులను సమావేశ పరుస్తాడు. వీర తాంబూలం ఇచ్చి, వారి నుండి విజయం సాధించ గలననే వాగ్దానం తీసు కుంటాడు. ఇదీ ‘బిడాఎత్తటం’ అంటే!
విజయనగర ప్రభువులు దసరా ఉత్సవాలను నిర్వహించిన తీరు గురించి డొమింగో పేస్, అబ్దుల్ రజాక్ లాంటి యాత్రికులు కొన్ని వివరాలు రాశారు. ఇప్పటి రిపబ్లిక్ డే పెరేడ్ నాడు దేశరక్షణ యంత్రాంగాన్ని ప్రదర్శించినట్టే రాయల కాలంలో సైనిక కవాతులు, ఏనుగులు, గుర్రాలు, మర ఫిరంగులు వగైరా ప్రదర్శించేవారు. మల్లయుద్ధాలు, కత్తి యుద్ధాలు, విలువిద్య ఇతర యుద్ధ విద్యా ప్రదర్శనలు ఈ తొమ్మిది రోజులూ జరిగేవి. ప్రజలు లక్షలాదిగా రాజధానికి తరలివచ్చి వీటిని తిలకించే వారు. రాజభక్తి, శౌర్యము, స్థిరత్వం కలవారిని ఎంచుకొని తాంబూలం ఇచ్చి గౌరవించటం ఈ ఉత్సవాల నిర్వహణ లక్ష్యం.
తంజావూరు పాలకులు తాంబూలం మీద విశేష ప్రయోగాలు చేశారు. దాన్ని లైంగికశక్తిని పెంచే ఒక ఉత్తమ సాధనంగా భావించేవారు. అలా ఉపయో గించుకునేవారు కూడా! బ్రిటిష్ యుగంలోనే తాంబూల సదాచారానికి పొగాకుని చేర్చి తాంబూల గౌరవాన్ని విదేశీ పాలకులు మైలపరిచారు. ఈనాటికి ఈ పొగాకు ఒక జాడ్యంగా ముదిరిపోయి కొనసాగుతోంది.
వారాంగనలకు తాంబూల గౌరవం
‘‘విదేశీ రాయబారులు తమ కొలువుల కేతెంచినపుడు నాటిరాజులు మర్యాదకై వీడ్యము (తాంబూలము) లిచ్చిరి, దమయెదిరికి ప్రియా ప్రియులు మనసులోని మరులను వక్కలాకులతో
ఉదెలిపిరి’’ అని ఆనాటి విదేశీ యాత్రికులు విజయ నగర సామ్రాజ్యంలో తాంబూల గౌరవం గురించి శ్రీ భావరాజు కృష్ణారావుగారు ‘‘ఆంధ్రదేశము విదేశీ యాత్రికులు’’ అనే గ్రంథంలో రాశారు. అబ్దుల్ రజాక్ రాతల్ని ఇలా వివరించారు: రాణివాసపు స్త్రీలు, వారాంగనలే కాదు, సాధారణ పామర స్త్రీలు కూడా ‘‘తరుణధావన ధగధగద్దశన మణులయందు లేతవీడ్యములడాలు హత్తుకొల్సి’’రని తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహ్మ్యాం(3-74) లో వర్ణించాడు.
తాంబూలం ప్రోటోకాల్
తాంబూల గౌరవం మొదటగా గురుత్రయానికి అందజేయాలి. శంకరాచార్యులు, జీర్ణాద్వైతమత పునరుద్ధారకులైన శ్రీ చిదానంద సరస్వతీ స్వామి (లక్ష్మీనారాయణ దీక్షితులనేది పూర్వాశ్రమ నామ ధేయం) ఆ కార్యక్రమాన్ని నడిపించే పురోహితుడు ఈ ముగ్గురుకీ మొదట తాంబూలం ఇవ్వాలి. బంధుయాజనపరులలో పూజ్యులైన ఒకర్ని ఆహ్వానించి వారికి అగ్రతాంబూలం సమర్పించాలి. ఆ తరువాత విద్యాది యోగ్యతానుసారంగా తాంబూలాదులివ్వాలి. ‘‘శ్రీ దీక్షితపద్ధతి నియమావళి’’ అనే గ్రంథంలో ఈ తాంబూలం ప్రోటోకాల్ వివరాలున్నాయి. మదర్పిత చందన తాంబూలాదులు గైకొని అనటం అంటే దానివెనుక ఇంత ప్రోటోకాల్ నిబంధనావళిని పాటిస్తాననే వాగ్దానం ఉంది. పాటించాలి కూడా!
విశ్వబ్రాహ్మణులకు ప్రథమ తాంబూలార్హత
‘‘దేవాలయాలకు ‘శంకుస్థాపనలు, యజ్ఞ యాగాదులు, యూపప్రతిష్ఠ, నూతన గృహ ప్రవేశాలు, వివాహోపనయన సమయాలలోనూ, మహాసభల్లోనూ గంధపుష్ప తాంబూల వస్త్రాభరణా లతో బ్రాహ్మణాది చాతుర్వర్ణాలవారికి బహూక రించడం’’ ఆచారం అని స్వర్ణ సుబ్రహ్మణ్యకవి రాశారు. ‘‘విగ్రహాలకు శిల్పి తల్లి అయితే, శాస్త్రం తండ్రి లాంటిదని రూపంలేని శిలా మృణ్మయ దారులోహాదులకు రూపాన్ని కల్పించి వానికి ప్రాణప్రతిష్ఠ, షోడశ కళాన్యాసాలు చేయవలసి ఉంటుందని, ప్రాణప్రతిష్ఠ మంత్రం తర్వాత నమక చమక పురుష సూక్తాలతో అభిషేకం చేసి, భస్మగంధక్షత పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల మంత్రపుష్పాది షోడశోపచారాల్ని శిల్పాచార్యులే చేయవలసి ఉంటుంది. కాబట్టి, విశ్వబ్రాహ్మణులకు ప్రథమ తాంబూలార్హత ఉంటుంది’’ అని రాశారాయన
తాంబూల బిరుదాంకితుడు
13వ శతాబ్ది నాటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రదేవుని ఆస్థానంలో 20 మంది మహాకవు లుండేవాళ్లట. ‘‘మంగళపల్లి భాస్కరుడు’’ వాళ్లలో ముఖ్యుడు. ఒకరోజు ప్రతాపరుద్రుడు నవరత్నాలు పొదిగిన బంగారు పళ్లెంలో అమూల్యమైన రత్నాభరణాలు, కర్పూర తాంబూలం ఉంచి, నా ఆస్థానంలోని కవులందరిలో గొప్ప కవిత్వం చెప్పినవారికి ఈ పళ్లెంలో నగలుతో సహా కర్పూర తాంబూలం సమర్పిస్తానని ప్రకటించాడని, ఆ పోటీలో తాంబూలాన్ని గెలిచి మంగళపల్లి భాస్కరుడు హళక్కి భాస్కరుడయ్యాడనీ, కన్నడంలో ‘హళక్కి’ అంటే తాంబూల గౌరవంతో ఇచ్చే బిరుదని ఒక కథ వ్యాప్తిలో ఉంది.
ఈ కథకు ఆధారాల్లేవు. ‘హళక్కి భాస్కరుడు’ ‘హుళక్కి భాస్కరుడు’ ఎలా అయ్యాడో తెలీదు. ఉత్తర కన్నడ ప్రాంతంలో ‘హళక్కి ఒక్కలిగ’ అనే ప్రజలున్నారు. ‘హళక్కికన్నడ’’ అనే మాండలికభాష మాట్లాడతారు. వారికీ ఈ తాంబూల బిరుదుకూ సంబంధం లేదు. పైగా కన్నడంలో హుళక్కి, హుళికి, హుళిక్కి, ఉళక్కి అంటే, వట్టిమాట, అబద్ధము అని! తెలుగులోకూడా ఇదే అర్ధంలో ఈ మాటని వాడతారు. కాకతీయుల కాలానికి సత్యము, ఉదాత్తమైనదనే అర్థంలో ఈ పదం వాడకంలో ఉండేదేమో తెలీదు. కాలానుక్రమంలో కొన్ని పదాలు అర్ధవిపర్యయం చెందటం సహజం. హుళక్కి అలాంటిది కావచ్చు. తెలుగులో తొలి రామాయణ అనువాదం భాస్కర రామాయణ అవతరణకు కారకుడు, ప్రేరకుడు అయిన ఈ భాస్కర మహాకవికి తెలుగు హుళక్కి బిరుదు తాంబూలంతో ముడిపడి వచ్చింది!!
రాయలకాలం నాటి రెష్టారెంట్లు
కందుకూరి రుద్రకవి 1480-1560 నాటి కవి. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడని చెప్తారు. జనార్దనాష్టకం, నిరంకుశో పాఖ్యానం, సుగ్రీవవిజయం యక్షగానం ఈయన రచనల్లో ముఖ్యమైనవి. ఈనాటి ప్రకాశంజిల్లా, కందుకూరుకు చెందినవాడు.
‘నిరంకుశుడనే ఓ బ్రాహ్మణ యువకుడు రాత్రిపూట వేశ్యావీధుల్లో తిరుగాడుతున్న వైనాన్ని తన నిరంకుశోపాఖ్యాన కావ్యంలో ఇలా వర్ణించాడాయన: ‘‘మీర ఘనసార తాంబూల సౌరప్రవాహవహగంధ వాహప్రదోహ మోహ/వశవిశా లేక్షణా జనస్యాంతుడగుచు, రాత్రుల జరించు చుండునా బ్రావ్మాణుండు’’ అని!
నిజానికి 500 యేళ్లనాటి ఈ వర్ణన చూస్తే ఇప్పటి కుర్రాళ్లను చూసి వర్ణించాడా అనిపిస్తుంది. మనం ఏదో నాగరికులమని మన పూర్వులంతా పాత చింతకాయ పచ్చడి, వాళ్లకేమీ తెలీదని అనుకుంటూ ఉంటారు కదా… కానీ ఈ నిరంకుశుడి వేషం ఇప్పటి వాళ్లని మించిపోయింది. కర్పూరపు తాంబూలం సువాసన సన్నగాలి మొలకలతో కూడి సోకుటవలన కామినులు మోహపరవశు లౌతుండగా రాత్రిళ్లు తిరుగుతున్నాడట.
మెడలో ఒంటిపొర రుమాలు వేసుకున్నాడట. చల్లడ అంటే, సగం తొడలదాకా తొడిగిన గుడిగి (కురుచలాగు-షార్ట్ లంటూన్నాం వాటిని ఇప్పటి రోజుల్లో) తొడుక్కుని వీధుల్లొ సంచారిస్తున్నాడట నిరంకుశుడు. మెడలో కాలర్ కింద ఎర్ర జేబురుమాల, షార్టులు వేసుకుని రోడ్లమీద తిరగటం ఏ అమెరికా వాణ్ణో చూసి మనవాళ్లు చెయ్యలేదు. మనవాళ్లని చూసే పోర్చుగీసులు, ఫ్రెంచివాళ్లూ ఇలాంటివి నేర్చారు. అద్దె చెల్లిస్తే పడక వసతులు, పడక సౌఖ్యాన్నిచ్చే పడతులు, భోజన హోటళ్లు, మసాజ్ సెంటర్లు ఒకటేమిటీ అన్నీ దొరికే అక్కవాడలు రాయల యుగంలో రాజధాని నగరంలో ఉండేవి.
– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు, 9440172642