(ఆరోగ్యం:ఆనందం)
రెండు తాంబూలాల గౌరవం
ప్రాచీన సంస్కృత సాహిత్యంలో తాంబూల గౌరవానికి సంబంధించి అనేక ఉదంతాలు మనకు కనిపిస్తాయి: శ్రీహర్షుడు రాజాశ్రయం పొందాలని ప్రయత్నించినప్పుడు మనసులో ‘‘తాంబూలద్వయ మాననంచ లభతే యః కాన్యకుబ్జేశ్వరాత్’’ తనకు కన్యాకుబ్జ ప్రభువు నుండి తాంబూల ద్వయ గౌరవం దక్కాలని మనసులో అనుకుంటాడు.
తాంబూల ద్వయం అంటే ఏమిటీ? పండు, తాంబూలం, శాలువా ఇలాంటి గౌరవాలను ఒక్కటిగా ఇవ్వరు. రెండు పండ్లు, రెండు తాంబూ లాలు, రెండు శాలువాలూ ఇచ్చేవారు. బహుశా గౌరవం పొందే వ్యక్తికీ, అతని భార్యకూ కలిపి రెండు గౌరవాలూ ఇచ్చే వారనుకుంటాను. రెండు పండ్లు, రెండు శాలువాలు అనేదే ‘‘దౌ శాలువా’’- ‘‘దుశ్శాలువా’’ అయ్యిందని పండితులు చెప్తారు. దౌశాలువా లాగానే దౌతాంబూలం ఇచ్చే ఆచారం కూడా ఉండేదన్నమాట.
200 యేళ్లనాటి హైదరాబాదీ తాంబూలం
ఏనుగుల వీరాస్వామి (1780 – 1836) యాత్రాసాహిత్య కర్త. ఆయన ‘కాశీయాత్ర చరిత్ర’ 200 యేళ్లనాటి భారతీయ సమాజాన్ని రికార్డు చేసిందని భావించవచ్చు. ఆయన హైదరాబాదు సందర్శించారు. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు రాస్తూ, ‘‘హెదరాబాదులో గొప్పవారందరున్నూ పండుటాకులు (తమలపాకులు) వేసుకొనుచున్నారు. బాలకొండలో పండుటాకులు దొరకును. కడప మొదలుగా గోదావరీ తీరమువరకు (నిజామాబాదుకు ఉత్తరములో) అమ్మే వక్కలు ముడి వక్కలు, ఈ దేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవ డము లేదు, వక్కలు మాత్రము నములుతారు, శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు. హైదరాబాదులో పండ్లు దొరకును. కాని ‘‘చెన్న పట్టణము కంటే మూడింతల వెల యివ్వవలసినది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియమైనా మహా రుచికరముగా నున్నవి, ‘‘కూరగాయల రుచికి హైదరాబాదు సమముగా యీ వరకు నేను చూచిన భూమిలో యేదిన్నీ కూడ చెప్పలేదు’’ ఇలా రాశారాయన. మద్రాసు తమలపాకులు, కూర గాయలకన్నా ఆనాటి హైదరాబాద్ ఆకులు కూరగాయలు చాలా రుచికరంగా ఉండేవిట.
1550 నాటికే పొగాకు తాంబూలం
‘‘గుడిసెయు మంచము కుంపటి/విడియమును పొగాకు తన్ను విడవొల్లని మే/ల్పడతియు గలిగిన జలియెక్కడి దప్పా….’’ అని కవి చౌడప్ప, చలికాలంలో వేడిని కలిగించే సాధనంగా తాంబూలాన్ని, పొగాకుని పేర్కొన్నాడు, మట్లి అనంత భూపాలుడు, తంజావూరు రఘునాథనాయకుడు ఇతన్ని సన్మానించటాన్ని బట్టి 1550-1640 మధ్య కాలం నాటి వాడని తెలుస్తుంది. అంటే 1550 నాటికే పొగాకు జన సామాన్యానికి అందుబాటులోకి రావటం, మన వాళ్లు అనాటికే చుట్టపీకలు తాగటం మొదలై పోయాయ నటానికి ఈ పద్యం సాక్ష్యం.
పరగడుపు తాంబూలం
‘‘ప్రాతర్భుక్త్వా దంతకాష్ఠం తాంబూలం సర్వదా భజేత్’’ ఉదయంపూట ఏదైనా తిన్నతరువాత నోరు కడుక్కొని తాంబూలం సేవించాలని ఆప్తవాక్యం. ఈ వాక్యంలో చెప్పదగిన సూచనలు కొన్ని ఉన్నాయి. నిద్రలేస్తూనే ఖాళీ కడుపున తాంబూలం సేవించ కూడదు. ఏదైనా తిన్న తరువాత వేసుకోవాలి. తాంబూలం వేసుకోవటం అంటే భోజనం అయ్యిందని అర్ధం. తాంబూలం తిన్నాక అన్నం తినటం సబబు కాదు.
పప్పు తాంబూలం
నలమహారాజు పాకదర్పణం అనే గ్రంథం రాశాడు. ఇది తొలి ఆహార శాస్త్ర గ్రంథం. ఆయుర్వేద సంహితలకు వ్యాఖ్యానాలు రాసిన చక్రపాణిదత్త లాంటివారు ఈ గ్రంథంలోంచి అనేక అంశాలను ఉదహరించటం వలన ఇది ప్రామాణిక గ్రంథంగా పేరుతెచ్చుకుంది. ఇందులో కందిపప్పు, పెసరపప్పు ఉలవల్లాంటి పప్పుధాన్యాలతో పప్పు వండుకోవటం గురించి అనేక విశేషాలున్నాయి. వండిన ముద్దపప్పులో చల్లారాక చిటికెడంత పచ్చకర్పూరం కలపాలి. తొడిమనీ, కొననీ తీసేసిన లేత తమలపాకు పైన ఈ పప్పు మందంగా పరిచి, ఆకుని మడిచి విస్తట్లో వడ్డిస్తారు. ఈ పప్పు తాంబూలాన్ని కొద్దికొద్దిగా కొరుకుతూ నెయ్యి కలిపిన వేడన్నంతో తింటారు. ఇది రాజభోజనం (=శీ••శ్రీ ఖీశీశీ•) అన్నాడు నలుడు. ఇలా తింటే పప్పు వలన గ్యాస్, ఉబ్బరం, భుక్తాయాసం కలగకుండా ఉంటాయి.
ముఖారవింద తాంబూలం
భీష్మపురాణంలో శ్రీనాథుడు శ్రీకృష్ణస్తుతి చేస్తూ, ‘‘బాలిక మోమును తవనబర్హి కిశోరకలాస్య లీల బైవాలిచి పచ్చ కప్పురపు వాసన తోడి ముఖారవింద తాంబూలపు మోవిమోవి పయి మోపుచు రాధకు నిచ్చు ధూర్తగోపాలుడు బ్రోచుగావుత’’ అంటూ పచ్చకర్పూరం సువాసనతో కూడిన తన ముఖార విందపు తాంబూలపు మోవిని రాధ మోవికి ఆన్చి అందించిన శ్రీకృష్ణుడు బ్రోచుగాక! అని వర్ణిస్తాడు. ముఖారవింద తాంబూలం అనేది నోటి నుండి నోటితో అందుకోవలసింది. రెండు మోముల్ని, రెండు తనువుల్ని, రెండు హృదయాల్ని రెండు కుటుంబాల్ని, రెండు దేశాల్ని, రెండు శక్తుల్ని, రెండు సంస్థల్ని, రెండు వ్యవస్థల్ని ఏకం చేసేది ముఖారవింద తాంబూలం.
ఆహ్వాన తాంబూలం
పెళ్లి కార్డుల మీద సకుటుంబ సమేతంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొనమని గొప్పగా రాస్తుంటాం. కానీ, పెళ్లికి తరలివచ్చిన అసంఖ్యాకులైన అతిథులకు అలాంటి తాంబూల సత్కారాలు క్రమేణా అదృశ్యమౌతు న్నాయి. వచ్చామా-తిన్నామా-వెళ్లామా అన్నట్టు ఎక్కువ పెళ్లిళ్లకు అతిథులువచ్చి వెళుతున్నారు. విందు భోజనం తరువాత కట్టిన కిళ్లీలు ఇస్తున్నారుగా అదే తాంబూల సత్కారం ఇప్పటి కాలంలో! ఒకప్పుడు పెళ్లికి పిలవటానికి తాంబూలం ఇచ్చేవారు. పెళ్లికి వచ్చాక తాంబూల సత్కారం చేసేవారు. తిరిగి వెళ్లేప్పుడు వీడ్కోలు తాంబూలం ఇచ్చేవారు. పెళ్లంటే తాంబూలంతో మొదలై తాంబూలంతో ముగిసే వేడుక. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని పల్లెల్లో హరికథలు, బుర్రకథలు, వీధినాటకాలు ఒక ఊరిలో జరుగుతూ వుంటే తమ ఊరిలో కార్యక్రమం జరపండని అందరి సమక్షంలో తాంబూలం ఇచ్చి ఆ కళాకారుల్ని ఆహ్వానించే ఆచారం ఇంకా కొనసాగుతోందట.
వీడ్కోలు తాంబూలం
వ్రతాన్నో హోమాన్నో పూజనో ప్రారంభించ బోయే ముందు వినాయకుడికి, ఇతర దేవతలకు తాంబూలం ఇస్తారు. తాంబూలంతో పాటు అందులో దక్షిణ కూడా ఉంటుంది. వ్రతాలు చేప్పటప్పుడు కాసిన్ని చిల్లర నాణాలు దగ్గరుంచుకోమంటా రందుకే! వ్రతం అయ్యాక వీడ్కోలు చేసేప్పుడు సంభావన లేకపోయినా కనీసం తాంబూలమైనా ఇచ్చి పంపాలి. లేకపోతే మర్యాద లోపంగా భావిస్తారు.
‘‘తాంబూలస్య గుణాః సంతి సఖే శతసహస్రశహః ఏకశ్చాపి మహాన్ దోషః యప్పదా వాగ్రి సజవకమ్’’ తాంబూలంలో వందలాది గుణాలుండవచ్చు. కానీ, తాంబూలం చేతిలో పెట్టారంటే ఇంకచాలు వెళ్లు అనటం అనే అర్థం ఏర్పడుతోంది కదా! తాంబూలంలో ఇదొక్కటే దోషం. అందుకని వచ్చిన అతిథులు ఇంక బయల్దేరటానికి సన్నద్ధమైనప్పుడే తాంబూలం ఇచ్చి బట్టలుపెట్టి సాగనంపుతారు. ముందే ఇచ్చేసి ఒక పనైపో యిందనుకోవటం సబబు కాదు. మన సంస్కృతిలో తాంబూలం ఇవ్వటం వీడ్కోలుకి చిహ్నం. దూర ప్రయాణానికి వెళ్లేప్పుడు పొలిమేరల్లో గంగానమ్మకి తాంబూలం ఇచ్చి ప్రయాణం సుఖంగా సాగేలా అనుగ్రహించమని వేడుకుంటారు. శవాన్ని ఊరేగింపుగా తీసుకుపోయేప్పుడు కూడా ఆకులూ వక్కలు వేస్తారు. మూడు ఆకులూ, మూడు వక్కలు ఇస్తే ఇంక మన ఇద్దరిదీ భార్యాభర్తల సంబంధం కాదు, సోదరసంబంధం అన్నట్టుగా భావించే ఆచారం సుమిత్రాలో ఉందట. తాంబూలం బైబై చెప్పే సాధనం అక్కడ.
పాండవదూతగా వచ్చిన పురోహితుని తాంబూల సత్కారం చేసి, ధృతరాష్ట్రుడు వీడ్కోలు చెప్పాడట. ‘‘సతం సత్కృత్య కౌరవ్యః ప్రేషయామాస పాండవాన్’’ అని మూలభారతంలో శ్లోకానికి తిక్కనగారు ‘‘నీవు మున్నేగుమని యతనికి విభూషణాంబరమ్ములతో తమ్ములంబు బెట్టి వీడుకో లిచ్చి పుచ్చిన…’’ అంటూ అనువదించారు. యుద్ధానికి ముందు తన పక్షంలోని వీరాధివీరులైన యోధులందరికీ ధర్మరాజు తాంబూలాభరణాలిచ్చి వీడుకొల్పినట్టు కూడా భారతం చెప్తొంది.
వశీకరణ తాంబూలం
కళాపూర్ణోదయంలో పింగళి సూరనగారు తాంబూలాన్ని ప్రేమ విజయ సాధన పక్రియగా ప్రయోగించటం ఎలాగో చెప్పిస్తారు. ‘సుగాత్రి’ అనే నాయికకు ఆమె భర్త విముఖుడుగా ఉన్నాడు. అతన్ని దారికి తెచ్చుకోవటం ఎలాగో ఆమె తల్లి ఓ ఉపాయం చెప్పింది:
‘‘గారామున తోడ్తోడన/రా రమ్మనుడనుచు మగిడి రానేటికి గ
ర్పూరంబుతోడి బాగా/లీరాదో ఆకుమడిచి యీరాదో చెలి’’ గారాముతో ఏదో విధంగా అతన్ని రప్పించి, కర్పూరంతో బాగాలు అంటే వక్కలు వేసి ఆకులు మడిచి ఇవ్వాలనేది ఆ తల్లి చేసిన సూచన. ఎంతవారయినా తాంబూలదాసులేనని ఆమె నమ్మకం. తాంబూలం ఇవ్వడం అంటే అవతలి వ్యక్తిని ఐస్ చెయ్యడమే ఆ రోజుల్లో!
బండి వెంకట స్వామి అనే కవి ‘‘రంభానల కూబర విలాసం’’ కావ్యంలో తాంబూలాన్ని ప్రేమగా ఎలా ఇవ్వాలో, ప్రేమను ఎలా పొందాలో వివరిస్తూ రంభ నలకూబరుణ్ణి ఎలా లోబరచుకుందో వివరిస్తాడు.
‘‘వినిమోద మొసగంగ వనజాక్షి తములంబు గొని చెంత నిలుచుండి కొమరు మిగుల
తన గళంబున కిది దగునె సాటి యటంచు ఖండము ల్గావించి క్రముకములను
తన కక్షములకిది యనయంబు తుల్యమై నందుకొను తమలపాకుల నొగి…’’ చక్కగా నవ్వుతూ తమలపాకులు చేత్తో పుచ్చుకుని అతని పక్కనే నిలబడి, తన సొగసుకు ఇది సాటి అగునా అనుకుంటూ, వక్కలు ముక్కలు చేసి, ఆకుల్ని మధ్యకు చీల్చి ఈనెలు తీసి, మంచి ముత్యభస్మాన్ని పచ్చకర్పూరం పలుకుల్ని ఎక్కువగా వేసి గట్టిగా చుట్టి అణచుకోలేని ప్రేమతో శరీరం పులకరిస్తుంటే అతనికి అందించింది…ఇలా సాగుతుందావర్ణన. గూడూరి నమశ్శివాయగారు తాంబూల సేవన ప్రశంస’’ అనే వ్యాసం (శాంతి భార్గవ విద్యాదేవ కులపతి సంపాదకత్వం)లో ఈ పద్యాన్ని ఉదహరించారు.
– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు, 9440172642