పేపరు, సిరా కొరత కారణంగా కొన్ని లక్షలమంది విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయంటే నమ్ముతారా? కానీ ఈ నమ్మలేని నిజం, ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న దారుణ దుస్థితికి ఒక ఉదాహరణ! ఒకవైపు తరిగిపోతున్న చమురు నిల్వలు, నిత్యావసరాల కొరత, కోల్పోతున్న ఉపాధి అవకాశాలు, అందుబాటులో లేని ధరలు ఇవన్నీ 22 మిలియన్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, కోపాగ్నికి కారణమై చివరికి హింసాకాండకు దారితీసింది. ఈ దుస్థితికి మాజీ ప్రధాని మహీంద రాజపక్స ప్రభుత్వం కారణమన్న కోపంతో ప్రభుత్వ ఆస్తులపై దాడులు, దహనాలు, లూటీలకు పాల్పడ్డారు. ముఖ్యంగా దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స, మహీంద రాజపక్సపై ప్రజాగ్రహం పరాకాష్టకు చేరింది. ఎన్నడూ లేని రీతిలో దేశ ఆర్థిక పతనావస్థకు రాజపక్స సోదరులే కారణమంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావ్యతిరేకతకు భయపడిన మహీంద రాజపక్స మే 9న ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో, పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వమంటూ లేకపోవడంతో దేశంలో అరాచకం తాండవించింది. ఎట్టకేలకు శ్రీలంక 26వ ప్రధానిగా రణిల్ విక్రమసింఘే మే 12న ప్రమాణస్వీకారం చేశారు. తక్షణం సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను ఇది తీర్చినా, కలగూరగంప మాదిరిగా అన్ని పార్టీల మద్దతుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఉసురును ఎవరు ఎప్పుడైనా తీయవచ్చు! అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడు, దేశం వదిలివెళ్లడానికి సహాయపడతారన్న ఉద్దేశంతోనే గోటబయ రాజపక్స ప్రధానిగా విక్రమసింఘేను నియమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
శ్రీలంక చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 51 బిలియన్ డాలర్లు. బ్లూమ్‌బర్గ్ ప్రకారం శ్రీలంక 2022లో మొత్తం 8.6 బిలియన్ యు.ఎస్. డాలర్ల మేర రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2022 మార్చి నాటికి దేశంలో 1.9 బిలియన్ యుఎస్ డాలర్లు మాత్రమే. విదేశీ మారకద్రవ్య నిల్వలు వీటిని చెల్లించడానికి ఏమూలకు సరిపోవు. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన 4 బిలియన్ డాలర్లు కూడా చెల్లించలేని దుస్థితి. వీటికి తోడు ఇంటర్నేషనల్ సావరిన్ బాండ్ (ఐఎస్‌బి)కి సంబంధించి 1 బిలియన్ యుఎస్ డాలర్లు చెల్లించాలి. 2022 జనవరి నాటికి ప్రభుత్వం 500 మిలియన్ యుఎస్ డాలర్లు ఐఎస్‌బికి చెల్లించింది. వీటి చెల్లింపును వాయిదా వేయడమే ఉత్తమమన్న ఆర్థిక నిపుణుల సలహాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 2010-2020 మధ్యకాలంలో విదేశీ అప్పులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. 2019లో దేశ జీడీపీలో రుణాలు 42% కాగా 2021 నాటికి ఏకంగా ఇవి 119%కు చేరాయి. చైనా అప్పుల చట్రంలో శ్రీలంక చిక్కుకుపోయిందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్న విషయాలు భిన్నంగా ఉండటం గమనార్హం. దీని ప్రకారం శ్రీలంక మొత్తం అప్పులో చైనా వాటా 10% మాత్రమే. అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్ల నుంచి తెచ్చుకున్న రుణాలు 47%, బహుముఖ అభివృద్ధి బ్యాంకులు ఇచ్చిన రుణాలు 22%, తర్వాతి స్థానాన్ని 10%తో జపాన్ ఆక్రమిస్తున్నదని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
సంక్షోభానికి ఐదు కారణాలు
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1948లో స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇప్పటివరకు విదేశీ మారకద్రవ్యం లేని దుస్థితిని ఎదుర్కొనడం ఇదే మొదటిసారి. దీనివల్ల ఆహారం, ఇంధనం దిగుమతులకు చెల్లిం పులు జరపలేని దయనీయత. దీనికంతటికి ప్రధాన కారణం గతం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాల నిర్లక్ష్య ఆర్థిక నిర్వహణా విధానాలు. ఇవి బడ్జెట్‌లోటుకు, కరెంటు ఖాతా లోటుకు దారితీసాయి. 2019లో ఆసియా అభివృద్ధి బ్యాంకు తన నివేదికలో ‘శ్రీలంక దుస్థితికి ఈ రెండు లోటులు (బడ్జెట్ లోటు, కరెంటుఖాతా లోటు) కారణం. అంటే ఉత్పత్తి, సేవల వాణిజ్యం పడిపోవడంతో జాతీయ వ్యయం, ఆదాయాన్ని మించిపోయింది’ అని పేర్కొంది. ఈ నివేదిక సంగతి ఎలా ఉన్నా, శ్రీలంక ప్రస్తుత దుస్థితికి ఐదు ప్రధాన కారణాలను చెప్పవచ్చు. 1. జాతీయ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టడం, 2. 2019లో జరిగిన ఈస్టర్ బాంబింగ్‌లు (2019 ఏప్రిల్ 21న ఈస్టర్ రోజున, శ్రీలంకలోని మూడు చర్చ్‌లు, కొలంబోలోని మూడు లగ్జరీ హోటళ్లపై ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబుదాడులకు పాల్పడ్డారు. అదేరోజు కొలంబోలోని డెమటగోడా హౌజింగ్ కాంప్లెక్స్, దెహీవాలాలోని ఒక గెస్ట్ హౌజ్‌పై కూడా బాంబుదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 269 మంది మరణించగా వీరిలో కనీసం 45 మంది విదేశీ యులు. 500 మంది గాయపడ్డారు), 3. కొవిడ్ మహమ్మారి 4. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, 5. గత ఎన్నికల్లో ఎడాపెడా పన్నురాయితీలకు హామీ ఇచ్చిన మహీంద రాజపక్స వాటిని అమలు జరపడం.
2021లో రాజపక్స సర్కార్ దేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తెచ్చి రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించడం దేశ వ్యవ సాయ రంగాన్ని తిరుగులేని దెబ్బతీసింది. శ్రీలంక వ్యవసాయమే అంతంతమాత్రం. రైతులకు ఏమాత్రం అవగాహనలేని సేంద్రియ వ్యవసాయాన్ని ఒక్కసారిగా తీసుకురావడం ప్రమాదకరమని నిపుణులు చెబు తున్నప్పటికీ సర్కారు వినలేదు. ఆవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలన్న ఉద్దేశం బూమరాంగ్ అయి వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయి ఆహార సంక్షోభానికి దారితీసింది. పర్యాటకాదాయం శ్రీలంక జీడీపీలో 10శాతం వరకు ఉంటుంది. 2019 ఈస్టర్ బాంబుదాడులు పర్యాటకాదాయాన్ని దెబ్బతీయగా, కొవిడ్ మహమ్మారి ఈ రంగాన్ని తిరిగి కోలుకోనీయ లేదు. కరోనా వల్ల ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక పరిశ్రమ పూర్తిగా మూతపడి, విదేశీ ఆదాయమార్గం మూసుకుపోయింది. ఫలితంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు శ్రీలంక రేటింగ్‌ను తగ్గించడంతో, అంతర్జా తీయ మార్కెట్లలో పరపతి కోల్పోయింది. రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో శ్రీలంకకు వస్తారు. ప్రధానంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చిపెట్టే పర్యాటకరంగాన్ని పునరుద్ధరించాలని నిపుణులు ఎంత మొత్తుకున్నా రాజపక్స సోదరులు ఖాతరు చేయలేదు. ఈ దెబ్బకు కేవలం రెండేళ్ల కాలంలో 70% విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోయి దేశం దివాలాస్థితికి చేరుకుంది. నిండా మునిగాక శ్రీలంక ప్రభుత్వం భారత్, చైనా లను సహాయం అర్థిస్తే మన దేశం 3.5 బిలియన్ డాలర్ల విలువైన సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ‘ప్రస్తుతం దేశంలో రాజకీయ సుస్థిరత లేదు. ఇప్పటికే దేశం 51 బిలియన్ డాలర్ల అప్పును చెల్లించలేక డిఫాల్ట్ అయింది. అసలు విదేశీ రుణాలు చెల్లించడానికి నిధులేవీ? అందువల్ల తక్షణం సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే నేను రాజీనామా చేయడం తప్ప వేరే మార్గంలేదు’ అని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘే నిస్సహా యతను వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. అంతేకాకుండా శ్రీలంక టీ ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్ రష్యా. తాజా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ ఎగుమతులు నిలిచిపోవడంతో శ్రీలంకకు మరో తిరుగులేని దెబ్బ తగిలింది. గడచిన ఎన్నికల సందర్భంగా మహీంద రాజపక్స, అనేక పన్నురాయితీలు కల్పిస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే వాటిని అమలుచేయడంతో దేశ ఆదాయం ఒక్కసారి కుప్ప కూలి పోయింది.
శ్రీలంకను వెన్నాడుతున్న తమిళుల శాపం
బ్రిటిష్ వారినుంచి 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంకలో సింహళీయులు, తమి ళుల మధ్య క్రమంగా పెరిగిన విభేదాలు 1980ల్లో మిలిటెన్సీకి దారితీసింది. ఇది శ్రీలంక అంతర్యు ద్ధానికి దారితీసి చివరకు 2009లో ముగిసింది. ఈ యుద్ధంలో లక్షమంది తమిళులు మరణించగా, కొన్ని వేలమందిపై అత్యాచారాలు జరిగాయి. మరికొన్ని వేలమంది అదృశ్యమైపోయారు. శ్రీలంక సైన్యం పాల్పడిన ఈ దారుణాలపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఐక్యరాజ్య సమితి నియమించిన ప్యానల్, శ్రీలంకలో అధ్యయనం జరిపి అంతర్యుద్ధం చివరిరోజుల్లో 40వేల మంది తమిళులను దారుణంగా చంపేశారని తేల్చింది. 2020 జనవరిలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అదృశ్యమైపోయిన 20వేలకు పైగా తమిళులు మరణించారని స్వయంగా అంగీకరించారు. మరి అంతర్యుద్ధం ముగిసిందని చెబుతున్నా తమిళులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో పత్రికాస్వేచ్ఛ ఇంకా పునరుద్ధరించలేదు. ఇక్కడి న్యాయవ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతోంది. అంత ర్యుద్ధం వల్ల మొత్తం 8 లక్షల శ్రీలంక తమిళులు కెనడా, సింగపూర్, ఇండియా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ వంటి దేశాల్లో తలదాచుకుంటున్నారు. శ్రీలంక ఉత్తర, ఈశాన్య ప్రాంతంలో విస్తరించిన జాఫ్నా రాజ్యానికి చెందిన తమిళుల చరిత్ర క్రీ.పూ.2వ శతాబ్దం నాటిది. భారత్‌లోని కళింగ రాజైన మఘ లేదా గంగరాజ కళింగ విజయబాహు, పొలన్నారువ ప్రాంత రాజైన రెండవ పరాక్రమ పాండ్యన్‌ను యుద్ధంలో ఓడించి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసు కున్నాడన్నది చరిత్ర. ఈయన శ్రీలంక ఉత్తర, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల్లో శక్తిమంతమైన రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే క్రీ.శ. 1258 నుంచి దక్షిణభారత్‌లోని శక్తిమంత మైన పాండ్య రాజులకు సామంత రాజ్యంగా జాఫ్నా కొనసాగింది.
సింహళీయుల గ్రంథం ‘నాంపోటా’లో కూడా ఆధునిక ట్రింకోమలి జిల్లాలోని కొన్ని భాగాలతో పాటు మొత్తం జాఫ్నా రాజ్యాన్ని తమిళల ప్రాంతమైన ‘దెమాల పట్టణం’ (తమిళ నగరం) అని పేర్కొని ఉండటం గమనార్హం. మరి అంతటి చరిత్ర ఉన్న తమిళుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిం చిన సింహళీయులను కాలం శిక్షించకుండా ఉంటుందా? తమిళులపై తీవ్ర దారుణాలకు ఒడిగట్టిన రాజపక్స సోదరులను నేడు ‘కాలం’ ఈ విధంగా శిక్షిస్తోందని అనుకోవాలి.
కట్టలు తెంచుకున్న అసంతృప్తి
ప్రజలు నిత్యావసరాల కోసం నెలల తరబడి పెద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి. దీనికితోడు ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న మందులు, ఆహారం, ఇంధనం అడుగంటిపోవడం ప్రజల్లో తీవ్ర అస హనానికి, ఆగ్రహానికి కారణమై హింసాకాండకు దారితీసింది. రోజువారి ఆదాయం 3.20 డాలర్ల కంటే తక్కువ ఉంటే పేదరికంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు పరిగణిస్తుంది. దీని అంచనా ప్రకారం శ్రీలంకలో 2019లో 9.2% ఉన్న పేదప్రజల జనాభా, 2020 నాటికి 11.7%కు పెరిగింది. దేశంలో కొవిడ్-19 నేపథ్యంలో 5 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని గుర్తించిన ప్రభుత్వం నెలకు రూ.5000 అలవెన్స్ కింద చెల్లించినా పెద్దగా ఫలితం లేదు. దీనికి తోడు పులిమీద పుట్రలా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దేశంలో చమురు కొరతను తీవ్రం చేసింది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తగినంత ఇంధనాన్ని సరఫరా చేయలేకపోవడంతో దేశంలో పవర్‌కట్‌లు మొదలయ్యాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణం ఎన్నడూలేని స్థాయికి పెరిగింది. గత ఏప్రిల్ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 30శాతం వృద్ధిని నమోదు చేసింది. శ్రీలంక రూపాయి విలువ యుఎస్ డాలర్‌తో 33శాతం, భారతీయ రూపాయితో 31.6%, యూరోతో 31.5%, పౌండ్ స్టెర్లింగ్‌తో 31.1%, జపాన్ యెన్‌తో 28.7%కు పడిపోయింది.
2019 నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ, 2020లో తన తమ్ముడు మహీంద రాజపక్సను ప్రధానిగా నియ మించారు. మహీంద మొదటిసారి 2004లో అధికారంలోకి వచ్చారు. తొలుత ప్రధానిగా, తర్వాత దేశాధ్యక్షునిగా పనిచేశారు. 2009లో గోటబయ డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు తమిళ రెబెల్స్‌తో అత్యంత కఠినంగా వ్యవహరించి, తమిళ తీవ్ర వాదాన్ని అణచివేసారు. 2015లో రాజపక్స సోదరులు కొద్ది కాలంపాటు అధికారానికి దూరం కాగా, మైత్రిపాల సిరిసేన, రణిల్ విక్రమ సింఘేలు దేశాన్ని ముందుకు నడిపారు. అయితే 2018లో విక్రమసింఘేను పదవినుంచి తొలగించడం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. 2020, ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో మహీంద రాజపక్స నేతృత్వంలోని పార్టీ గొప్ప విజయాన్ని సాధించడంతో, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గతంలో అధ్యక్షుని అధికారాలపై విధించిన పరిమితులను తొలగించి, మళ్లీ ఆయనకు విశేష అధికారాలను కల్పించారు.
ఇప్పుడు వేలాదిమంది నిరసకారులు గోటబయ రాజీనామా కోరుతూ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నారు. 45 సంవత్సరాల శ్రీలంక పాలనా చరిత్రలో ఒక్కసారి మాత్రమే దేశాధ్యక్షుడిని తొల గించేందుకు విఫలయత్నం జరిగింది. ఎందుకంటే దేశంలో అమల్లో ఉన్నది ‘కార్యనిర్వాహక అధ్యక్ష పాలనా వ్యవస్థ’. దేశాధ్యక్షుడికి అపరిమిత అధికారా లను రాజ్యాంగం కట్టబెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, పోలీస్ ఉన్నతాధికారిని నియమించే అధికారం ఆయనదే. ఇంతటి అపరిమిత అధికారాలు న్నప్పటికీ వాటిని అమలు పరచేందుకు మంత్రిమం డలి, పార్లమెంట్ సహకారం అధ్యక్షుడికి అవసరం. ప్రస్తుతానికి రణిల్ విక్రమ సింఘేని ప్రధానిగా, దేశాధ్య క్షుడు నియమించినా ఈ ప్రభుత్వ సుస్థిరతకు గ్యారంటీ లేదు. మరి ఈ అనిశ్చిత పరి స్థితి ఎటు దారితీస్తుందో తెలి యడం లేదు. సైనికచర్య జరి గితే పరిస్థితేంటన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని మహీంద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ రాజపక్స మరో 15మంది దేశం విడిచి పోకుండా శ్రీలంక కోర్టు ఆంక్షలు విధించింది. ప్రస్తు తం మాజీ ప్రధాని ట్రింకో మలిలోని నౌకాస్థా వరంలో పూర్తి రక్షణ మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9న గొటగొగామ, మైనగొటగామ ప్రాంతంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన జరుపుతున్న వారిపై జరిగిన దాడులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఫోర్ట్ కోర్టు మెజిస్ట్రేట్ మహీంద రాజపక్స విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించినట్టు రాయ్‌టర్ వార్తాసంస్థ పేర్కొంది.
భారత్ అందించిన సహాయం
భారత్ శ్రీలంకకు 2022లో ఇప్పటివరకు 2.4 బిలియన్ డాలర్ల మేర సహాయం అందించింది. 500 మిలియన్ డాలర్ల విలువైన డీజిల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో పంపింది. ఆహారం, ఔషధాల వంటి అత్యవసరాల దిగుమతుల కోసం 1 బిలియన్ యుఎస్ డాలర్ల మేర రుణసదుపాయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని కీలక మౌలిక వసతుల ప్రాజె క్టులను భారత్‌కు అప్పగించే అవకాశముందని ఆ దేశ మీడియా పేర్కొంటున్నది.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్