ఎందరో త్యాగధనుల దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కొట్లాడి సాధించుకున్న నేటి తెలంగాణలో స్వరాష్ట్ర లక్ష్యాలు ఏ మేరకు సఫలమయ్యాయి? రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన ఉద్యమకారుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆత్మబలిదానాలు చేసిన వాళ్ల కుటుంబాల స్థితిగతులు ఏంటి? ఉద్యమంలో కేసీఆర్‌కు అన్నీ తామై వెంట ఉండి ఆయనను ముందుకు నడిపించిన ఆనాటి మేధావులు, ప్రముఖుల జాడెక్కడ? ఇలాంటి ప్రశ్నలు మళ్లీ ఉదయిస్తున్నాయి. ఆర్థికంగా ఆదుకునే విషయంలో ప్రాణత్యాగాలు చేసుకున్న 1500కు పైగా అమరవీరుల సంఖ్యను కేవలం 15 నుంచి 20 శాతానికి కుదించిన నాటి సంగతులను తెలంగాణ సమాజం నెమరేసుకుంటోంది.
తెలంగాణ తెచ్చాను.. తెచ్చాను అంటూ ముద్ర వేసుకుని తనదైన చతురతతో రాష్ట్రానికి అన్నీ తానే అన్న బ్రాండ్‌ను సంపాదించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు చేస్తున్న పనులను రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. స్వరాష్ట్రం సిద్ధించింది మొదలు అధికార పీఠం అధిరోహించినప్పటి నుంచీ తానే కేంద్రబిందువు అయి పాలన సాగిస్తున్నారు. ఒకరకంగా ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. తనకు ఎదురుచెప్పిన వాళ్లపై, తన విధానాలను సహించని వాళ్లపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు. అది ప్రతిపక్ష నేతలైనా, ఉద్యమ కాలంలో తనకు అండగా ఉన్నవాళ్లయినా, అధికార పక్ష సభ్యులైనా, చివరకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులైనా సరే. అందుకోసం తనవైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత కేసీఆర్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం ఆయన ఆలోచిస్తున్న తీరు, అనుసరిస్తున్న వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటున్నారు విపక్షాలు, విశ్లేషకులు. సొంత రాష్ట్రంలో ప్రజల కష్టాలు, వాస్తవ పరిస్థితులను వదిలేసి ఉత్తరాదికి వెళ్లారు. అక్కడ రైతు ఉద్యమంలో చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం అందజేశారు. అక్కడి ప్రభుత్వాలు, బాధితులతో జేజేలు కొట్టించుకున్నారు. ఏ ప్రభుత్వానికైనా తమ రాష్ట్రం బాగు కోసం పరితపించడం, తమ ప్రజలకు అండగా నిలవడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తోడ్పాటునందించడం అనేది ప్రాథమిక బాధ్యత. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తుంది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను మరిచి, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన ఓటర్లను విస్మరించి.. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు సాయం చేస్తానని చెబుతున్నారు. అమరులను, ఉద్యమాల్లో బలైన వాళ్లను ఆదుకోవడం తప్పు కాదు. కానీ, సొంత రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అమరులైన కుటుంబాలను వదిలేసి, ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసు కుంటున్న రైతుల కష్టాలు విస్మరించి, చనిపోయిన రైతు కుటుంబాల దీనస్థితిని పక్కనబెట్టి ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్లకే ముందు వరుసలో ప్రాధాన్యం ఇవ్వడం అనేది సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.
ఢిల్లీ సహా పలు రాష్ట్రాల సుదీర్ఘ పర్యటనకు ప్రణాళిక వేసుకున్న సీఎం కేసీఆర్.. ఈనెల 22న పంజాబ్‌కు వెళ్లారు. కేంద్రం ప్రతిపాదించిన సాగుచట్టాలు రద్దు చేయాలంటూ ఉత్తరాదిలో, ప్రధానంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అలా.. ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో రైతు కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామని గతంలో ప్రకటించారు. ఆ హామీ మేరకు పంజాబ్ వెళ్లి మరీ చెక్కులను పంపిణీ చేశారు.
ఆ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కేసీఆర్ వెంట బెట్టుకొని వెళ్లారు. కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడానికి పంజాబ్ రైతుల పోరాటమే కారణమని, వాళ్లకు సలాం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందంటూ కొనియాడారు. అలాగే చైనాతో జరిగిన యుద్ధంలో గల్వాన్ లోయలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల కుటుంబాలకు కూడా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
విపక్షాల మండిపాటు
ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు విపక్షాలతో పాటు, మేధావులు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఉద్యమంలో అసువులుబాసిన వారి కుటుంబాలను కేసీఆర్ గాలికొదిలేశారని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కొంతమందినే ఆదుకొని మిగతా కుటుంబాలకు మొండిచెయ్యి చూపిందని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ అమరవీరులను మరిచిన కేసీఆర్.. పంజాబ్‌లో రైతులను స్మరిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు, తెలంగాణలో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారమే 1381 మంది ఆత్మబలిదానం చేసుకోగా.. 576 మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మిగతావాళ్లను అసలు అమరవీరులుగానే గుర్తించలేదు. కానీ, పంజాబ్‌లో మాత్రం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 మందికి ఆర్థిక సాయం చేసింది. ఈ సంఖ్యను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన త్యాగధనుల సంఖ్యను కుదించేందుకు తాపత్రయపడ్డ కేసీఆర్.. పంజాబ్‌లో రైతు ఉద్యమంలో మరణించిన వాళ్ల సంఖ్యలో ఏ లెక్కలు అనుసరించారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. అమరవీరుల యాదిలో అమలు చేస్తామన్న హామీలు కూడా అటకెక్కాయని విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న అమరుల స్మారక చిహ్నం, స్మృతివనం ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని ఎత్తిచూపుతున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో వాస్తవానికి శ్రీకృష్ణ కమిటీకి విజ్ఞప్తులు, నివేదికలు సమర్పించిన సమయంలోనే దాదాపు 1,381 మంది అమరు లయ్యారని టీఆర్‌ఎస్‌తో పాటు, అప్పటి పొలిటికల్ జేఏసీ రిపోర్ట్ ఇచ్చాయి. ఆ తర్వాత 1,089 మంది అమరులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారో పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూడా మరో నివేదికను రూపొం దించింది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని 2014 మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుటుంబా లకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమి, పిల్లల చదువు బాధ్యతలు తీసుకుంటామని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 80ని కూడా రిలీజ్ చేసింది. కానీ, దశల వారీగా కేవలం 576 మందినే గుర్తించింది. వీరిలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందించింది. సాగు భూమి, ఇల్లు, చదువు, హెల్త్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. ఇక 12 మందికి మాత్రమే వీఆర్‌వో స్థాయి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారందరికీ జూనియర్ అసిస్టెంట్, స్వీపర్, వాచ్‌మెన్, అటెండర్ ఉద్యోగాలు ఇచ్చారు. 1381లో 576 కుటుంబాలు పోగా, మిగతావారిని ప్రభుత్వం గాలి కొదిలేసింది. అమరుల బలిదానాల ఆధారాలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ లీడర్లే వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న ఫొటోలు ఉన్నా ప్రభుత్వం ఆర్థికసాయం చేయడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. తమను పట్టించుకోవాలని అమరుల కుటుంబాలు అనేక దఫాలుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినా పట్టించుకునేవారు కరవయ్యారు.
హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద ప్రపంచంలో అత్యంత ఎత్తైన అమరుల స్మారక చిహ్నం, దాని పక్కనే అమరుల స్మృతివనం నిర్మిస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఆ ప్రతిపాదనలు పూర్తి కావడం లేదు. నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో అమరుల స్మృతి వనాలు నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు నాయకులు ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. కానీ, వాటి ఊసు కూడా లేకుండా పోయింది.
ఇప్పుడీ అంశాలన్నీ తెలంగాణ ప్రజలు, ఉద్యమ కారులు, విపక్షాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలా.. ఇల్లు వదిలి రచ్చకేగి కేసీఆర్ ఏ సందేశం ఇవ్వదలచు కున్నారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అక్కసుతో కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థంకాకుండా పోతోందని పలు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. మోదీకి తాను వ్యతిరేకమని, కేంద్రంలో కొత్త ఎజెండా రూపకల్పన చేస్తానని, ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని దాదాపు ఐదారేళ్లుగా సభలు, సమావేశాల్లో ప్రకటిస్తున్న కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా తన ఆలోచనలను ప్రస్ఫుటించేలా చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తర భారత పర్యటన కూడా దానికి సంకేతమంటున్నారు. ఢిల్లీలో బీజేపీని వ్యతిరేకించే ఆయా పార్టీల నేతలతో భేటీ అయ్యారు. అధికారిక పర్యటన పేరుతో పంజాబ్ వెళ్లి.. అక్కడి ముఖ్య మంత్రి భగవంత్‌మాన్‌ను కూడా కలిశారు. వెళ్తూ వెళ్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా వెంటబెట్టుకొని వెళ్లి.. ముగ్గురూ కలిసి మంతనాలు సాగించారు. ఆ తర్వాత ముందుగా రూపొందించు కున్న షెడ్యూల్‌ను పక్కనబెట్టి.. రాత్రికి రాత్రి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు.
ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ఐఎస్‌బీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని రానున్నారు. అయితే, మోదీది అధికారిక పర్యటన అయినందున రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ప్రధానికి స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఆ పర్యటనలో ప్రధాని వెంటే ఉండి.. తిరుగు ప్రయాణంలోనూ వీడ్కోలు పలకాలి. అయితే, దీనిని తప్పించుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ చేసుకున్నారని విశ్లేషకులు అంచనా వేశారు. ఎందుకంటే ఏకంగా పదిరోజుల పాటు దేశవ్యాప్త పర్యటనను రూపొందించుకున్నారు ఆయన. ప్రధాని పర్యటన రోజు హైదరాబాద్‌లో ఉండకుండా ఉండేందుకే అదేరోజు కర్ణాటకకు వెళ్లి దేవెగౌడ, కుమారస్వామిని కలిసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారని, మరుసటిరోజు కూడా తనదైన వ్యూహంలో భాగంగానే మహారాష్ట్ర టూర్ షెడ్యూల్ చేసుకున్నారని భావించారు. కానీ, ఉన్నట్టుండి 23 రాత్రే ఢిల్లీలో ఉండకుండా హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. షెడ్యూల్‌ను పక్కనబెట్టి మరీ కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్