మే 27 నిర్మల ప్రభావతి వర్ధంతి
పవని నిర్మల ప్రభావతి. ఈ రచయిత్రి పేరు మునుపే విన్నట్లుంది కదూ! కథల, నవలల రచనల్లో అలనాటి మేటి. ‘స్త్రీ, మండోదరి మళ్లీ పుట్టింది, శిథిలాల నుంచి శిఖరాలకో’… ఇటువంటి వైవిధ్య శీర్షికల ఆమెవే. ఎనభై రెండేళ్ల జీవితకాలంలో ఎన్నెన్నో రాసి, ఎంతెంతో ఆలోచింపజేశారు. ప్రత్యేకించి వనితల మనస్తత్వ చిత్రీకరణలో నేర్పరి. ఆద్యంతాల మధ్య, అమ్మా! యువమాసం, శివదూతీ సప్తశతి, నాగరికత నవ్వుతోంది పేరిట రాసినవి అప్పట్లో చదువరుల అపార ఆదరాన్ని పొందాయి. అటు తర్వాత తత్వచింతనతో ‘భవానీ సౌందర్య లహరి’ అంటూ శక్తి సమన్విత గ్రంథాన్ని వెలువరించారామె. ఒంగోలులో పుట్టి, అదే ప్రాంతం మొగిలిచర్ల గ్రామంలో తుదిశ్వాస విడిచిన ఆమె ఆ మధ్య కాలవ్యవధిలో అనంత సాహితీ సృజన చేశారు. కథాసంపుటాలు, నవలల పరంపర, ఇతర పక్రియల్లోనూ తనదైన ముద్రవేసిన ఆ సహజసిద్ధ రచయిత్రి సమకాలీన సమస్యలకు పరిష్కారాలనూ సూచించడమే ప్రత్యేకత. కాళీపట్నం రామారావు (కారా) మాస్టారు నిర్వహణలోని ‘శ్రీకాకుళం కథానిలయం’ సమీకరించి భద్రపరచిన ఆమె రచనలె అనేకం. సంస్థ రజతోత్సవ తరుణంలో ప్రభావతి కథలను విశేషంగా ప్రస్తావించిన నిర్వాహకులు – స్త్రీ అంతరంగానికి నిలువుటద్దం పట్టిన కలం ఆమెదని అభివర్ణించారు. విశ్లేషించితే ఉదాహరణలు అసంఖ్యాకం.
‘అద్దంలో ప్రతిబింబాలు’ కథ ఇప్పటిది కాదు. అది ప్రచురితమై ఇప్పటికి ఆరున్నర దశాబ్దాలు కావస్తోంది. ‘నా కథే ఇలా పత్రికలోకెక్కిస్తారని నీవనుకోలేదు’ అంటుందీ భార్య. నవ్వూ, ఆశ్చర్యం ముంచుకొచ్చిన ఆ రచయిత ‘నీ కథ కాదిది, లోకంలో ఇంకెవరూ లేరా’ అంటాడే కానీ, తదుపరి సంఘటనలన్నీ ఇతరులూ అది తమ కథే అనుకొనేలా చేస్తాయి. చివరికి అతను ఆమెను పిలిచి అద్దంలో చూడమంటాడు. ‘ఏముందక్కడ…. నా ప్రతిబింబం తప్పిస్తే’ అని బదులిస్తుంది. ‘అదే మరి- దాన్ని చూసి నువ్వూ కోప్పడలేదేం’ అని ప్రశ్నిస్తాడు. ‘అయితే మేమంతా మీ కథలో మా ప్రతిబింబాన్ని చూసి అపోహ పడ్డామంటారా?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ‘అంటే మీ కథ….’ అనగానే, ‘కేవలం ఓ అద్దం’ అన్నదే అతడి సమాధానం! ఈ కథాంశాన్ని అర్థం చేసుకుంటున్నకొద్దీ అటు రచయితలు ,ఇటు చదువరులు ఎంతైనా తెలుసుకొంటారు. వెలువడి 65 ఏళ్లు అవుతున్నా, ఈ నాటికీ కొత్తదనం కనిపించే సంవిధానం ఇది.
మానవ, మాధవసేవ
వచనాన్ని ఎంత బాగా పలికిస్తారో గ్రాంథికాన్నీ అంత చక్కగా పండించారు రచయిత్రి ప్రభావతి. ‘భాగవతామృత కలశం’ పుస్తకమే నిత్య నూతన నిదర్శనం. కథల మాదిరే కావ్యరచననూ అలవోకగా నడిపించిన ఆమె మధుర, మార్దవ, మానసానందకర వచనంలో భాగవత కథలెన్నింటినో పాఠకుల ముందు పెట్టారు. తన గ్రామంలో మాధవసేవకు ఆలయాన్ని, అదే కోవలో మానవసేవకు వైద్యశాలను ప్రారం భించిన క్రియాశీలి. పోతన మహాకవి భాగవతామృ తాన్ని అందరికీ పంచాలన్న సదాశయంతో ముందుకు సాగి జనజాగృతి సాధించిన సారస్వత మూర్తి ఆమె. అదే గ్రంథంలో కుంతీదేవిని పరిణిత భక్తురాలిగా ప్రశంసించారు. ఎంతటి సంయమనమో ఆ హృదయానికి!ఎంతెంత ఆత్మ నిగ్రహమో తనకి! కష్టాల కొలిమిలో కాగి తుదకు పరమాత్మ శ్రీచరణాలకు శరణాగతి అయిన కుంతిది ఇంకెంత పరిణతత్వమోనంటూ విపులీక రించారు. దేవతానేక బ్రాహ్మణ గోగణార్తి హరణా, నిర్వాణ స•ంధాయకా అని తనకు తానుగా ఆత్పార్పణ చేసుకున్న వైనాన్ని తనదైన తీరున విశ్లేషించారామె.
జ్ఞాననేత్రం – భక్తి రసామృతం
ఈ దేశం మనకు ఏమిచ్చిందో భాగవత నేపథ్యంగా తేటతెల్లం చేశారు ప్రభావతి. మన దేశంలో, ప్రపంచంలో ఆధ్యాత్మిక భావజాలం నిక్షిప్త మైంది. మనిషి ఆత్మ ఔన్నత్యం తాలూకు మార్గదర్శ నానికి ఎందరో మహనీయులు మాటలు, రాతలతో కృషి జరిపారు.సర్వలోకానికీ ఈ భారతదేశమే జ్ఞాననేత్రం. దీన్ని నమ్మిన వారికి దేశం మనకే మిచ్చిందన్నది బోధపడుతుంది. ఇక్కడి మట్టి, గాలి, నిప్పు, ఆకాశానికి ఎంత ఋణపడి ఉన్నామో అవగత మవుతుంది. శాస్త్రాలు, కళలన్నింటి పరమార్థమూ దైవదర్శన భాగ్యమే. మనుషులుగా పుట్టిన మనం దేశం మనకిచ్చిన కావ్యాల సారాంశాన్ని కొద్దిగానైనా గ్రహిస్తే అదే మహాద్భుత వరమంటారామె. పోతన మహాకవి ప్రసాదించిన భక్తిగంగలోని కొన్ని నీటి బిందువులను తన దోసిలిలోకి తీసుకునే ప్రయత్నమే ఈ రచన అని వివరించి చెప్పారు.
భావశక్తితో ఆరాధన
ఇంతకుముందే మనం అనుకొన్నట్లు, జగన్మాతది అపారమైన దయామహిమ. ఆ అంశాన్నీ సౌందర్యల హరిలో వివరిస్తూ శంకర భగవత్పాదులను స్మరించు కున్నారీ రచయిత్రి. సద్భావనలు, సదాలోచనలు, సదాశయాలు వెల్లి విరుస్తుండగా మార్గదర్శనం జరగాలని ఆకాంక్షించారు. దేవీ వదనాన్ని ‘శరత్పూర్ణ చంద్ర ప్రభాపూర్ణ బింబాధర స్మేర వక్త్రారవిదాం సుశాంతం / సురత్నావళీహార తాటంక శోభాం మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీం’ అని కొనియా డారు. అలాటి ఘనతను ‘లలాటం లావణ్య / ద్యుతి విమల మాభాతి తనయత్ ద్వితీయం తన్మన్యే, మకుటఘటితం చన్ద్ర శకలమ్/విపర్యాస న్యాసా దుభయమపి, సమ్భూయచ మిదః సుధాలేవ స్యూతిః పరిణమతి ర్యాకా హిమకరః’ అంటూ స్తుతించారు అద్దంలా నిగనిగలాడుతున్న తల్లి నుదురుపై కిరీటపు కింది అంచు అర్థ చంద్రాకృతిలో ఉన్నదని అంతరార్థం.
సమస్యలకు సమాధానాలు
కథలూ నవలలూ రాసిన రచయిత్రిగా పేరున్న ప్రభావతిలో ఇంతటి గ్రాంథిక•త, ఆలంకారిక రచనాశక్తి ఇమిడి ఉన్నదని అందరూ మరింత గ్రహించాల్సి ఉంటుంది. భాషా సంబంధమైన పదజాలం, ప్రాచీన గ్రంథాల అధ్యయన పటిమ, వీటన్నింటినీ మించిన తత్వచింతనాసక్తి ఆమెను అపురూప కావ్యకర్తగా రూపుదిద్దాయి.ఎదలో ముల్లు, శలభాలు, శాపగ్రస్తులు, రాసినపూలు, శేష ప్రశ్నలు వంటి రచనా శీర్షికలు తన నిశ్చయత్వాన్ని వెల్లడి స్తాయి. భగవాన్! నేనేమీ కోరను, ముగింపేమిటి?, ఈ జీవిత సంధ్యా సమయంలో… వంటివి లోలోపలి తాత్వికతను వ్యక్తపరుస్తాయి. పంజర కోరాలు, శలభాలు, అనామిక రచనలు ఆమె పరిశీలనా శక్తిని ప్రస్ఫుటీకరిస్తాయి. ఇంత నిరంతరంగా, నిరంత రాయంగా వ్యాసంగం సాగించినవారు అరుదుగానే ఉంటుంటారు. మరీ ముఖ్యమైన విషయం – ‘చైతన్య రాహిత్యంలో స్త్రీ’ అనే నవలికను తీర్చిదిద్దిన విధానం. పలు రకాల స్థితిగతుల ప్రభావం నేడు కొంతమంది వనితలపై ఎలా ప్రసరిస్తుందో సామాజిక కోణంలో విశ్లేషించారామె. కాలం మారింది అంటున్నాం. రోజులు మారాయని చెప్తున్నాం. మరి ఇంత మార్పు వచ్చేస్తే, ఇప్పటికీ ఆ పడతులకు ఎందుకింత దుస్థితి? అన్నదే ప్రశ్న. రచయిత్రిగా తానిచ్చిన లిఖిత సమాధానం ఆమె విమర్శనాత్మక దృక్పథానికి సూచిక. ఇన్ని విధాలుగా కలం బలాన్ని చూపిన పవని నిర్మల ప్రభావతి మనం ఎన్నటికీ మరవలేని,ఎంతకీ మరపురాని అసాధారణ సాహితీవేత్త. ఈ నెల 27వ తేదీన ఆమెను స్మరించుకోవటం రచనా వైవిధ్యాన్ని ప్రశంసించడమే!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్