మే 25 హనుమజ్జయంతి
కేసరినందనుడు పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు. స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించాలన్నది హనుమ సందేశం. లక్ష్యసాధనకు పట్టుదల, శారీరక బలమే చాలదని, సమయాను కూలంగా తగ్గడం, నెగ్గడం, శక్తియుక్తులను ప్రదర్శించాలనేందుకు నిదర్శనంగా నిలిచాడు. నిర్భయత్వం, అమోఘమైన వాక్చాతుర్యం, అపారమైన బుద్ధిబలం, అద్భుత పాండిత్యాలకు గని. ఒక్క మాటలో… వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఎదగాలనుకునేవారు, రామాయణంలో వివిధ సన్నివేశాలలో ఆయన నడతను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి జిజ్ఞాసువులు హితవు పలికారు.
శ్రీరామావతార కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకునేందుకు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి నాడు రుద్రాంశతో హనుమ అవతరించాడని పరాశర సంహిత, ఆయన శిష్ట రక్షకుడు.. దుష్ట శిక్షకుడని నారద పురాణం తెలిపాయి. త్రిపురాసుర సంహార సమయంలో శ్రీహరి తనకు అందించిన సహకారా నికి కృతజ్ఞతగా శివుడే హనుమగా ఆవిర్భవించాడని వానరగీత పేర్కొంది. జీవన పారాయణంగా పేరొం దిన శ్రీమద్రామాయణంలోని హనుమ భూమిక తరతరాలకు స్ఫూర్తి మంత్రం. ఆయన నడత, కార్యదీక్షాదక్షతలు, యుక్తాయుక్త విచక్షణాది గుణా లను వాల్మీకి మౌని అనేక విధాలుగా ఆవిష్కరించారు.
ఆరు కాండలతో విరాజిల్లే శ్రీమద్రామాయణ మహాకావ్యంలో ఐదవ కాండ (సుందరకాండ) ఆంజనేయుడి వీరత్వానికి, సాహస కృత్యాలకు, భక్తి వైభవాలకు నెలవు. సీతామాత జాడను తెలుసు కోవడం నుంచి రామచంద్రమూర్తికి అమ్మవారి ఆచూకి తెలియచేయడం వరకు ఎదురైన ఇబ్బందు లను అధిగమించి స్వామి కార్యం నిర్వహించడంలో ఆయన చూపిన అంకితభావం, ధర్మనిరతి వ్యక్తమవు తుంది. ఈ కాండకు హనుమ సౌందర్యత్వాన్ని ఆపాదించాడు. సూర్యుని వద్ద వ్యాకరణం నేర్చి నవవ్యాకరణ కర్తగా, సంగీతంలో నారద తుంబు రులతో సరిసాటి అనిపించుకున్న విద్వన్మణిగా, ఇతరుల మనసులోని అంశాలను గ్రహించడంలో దిట్టగా తదితర విశేషాలు సుందరకాండ ద్వారా తెలుస్తాయి.
మహాభారతంలోని భగవద్గీతలా శ్రీమద్రా మాయణంలో ‘సుందరకాండ’ సుప్రసిద్ధం. ఇది రామాయణానికి తలమానికం. భగవత్ చరిత్ర కన్నా భగవద్భక్త చరిత్ర ఎంతో ఉత్కృష్టమైనదంటారు. అందునా రామభక్తుడైన ఆంజనేయుని విజయ పరాక్రమాలు ఆహ్లాదకరంగా వర్ణితం కావడంతో ఈ ‘కాండ’ సౌందర్యానికి మారుపేరుగా నిలిచింది’ అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మరోవంక, హనుమ పరంగా వెలసిన అపార వాఙ్మయంలో తులసీదాసు విరచిత ‘హనుమాన్ చాలీసా’ మకుటాయమాన మైనది. దేశవ్యాప్తంగా హిందువులకు పారాయణ గ్రంథమైంది. హనుమను సద్గురువుగా, జానకీదేవి వరం వల్ల ఆయన అష్టసిద్ధులను, నవ నిధులను ప్రసాదించడగలడని తులసీదాస్ ఆవిష్కరించారు.
సీతాన్వేషణకు తమ్ముడితో బయలుదేరిన రాముడికి కిష్కింధలో మారువేషంలో అంజనీపుత్రుడు కనిపించగా, ‘సోదరా! ఇతడు నవవ్యాకరణాలనూ చదివిన జ్ఞానసంపన్నుడు. సాక్షాత్తూ సరస్వతీ స్వరూ పుడు. సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు’ అని హనుమలోని విశిష్ట లక్షణాలను వివరించారు. హనుమ తొలిసారిగా తనతో చేసిన సంభాషణను ప్రస్తావిస్తూ, చతుర్వేదాలను అధ్యయనం చేసిన వారికి తప్ప ఇతరులకు ఇంతటి శ్రేష్ఠమైన చతురత అలవడదని (నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణి:/నా సామవే విదుష: శక్యమేవం ప్రభాషితుమ్) ఆయన పాండిత్య గరిమను నిర్ధారించాడు రామ చంద్రుడు.
శ్రీరామ పాదసేవా దురంధరుడు హనుమ. ప్రభుభక్తి పరాయణుడు. నవమ బ్రహ్మ పదవి కంటే ‘రామబంటు’గా ఉండేందుకే ఇష్టపడే పరమ భాగవతోత్తముడు. ‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్/తత్రతత్ర కృతమస్తకాంజలిమ్’-రామనామం వినిపించినచోటల్లా వినయాంజలితో నిలుచుండి పోతారట. ‘జై శ్రీరామ్’ అనే పిలుపునకు రాముడి కంటే ముందే చేరి తన తేజశ్శక్తిని ప్రసరించి కార్యో న్ముఖులవుతారట. అందుకే శ్రీరాముడు వంటి ప్రభువు/యజమాని ఆంజనేయుడు వంటి సేవకుడు లేరన్నది పెద్దల మాట. ఆంజనేయుడు లాంటి బంటు లభించడం తన అదృష్టంగా రామచంద్రుడే కొని యాడాడని తులసీదాస్ కీర్తించారు. సర్వగుణ సమున్నతుడైనా, కపిశ్రేష్ఠుడిగా మన్ననలు అందుకున్న ప్పటికీ ఏలిక కావాలనుకోలేదు. సుగ్రీవునికి సచివు డిగా, అనంతరం శ్రీరామబంటుగా ఉండేందుకే ఇష్టపడ్డాడు. మంత్రిగా, స్వామిసేవకుడిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించాడు.
యువతకు మార్గదర్శి
‘దీక్ష, మనోనిగ్రహం, ధైర్యం, వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, మనోబలం, బుద్ధి కుశలత, కార్యసాఫల్యానికి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు సంపూర్ణంగాగల హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద. స్వామి కార్యమే తప్ప ఇతరత్రా ఆలోచనలు లేని దీక్షాదక్షుడు పవనసుతుడు. బాహ్యాకర్షణలకు చలించని మనోనిగ్రహ సంపన్నుడు. అవరోధాలను సమయస్ఫూర్తితో అధిగమించిన ధీశాలి. లంకాదహనంతోపాటు మైరావణాది అసుర సంహారం లాంటి ఘనకార్యం సాధించినా, తాను రాముడు వదిలిన బాణాన్నే అని పొగడ్తలు, ఆత్మస్తుతి పట్ల విముఖత చూపిన వినయశీలి. కార్యసాధనకు స్వీయ సుఖాలను కాదనుకున్న త్యాగశీలి. ఆత్మ విశ్వాసం విజయానికి తొలిమెట్టు అనే సూత్రాన్ని హనుమ అక్షరాల పాటించాడు. సీతాన్వేషణకు లంకకు వెళుతున్న తాను ఎప్పటికి తిరిగా రాగలనో చెప్పలేను కానీ, సీతమ్మ జాడను తెలుసుకోవడమే కాదు…ఆ తల్లిని చూసే వస్తాననడంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.
సీతాన్వేషణకు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సాగరగర్భం నుంచి పైకి వచ్చి మైనాకుడు (స్వర్ణమయ పర్వతం) ఇవ్వజూపిన ఆతిథ్యాన్ని మృదువుగా తిరస్కరించి (‘నేను విశ్రమించేందుకు ఇది సమయం కాదు. శ్రీరామ కార్యమే ప్రథమ కర్తవ్యం) ముందుకు సాగిన అంకితభావం గల సేవకుడు. సీతామాత ఆచూకీ తీయలేకపోతే ఆత్మహత్యే శరణ్యమని భావించి, అంతలోనే మనోబలంతో తనకు తానే ధైర్యం చెప్పుకుని పట్టుదలతో ప్రయత్నాన్ని కొన సాగించి సాధించాడు. తాను సాధించిన కార్యాలు తన ఘనతగా కాకుండా వానర సమూహ విజ యంగా అభివర్ణించిన మహోన్నతుడు. జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణనిధానుడు. అయినా పెద్దల ముందు అతి వినయశీలి. అదీ ఆయన ఔన్నత్యం. అందుకే పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ‘ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా/యెక్కడా హనుమంతుని కెదురా లోకము’ అనీ, ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు/పిన్ననాడె రవినంటె పెద్ద హనుమంతుడు…..’ అని కొనియాడారు.
భక్తి కవులకు స్ఫూర్తిప్రదాత
‘రామాయణ మహామాలారత్నం’గా భాసిల్లుతున్న హనుమ దాస్యభక్తికి ప్రథమోదాహరణ. త్యాగయ్య (సంగీతసేవ), కబీరు (కవనసేవ), రామదాసు (కరసేవ) ల•ంటి మహావాగ్గేయకారులు, కవులకు స్ఫూర్తి ప్రదాత. భక్తుల పాలిట చింతామణి. రామ నామం ఉండే చోట అంజలి ఘటిస్తూ నిలుస్తాడు. ప్రభువుతో పాటు ప్రత్యేకంగా పూజలందుకునే అరుదైన ‘బంటు’. భగవంతునితో సమానంగా భక్తుడు పూజలు అందుకోవడానికి నిదర్శనం. అంజన్నంటే భక్తులకు కొండంత నమ్మిక. ఆయన పేరు విన్నంతనే భయం మటుమాయమై ధైర్యం ఆవహిస్తుంది. భూత ప్రేత పిశాచాదులు పలాయనం చిత్తగిస్తాయని, మనోభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ‘హనుమత్స దృశం దైవం నాస్తి నాస్త్యేవ భూతలే అనేనైన ప్రమాణేన జయసిద్ధికరం పరమ్’ (హనుమంతునితో సమానమైన దైవం భూతలంలో లేడు. ఈ ప్రమాణం వల్లనే హనుమంత వ్రతం ఆచరించిన వారికి నిశ్చయంగా జయం కలుగు తుంది) అని శాస్త్ర వచనం. తెల్లజిల్లేడు వేరుతో చేసిన హనుమ విగ్రహం ప్రశస్తమైనదని, దానిని ఆర్చిం చడం వల్ల శత్రుభయాలు ఉండవని చెబుతారు. జిల్లేడు పూలు, పారిజాతాలు, తమలపాకుల మాలను ఆయనకు అలంకరిస్తారు. హనుమత్ పూజతో సర్వ దేవతా పూజఫలం కలుగుతుందని మైత్రేయునితో పరాశర మహర్షి చెప్పినట్లు (‘సప్తకోటి మహామంత్రా: సిధ్యంత్యేవ,నసంశయం/ఆరాధితే కపిశ్రేష్ఠే సమస్తా ఆదిదేవతా:) అని పరాశర సంహిత తెలుపుతోంది.
ఆసేతు శీతాచల పర్యంతం హనుమను తమ వాడిగా చెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనే ఆయన పట్ల గల భక్తిభావం వ్యక్తమవుతోంది. హనుమ జన్మస్థలిపై వాదోపవాదాలను అటుంచితే ప్రతి ప్రాంతం వారు ఆయనను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. అవతార పురుషులను తమ తమ ప్రాంతాలకు చెందిన వారుగా చెప్పుకోవ డంలో వింతకానీ, అనౌచిత్యం కానీ లేదటారు. ఏ ప్రాంతీయులైనా, ఏ కాలానికి చెందినవారైనా మహనీయులు లోకవంద్యులు, ఆరాధనీయులే. లోకారాధ్యుడు, ధర్మమూర్తి రామచంద్రుడి బహి: ప్రాణంగా సంభావించే లోకోత్తర వీరుడు పవన సుతుడు అంతే….
ప్రాంతీయ అచారాలను బట్టి వివిధ తిథులలో హనుమజ్జయంతిని జరుపుకుంటారు. తెలుగువారు పరశర సంహితను అనుసరిస్తూ వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహించుకుంటారు. ద్వైత సంప్ర దాయపరులకు హనుమజ్జయంతి ప్రధాన పండుగ. వారు ఆయనను ‘ముఖ్య ప్రాణదేవుడు’గా సంభా విస్తారు. హనుమదుపాసకులు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. హనుమజ్జయంతి నాడు సూర్యోదయం నుంచి ప్రత్యేక పూజాదికాలతో మందిరాలు పరిమళిస్తుంటాయి.
‘వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళమ్ శ్రీహనూమతే!!
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్