రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ పూర్వ ప్రాంత సంఘచాలక్‌ ‌ప్యాటా వెంకటేశ్వరరావు (76)  మే 3న తుది శ్వాస విడిచారు. ఆయన  గత కొద్దిరోజులుగా అస్వస్థులుగా ఉన్నారు. నిరంతర పరిశ్రమ ద్వారా అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వెంకటేశ్వరరావు మరణం తెలంగాణ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌కి తీరని లోటు.

భాగ్యనగరంలో సుదీర్ఘకాలం సంఘ పనిచేసిన జేష్ఠ్య కార్యకర్తలలో ప్యాటా వెంకటేశ్వరరావు ప్రముఖులు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వితీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌పూజ్య గురూజీ మొదలు అందరు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్దలతో, సర్‌ ‌సంఘచాలక్‌లతో  వెంటటేశ్వరరావుకు ఆత్మీయ అనుబంధం ఉంది. 

జనవరి 4,1946న రాజయ్య, నర్శమ్మ దంపతులకు వెంకటేశ్వరరావు భాగ్యనగర్‌లో జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా కష్టించి చదివి, ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైనారు. ఆపై ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.   సంఘ కార్యాన్ని జీవన కార్యంగా స్వీకరించగలిగారు. నిరాడంబర జీవితం గడిపారు. పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారి జీవనశైలిని గురించి చెప్పినప్పుడు సభికు లందరూ ఆశ్చర్యచకితులైనారు. సంఘ పనికి ఎన్నో గంటలు సమయమిస్తూ కూడా పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దారు.  అనేకమంది స్వయంసేవకులకు ప్రేరణనిస్తూ కార్యకర్తలుగా మలిచేవారు.

 వెంకటేశ్వరరావు పేరు గుర్తుకు రాగానే  చాలామందికి మొదట జ్ఞాపకం వచ్చేది వారు పాడే వైయుక్తిక్‌ ‌గీత్‌లే. పాటకు తగ్గ ఆ కంఠ మాధుర్యమే వారి మృదువైన పలకరింపులోను ధ్వనించేది. వారు మంచి ఘోష్‌ ‌వాదకులు. ఘోష్‌ ‌గణ శిక్షక్‌గా, సంచలన కార్యక్రమాల్లో, శిబిరాలలో ఘోష్‌ ‌ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించినవారు. వీరు మంచి గాయకులే కాదు, హార్మోనియం, తబలా వంటి సంగీత వాయిద్యాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఇక హాస్య చతురత వీరికి అబ్బిన సహజమైన కళ.  సమావేశా లలో హాస్య చతురతతోనే విషయాన్ని అవతలివారికి ఆకళింపు చేయగలడం వారి ప్రత్యేకత. ఘోష్‌లో స్వయంగా విశేష రచనలు అందించారు. ఆ అనుభవాలను కార్యకర్తల దగ్గర సందర్భాన్ని బట్టి చెప్తుండేవారు. జహా అపేక్షిత్‌, ‌వహా ఉపస్థిత్‌ అన్న రీతిలో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక, వ్యక్తిగత పనులను కూడా పక్కనపెట్టి సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. వారు మంచి దైవభక్తులు కూడా. ఏకాదశి వంటి పర్వదినాలలో రాత్రి దేవాలయాలలో వెళ్లి గంటల తరబడి భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పరిచయమైన వారికెందరికో సంఘ పరిచయం చేసి స్వయంసేవకులుగా చేశారు.

వెంకటేశ్వరరావు రోడ్లు, భవనాల శాఖలో సూపరిండెంట్‌ ఇం‌జనీర్‌గా పనిచేసారు. ఇంజనీరింగ్‌ ‌విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌ శ్రీ‌రాం సాఠే, డా।। సురేందర్‌ ‌రెడ్డి మార్గదర్శనంలో ముఖ్య శిక్షక్‌గా, మండల కార్యవాహగా పనిచేస్తూ అంచలంచలుగా ఎదిగారు. భాగ్యనగర్‌లోని  తూర్పు భాగ్‌ ‌కార్యవాహగా, భాగ్యనగర్‌ ‌విభాగ్‌ ‌కార్యవాహగా, విభాగ్‌ ‌సహ సంఘచాలక్‌గా, తెలంగాణ ప్రాంత సహ సంఘచాలక్‌గా, ప్రాంత సంఘచాలక్‌గా (2012 నుండి 2018 వరకు) వివిధ స్థాయిల్లో  సుమారు 50 సంవత్సరాల పాటు సంఘ బాధ్యతలు నిర్విరామంగా నిర్వహించారు. YMIS (Young men Improvement Society)కు అధ్యక్షులుగా చాలాకాలం కొనసాగారు. ఆర్‌వికె పాఠశాల ట్రస్టు అధ్యక్షులుగా మార్గదర్శనం చేసారు. ప్రాంత సేవాభారతి అధ్యక్షులుగా ఉంటూ సామాజిక సమరసత విభాగంలో చురుకైన పాత్ర పోషించారు.

వెంకటేశ్వరరావుకు  భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయనకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE