– చొప్పదండి సుధాకర్
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
అతడు రమేశ్!
రమేశ్ చెరువుకట్ట మీద అచేత నంగా కూర్చొని ఉన్నాడు. సాయంకాలం! సూర్యుడు పడమరవైపు దిగిపోతూ ‘‘ఇంకాసేపటికి వెళ్లొచ్చులే’’ అన్నట్టు నిదానించి కదులుతున్నాడు. అతడి ఆలోచ నలు వివిధ కోణాల్లో ఇష్టారాజ్యంగా సంచరిస్తు న్నాయి. వెనకవైపు చెరువు నీటి గలగలలు లయ బద్ధంగా వినిపిస్తోన్నా మనసు మాత్రం ఇక్కడ లేదు.
నీటి మీదుగా మంద్రంగా వీస్తున్న గాలి శరీరాన్ని సున్నితంగా పలకరిస్తుంటే ఒకింత స్పృహలో కొచ్చి చుట్టూ చూశాడు. సగానికి పైగా నిండి ఉన్న చెరువులో రకరకాల చేపలూ, పక్షులూ ఉబుసుపోక అటూ ఇటూ ఎగురుతూ జలదృశ్యానికి మరింత రమణీయతను సంతరింపజేస్తున్నాయ్! కుడి పక్క చెరువూ,ఎడమ పక్క కట్టకిందుగా కళ్లకు తమ శక్తి మేర ఆహ్లాదాన్ని పంచుతూ పంట పొలాలు, పొదలు.. తుప్పలు, ఎవరు పట్టించుకోకున్నా ఏపుగా పెరిగిన వేపచెట్లు… ఇంకా కంచిపట్టు చీరకు జరీ అంచులా పక్కనే ఒంపుసొంపుల మెలికలుగా తిరిగి తరలి పోతోన్న చిన్నపాటి సెలయేరు!
రోజూ చూసేదే అయినా అతడికా దృశ్యం నిత్య నూతనంగా కనిపిస్తూ… అనిపిస్తూ… ఉంటుంది. చల్లటి గాలి.. అన్నీ గమనిస్తూ మౌనంగా మిగిలి పోతోన్న పరిసరాలు.. ఎవరో అదృశ్యంగా వెలిగిం చిన అగరుబత్తుల్లా సహజ పరిమళాలు వెదజల్లుతూ ‘మమ్మల్లి కనుక్కో’ అంటూ ఆటపట్టించే అడవి మల్లెల సుగంధం-వెరసి ఒక అద్భుత జ్ఞాపక చిత్రం లాగా కనువిందు చేస్తుంటాయి.
వీటన్నింటికి తోడుగా కొద్ది దూరంలో నిటారుగా నిలబడి మనిషికి ధైర్యం చెబుతున్నట్టుగా కొలువైన తాటివనం!
ప్రకృతిని చూసి మనిషి బొమ్మలేయడం నేర్చుకొన్నాడా? బొమ్మలను చూసి ప్రకృతి అందంగా ముస్తాబ యిందా? ఏం పిచ్చివాదన.. తాత మొహం అచ్చు మనవ డిలా ఉందనట్టు- ఎక్కడో చదివినట్టు గుర్తు. మనిషి అమ్ముడు పోతూ… భూమిని అమ్ముతున్నానని చెప్పడం లాంటిదే. భూమిని వాస్తవానికి ఎవరమ్మ గలరూ? ఆ మాట వింటే భూమి ఫక్కున నవ్వుకోదా?
దూరంగా నాలుగయిదు మోటారు సైకిళ్లు ఆగి ఉన్నాయి. వాటి పక్కనే నలుగురైదుగురు భూ దళారులు అటూ ఇటూ చేతులూపుతూ పెద్దగా మాట్లాడుతున్నారు. మధ్యమధ్య నవ్వుతూ ఆ ప్రాంతం గొప్పదనాన్ని విశ్లేషిస్తున్నారు. ఆ మాటలు లీలగా వినిపిస్తున్నాయి.
పొన్నాల-సిద్ధిపేట పట్టణానికి ఆనుకొని ఉన్న కుగ్రామం. ఏం జరిగిందో ఏమోగానీ రెండు, మూడేళ్లుగా ఒకటే ల్యాండ్‌బూమ్ సునామిలా దాన్ని చుట్టు ముట్టింది.పట్టణానికి పది కిలోమీటర్ల పరిధిలోని అన్ని రకాల భూముల ధరలకు రెక్కలొ చ్చాయి. వేల ధరల్లో ఉన్నవి లక్షల్లో, లక్షల విలువైనవి కోట్లలో మండిపోతున్నాయ్. సిద్ధిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజూ సందడే! కొమురెల్లి జాతర చందమే! సైట్‌మ్యాపులు… దస్తావేజులు… నోటరీలు చెట్ల కిందనే బయానాలు… అక్కడక్కడా ఛాలెంజ్‌లు… సిగపట్లు… మారుబేరాలు… అబ్బో అదో వర్ణింప నలవి కాని దృశ్య సమూహం.
దళారులు, అమ్మేవారు, కొనేవారు అందరూ మనవారే. మనుషులు కదా! ఏది లాభంగా ఉంటే అదే చేస్తారు. పైసాలోనే పరమాత్మ ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు.
‘‘నర్సింలు అనేది అదే!’’ రమేశ్ గుర్తుచేసు కున్నాడు. ‘‘ఒరే చెబితే కొంచెం అసహ్యంగా ఉంటుం దేమో గానీ ఇవాళ జనం సుఖాలకు విపరీతంగా అలవాటు …కాదు కాదు అడిక్ట్ అయిపోయేరు. రిమోట్ దొరకకపోయినా, టి.వీ.ఛానల్ మార్చవచ్చు అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి, దానికోసం తన్నుకు చస్తున్నారు. రిమోట్ దొరికే దాకా బి.పి. పెంచు కొంటున్నారు. ఒకప్పటి పారిశ్రామిక విప్లవం ఇట్లా తిరగబడుతుందని తెలిస్తే ఆ పక్రియను అప్పుడే ధ్వంసం చేసే వారేమో? మనిషికిపుడు సుఖమే పరమావధి. అందునా స్మార్ట్ మనీ… కష్టపడకుండా వేరే వాడి కష్టం మీద బతకాలి. ఇందుకు ఆడామగా తేడా లేదు. పల్లె,పట్నం అనే మాటే లేదు.
నర్సింలు, రమేశ్ డిగ్రీ క్లాస్‌మేట్స్, నిర్మల కూడా. అదేమిటో గానీ నర్సింలు పట్టిందల్లా బంగారమే! వాడికి పెళ్లయి ఆరేళ్లు దాటిపోయింది.అబ్బాయి స్కూలుకెళుతున్నాడు కూడా. రమేష్ ప్రేమ మాత్రం నిర్మల దగ్గరే ఆగిపోయింది. పదేళ్ల ప్రేమకు ఇంకా ముగింపు దొరకలేదు.
రమేష్ పెదాలపై ఓ చిరునవ్వు రాబోతూ ఆగి పోయింది. కారణం చేతిలోని స్మార్ట్‌ఫోన్ మోగడమే. దానివైపు చూశాక ఇందాకా రాబోతూ ఆగిపోయిన చిరునవ్వు నిస్సంకోచంగా ఆవిష్కృతమైంది.
‘‘నిమ్మా’’ నిర్మలను తలచుకొని ఫోన్ లిఫ్ట్ చేయబోయాడు. అంతలోనే కాల్ కట్ అయింది.
‘నర్సింలుకి తామిద్దరు ప్రేమించుకొన్నట్టు తెలుసు’. గతం గుర్తు చేసుకొన్నాడు. నిర్మల గుర్తుకు రాగానే ఒక్కసారిగా మనసంతా అదోలా మారి పోయింది. కొంత ఆనందం.ఎక్కువ విషాదం.ఎక్కువ విషాదం కొంత ఆనందం కలగలిసిన ఒకానొక మానసిక స్థితి. అనిర్వచనీయ అనుభూతి అది.
రమేశ్‌కి చదువు పుష్కలంగా ఉన్నా కోరుకొన్న ఉద్యోగం రావడం లేదు. నిర్మలకేమో ఉద్యోగం సిద్ధంగా ఉన్నా చేయడానికి మనసొప్పడం లేదు.
‘‘నిన్ను పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేసి చచ్చేదాకా నీకు, వాళ్లకు సేవ చేసుకోవడమే నా అసలయిన ఉద్యోగం అంటుంది స్వచ్ఛంగా.
‘‘అదేం, పాత చింతకాయ బుద్ధీ’’ ఎగతాళిగా అన్నాడు. ‘‘ఎందుకూ..?’’ ఉడుక్కొంది నయన మనోహరంగా!
‘‘చక్కగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్కో, అదీ అద్దాల మేడలో’’… ‘‘ఏమొద్దూ.. నా దృష్టిలో కాపురం చేసుకోవడమే మంచి ఉద్యోగం, అదీ… ఎవరు ఊహించని రీతిలో, మొగుణ్ణి, అత్తమామలను ప్రేమిస్తూ, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ, వంటలు చేస్తూ కోపానికి గురవుతూ, ప్రతిగా అలుగుతూ, తిడుతూ, తిట్లు పడుతూ ఓహ్… అదో అద్భుత లోకం… ‘‘నిర్మల గొంతులో పరవశం…
‘‘వెర్రి బాగా ముదిరింది..’’ రమేష్ తెచ్చి పెట్టుకొన్న కోపంతో అన్నాడు. ‘‘ఉహు.. దీన్ని మీ ఊళ్లో వెర్రి అంటారేమో.. కానీ మా ఊళ్లో ప్రేమ, ఉత్తమ ఇల్లాలు..ఇంకా అదేదో ఆదర్శ దాంపత్యం అంటారు’’ దీర్ఘం తీస్తూ చెప్పింది.
‘‘నిన్నెవడు చేసుకొంటాడో గానీ – వాడు ఉద్యోగం, సద్యోగం ఏదీ చేయడు. నీ కొంగు పట్టు కొని తిరిగి తిరిగి సర్వనాశనమైపోతాడు.
హు-నీకలా అర్థమయిందా… అటునుండి గాఢమైన నిట్టూర్పు.
‘‘ఒకవేళ మనకు పెళ్లే కాలేదనుకో ఎలా -‘‘రమేశ్ ప్రశ్నించాడు. నిర్మల నుండి అయిదారు సెకన్ల మౌనం.
‘‘కొంపదీసి చచ్చిపోతావా? ఏమిటి?’’ సరదాగా అడిగినట్టనిపించినా అతడి గొంతులో లీలగా భయం పొడసూపింది.
‘‘కాదు -అసలు నా జీవితంలోంచి పెళ్లినే బహిష్కరిస్తాను’’.కళ్లు చెమర్చినాయి కాబోలు ఆ ‘తడి’ గొంతులో ప్రతిఫలించింది. అయిదేళ్లుగా ఇదే తంతు… కలిసిన ప్రతిసారి ఇవే మాటలు!
ఫోన్ మళ్లీ మోగింది. మళ్లీ నిర్మల.. అదే నిమ్మా.. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయక తప్పలేదు. ఎందుకంటే ఆలోచనల్లో పడి గమనించలేదు గానీ, అది అయిదో మిస్‌డ్ కాల్!
‘‘చెప్పండి నిర్మలా మేడమ్!’’ నిర్లిప్తంగా విష్ చేశాడు. అటునుండి నిశ్శబ్దం మాట్లాడుతున్నట్టు మళ్లీ మౌనమే! ‘‘ఇందుకేనా ఫోన్ చేసింది’’ రమేశ్ గొంతులో ఇష్టమైన నిష్ఠూరం. ‘‘కాదు నీ గొంతు వినాలనీ – ‘‘ఆమె గొంతు స్థిరంగా మంద్రంగా ఉంది. నిర్మలా ఒత్తిడితో తల్లడిల్లిపోతున్నాను’’.
ఇక్కడ నాగతీ అంతే. రామకోటి రాసినట్టు ఒకటే మాట పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని చంపుతున్నారు.
ఏం చేయాలో తోచడం లేదు. రమేష్ అభావంగా అన్నాడు. చేసేదేముంది? అనుకొన్నది సాధించే శక్తి లేనపుడు, జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే.
కొద్దిసేపటి తర్వాత కాల్ కట్ అయింది.
రమేశ్‌కి మళ్లీ ఫోన్ చేయాలనిపించలేదు. ఎందుకో గానీ కాసేపు మనసుని బాధ బాధగానే ఉంచాలనిపించింది.
అలాగయిన తన పిరికితనానికి తగిన శిక్ష విధించుకొన్నట్టుగా ఉంటుందనిపించింది. మసక చీకట్లు కమ్ముకొస్తుంటే నిస్సత్తువగా కట్టమీది నుండి లేచి ఇంటివైపు బయలుదేరాడు. మనసంతా ఖాళీఖాళీగా ఉంది. ఇంటి నుండి పొలానికి వస్తున్నాడో.. పొలంనుండి ఇంటికి వెళుతున్నాడో కూడా తెలియనంత గందరగోళం.
చేతిలో సెల్‌ఫోన్ మళ్లీ మోగింది!
‘‘మళ్లీ నిమ్మియే…’’ అనుకొంటూ ఫోన్‌కేసి చూశాడు.
ఈసారి నిమ్మి కాదు… నర్సింలు…! లిఫ్ట్ చేశాడు. ‘‘హాయ్ రా.. రమేశ్..’’ అటు నుండి నర్సింలు పలకరించాడు.
‘‘హాయ్..’’ మనస్కంగానే బదులిచ్చాడు.
‘‘ఏరా -డల్‌గా ఉన్నట్టున్నావ్’’ నర్సింలు అసలే ఆవులించకుండానే పేగులు పేగులు లెక్కబెట్టే రకం.
‘‘సర్లే నీ సంగతి తెలియందేముంది. అన్నింటికి తటపటాయింపే..అది పోనీ – మీ ఊళ్లో ఎక్కడయినా పదెకరాల పొలం అయినా మెట్ట భూమయినా ఉందా? కొనడానికి..’’
‘‘ఎందుకురా..’’ షాక్‌లు మీద షాక్‌లు తట్టుకోలేక అడిగాడు. ఎందుకేమిట్రా కొనేస్తా – ఈ ఉద్యోగం అదే సాఫ్ట్‌వేర్ జాబ్ ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో.. కాసింత జేబులు చల్లగా ఉన్నప్పుడే కొనిపడేస్తే నేలతల్లితో కాస్తా అనుబంధం పెరుగు తుంది.బతుక్కి భరోసాగా ఉంటుంది. అదీగాక – ఆ పొలాలు, ఆ గాలీ, చెట్లూ, వాటి సామీప్యం ఓహ్ – ఆ థ్రిల్లే వేరు -’’ నర్సింలు గొంతులో పట్టరాని పారవశ్యం.
‘‘ఉందిరా – చాలా భూమి అమ్మకానికి ఉంది. రోజు ఇక్కడ జరుగుతున్నది అదే. ఉన్నవాళ్లు తేలిగ్గా అమ్ముకోవడం, లేనివాళ్లు అపురూపంగా కొను క్కోవడం..’’
అయితే నాకో పదెకరాల స్థలం చూడు. అట్లా కాకపోతే యాభయి నుండి డెబ్బయి, ఎనభై లక్షల మొత్తానికి ఎంతొస్తే అంత.. కొనడం మాత్రం పక్కా. అదీ మా ఊళ్లోనే, వీలయితే నీ పొలానికి దగ్గర్లోనే.. ఎందుకంటే నువ్వే అన్ని చూసుకోవాలి.
‘‘అంటే నేనేమో జీవితాంతం మట్టి పిసుక్కొం టూనే ఉండాలి. మీలాంటి వాళ్లేమో అద్దాలమేడల్లో ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేయాలా?’’ రమేశ్ గొంతు ఉక్రోషంతో పూడుకుపోయింది.
‘‘ఒరే పిచ్చి రమేశ్ నేను నీతో రెండు, మూడు విషయాలు చాలా నిర్మొహమాటంగా మాట్లాడతాను. వాటిపై నీ అభిప్రాయం లేదా విశ్లేషణ రేపు లేదా వారం తర్వాత చెప్పు. వెంటనే మాత్రం అస్సలు వద్దు..’’
రమేశ్ చాలాసేపు ఏమి మాట్లాడలేకపోయాడు. నర్సింలు చేప్పే లాజిక్ ఏమిటో అతడికి ఎప్పట్లాగే అస్సలు అర్థం కాలేదు.
‘‘ఒరేయ్ రమేశ్.. వినూ.. ఒకటి నువ్వు నీలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని ముందు వొదిలెయ్. నువ్వెంత ఉన్నతస్థాయిలో ఉన్నావో ఒక్కసారి ఆలో చించుకో. ఇన్నేళ్లయ్యాక కూడా నేను నీ వర్గంలోకి రావాలని ఎందుకు ఆరాట పడుతున్నానంటావ్? తల్లిదండ్రుల సాన్నిహిత్యం, సొంతవూరు, పది పది హేను ఎకరాల పొలం.. నీ అంత లక్కీ ఫెలో అసలు ఈ కాలంలో ఎవరూ ఉండరురా.. అన్నింటి కన్నా గొప్పదైన, నిర్మలమైన నిర్మల ప్రేమను తారస్థాయిలో పొందగలగడం.. ఇంకా నీకు ఏం కావాలిరా..? స్టుపిడ్..’’ ఫోన్ కట్ చేశాడు.
రమేశ్ చెంపలు తడుముకున్నాడు. నర్సింలు మాట్లాడిన మాటలు అచ్చు చెంపదెబ్బల్లాగే తగి లాయ్. ఎట్లా ఇంటికొచ్చాడో అస్సలు తెలియదు. వచ్చీ రావడంతోనే వాకిట్లో మంచంపై వాలి పోయాడు. చెప్పరాని నిస్సత్తువ ఆవరించింది. కానీ ఆ నిస్సత్తువలోనే ఏదో తెలియని సత్తువ.
‘‘ఓరేయ్ రమేశ్ – నర్సింలు అని ఎవరో నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడ్రా..!’’ తండ్రి నాగయ్య పలక రింపుతో రమేశ్ ఈ లోకంలోకి వచ్చాడు.
‘‘అంటే.. నాన్నగారూ.. మీకు ముందే చేశాడా.. ఏం మాట్లాడాడు?’’
‘‘ఏం మాట్లాడలేదురా.. నీ ఫోన్ పదేపదే ఎంగేజ్ వస్తోంటే నాకు చేశాడట.. అంతే చెప్పాడు.
‘‘అలాగా..’’ తాను అంతసేపు నిర్మలతో మాట్లాడిన సంగతి గుర్తొచ్చి లోలోన ఏదో పరవశపు తెర రెపరెపలాడింది.
రమేశ్ సుదీర్ఘంగా శ్వాసించాడు. ఏదో ముఖ్య మైన విషయం చెప్పబోతున్నాడని పూర్ణమ్మ దగ్గరగా జరిగింది. తల్లి చేయి తన చేతుల్లోకి తీసుకొన్నాడు. అందాకా కొట్టుమిట్టాడిన వీధిలైట్ ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలిగింది. రమేశ్ పెదాలపై చిరునవ్వు..!
‘‘నర్సింలని నా ఫ్రెండమ్మా! మన ఊళ్లోనే ఇంకా వీలయితే మన పొలానికి పక్కనే పదెకరాల పొలం తీసుకొంటాడట.దాని బాగోగులు నన్నే చూడమంటు న్నాడు. ఏం చెప్పాలి?’’
‘‘కొనుక్కొమ్మను బిడ్డా.. మన పొలంతో బాటు తన పొలమూ చూసుకుంటూ ఊళ్లోనే ఉండొచ్చు మాతో బాటు’’ పూర్ణమ్మ నవ్వింది ఆశగా. ‘‘మరి నా చదువూ.. ఉద్యోగమూ..?’’ రమేశ్ ప్రశ్న ముగ్గరి మధ్య మెయిడిన్ ఓవర్ లాంటి నిశ్శబ్దం..!
‘‘చదువంటే లోకజ్ఞానం కోసం, ఉద్యోగం అంటే ఏ బతుకు తెరువూ పూర్తిగా లేనోళ్లకు. మనకెందుకు నాయినా! భూతల్లిని నమ్ముకో నాయినా.. నిన్నెప్పుడు మోసం చేయదు. పదేళ్లు ఉద్యోగం వెలగబెట్టిన వాడే మళ్లీ భూతల్లి ఒడిలోకి రావాలని ఆశపడుతున్నాడు కదరా..! మళ్లీ నువ్వు పదేళ్లు గొడ్డు చాకిరి చేసి తిరిగి పంట పొలాలవైపు రావడం కన్నా, ఈ మధ్య కాలంలో నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మా కళ్లముందే పిల్లా పాపలతో కళకళలాడుతుంటే.. ఎంత బాగుంటుందయ్యా..’’
‘‘మరి అమ్మా నన్నెవరు గేలి చేయరా..?’’
‘‘చేస్తారు నాన్నా.. కానీ గేలి చేసే వాళ్లెవరు నీకు అవసరానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయరు..’’
అంతా నిశ్శబ్దం – నిశ్శబ్దమే నిజం! నర్సింలు గాని ఒక ఫోన్‌కాల్ తన జీవితాన్నే మార్చేసిందా..! ఒక ఫోన్‌కాల్ కూడా జీవితాన్ని మార్చగలదా?
‘‘సరేనమ్మా ఒక ఫోన్‌చేసి వస్తా – అయిదు నిమిషాల్లో..!
‘‘ఎవరికయ్యా నర్సింలుకా?’’ పూర్ణమ్మ అడి గింది. ‘‘కాదు నిమ్మికి..’’ నాగయ్య బోసిగా నవ్వాడు.
అయినా వినిపించనే వినిపించింది.
రమేశ్ ఇంట్లో లైట్లన్నీ వేసి నిశ్శబ్దంగా పెరట్లోకి నడిచాడు.