– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
పనే దైవం (వర్క్ ఈజ్ గాడ్) పనే పూజ (వర్క్ ఈజ్ వర్షిప్) అని ఆర్యోక్తి. జీవిక కోసం ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన, నచ్చిన ఏదో ఒక పని చేయాల్సిందే. తరతరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు వారసత్వంగా సంక్రమించినా ఏ పని చేయకుండా వాటిని అనుభవించాలనుకోవడం స్వార్థం, సోమరితనం కిందికే వస్తాయన్నది పెద్దల వాక్కు. ‘పని చేయనివాడికి తినే హక్కులేదు’ అనే మాట ఉండనే ఉంది. వయోభారం వల్లనో, అనారోగ్యంతోనో శరీరం సహకరించక పోతేనో తప్ప అన్నీ అనుకూలంగా ఉండీ ‘పని గండం’గా భావించే వారిని సమాజం క్షమించదు. పని ధ్యాస ఉన్నవారికి పాడు ఆలోచనలు మనసులోకి రావంటారు. కష్టించే తత్వం, ఏకాగ్రత, లక్ష్య సాధన, మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతాయి. అందుకు ఎందరో మహనీయులు ఉదాహరణగా నిలిచారు.
ప్రతి వ్యక్తి తనకు కేటాయించిన పనిని (కర్తవ్యాన్ని) శ్రద్ధతో సకాలంలో నిర్వహించగలిగితే సత్ఫలితాలు సాధించవచ్చు. పని దైవ స్వరూపం అని పెద్దలు ఏనాడో శ్లాఘించారు. భక్తి ద్వారా భగవంతుడిని దర్శించాలనుకోవడం కంటే, పని ద్వారా దానిని సాధించాలనుకోవడం అర్థవంతంగా ఉంటుందని, అందులో పరమార్థం దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు. ఏ కారణంతోనైనా కర్తవ్యాన్ని విస్మరించినా, జాప్యం చేసినా ఫలితాలు తారుమారు కావచ్చు. రేపటి పనిని ఇవ్వాళే, ఈరోజు పనిని ఇప్పడే చేయాలని సూక్తి. దీనిని పాటించినవారు ఎన్నో అద్భుతాలు సాధించారు, సాధిస్తున్నారు. ఏ పనినైనా, జీవనయాత్ర రేపోమాపో ముగుస్తుందన్నట్లుగా మొదలుపెట్టాలని, పని చేసేటప్పుడు ‘మరి కొన్నేళ్లు బతుకుతాను’ అనేంత ఆనందంగా కొనసాగించాలంటారు.
ప్రతి ఒక్కరు జీవనం కోసం ఏదో ఒక పని చేసుకుంటూపోవాలి. ఏమీ చేయకుండా కూర్చోవడం అందరికి సాధ్యం కాదు. పని లేదా వృత్తి చేసుకుని ఆర్జించిన దానితోనే తృప్తి లభిస్తుంది. అదృష్టం వల్ల కొందరికి వారసత్వంగా సిరిసంపదలు దఖలు పడవచ్చేమో కానీ కష్టించే తత్వం మాత్రం అలా రాకపోవచ్చు. అలా కుటుంబ పెద్దల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే కొందరికి ఇతరత్రా పని చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. అయితే పనితనం లోపిస్తే ఆ ఆస్తిపాస్తులు వ్యర్థమవుతాయనేందుకు అనేక ఉదాహరణలు కళ్ల ముందు కదలాడతాయి. ‘మేము కష్టపడ్డాం కనుక మా సంతానానికి ఆ పరిస్థితి ఎదురు కాకూడదు. మేము ఆర్జించిన దానితో, ఏ పనీ చేయకపోయినా భావితరాలు సుఖంగా బతికేయవచ్చు’ అనే భావనను పెద్దలు తుడిచిపెట్టి ‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే…’ అనేలా పని, ఆర్జన విలువలను తెలియ చెప్పాలి. ‘తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగా నువు తిరగకురా/కండలు కరుగగ• కష్టం జేసి తలవంచక జీవించుమురా…’ అని ఒక సినీకవి ప్రబోధించారు. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావచ్చు. సంపన్నుడు అతి సంపన్నడు లేదా సిరి రహితుడు కావచ్చు. అలాంటి పరిస్థితులలో ‘పని సంస్కృతే శ్రీరామరక్ష’. పని సంస్కృతి అలవడితే పూవుకు తావి అబ్బినట్లే.
పని వ్యక్తి ధర్మం
సృష్టిలో ప్రతి మనిషీ కారణజన్ముడే. ఏదో విధంగా సమాజానికి ఉపకరించవలసినవాడే. పెద్దదో, చిన్నదో అర్హత, అదృష్టాన్ని బట్టి అందివచ్చిన పని నిర్వర్తించవలసినవాడే. అదే సమయంలో చేసే పనిపై గౌరవం ఉండాలి. తాము చేసే పనే గొప్పదని, లేదా తన పని కన్నా ఇతరులు చేసే పని ఉన్నతమైన దనే భావన కూడదు. అలా అనుకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. వివిధ వృత్తుల వారు అలా అనుకుంటే జీవనచక్రం స్తంభించిపోతుంది. అప్పగించిన, ఎంచుకున్న పనిని ఎలా నిర్వర్తిస్తున్నాం? అనే దానిపైనే దాని విలువ, ఉన్నతి ఆధారపడి ఉంటాయి. సేతు నిర్మాణంలో వానరవీరులతో పాటు ఉడుత కూడా శక్తి మేరకు పాలుపంచుకుని చిరస్థాయిగా నిలిచి పోయింది. ‘ఉడుత సహాయం’ జాతీయంగా వినుతికెక్కింది. అలాగే పనుల నిర్వహణలోనూ ముందు వెనుకల ప్రాధాన్యక్రమం, అవసర, అనవసరాలనే భేదాలు ఉంటాయి. అవసరమైన పనిని చేయ(లే)క పోవడం, అనవసరమైన దానిని చేయడం రెండూ పొరపాటే అనేందుకు ‘మిత్రలాభం’లోని కుక్క-గాడిద కథనే ఉదాహరణంగా చెబుతారు. ‘చేయవలసిన పనిని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కానీ చేయకూడని పనిని ముందుగా చేయడం మూర్ఖత్వం’ అవుతుందని పెద్దలు వ్యాఖ్యానించారు. చేపట్టిన పని ఎంత కఠినతరమైనదైనా ప్రయత్నంలోపం ఉండ కూడదు. మధ్యలో వదిలేయకూడదు. ప్రతి యత్నం గెలుపు సోపానం కాబోదు. అలా అని విజయ తీరాలకు చేర్చకపోదు.
మానసిక ప్రశాంతతకు దివ్యౌషధం..
బతుకుతెరువు కోసం చేయడం, ఆ అవసరం అంతగా లేకపోయినా ఆసక్తితో చేయడం.. అని పనిని స్థూలంగా రెండు రకాలుగా చెబుతారు. రెండవది ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని పలువురు స్వానుభవంతో చెబుతారు. పని పలు సంతోషాలకు పట్టుగొమ్మ అని పెద్దలు అంటారు. అనేక రుగ్మతలను, అనర్థాలను దూరం చేసే దివ్యౌషధం పని అని వైద్య నిపుణులు పేర్కొంటారు. ‘పని చేస్తుంటే ఉక్కులా ఉంటావు. అదే లేకుంటే తుక్కులా మారతావు. పని అంటే ఆరోగ్యం, దానిని వద్దంటే శరణ్యం వైరాగ్యం’ అనే నానుడి ఉండనే ఉంది. ‘ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపు ఉండదు..’ అనే గీతం దీనికి సమాంతరంగా పుట్టి ఉంటుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసంతో పాటు సమాజ, దేశాభివృద్ధి పని సంస్కృతిలో ఇమిడి ఉన్నాయి. దేశానికి ఆర్థిక పరిపుష్టినిచ్చే వస్తూత్పత్తి, సమాజాభ్యుదయం లాంటివి అందులో దాగి ఉన్నాయి.
‘ఆశలావు పీక సన్నం’ అన్నట్లు చేయాల్సినంత పని చేయకపోవడం, అంతకు మించి ఫలితం ఆశించడం.. రెండూ తప్పే. మొదటిది అసమర్థతను, రెండవది అత్యాశను సూచిస్తుంది. చేపట్టిన పని ఇష్టపడేలా ఉండాలే కానీ మొక్కుబడిగా ఉండకూడదు. ఆనందంగా చేసే పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ప్రతి పనిని కేవలం ఆర్థికాంశంతో ముడిపెట్టకుండా, తాను చేయగలిగిన పనివల్ల ఇతరులకు ఏ కొంచెమైనా మేలు కలుగుతుందా? అని ఆలోచించ వలసిన అవసరం ఉంది. పనిచేస్తూ పోతే ఫలితం దానంతట అదే పరిగెత్తుకు వస్తుందని గీతాచార్యుడే చెప్పాడు.
పనికి, ఏకాగ్రతకు అవినాభావ సంబంధం ఉందంటారు. అనుకున్న పనిని ఏకాగ్రతతో చేయాలి. అలాగే, పని పట్ల శ్రద్ధను సారిస్తే ఏకాగ్రత పెరుగు తుంది. పనికి శక్తియుక్తులే పరిమితులు. కానీ ‘లోకో భిన్న రుచిః’ అన్నట్లు పని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా వ్యవహరిస్తారని పరిశీలిస్తే తెలుస్తుంది. తమకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా నెరవేర్చేవారు కొందరైతే, నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రదర్శించేవారు కొందరు. కేటాయించిన పని చేయడం సామాన్యుల లక్షణం కాగా, అప్పగించిన పనిని ఇష్టంగా మార్చుకోవడంతో పాటు ఇతర అనుబంధ పనులను చక్కపెట్టడం సమర్థుల లక్షణం. అందుకు హనుమను ప్రథమోదాహరణగా చెప్పుకోవచ్చు. లంకలో సీతామాత జాడ తెలుసుకున్న ఆయన తనను ఎదిరించిన అక్షయ కుమారుడు, ఇతర దానవసేనను చంపడం, శత్రువుల ఆయుధా లను, వారి యుద్ధ నైపుణ్యాన్ని పరిశీలించడం గమనార్హం. అలా రామకార్యాన్ని విజయవంతంగా నిర్వహించిన హనుమను ఆదర్శంగా తీసుకోవాల న్నారు రామకృష్ణ పరమహంస.
పనిలోనే విశ్రాంతి
పనిలోనే విశ్రాంతి అంటారు కొందరు. పనితనాన్ని ప్రాణప్రదంగా భావించుకునేవారు ప్రతి క్షణం తమను తాము మెరుగుపరచుకుంటూ, పనిని సమర్థంగా పూర్తి చేసేందుకు యత్నిస్తారు. జీవనం కోసం, జీవితంలో ఉన్నతి కోసం పనిని శ్వాసిస్తూ, పనిని ప్రేమించాలంటారు. అలాంటి వారు ఎందరో ఆ దిశగానే అద్భుతాలు సాధించారు. వాటి ఫలితాలు వారికి ఎంత వరకు ఉపకరించాయన్నది అటుంచితే లోకానికి ఎంతో మేలు చేస్తున్నాయి. అంకిత భావంతోనే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించ గ•లుగుతారు. అందుకు అల్లుకుపోయే తత్వం ఉండాలంటారు. కొందరు అప్పగించిన పనినే చేస్తారు. మరికొందరు ఎదుటి వారి పనిలోనూ భాగం పంచుకుని వారిపై పని ఒత్తడిని తగ్గించే ప్రయత్ని స్తారు. మొదటిది కర్తవ్యం కాగా, రెండవ దానిని పారమార్థికంగా చెప్పవచ్చు. ఇంకొందరు అందులోని నైపుణ్యాలను, విశేషాలను తెలుసుకునేందుకు చొరవ చూపుతారు.
ఉచితాలతో నిర్లిప్తత
చేయడానికి పనిలేదనే మాట కొందరి నోట తరచూ వినిపిస్తుంది. పని చేయాలనే ఉద్దేశం గట్టిగా లేకపోతే ఏమో కానీ కష్టించే తత్వం ఉన్నవారికి అవకాశాలు మూసుకుపోతాయని చెప్పలేమంటారు నిపుణులు. రాజకీయ ప్రయోజనాల కోణంలో ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలు కూడా కొందరిలో పని పట్ల నిర్లిప్తతను పెంచి పోషిస్తున్నా యని మేధావివర్గం, విశ్లేషక ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఉచితాలు’, పని పట్ల విముఖత లాంటివి సహజ వనరుల, దేశ సంపద క్షీణతకు కారణమవుతున్నాయి. ఫలితంగా దేశాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందన్నది నడుస్తున్న చరిత్ర.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్