అప్పులపై లెక్కలు చెప్పాలని కంట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) 5 ‌నెలలుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖకు తెలిసి చేస్తున్న అప్పులు కొన్నైతే తెలీకుండా చేసేవి అంతకు మించి ఉన్నాయని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్నారు. పైగా ప్రభుత్వం చేస్తున్న అప్పులు మూలధన వ్యయానికి చేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటి నుంచి సంపద సృష్టించవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా సంక్షేమం పేరు చెప్పి ఓట్ల కొనుగోలు లక్ష్యంతో అప్పు తెచ్చిన నగదును ప్రజలకు పంచేస్తోంది. ఇదే ఇప్పుడు కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అప్పులు రూ.7 లక్షల కోట్లకు పైగా చేరిన తరుణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ప•రిమితికి మించి రుణం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులెంతో లెక్కగట్టేందుకు కాగ్‌ ‌ప్రయత్నించింది. ప్రతి ఏడాది ఆయా రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలు, ఖర్చుల వివరాలను కాగ్‌ ‌పరిశీలించి పార్లమెంటుకు నివేదిస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు తాను తీసుకున్న అప్పుల వివరాలను మాత్రం కాగ్‌ ‌కార్యాలయానికి పంపలేదు. ఇప్పటికి పదే పదే లేఖలు రాసినా ఫలితం లేదు.

కంట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ఇం‌త వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్‌ ‌రుణాల వరకే వివరాలను తీసుకుని వాటితోనే లెక్కలు తేలుస్తోంది. కాని వైసీపీ సర్కారు పలు రూపాల్లో అప్పులు సేకరించింది. 33 కార్పొ రేషన్లు ఏర్పాటుచేసి వాటి ద్వారా రుణాలు సేకరిం చింది. ఈ వివరాలు గోప్యంగా ఉంచింది. దాదాపు 33 సంస్థలు రెండు లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.35 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇంధన శాఖకు సంబంధించి పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌రూ.14 వేల కోట్లు, పవర్‌ ‌కో-ఆర్డినేషన్‌ ‌సంస్థ ద్వారా డిస్కామ్‌లు రూ.11 వేల కోట్లు, జెన్‌కో రూ.5 వేల కోట్లు, పవర్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌రూ. వెయ్యి కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమా చారం. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టిడ్కో రూ.12 వేల కోట్లు, గృహ నిర్మాణ సంస్థ రూ.4 వేల కోట్లు రుణంగా సమీకరించాయంటున్నారు. రహదారుల అభివృద్ధి సంస్థ, నీటివనరుల అభివృద్ధి సంస్థ, ఆర్‌టీసీ కూడా జాబితాలో ఉన్నాయట. కొత్తగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి సంస్థ రూ.23 వేల కోట్లు, ఫైనాన్షియల్‌ ‌సర్వీసెస్‌ ‌కార్పొరేషన్‌ ‌రూ.10 వేల కోట్లు తీసుకోగా, గ్యారెంటీలు లేకుండా మరికొన్ని సంస్థలు రూ.65 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు నిపుణులు అంటున్నారు. మొత్తం రుణంలో కొన్ని సంస్థలు తామే రుణం తీసుకుని, తామే చెల్లించుకుంటున్నది రూ. 50 వేల కోట్ల వరకు ఉంటుంది. వీటిలో చెల్లించినవి పోగా దాదాపు రూ. 1.63 లక్షల కోట్ల అప్పుకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. అయితే ఈ మొత్తంలో సింహభాగం ప్రభుత్వ అవసరాలకు వివిధ ఖాతాల ద్వారా మళ్లి పోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత భారీ రుణాలపై ఏటా రూ. 15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో పెను భారంగానే మారుతుందన్న ఆందోళన వ్యక్త మవుతోంది.

అన్నింటిపై ఆరా..

సంస్థలు తీసుకునే రుణాలపై ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీల వివరాలపై కాగ్‌ ఆరా తీస్తోంది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పంపిన ప్రశ్నావళిలో గ్యారెంటీలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. ఏ సంస్థకు ఎంత గ్యారెంటీ ఇచ్చారన్న దానితోపాటు ఆ రుణానికి సంస్థలు చేస్తున్న వాయిదాల చెల్లింపులు, గడువు తేదీల వివరాలు కూడా సమర్పించాలని కోరింది. గ్యారెంటీలకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు కూడా ఇవ్వాలని, ఏవైనా రుణాలను రీషెడ్యూల్‌ ‌చేశారా అన్నది చెప్పాలని స్పష్టం చేశారు. ఫలానా సంస్థలకు రుణాలకు భారీగా గ్యారెంటీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఫలానా సంస్థలు ఆ రుణాలను ఏ అవసరానికి తీసుకున్నాయన్నది కూడా చెప్పాలని ఏజీ కార్యాలయం కోరినట్లు సమాచారం. గ్యారెంటీల ద్వారా ఆయా సంస్థలు ఏయే బ్యాంకుల నుంచి, ఏయే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్న అంశాలను కూడా ప్రశ్నావళిలో చేర్చారు. ఈ గ్యారెంటీల మొత్తం 2021 మార్చి నెలాఖరుకు, 2022 మార్చి నెలాఖరుకు ఎంత ఉన్నాయన్నది కూడా చెప్పాలని కోరింది. అలాగే ఆయా సంస్థలు తీసుకున్న రుణాలకేనా, ఆ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీలకు కూడా గ్యారెంటీ ఇచ్చారా అని ఏజీ కార్యాలయం ఆరా తీస్తోంది. ఒప్పందం మేరకు రుణం తీసుకున్న నాటి నుంచి అసలు ఎంత చెల్లించారు? ఏమైనా గ్యారెంటీల కాలపరిమితి ముగిసిందా? అన్న అంశాలపైనా ప్రశ్నలు వేశారు. ఇక గ్యారెంటీలపై వసూలు చేయాల్సిన కమిషన్‌ ‌గురించీ అడగడం గమనార్హం.

వసూలు కాని గ్యారెంటీల కమిషన్‌కు గల కారణాలు చెప్పాలని కోరింది. వాటికి సంబంధించిన చలాన్ల వివరాలు కూడా పంపించాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, ప్రభుత్వ గ్యారెంటీల ద్వారా రుణాలు తీసుకున్న సంస్థల వార్షిక టర్నోవర్ల వివరాలు కూడా సమర్పించాలని ఏజీ కోరింది. ప్రధానంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల వివరాలు కావాలని కోరింది. రుణాలకు సంబంధించి ఆయా సంస్థలకు చేసే బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో పొందుపరిచారా లేదా అన్నది కూడా చెప్పాలని పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఏడాది అప్పులపై ప్రభావం!

అనుమతి లేకుండా చేసే రుణాలు ప్రభుత్వ రుణాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల జాబితాలో కలిపితే రుణ పరిమితి దాటిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న అప్పులు ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఈ ఏడాది లభించే రుణ సదుపాయంపై ఆ ప్రభావం పడనుంది. ఈ ఏడాది ఇచ్చే రుణాల మొత్తం నుంచి గత ఏడాది అదనంగా తీసుకున్న రుణాలను తీసివేసి మిగతాది మాత్రమే ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల సంక్షేమ పథకాలకు చెల్లింపుల కోసం ప్రతి నెలా అప్పుల కోసం ఎదురుచూసే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన విచ్చలవిడి అప్పులు, గత అప్పులతో కలిపితే రూ.7.76 లక్షల కోట్లకు చేరాయంటున్నారు. ఇది మరో రెండేళ్లు కొనసాగితే రూ.10 లక్షల కోట్లకు చేరిపోతుంది. అదే జరిగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటం ఖాయం. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే కట్టడితో రాష్ట్రానికి రక్షణ రేఖ ఏర్పడవచ్చు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE