తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రయోగిస్తున్న భాష ప్రజాస్వామిక వాదులను విభ్రాంతికి గురి చేస్తున్న మాట నిజం. విపక్ష నేతలతో పాటు, పత్రికా విలేకరులను, తన సభకు వచ్చిన వారి మీద కూడా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌పరుష పదజాలం ఉపయో గించడం తెలిసిందే. గాజు మేడలో ఉన్న వారు ఎప్పుడూ రాళ్లు వేయరాదని చక్కని నానుడి. ఇప్పుడు అదే జరుగు తున్నది. తెరాస నేతలు ప్రయోగిస్తున్న భాషనే విపక్షాలు కూడా యథాతథంగా ప్రయోగి స్తున్నాయి. అయితే  తెలంగాణ మంత్రుల, నేతల వాచాలత వాళ్లనే ఇరుకున పెడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ, పొరుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌లోని మౌలిక వసతుల మీద కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలు, వాటి మీద ప్రతి విమర్శలు.


టీఆర్‌ఎస్‌ ‌పాలన మినహా దేశంలో ఎవరూ ప్రజారంజక పాలన అందించలేరనే అతిశయం అధికారపార్టీ ముఖ్యనేతలు, నేతల ప్రసంగాల్లో, వ్యాఖ్యల్లో ఎప్పుడూ ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అదే క్రమంలో సీఎం కేసీఆర్‌ ‌కుమారుడు, తెలంగాణ మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్‌ అయ్యాయి. అత్యుత్సాహంతో, ఆవేశంతో ఆయన చేసిన ప్రసంగం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అటు సహజంగానే ఏపీ మంత్రులు, అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిసింది. చిత్రంగా ఆ రాష్ట్ర విపక్ష పార్టీల నేతల నుంచి కేటీఆర్‌ ‌ప్రకటనకు మద్దతుగా స్పందన వచ్చింది. మరోవైపు ఇటు సొంత రాష్ట్రం తెలంగాణలో ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేని దుస్థితి అధికార పార్టీకి వచ్చింది. దీంతో, నాలుక్కరుచుకున్న కేటీఆర్‌ ‌చివరకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పక్క రాష్ట్రంలోని మౌలిక వసతుల మీద మంత్రిగా కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వెంటనే రాజకీయ రూపం సంతరించు కున్నాయి. క్రెడాయ్‌ ‌సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, ‌సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన తన ఆంధప్రదేశ్‌ ‌స్నేహితులు తమ రాష్ట్రంలో పరిస్థితులు ఆధ్వాన్నంగా ఉన్నాయని తనతో చెప్పినట్లు తెలిపారు. ఎప్పుడో సంక్రాంతికి మిత్రులు చెప్పిన విషయాలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది. సందర్భం ఏమిటి? కేవలం సొంత డబ్బా అనిపించు కోవడానికే అన్న అభిప్రాయం వచ్చింది. ఏపీలో కరెంట్‌ ‌లేదని, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమయ్యా యని, కనీసం తిరగడానికి కూడా వీలులేదనీ,  ప్రయాణం నరక ప్రాయంగా ఉందనీ, హైదరాబాద్‌ ‌వచ్చే వరకు ప్రశాంతంగా ఉండలేకపోయామనీ ఆ స్నేహితులు చెప్పినట్లు కేటీఆర్‌ ఆ ‌మీటింగ్‌లో బాంబు పేల్చారు. పరోక్షంగా తెలంగాణలో సకల హంగులు, సదుపాయాలు ఉన్నాయన్న అభిప్రాయం ఆయన వ్యాఖ్యల్లో ప్రస్ఫుటించింది.

ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. పక్క రాష్ట్రానికి చెందిన మంత్రులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కేటీఆర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఏపీకి వస్తే అభివృద్ధి చూపిస్తామని ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఆమెది మరీ వింత పరిస్థితి. ఆమె మంత్రి అయిన సందర్భంగా కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లిన సమయంలోనే ఇటు కేటీఆర్‌ ఆం‌ధప్రదేశ్‌ ‌మౌలిక సదుపాయాల మీద ఇలాంటి చులకనతో కూడిన ప్రకటన చేశారు. ఇక హైదరాబాద్‌లో రాత్రంతా కరెంట్‌ ‌లేదని ఇంకో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ‌తన వ్యాఖ్యలను ఉపసంహ రించుకోవాలన్నారు. ఏపీ కంటే హైదారాబాద్‌ ‌లోనే కరెంట్‌ ‌కోతలు ఎక్కువగా ఉన్నాయని, తాను స్వయంగా హైదరాబాద్‌లోనే ఉండి వస్తున్నాని, అక్కడ కరెంటే లేదన్నారు. అంతేకాదు, జనరేటర్‌ ‌వేసుకొని వచ్చానన్నారు. కేటీఆర్‌కు ఎవరో ఫోన్‌ ‌చేసి చెప్పారని, కానీ తాను మాత్రం స్వయంగా అనుభవించా నన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పన్న బొత్స.. తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చన్నారు.

 మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్‌ అలా మాట్లాడారన్నారు. పంచాయితీ రాజ్‌ ‌శాఖలోనే 10 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించామన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని, ఎవరో ఒకర్ని కించపరిస్తే ఓట్లు వస్తాయనే కేటీఆర్‌ ఏపీని విమర్శించారని పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌పిట్టకథలు చెప్పి తెలంగాణ తెచ్చారని, కేటీఆర్‌ ‌కూడా అలాగే పిట్టకథలు చెబుతున్నారని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటరిచ్చారు. అటు తెలంగాణలో రోడ్లు అస్సలు బాగాలేవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్‌గా మరికొందరు ఏపీ నేతలు కొట్టిపారేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌-‌వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగింది.

అంతేకాదు, ఎప్పుడూ ప్రభుత్వాల వైఖరులపై విమర్శలు చేస్తూ వార్తలలో ఉండే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై అనుకూలంగా స్పందించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్‌ ‌కోతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుబడుతున్నప్పటికీ, తానుమాత్రం ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఆంధ్ర- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి ఏపీలో రోడ్ల దుస్థితి, తమిళనాడులో రోడ్ల గురించి వీడియోలు రికార్డ్ ‌చేసి మరీ ఆధారాలతో సహా వివరించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని పక్క రాష్ట్ర రహదారులు చక్కగా ఉన్నాయని తేడాను పోల్చారు. ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. నగరి మండలంలో తన స్వగ్రామమైన అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని నారాయణ ఎత్తిచూపారు.

ఇక, కేటీఆర్‌ ‌వ్యాఖ్యలతో ఇటు.. తెలంగాణ లోనూ విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. ముందు ఇల్లు చక్కదిద్దుకొని ఇతరుల గురించి మాట్లాడాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు దుయ్యబట్టారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితి ఇక్కడ అనుభవిస్తున్న ప్రజలకు మాత్రమే తెలుసని, హైదరాబాద్‌లో, ఏసీ రూముల్లో మాత్రమే ఉండే కేటీఆర్‌కు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశాయి. దీంతో, కేటీఆర్‌ ‌దిగిరాక తప్పలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన రోజే అర్థరాత్రి సమయానికి స్పందించారు. ట్విట్టర్‌ ‌వేదికగా వివరణ ఇచ్చారు. క్రెడాయ్‌ ‌సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చంటూ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధ పెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడ లేదంటూ చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నానని చెప్పిన ఆయన.. జగన్‌ ‌నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో వెల్లడించారు.

ఏమైనా ఇటీవలికాలంలో కేటీఆర్‌ ఆవేశంతో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన పీకకే చుట్టుకుంటున్నాయి. తమ ప్రభుత్వం గొప్పలను చెప్పుకునే క్రమంలో ఇతర రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తూ, కించపరుస్తూ కామెంట్లు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. క్రెడాయ్‌ ‌ప్రాపర్టీ షోలో చేసిన ప్రసంగం ఇలాగే బెడిసి కొట్టింది. మరొక పొరుగు రాష్ట్రం కర్ణాటకను కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం పైనా కేటీఆర్‌ ‌చేసిన కామెంట్స్‌పై ఇలాంటి ప్రతిస్పందనే వచ్చింది. కర్ణాటక సీఎంతో పాటు నెటిజన్‌ల నుంచి మంత్రి కేటీఆర్‌కు విమర్శలు ఎదురైనాయి. బెంగళూరులో పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు అద్వానంగా ఉన్నాయని ఓ పారిశ్రామికవేత్త  ట్వీట్‌ ‌చేస్తే బ్యాగులు సర్దుకొని హైదరాబాద్‌కు వచ్చేయాలని కేటీఆర్‌ ‌ట్విట్టర్‌లో ఉచిత సలహా ఇచ్చారు. అంతటితో ఆగకుండా సిలికాన్‌ ‌వ్యాలీ ఆఫ్‌ ఇం‌డియాగా పేరున్న బెంగ ళూరును అక్కడి ప్రభుత్వం ఆగం చేస్తుందన్నట్టుగా కామెంట్‌ ‌చేశారు. స్వరాష్ట్రంలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కర్ణాటక శాఖ మీద కూడా ఉందన్న రీతిలో కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే కేటీఆర్‌ ‌వ్యాఖ్యలకు కర్టాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్రంగా స్పందించారు. దేశంలో వస్తున్న ఎఫ్‌డీఐల్లో 40% కర్ణాటకకే వస్తున్నాయని, ఇన్‌‌ఫాస్ట్రక్షర్‌ ‌సరిగా లేకుంటే వందలాది స్టార్టప్‌లు, రీసెర్చ్ ‌సెంటర్‌లు బెంగళూరులో ఎందుకున్నాయో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బీటీ సెక్టార్‌లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని హితవు పలికారు.

సమతామూర్తి విగ్రహాష్కరణకు మోదీతో పాటు కేసీఆర్‌ ‌పాల్గొనకపోవడం, నాడు జరిగిన రగడ జనం మరచిపోలేదు. కానీ ఎలాంటి వత్తిడి కారణంగానో మరి, కేటీఆర్‌ ‌మాత్రం ఆ పూర్వాపరాలన్నీ మరచి పోయినట్టే వ్యాఖ్యానించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ ‌దూరంగా ఉండాలని ప్రధాని ఆఫీస్‌ ‌సమాచారం ఇచ్చిందని కేటీఆర్‌ ‌కామెంట్లు చేస్తే, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ‌గట్టి సమాధానం ఇచ్చారు. తనకు ఆరోగ్యం సహకరించనందున పర్యటనకు దూరంగా ఉన్నానని సాక్షాత్తు కేసీఆర్‌ ‌కూడా నాడు ప్రకటించారు. ఫిబ్రవరి 5న ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొనాల్సి ఉందని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని సీఎంవోనే సమాచారం ఇచ్చిందని జితేంద్ర స్పష్టత నిచ్చారు. తర్వాత ప్రధాని టూర్‌ ‌సమయంలో పీఎంఓ వద్దన్నదంటూ కేటీఆర్‌ ‌నేషనల్‌ ‌మీడియాకు చెప్పడం కూడా వివాదమైంది. అలాగే టెస్లా కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న కేటీఆర్‌కు విదేశీ విధానాలపై అవగాహన లేదంటూ కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వరుస ట్వీట్లు చేశారు.

–  సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE