– డా।। గోపరాజు నారాయణరావు
ఎదురుగా కనిపిస్తోంది గప్పీదొర బంగ్లా. కొండవాలులో కట్టారు. నేల మీద నుంచి కొండపైకి పెంచుకుంటూ పోయినట్టుంది. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళుతుంటే ఎడం పక్కగా బాట పక్కనే ఉంది.
కాలిబాట దగ్గర నుంచి మెట్ల దాకా ఉన్న దారికి అటు ఇటు ఏటవాలుగా ఇటుకలు పాతారు. నాలుగు మెట్లు ఎక్కితే మొదట అటు ఇటు రెండు చిన్న చిన్న గదులు. మళ్లీ వాటి మధ్యలో పైకి మెట్లు. పెద్ద అధికారుల వెంట వచ్చే బంట్రోతులు – మన్య ప్రజల పరిభాషలో కోలగాళ్లు, ఈ గదులలో ఉంటారు. ఇంకో నాలుగు మెట్లు ఎక్కితే మళ్లీ రెండు గదులు, అటు ఇటు.. ఇవి కొంచెం పెద్దవి. ఇంకో రెండు మెట్లు ఎక్కితే నడవాలా ఉంది, అడ్డంగా. నాలుగు మద్ది కర్ర స్తంభాలు వేసి రెండడుగుల పందిరి వేశారు.
దాని మీద వెదురు చాపలు ఉన్నాయి. ఆ నడవా మధ్యలోనే ఉంది ఆ హాలులోకి ప్రవేశించే గుమ్మం. యమకూపమే అయినట్టు భయంగా భయంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హాలు దాకా వచ్చాడతడు. బగత కులంలో తన ఉన్నత స్థాయిని చెబుతున్నట్టు కాసెకోక గోచి పోసి కట్టుకున్నాడు పంచె. తలకి చిన్న పాగా. భుజాల నిండుగా కప్పుకున్నాడు పై గుడ్డ. చేతిలో వెదురు కర్ర. మెడలో వెండి కంటె. ముక్కు, చెవులకి వెండి పోగులు. పేరు కంకిపాటి బాలయ్య. ఎండు పదాలు అంటారంతా. పెద్దవలస ముఠాదారు. నలభయ్ ఏళ్లుంటాయి. హాల్లోనే ఉన్నాయి రెండు చెక్క టేబుళ్లు, వాటి ఎదురుగా నాలుగైదు కుర్చీలు. అయినా పద్దు పుస్తకాలు ముందేసుకుని దీక్షగా చూస్తున్నాడు పిళ్లే, నాపరాళ్ల నేల మీద. కొంచెం లోపలికి తొంగి చూశాడు ఎండు పడాలు. నులక మంచం మీద చొక్కా లేకుండా ప్యాంటుతోనే పడుకుని ఉన్నాడు బాస్టియన్. ఒంగుని పాదాలు ఒత్తుతున్నాడు కిష్టయ్య. తను దీక్షగా పనిచేస్తున్న సంగతి ముఖం గోడవైపు పెట్టుకుని పడుకుని ఉన్న బాస్టియన్ కు తెలియడానికన్నట్టు పైకి వినపడేటట్టు చదువుతున్నాడు పిళ్లే. ‘‘బిత్తార గంగన్న, కాకర మల్లయ్య, సూలా ఎర్రేసు, రావుల పెద్దపోతి, బితార ఎరుకలు, బిత్తార మరిడయ్య- అందరిదీ మర్రి పాలెము. పిట్టల ఎర్రేసు వీనిది బొంకులపాలెము. అంపూరు సన్యాసి.. వీడిదీ ఆ ఊరే. ఉనుము రామన్న దొర, ఊరు బౌడ, బూతా ఎర్రేసు, ఊరు మర్రి పాలెము, పోలోజు లక్ష్ముడు, వీడిదీ ఆ ఊరే, వరికూటి బొడ్డు, వీడిది కూడా బౌడే కదా. ఉగ్గిరంగి రామన్న, ఊరు తాజంగి, లువ్వాబు పండుదొర, వీడిదీ తాజంగే. ఒనుము రామన్న దొర, ఈ బౌడ వానిని వాళ్ల దగ్గరనే ఉంచాలి… ఒక్కొక్కళ్లు నాలుగేసి రోజులు… ఇవ్వవలసిన బియ్యం… కూలీ… రూపాయిన్నర…’’ అపైకి చదువుతూనే ఊటకలంతో ఏవో గుర్తులు పెడుతున్నాడు. వాళ్లంతా రోడ్డు పనిలో ఉన్నారు. ‘‘దండాలు బాబూ!’’ గుమ్మం బయటి నుంచే అన్నాడు ఎండుపడాలు, ఒక నిమిషం తరువాత. తలెత్తి చూశాడు పిళై. తరవాత కిష్టయ్య కొంచెం వంగి గుమ్మం బయటకి చూశాడు. బాస్టియలో చిన్న కదలిక.
కానీ లేవలేదు. ఏమిటన్నట్టు చూశాడు పిళ్లే. ‘‘బెస్టీను దొరవారికి ఓ పాలి కనిపించి పోదామని…!’’ నీళ్లు నమిలాడు ఎండుపడాలు. నెమ్మదిగా లేచి వచ్చాడు పి. ‘‘ఎండు పదాలు! ఇదిదా ఏం పని? పైగా ముఠాదారువి. ’’ దర్పంగా దబాయించడం మొదలెట్టాడు పిళ్లే. తను మన్యంలోనే ఎంతో విలువైన పెద్దవలస ముఠాదారు. కొన్ని గ్రామాలు సమూహమే మురా.
దానికి తాను అధిపతి. అలాంటిది తనని ఓవర్సీయర్ అలా పిలవడం లోపల బాధగా ఉంది. ‘‘నీ మూలంగా బాస్టియన్ దొరవారు మాట పడినారు.’’ అన్నాడు పిళ్లే. ‘‘నా తప్పేముంది బాబూ!’’ అన్నాడు ఎండుపడాలు. ‘‘నీవు కాట్రగడ్డ- పెద్దవలస రోడ్డు రోడ్డు పని తీసుకున్నావు. 60 గొలుసుల దూరం. అంటే ఒన్ను మైలు. వంద రూపాయలు అడ్వాన్సుగా తీసుకుంటివి. కదా?!’’ అన్నాడు పిల్లె. ‘‘అంతే!’’ అన్నాడు ఎండుపడాలు.
‘‘ఎండుపడాలు! నీవు ఆ వందరూపాయల్లో యాభై రూపాయలు జేబులో వేసుకుంటివి. అంటే సర్కారు వారి సొమ్ము నిండా మేస్తివి! రోడ్డు పని అయిపోయిందని చూపించి మిగతా ధనం కోసం వెంట పడుతున్నావ్. అసలు ఆ వందరూపాయల పని కూడా లేదక్కడ! అంటే నీకు అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్ము కూడా దండగే ’’ అన్నాడు పిళ్లే. ‘‘ఏంటిసామి అంటన్నారు? నేను సర్కారు సొమ్ము తిన్నానా? పొరపాటున కూడా జరగదు’’ ధీమాగా, పౌరుషంతో అన్నాడు పడాలు. ‘‘నువ్వు ఇలాగే అంటావు. రోడ్డు నాసిగా ఉందని మొన్న నర్సీపట్నం నుంచి వచ్చిన ఇంజనీరు సారు చెప్పి పూడ్సినాడు. నీ వల్లన బాస్టియన్ దొరవారికి నిండా చెడ్డ పేరు వచ్చింది. రాదా మరి!’’ అన్నాడు పిళ్లే, బాస్టియన్‌కి వినిపించే టట్టు, తీవ్రంగా. నాలుగు రోజుల క్రితమే వేసుకున్న పథకం మాట పొల్లుపోకుండా చకచకా సాగుతోంది. ‘‘బాబూ! నాకు ఆ రోడ్డు పనిలో ఐదు రూపాయలు కూడా మిగల్లేదు! సత్తెం చెబుతున్నా!’’ నిజాయితీగా, నిబ్బరంగా చెప్పాడు ఎండుపడాలు. ‘‘మరి, ఇంజనీరు ఎందుకంత చీదరించుకున్నాడ్రా ? తల కొట్టేసినట్ట యింది నాకు.’’ హఠాత్తుగా ప్రత్యక్షమై బిగ్గరగా అన్నాడు బాస్టియన్. ‘‘దండాలు దొరా! సత్తె పెమానం. నాకు ఐదు రూపాయలు కూడా మిగల్లేదు. ఇంకా డబ్బులియ్యాల్సినోళ్లున్నారు. అయినా పని బాగా లేదని ఎలా అంటారు దొరా! ఏంటి లోపం?’’ తెగించినట్టు అన్నాడు పడాలు. ‘‘రెండు దోసిళ్ల కంకర కూడా వాడలేదన్నాడు ఇంజనీరు. ఇదేకదరా అసలు సత్యం?’’ ఇంకా పెద్ద గొంతుతో అన్నాడు బాస్టియన్. తన మీద నింద వేయడం, అంత అగౌరవంగా సంబోధించడం చూస్తుంటే ఎండు పదాలు
గుండె మండిపోతోంది. ‘‘ చారెడు కంకర కూడా మిగలకుండా రోడ్డేయించాను దొరా! అది నా ఊరి నుంచి వేసుకున్న రోడ్డు. నా ఇంటి పనిలా నేనే దగ్గరుండి చేయించాను.’’ అన్నాడు ఎండుపడాలు. ‘‘అదే కదా నేనూ అంటన్నాను. ఘనత వహించిన ప్రభుత్వం వారి సొమ్ము నీ ఇంటికే వాడుకున్నావు. కంకర, ఇసక అమ్ముకున్నావు. నా దగ్గరా కనికట్టు. దొంగ నాకొడకా! మళ్లీ మిగిలిన రూపాయలు ఇమ్మంటూ పదిసార్లు నా చుట్టూ తిరగడం!’’ అన్నాడు బాస్టియన్. ‘‘దొరా! ఇది మర్యాద కాదు. మూడు మాసాల నుంచి తప్పించుకుంటన్నారు. ఇప్పుడు ఎవరో రోడ్డు బాగా లేదని చెప్పారంటన్నారు. నన్ను ఇంకా ఇలాగే తిప్పితే ఇంక కలెటు బాబుకి ఫిర్యాదు చేయక తప్పదు.’’ అన్నాడు ఎండు పడాలు ఉక్రో షంతో. ‘‘నీ తల్లి…. నాకే మర్యాదలు నేర్పేటంతో డివయ్యావురా!’’ అంటూ ఎండు పదాలు గూబ మీద సాచి కొట్టాడు బాస్టియన్. ‘‘ఏంట్రా! దొర మీదకే ఎల్టన్నావ్! ఏంట్రా?’’ పడాలే బాస్టియన్ మీద తిరగబడినట్టు హఠాత్తుగా మధ్యలోకి చొరబడి అరిచాడు కిష్టయ్య. అదే సమయంలో ఒక్క ఉదుటన ఎండు పదాలుని మద్ది స్తంభం వరకు తోసుకుంటూ వెళ్లి హఠాత్తుగా రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు.
పిళ్లే వచ్చి పడాలు పై గుడ్డతోనే చేతులు కట్టేశాడు. కుపితుడైపోయాడు ఎండు పడాలు. ఇంత పని చేస్తారని అతడు ఊహించలేదు. నిస్సహాయతతో కళ్లంట నీళ్లు ఉబికాయి. తల పాగా మెడ మీద జారిపోయింది. ‘‘కొండోడివి, కొండోడిలా ఉండాలి. అడివి నా కొడకా! నరికేస్తాను నా కొడకా! నీయమ్మ… ఒక్క పైసా ఇవ్వను. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో!
దొరతనాన్ని నిలదీయడానికొచ్చావా? ఎన్ని గుండెలా?’’ అంటూ మళ్లీ ముఖం మీద బలంగా గుద్దాడు బాస్టియన్. ‘‘ఒరేయ్ ఎండు పదాలు! నిన్ను ఈ క్షణంలో బొక్కలో ఏయించీగల్ను. లాగరాయి పితూరీలో రాజద్రోహులకి బియ్యం ఎలా చేరిందో నాకు తెలియదునుకుంటన్నావా? జెర్రాల దారి దోపిడీలో పోయిన బియ్యం అదేనని నాకు ఎరిక లేదని నీపిచ్చి నమ్మకం. కదరా! దీని మీద ఆరా తీయిస్తాను. నేను ఊరుకోను. నువ్వూ, ఆ బట్టి పనుకుల గంతన్నగాడు జెర్రాలలో ఏం చేశారో కూడా తెలుసురా నాకు. నా మీదకొచ్చి బెదిరిస్తావా? ద్వీపాంతరం పోతావ్ ! అండమాను జైలు తెలుసా? అక్కడికి పంపించేస్తాను.’’ పిచ్చి కోపంతో పదాలు పీక మీద చేయి వేసి గట్టిగా వెనక్కి నొక్కాడు, కట్టేసి ఉన ఆ స్తంభానికేసి. ఉక్కిరి బిక్కిరయ్యాడు పడాలు. తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఎండు పడాలుకి. అదే సమయంలో అతనికి జ్ఞానోదయం కూడా అయింది. ఇదంతా ముందే వేసుకున్న పథకం. కాంట్రాక్టు సొమ్ము మొత్తం కాజేయాలనుకున్నారు. అంతే. ఆ రోడ్డు పని పరీక్షించడానికి ఏ ఒక్కరూ రాలేదు. ఆ ముఠాలో తనకి తెలియకుండా ఆ పని జరగదు కూడా. ఐదారు నిమిషాలు గడిచాయి మౌనంగా. సర్వశక్తులు ఉడిగిపోయినట్టు, పూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నట్టు, ‘‘మన్నించు దొరా! ఇక మీ కాడికి రాను. నన్ను వదిలేయండి! అదే చాలు. మీకు దణ్ణవెడతాను’’ అన్నాడు ఎండుపడాలు. ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకుని బతకండి! ఒకటి గుర్తెట్టు కోండ్రా కొండ నాకొడకల్లారా! మమ్మల్ని ఎదిరించి బతకడం
మీ వల్ల కాదు. వదిలిపెట్రా ఈణ్ణి ! ’’ అరిచాడు బాస్టియన్, కిష్టయ్య కేసి చూసి కట్టు విప్పమన్నట్టు సైగ చేస్తూ.
********************
‘‘డిప్యూటీ తహసీల్దారు గారు! ఒక్క నిమిషం.’’ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం. గెస్ట్ హౌస్‌లో తన గది నుంచి బయటికొచ్చి మెట్లు దిగబోతుంటే వినిపించింది. అది డాక్టర్ మూర్తి గొంతు. అప్పటికే డాక్టర్ మూర్తి కూడా బయటకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘‘మీరూ వస్తున్నారా ? ఎక్కడ దింపించ మంటారు?’’ అన్నాడు బాస్టియన్. ‘‘మీరు రోడ్డు పని చేయిస్తున్న చోట, చిట్రాళ్ల గొప్పు దగ్గర దింపిస్తారా, ఇవాళ!’’ అన్నారు డాక్టర్ మూర్తి, కాస్త చనువుగా. ‘‘అక్కడికి మీరెందుకు?’’ అడిగాడు బాస్టియన్, కంగారు కనపడనీయకుండా. ‘‘చెకప్. వేరే పనేం ఉంటుంది నాకు?’’ అన్నారు మూర్తి.
‘‘అక్కడ మెడికల్ చెకప్ ఏమిటి డాక్టర్ గారు! సాధ్యం కాదు. మీరు అటు రాకండి! కావాలంటే ఓ రోజు నేను సెలవు ఇచ్చి మీకు చెబుతాను సరేనా!’’ అన్నాడు నమ్మకంగా బాస్టియన్. ‘‘ఇప్పుడయితే కుదరదు అంటారు, అంతేనా!’’ అన్నాడు మూర్తి. – డాక్టర్ ని రోడ్డు పని దగ్గరకి రాకుండా చేయడమే ప్రథమ కర్తవ్యంగా ఉన్నవాడు బాస్టియన్. ‘‘కచ్చితంగా అంతే. రోడ్డు పని ఆగ డానికి వీల్లేదు డాక్టరు గారు. అందుకోసం వాళ్లని వదిలిపెట్టడం సాధ్యంకాదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు మా పనికి అడ్డురాకుండా ఉంటే మంచిది. రావద్దని కూడా చెబుతున్నాను.’’ అంటూనే వెళ్లిపోయాడు బాస్టియన్. కొంచెం బాధగా అనిపించింది డాక్టర్ మూర్తికి. అంత కటువైన సమాధానం ఆయన ఊహించలేదు.
********************
‘‘రాత్రి నువ్వు చెప్పిన ఆ కత నీ నోరు కాదు, నెగళ్లు చెప్పినట్టుందయ్యా! ఊహూ! అదీకాదు, నెగళ్ల నుంచి లేచిన మంటల నాలికలు పాడినట్టుం దయ్యా!’’ మంచినీళ్లు తాగుతున్న ఉగ్గిరంగి రామన్నతో అన్నాడు, అప్పుడే అక్కడికి వచ్చిన ఆ నడి వయసు పురుషుడు. అతడు కూడా మంచినీళ్లకే వచ్చాడు. పేరు గారంగి లింగాలు. రాళ్లు మోస్తాడ తడు. ఈ రోడ్డు పనిలో అతడికి అదే అప్పగించారు. మట్టిలో ఇరుక్కుని ఉండే చిన్నా పెద్దా రాళ్లను పెళ్లగించే క్రోబార్, అంటే వంకర గునపం చేతిలోనే ఉంది. ఏ వస్తువు తీసుకున్నా, మళ్లీ జాగ్రత్తగా నాలుగుసార్లు చెప్పి తిరిగి అప్పగించాలి. లేకపోతే కూలిడబ్బుల్లో కోత తప్పదు. రాత్రి ఆ కథ విన్నప్పటి నుంచి మనసు ఉప్పొంగిపోతోంది లింగాలుకి.
‘‘నువ్వూ ఇన్నావు కదా! మరేటనుకుంతన్నావు!’’ అన్నాడు గర్వంగా రామన్న, కొద్ది నీళ్లు తీసుకుని జులపాలకి రాసుకుంటూ. ‘‘నీ పేరు ఉగ్గిరంగి రామన్న అని గుర్తుంది! తమరిది ఏ ఊరేంటి’’ అడి గాడు లింగాలు, అటు ఇటు చూసి. మళ్లీ కిష్టయ్యో, పిళ్లయ్యో చూస్తే గొడవ. ‘‘తాంజగి’’ నీళ్లు తాగి కుండ మీద ముంత పెడుతూ అన్నాడు రామన్న. ‘‘నిజమే సుమా! ఎప్పుడో కొండసంతలో నిన్ను సూసినట్టే ఉంది! మీకు బాగా దగ్గరే కదా సంత!’’ అన్నాడు లింగాలు, అదో ఆరాధనతో..
క్రితంసారి రోడ్డు పనికి వస్తే పని బాగోలేదని లింగాలుకి రూపాయి కత్తిరించాడు పిళై. రాళ్లు తీసుకెళ్లి వేరే చోట పడేసి రావడానికి నైపుణ్యం ఏం ఉంటుందో అర్థం కాలేదు అతడికి. ఈసారి జాగ్రత్తగా పనిచేస్తే ఆ రూపాయితో పాటు, ఈ దశలో చేసిన పనికి కూడా కూలీ చేతికొస్తుందని లింగాలు ఆశ. రామన్నకి నలభయ్ ఏళ్లుంటాయి. చెట్టు కొట్టే పనిలో ఉన్నాడు. ‘‘రోజూ ఓ కత చెప్పు బాబు!’’ అన్నాడు లింగాలు, అర్ధిస్తున్నట్టు. ‘‘మీరంతా ఓపిగ్గా కూకుంటే చెప్పకుండా ఉంటానా! ఇదిగో, లింగాలు! అయన్నీ మన మన్నెపోళ్ల కతలు. మన తాతముత్తాతల వీరగాదలు. సత్తె ప్రేమానం. నిజంగా జరిగాయి.’’ ఉత్సాహంగా అంటూ కింద పెట్టిన గొడ్డలిని అందుకుని అక్కడ నుంచి వెళ్లాడు రామన్న. లింగాలు కూడా తిరిగొచ్చి రాళ్లు పెళ్లగిస్తున్నాడు.
దారుణమైన శ్రమతో ఒళ్లంతా పచ్చి పుండులా ఉంటుంది సాయంత్రానికి. బాస్టియన్ తిట్లు, దానితో వచ్చే ఒత్తిడితో మనసుకి వాతలు పెట్టినట్టు ఉంటుంది. వ్యక్తం చేయలేని బాధ. చెప్పుకోవడమూ వాళ్లకి రాదు. పైగా అందరిదీ ఒకే రకం బాధ. ఒక సమూహం బాధ అది. ఎవరికి చెప్పుకుని ఏం లాభం? అందుకే కుమిలిపోతూ ముడుచుకుని ఉండి పోతున్నారు. కానీ రాత్రి పది పన్నెండు మంది కలసి నెగళ్లు వెలిగిస్తుంటే అనుకోకుండా ఆ గాధ చెప్పాడు రామన్న. అది విన్నాక అందరిలోను ఏదో ఉత్సాహం. మనసులు తేలికపడ్డాయి.
రామన్నకి ఎన్నో పాట లొచ్చు. అవి ఎలా పుట్టాయో కూడా చెబుతాడతడు. మన్యం పండుగల గొప్పదనం చెబుతాడు. ఎన్నో కథలు కూడా చెబుతాడు. పసరు వైద్యం కూడా చేస్తాడు. ఇవన్నీ కొండవాళ్ల పూజారులు, అంటే శివసారుల లక్షణాలు. ఏదో రాయి బాగా లోతుకి ఉంది. గట్టిగా లాగు తున్నాడు లింగాలు.
రామన్న చెప్పినది నిజంగా జరిగిన కథంటే మరీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది అతడికి. రంప దేశంలో జరిగిందట.
నూట పాతికేళ్ల క్రితం గాధంట. కానీ నిన్న మొన్న జరిగినట్టే చెప్పాడు రామన్న.
లింగాలు వంకర గునపంతో పెళ్లగిస్తుంటే భూమి పొరలలో నుంచి బయటకొస్తున్న రాయిలాగే రాత్రి రామన్న చెప్పిన కథ అతడి మనసు పొరలని చీలుస్తు న్నట్టే ప్రతిధ్వనిస్తోంది… కతంటే కతా మరి! ‘రంప దేశం… అంటే తెలుసా?’ అంటూ మొదలుపెట్టాడు కత రాత్రి రామన్న. ‘రాముడి పాదం నుంచి పుట్టిందే రంపదేశం… అక్కడ జరిగిందిది… దట్టమైన మబ్బు కింద మసక మసకగా ఉంది మన్యం. నల్లమబ్బు కమ్మిన ఆకాశం కింద ఏదో జంతువును మింగిన కొండచిలవలా స్తబ్దుగా కూడా ఉంది. కొండలని తాకుతున్న నలుపు తెలుపు మబ్బులు దూదిపింజల్లా చెదిరిపోవడం కనిపిస్తోంది దూరానిక్కూడా. ఉదయం నుంచి ఉరుముతూనే ఉంది ఆకాశం. ఆగకుండా చినుకులు పడుతూనే ఉన్నాయి. అలాంటి వాతా వరణంలోనే హఠాత్తుగా వినిపించింది తుడుము నాదం. అది కొత్తపల్లి ఊరి బారికదే. ఊరి మధ్యగా ఉన్న ఆ పెద్ద రావి చెట్టుకింద నిలబడి ఉన్నాడతడు. నాలుగైదు నిమిషాలు ఎడతెరిపి లేకుండా వాయిం చాడు ఆ చర్మవాద్యాన్ని, రెండు కర్రలతో. చల్లదనం వల్ల కాబోలు తుడుము కంగుమనడం లేదు.
కానీ అలాంటి సమయంలో చాటింపంటేనే అందరిలోను ఏదో ఉత్కంఠ.
తాటాకు గొడుగులు వేసుకుని అక్కడికి వచ్చారు కొద్దిమంది. కొందరు పెద్ద పెద్ద ఆకులు నెత్తి మీద కప్పుకుని చెట్టుకిందకి వచ్చి ఆకు మీది నీళ్లు దులిపి, వణుకుతూనే నిలబడ్డారు. చివరిగా ముక్తాయింపు అన్నట్టు రెండు దెబ్బలు వేసి బిగ్గరగా అన్నాడు, బారిక.
‘కొత్తపల్లి, ఇందుకూరిపేట గ్రేమాల ప్రజలకు ఇందుమూలముగా తెలియచేయునది ఏమనగా… ఈ రంప దేశం చేతులు మారి కుంఫిణీ వారికి దాఖలైంది.
అందుకే రెండు సిపాయీల దండ్లు ఇక్కడి వచ్చాయని, వారిని చూసి గ్రేమ ప్రజలు భయ
పడక్కర లేదని తెలియచేయడమైనది. దండ్లు ఇక్కడే ఉంటాయి. కవాతులు కూడా చేస్తాయి. ప్రజల జోలికి రావని దండ్ల పెద్దదొర సందేశం. కాబట్టి తెలియ చేయడమైన దహోయ్…!’