– డా।। గోపరాజు నారాయణరావు
చింతపల్లి, లంబసింగి ప్రాంతాలని చలిగూడెం, పులిగూడెం అంటారు. పగలు చలి బాధే. చీకటి పడితే చలికి తోడు పులుల బాధ. మూగయ్యది ప్రస్తుతం దారుణమైన చలిబాధ. చలే పులై వెంటాడుతోంది. మీద పడి చీరుతోంది. ఎక్కువ మంది గుడిసెలలోనే ఉన్నారు.ఆ కథ వినాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. అలసట బాధిస్తోంది. పాదాలు ఒత్తుకుంటున్నారు. పిల్లలు ఏదో కాస్త తిని అప్పుడే నిద్రపోతున్నారు. ‘‘ఇందుకూరుపేట, కొత్తపేట ఊరోళ్లన్ని ఆ తెల్లోడు చావగొట్టేసాక పదిహేనేళ్లకి జరిగిందంట.’’ అని ఒక నిమిషం ఆగి అన్నాడు రామన్న, ‘‘ఈ కత నాకు చాలా ఇష్టం.’’ అలా అని చెప్పి ఇంకా ఆసక్తి పెంచాడు వాళ్లలో. ‘‘ఎందుకంటే లింగాలు! విలువైందేదీ పోగొట్టుకోకూడదు. ఒకేళ పులి కర్మ కాలిందనుకో! మళ్లీ తిరిగి తెచ్చుకోవాలి. అప్పుడు కదా మనం మొగోళ్లం! అదే చేశాడు రంప జమిందారు.’’
ఆ గాధ చెప్పడం మొదలుపెట్టాడు రామన్న. అదీ వానాకాలమే. అప్పుడే వాన వెలిసింది. కొండదారులన్నీ ఎర్రటి కొండ మట్టినీళ్లతో నిండిపోయాయి. వర్షంతో రేగిన మట్టి గుబాళింపు, కొండలంతా.
వానలో తడిసినందువల్ల కాబోలు ఆ నల్లగుర్రం మరింత నల్లగా కనిపిస్తోంది. వేగంగా వస్తోంది ఆ కొండ గ్రామంలోకి. లంఖణాలు చేసి చిక్కినట్టుగా ఉన్న ఆ మనిషి అడవి మేతతో బలిసి ఉన్న ఆ గుర్రం మీద వీరావేశంతో ఊగిపోతున్నాడు. గెడ్డం మాసి ఉంది. ఏదో కోల్పోయినట్టు ఉన్నాడు. ఒంటి మీద పసుపు రంగు పంచె, ముదురునీలం రంగు కోటు. రెండూ పట్టువే.
కానీ పాతికేళ్ల క్రితం అటక మీద పడేసి, ఇప్పుడు బయటకు తీసినట్టు ఉన్నాయి. అవి కూడా వాన చినుకులతో కొద్దిగా తడిసి ఉన్నాయి. తలమీద ధరించిన పాగా కూడా పట్టుదే అయినా, చిమ్మెటలు కొట్టేశాయి. దుమ్ము కూడా పట్టేసి ఉంది. కాళ్లకి నలిగిన నల్లటి బూట్లు. మెడలో చిన్నహారం తప్ప అన్నీ వెలవెలబోతున్నాయి. అలంకారానికి ధరించే టెంగి గొడ్డలి మాత్రం వెండి లోహంలా మెరుస్తోంది.
ఒక చేతిలో కళ్లెం, రెండో చేతిలో ఆ టెంగి గొడ్డలి. చాలా గంభీరంగా గుర్రం మీద గ్రామంలోకి వచ్చాడతడు. ఆ రౌతు వెనుక రెండుమూడు వందల మంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది చేతిలో విల్లూ బాణాలే ఉన్నాయి. నలుగురైదుగురి చేతిలో మాత్రం పాత తుపాకులు కనిపిస్తున్నాయి. ఏ గ్రామంలో ప్రవేశించినా కొండవాళ్లంతా బయటకు వచ్చి పొర్లు దండాలు పెడుతున్నారు. దేవుడే వచ్చాడన్నంత సంబరపడుతున్నారు. ఏ గ్రామంలో అడుగుపెట్టినా అక్కడి మునసబు బయటకు వచ్చి, వంగి వంగి దండాలు పెడుతున్నాడు. ఎవరూ ఆపడం లేదు.
ఆయనే రంప జమిందారు. మన్సబ్‌దారని కూడా అంటారు. పేరు- రాజా రాంభూపతిదేవ్. నాలుగైదు రోజులుగా ఆయన అలాగే ఆ కొండలలో తిరుగుతున్నాడు. ప్రతి ఊరికి వెళుతున్నాడు. బారికని పిలిపించి ఆయన కూడా అక్కడే నిలబడి చాటింపుతో చెప్పిస్త్తన్నాడు-
ఈ గ్రామాలు ఇక నావి, నేనే పాలకుడిని అని. అవన్నీ ఒకప్పుడు ఆయనగారి వంశీకుల ఏలుబడిలో ఉన్నవే. కానీ తెల్లోడి ప్రభుత్వం ఊరుకుంటదా! ఒక గ్రామం వచ్చారు జమిందారు గారు.
కొత్త కొత్త తుపాకులు గురెట్టి కుంఫిణీ సిపాయీలు చుట్టమట్టి రాంభూపతిదేవ్‌ను బంధించారు. రెండు రోజుల కల్లా రాజమండ్రి తీసుకు పోయారు. ఇదంతా చూసి కోపగించినట్టు వరదతో పోటెత్తింది గోదావరి. పన్నెండు రోజులు బంధించి ఉంచారు.కుంఫిణీ ప్రభుత్వం జమిందారుని లొంగదీసి, ఒప్పందం చేసుకోమంది. కుంఫిణి ప్రతినిధిగా ఉండడానికి జమిందారు తలొగ్గాడు. ఆయన హక్కు ప్రకటించుకున్న గ్రామాలకి ఆయన్నే మొఖాసాదారుని చేసింది. ముప్పయ్ ఐదేళ్లు ఆయనే జమిందారు. వయసు కూడా అయిపోయింది. ఎండలు ముదిరిపోతున్నాయి. భూదేవి పండుగ జరుగుతోంది చాలా గ్రామాలలో.
తాడి, జీలుగు కల్లు పుష్కలంగా లభించే కాలం. పొలం పనులకి సెలవు. సోమ, మంగళవారాలంతా కల్లు తాగడం, చిందేయడమే. రాత్రంతా పాటలు పాడడం మరొకటి. నెలలో ఒక బుధవారం వేకువనే గొర్రె లేదా పందిని బలి ఇచ్చి భూమికి పూజ చేస్తారు. రంప దేశమంతా ఆ పండగ జరుగుతుండగానే కబురు తెలిసింది. రాజా రాంభూపతిదేవ్ చనిపోయాడు. వయసైపోయింది, ఆయన పోయాడు.
కానీ వారసుడు కావాలి కదా! అక్కడొచ్చింది గొడవ. వారసుడు ఎవరు? ఇది అంత తలబద్దలు కొట్టేసుకోవలసినదేమీ కాదని అంతా అనుకోవచ్చు.
కానీ అది కాదు. జమిందారు మొదటి సంతానం – ఓ బొట్టె. అంటే కూతురు. పేరు శ్రీజగ్గా అమ్మ. ఈడొచ్చినా, పెళ్లి చేసుకోలేదు. మనువు సంగతి అలా ఒగ్గిండి. ఆడది రాజ్యమేల్తానంటే ఏ మునసబు, ముఠాదారు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. ఆమెకో పదమూడేళ్ల తమ్ముడు. ఆయనిక్కూడా రాంభూపతిదేవ్ అనే పేరు పెట్టారు…… అక్కడే ఠక్కున కథ ఆపాడు రామన్న, పెద్దగా ఆవలిస్తూ, ‘‘ఇంక పడుకుందాం…! ’’అన్నాడు. ‘‘ఇదిగో రామన్న! ఆ కొడుక్కి పట్టాభిషేకం చేయడానికేమి?’’ అడిగాడు, లింగాలు, ‘‘రేపు చెప్పుకుందాం లే! నిద్ర…. నిద్ర…’’ బొంగురు గొంతుతో అన్నాడు రామన్న. ‘‘బాబ్బాబు. ఈ ఒక్క సంగతి చెప్పు! ఆ పిల్ల జమిందారుకి పట్టాభిషేకం జరిగిందా?’’ ‘‘జరగలేదు. నే పోతన్నా!’’ అంటూ లేచి నిలబడ్డాడు రామన్న. మిగిలిన అందరూ కూడా లేచి నిలబడ్డారు. మరి వారసుడు ఎవరు? రంప దేశం ఏమైంది? ‘‘ఇదిగో రామన్న! నాకు నిద్ర పట్టదు. పట్టాభిషేకం చెయ్యలేదన్నావ్ సరే, ఎందుకు? మూడు, మూడంటే మూడు మాటల్లో చెప్పు!’’ అన్నాడు అర్థింపుగా. రెండడుగులు వేసి అక్కడ ఆగి అన్నాడు రామన్న. ‘‘పిల్ల జమిందారు పెద్ద రాంభూపతి చాటుమాటు సంతానం మరి!’’
*********
గొడ్డు కళేబరంలా వేలాడుతోంది వాళ్ల భుజాల మీద ఉన్న బలమైన వెదురు బొంగుకి,
ఆ బూడిద రంగు తోలు తిత్తి. నిండా ఉన్నాయి నీళ్లు. అందుకే పొట్ట ఉబ్బిన కళేబరంలా కూడా ఉంది. అంచె టపా మాదిరిగా మోస్తున్నారు నలుగురు వంతున. నాలుగు కిలోమీటర్ల అవతల, నర్సీపట్నం వైపు ఉన్న లంబసింగి నుంచి వస్తున్నాయి నీళ్లు. అక్కడ గప్పీ దొర బంగ్లాకి కొంచెం అవతలే ఉన్న పెద్ద బావి నుంచి కొందరు నీరు తోడి ఈ తోలుతిత్తులు నింపుతూ ఉంటే, అర కిలోమీటరుకు ఒక బృందం వంతున మోసుకువస్తున్నారు, చిట్రాళ్ల గొప్పుకి. ‘‘ఒరేయ్! ముందు ఈ గోలెం నింపండ్రా!’’ వాళ్లని చూసి అరిచాడు కిష్టయ్య. నీళ్ల కోసమని బాస్టియన్ గుర్రాన్ని అప్పుడే ఆ గోలెం దగ్గరకి తెచ్చాడతడు. మూగయ్య కళ్లు ఆశతో మెరిసాయి. కానీ మనసంతా భయం. ముందు వైపు ఉన్న ఒక కూలీ ఆ తిత్తి మూతి విప్పి నెమ్మదిగా గోలెంలోకి నీరు ఒంపుతున్నాడు. అదే సమయం అనుకుంటూ మూగయ్య చేతులెత్తి దణ్ణం పెడుతూ పిలిచాడు, ‘‘కిట్టయ్య!’’ చీదరగా చూశాడు కిష్టయ్య. గజగజలాడిపోతూ, చిన్నగా కాళ్లు వణుకుతుంటే ఒక్కొక్కమాటే చెప్పాడు మూగయ్య.
‘‘దండవెడతాను. రాత్రి చలికి తట్టుకోలేకపోతన్నాను. నా గొంగడి నాకు ఇచ్చేయ్ బాబు! ఎలాగూ ఈసారిచ్చే కూలిలో తగ్గించుకుంటారు కదా! చిన్నోడివైనా నీ కాళ్లకి దణ్ణం!’’ అన్నాడు దీనంగా. భుజం మీద బరువుతో మాట కష్టంగా వచ్చింది. నీరసం వల్ల నూతిలో నుంచి వచ్చినట్టుంది. ‘‘పేరు మూగయ్యే గానీ, నీ నోరు పెద్దదని నాకు బాగా తెలుసొరేయ్! నిన్ననే కదరా గుర్తు చేశావ్! ఎన్నిసార్లు చెబుతావురా? మాకు ఏరే పనేంలేదా, నీ చింకి గొంగడి గోల తప్ప?’’కిష్టయ్య అన్నాడు,
‘‘చింకిది కాదు, కొత్తది కిష్టయ్యా! కొండసంతలో కొన్నాను. మూడు పావలాలు.’’ అన్నాడు మూగయ్య. ‘‘నోర్మూస్కో’’ అరిచాడు కిష్టయ్య. అదిరిపడ్డాడు మూగయ్య. ఒక నిమిషం మౌనం. ‘‘కొత్తదంట కొత్తది! నీ గొంగడి ఊర్కే లాక్కున్నానా ఏంటి? అయినా ఒరే, దొరతనమోరి సొమ్ము అలా గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళిపోతే తప్పుకదరా! ఎవరు తీసుకోమన్నార్రా! దేనికైనా ఓ రూలుంటిది! అది మర్సిపోతే ఎలాగ! బేస్టీ దొర మంచోడు కాబట్టి ఇప్పుడిచ్చే కూలిలో తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఈపాటికి నర్సీపట్నం సబ్ జైల్లో కూకునేవాడివి.’’ అన్నాడు కిష్టయ్య. ‘‘అంత తప్పు నేనేం చేశాను కిష్టయ్య!’’ అన్నాడు బాధగా మూగయ్య. ‘‘దొంగతనం.’’ చాలా కర్కశంగా అన్నాడు కిష్టయ్య. ఆ నింద అతడిని బాగా కుంగదీసింది.
అయినా రాత్రి వేళ చలి అంతకంటే దారుణంగా బాధిస్తోంది. అందుకే బతిమాలడం మానలేదు. ‘‘తప్పు కాయి కిష్టయ్య ! నాకున్నది
ఆ ఒక్క గొంగడే. పెద్దణ్ణి. ఇక్కడ చలి బాద నీకు తెలుసు కదా! మాపటేల గప్పీదొర బంగ్లా కాడికొస్తాను. ఇచ్చీయ్ బాబు!’’ జోడించిన చేతులు ఇంకొంచెం పైకెత్తి మళ్లీ అడిగాడు మూగయ్య. శబ్దం చేస్తూ నీళ్లు తాగుతోంది గుర్రం.
దాని మూతి కేసి చూస్తూ, ‘‘ఔన్రోయ్ !నువ్వు ముసిలోడివి! మర్చిపోయా! ఇస్తాలే.
రాత్రికి కదా చలేస్తది! మాపటేలకి రారా!’’ అన్నాడు కిష్టయ్య, చాలా నిర్లక్ష్యంగా. మూగయ్య మాట కోసం చూడకుండానే గుర్రంతో ముందుకు నడిచాడు. నీటి బుంగలతో అక్కడ నిలబడి ఉన్నారు ఆరుగురు ఆడకూలీలు. నీళ్లన్నీ బుంగలలో నింపేసి ఖాళీ తిత్తితో మరోసారి తేవడానికి వెనుదిరిగింది మూగయ్య బృందం, ఆలస్యం చేయకుండా. వడివడిగా నడుస్తున్నాడన్న మాటే గానీ మూగయ్య ఆలోచనల నుంచి గొంగడి పోవడం లేదు… చిట్రాళ్లగొప్పు రోడ్డు పని మొదలైన రోజున, అంటే మొన్న- కిష్టయ్య ఎదురుపడగానే మొదట అడిగింది గొంగడి గురించే. సరిగ్గా ముప్పయ్ నాలుగు రోజుల క్రితం కూడా నర్సీపట్నం-చింతపల్లి రోడ్డు ఒక దశ కొంతపని జరిగింది. మూగయ్యే కాకుండా, ఇప్పుడు పనిచేస్తున్నవాళ్లలో చాలామంది అప్పుడూ వచ్చారు. ఆ సమయంలోనే మూగయ్య గొంగడి లాక్కున్నారు. మనిషికి రోజుకి ఆరు అణాల (అణా ఆరు పైసలు) కూలీ అని చెప్పారు. రోజులను బట్టి పద్నాలుగు కుంచాల వరకు బియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్ని రోజులకి మాట్లాడుకుంటే అన్ని రోజులు పని జరిగే చోటే ఉండాలి. ఎనిమిది రోజులు, పదిహేను రోజులు, మూడు వారాలు.. ఇలా.
గ్రామ మునసబులూ, ముఠాదారులూ పోటీలు పడి రోడ్డు పనికి మన్యప్రజలని సమీకరించే బాధ్యత తీసుకున్నారు, మొదట్లో. ఇప్పుడు అందరికీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. దఫదఫాలుగా సాగుతూనే ఉంది. రేపటి నుంచి ఇక్కడ పని ఆపేస్తున్నామనీ, ఇవాళ ఇచ్చే కొంత బియ్యం, ఇచ్చిన కూలీ తీసుకుని వెళ్లి, మళ్లీ మొదలు పెట్టినప్పుడు రావాలని చెప్పారు అప్పుడు. గప్పీదొర బంగ్లా దగ్గర అందరినీ వరసలో నిలబెట్టి, సంతానం పిళ్లై మస్తరు చూసి చెబుతుంటే, కిష్టయ్య కుంచం తీసుకుని లెక్క మేరకు కొండవాళ్లు తెచ్చుకున్న సంచులలో పోశాడు. మూడు కుంచాలే తీసుకోవలసిన మూగయ్య సంచిలో పొరపాటున నాలుగు కుంచాలు పోశాడు కిష్టయ్య. అది ఇద్దరూ గమనించలేదు. నిజానికి తప్పు కిష్టయ్యదే. చివరికి బియ్యం కాస్త తక్కువై గొడవ జరిగింది. అప్పుడే ఎవరో చెప్పారు, మూగయ్య సంచిలో ఒక కుంచం అదనంగా పడిన సంగతి. అతడి గురించి వెతికితే కనిపించలేదు. రోడ్డు పని కోసమని ఇల్లు వదిలి పదిరోజులైంది. చేతికి బియ్యం వచ్చింది. అవి తీసుకుని చడీచప్పుడూ కాకుండా పని వదిలేసి మూగయ్య తన ఊరు బయలుదేరి వెళ్లిపోయాడు. ఒక రోజంతా ఔరజ్ఞానం (భంగులా గాఢమైన మత్తు ఇచ్చే కల్లు) తాగి, దొరికితే కణుజుదుమ్ము కల్లు (కణుజు మాంసం ఒండినది) తాగేసి, కడుపు నిండా తిని, పడుకుని, రెండు రోజుల తరువాత వచ్చి పనిలో చేరవచ్చునని అతని ఆలోచన.
కానీ రెండో రోజుకే మూగయ్య ఇంటికి వచ్చాడు బారిక- బాస్టియన్ గప్పీదొర బంగ్లాకి రమ్మన్నాడని చెప్పాడు. పంచాయతీ మొదలయింది. ‘కుంచెడు బియ్యం అదనంగా పట్టుకుపోవడం ఒక తప్పు’ అన్నాడు పిళై. ‘చెప్పకుండా పని వదిలి వెళ్లడం రెండో తప్పు’ అన్నాడు కిష్టయ్య. నాకేం తెలియదన్నాడు మూగయ్య. పైగా తప్పు నీదైతే నేనేం చేస్తాను అన్నాడు ఎదురు తిరిగి. ఇది మూడో తప్పు. ఇందులో దొరతనం మీద ధిక్కారం కూడా వినిపించింది బాస్టియన్‌కి. బంగ్లా స్తంభానికి కట్టేసి, బాస్టియన్ ఆదేశంతో కొరడా అందుకున్నాడు కిష్టయ్య. ఒక కర్ర తీసుకుని పిళ్లే దాడిచేశాడు. పది నిమిషాల పాటు ఆగకుండా కొట్టారు. అప్పుడే పిళ్లై కర్రకి తగులుకున్న గొంగడి ఊడొచ్చింది. ఇక దెబ్బలన్నీ నేరుగా శరీరానికి తగలడం మొదలైంది. బాధ పది రెట్లయింది. ఎలుగొడ్డు దాడి చేసినట్టు ఒళ్లంతా గాయాలు- అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా. అప్పటికే కొన్ని గాయాల్లో కారుతోంది నెత్తురు. కొన్ని కొన్ని గాయాలలో స్రవించడానికి భయపడుతున్నట్టు అలాగే నిలిచి ఉంది. కిష్టయ్య గావంచా కూడా లాగేశాడు. కొరడా దెబ్బలు, కర్రతో కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మూగయ్య కాళ్ల మీద. ఎదిరిస్తే మనిషి కాడు బాస్టియన్. గొంతు కొంచెం లేచినా పిచ్చికుక్కలా మారిపోతాడు. అవతలి మనిషి చచ్చిపోతాడేమోననిపిస్తుంది కొడుతుంటే. అక్కడితోనూ ఆగడు. ఆ మనిషి చచ్చిపోయినా ఫర్వాలేదు.
కానీ మరొకడు ఎవరూ నోరెత్త కూడదు. అందుకే అతడు ప్రత్యేకంగా కొన్ని శిక్షలను అమలు చేస్తుంటాడు.ఎక్కడి నుంచి తెచ్చి ఉంచాడో మరి, మిరపకాయలు నూరి ఆ ముద్ద పట్టుకొచ్చి బాస్టియన్ ఆదేశం మేరకు మూగయ్య ఒళ్లంతా రాసేశాడు కిష్టయ్య. అంతటితో ఆగకుండా మిరపగుజ్జు అంటుకున్న చేతులని ఒక పాత్రలో కడిగి ఆ నీళ్లు కళ్లని లక్ష్యంగా చేసుకుని మూగయ్య ముఖం మీద కొంచెం, దెబ్బల మీద, అతడి మర్మాయవాల మీద విసురుగా చిమ్మాడు కిష్టయ్య. ముళ్ల కంపతో ఒళ్లంతా కసిగా రుద్దేసినట్టయింది మూగయ్యకి. నగ్నంగా ఉన్న మూగయ్య దెబ్బల బాధతో, మిరపగుజ్జు మంటతో చిన్నపిల్లాడిలా ఏడుస్తూ, గావంచా అయినా ఇవ్వమనీ, లేదా చిన్న గోచి గుడ్డయినా ఇవ్వమని, కూలి చేసి గొంగడి తీసుకుంటానని కాళ్ల వేళ్లా పడ్డాడు. చివరికి పాత గావంచా ముఖాన కొట్టి, కొత్త గొంగడి మాత్రం గప్పీ దొర బంగ్లాలో పడేశాడు కిష్టయ్య. ఆ కంబళి కోసం అప్పటి నుంచి అతడు బెంగ పెట్టుకున్నాడేమో కూడా ! చలి బాధకి కంబళి కావాలి.
కానీ కిష్టయ్యని చూస్తే వెన్నులో చలి.
*******
రోడ్డు పని కొంచెం మందకొడిగానే సాగుతోంది.బాస్టియన్ కూడా పరధ్యానంగా ఉన్నాడు. పైగా పని జరుగుతున్న చోటుకి కొంచెం దూరంగా లోయని చూస్తూ నిలబడి ఉన్నాడు. కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా ఉంది కూలీలకి. నర్సీపట్నంలో కడుతున్న సొంత బంగ్లా గురించే బాస్టియన్ ఆలోచిస్తున్నాడు. చాలామంది తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అక్కడే ఇళ్లు కట్టుకుంటున్నారు. చెప్పకపోవడమేం! అందులో తనది కొంచెం పెద్ద కట్టడమే. దానితో సహాయ నిరాకరణ ఉద్యమకారులు మన్యాన్ని దోచేశాడని గోల మొదలు పెట్టారు. ఫిర్యాదులు వెళతాయేమోనని కొంచెం భయంగా ఉంది. ఎక్కువగా పిల్లల్ని పనిలో పెట్టి అణా అణా చేతిలో పెట్టి పంపేయడం గురించి నర్సీపట్నంలో గోలగానే ఉంది. ‘‘వణక్కం!’’ అంటూ వచ్చాడు పిళ్లై. ‘‘ఏమయ్యా! ఆ మర్రిపాలెం చెత్తనా కొడుకు పోలోజు లక్ష్ముడు దొరకలేదు కదా!’’ ఆరా తీస్తున్నట్టు అడిగాడు బాస్టియన్. ‘‘దొరకలేదు దొర!’’ అతి వినయంగా అన్నాడు పిళ్లై, పెదవి విరుస్తూ. ‘‘ఎక్కడికి పోతాడులే! ఆ లం..కొడుకుని నమ్మానయ్యా అనవసరంగా. ఇటకైపోయింది నర్సీపట్నంలో. ఇటక కాల్చడానికి కలప పంపరా ఎదవ నాకొడకా అని ఆడికి చెప్పాను. పంపలేదు. నెల పైనే అయింది. ఆణ్ణి ఏంచెయ్యాలంటావ్?’’ అన్నాడు కోపంతో బాస్టియన్. ‘‘తొళ్లు ఒలిచి పూడవాలా!’’ అంత ఆవేశంగాను అన్నాడు పిళ్లై. ఆ కలప ఉచితంగానే నర్సీపట్నం చేరవేయవలసిన బాధ్యత లక్ష్ముడికి ఉందని పిళ్లైకి తెలుసు. కానీ దొరవారికి ఆ మాత్రం చేయొద్దా అన్నదే అతడి తర్కం. ‘‘చింతపల్లి పనికి వాని కొడుకు, కూతురు, కోడలు వచ్చారు. వాడు మాత్రం పొలం పనికి పూడ్నాలని ఎగనామం పెట్టి పూడ్చాడు’’ అన్నాడు పిళ్లై.‘‘ దొరక్కపోడు. కాళ్లూ, చేతులూ ఇరిచేస్తాను….. ఇంకో మునసబుని ఎవడినైనా చూడు. పచ్చి ఇటక తీయించాను. కాల్చాలి. వెంటనే కలప కావాలి మనకి…’’ అంటూ హఠాత్తుగా కూలీల కేసి చూశాడు బాస్టియన్. పని మందగించిన సంగతి తెలుస్తోంది. ‘‘ఏంట్రా పెళ్లి నడకలు నడుస్తున్నారు…! ’’ గట్టిగా అరిచాడు బాస్టియన్, పూనకం వచ్చిన మనిషిలా కదులుతూ. ఆ కేక భయం పుట్టించింది. అదే, లేని ఓపిక తెచ్చి పెట్టింది. పనిలో మళ్లీ అదే వేగం.
(ఇంకా ఉంది)