సంపాదకీయం
శాలివాహన 1944 శ్రీ శుభకృత్ వైశాఖ శుద్ధ విదియ 02 మే 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారతదేశాన్ని కకావికలం చేసేది వాళ్లే. భారతదేశంలో బాధితులం తామేనని గుండెలు బాదుకునేదీ వాళ్లే. ఈ దేశంలో మైనారిటీలుగా చెప్పుకుంటున్న వారి సరికొత్త విన్యాసమిది. కొద్దికాలంగా జరుగుతున్న ఘటనలను బట్టి చూస్తే రహస్యంగా సాధించదలిచిన ఒక రాజకీయ, సామాజిక లక్ష్యానికి ఇంకా తొందరగా చేరిపోవాలన్న ఆరాటం మైనారిటీలలో కనిపిస్తున్నది. అందుకు అనుకూలించేవే హిందూత్వ ఆధిపత్య ధోరణి, మైనారిటీలకు రక్షణ లేకపోవడం వంటి నినాదాలు, సూత్రీకరణలు. హిందూ త్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించే హిందువుల సమర్ధన దీనికి ఇబ్బడిముబ్బడిగా ఉంది. హిజాబ్ వివాదం, తరువాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల మీద దాడి, తరువాతి పరిణామాలన్నింటికి మూలం హిందూత్వ ఆధిపత్య ధోరణేనని ఇప్పుడు చాలామంది మేధావులతో పాటు, ఒక వర్గం మీడియా పాత పాటే వినిపిస్తున్నది. దీనిని సూచించే పదమే మెజారిటేరియనిజం.
ఒక వ్యవస్థలో సంఖ్యను బట్టి ఆధిక్యం ఉన్న వర్గం అనుసరించే సంప్రదాయాలు, ఆచారాలు, చింతనలకు అనుగుణంగా మిగిలిన మైనారిటీ లను ఉండమని ఆదేశించడమే మెజారిటేరియనిజం. గతం సంగతేమో కానీ, 2014 నుంచి భారత్‌లో మెజారిటేరియనిజం హద్దు మీరిందని మన కిరాయి ఉదారవాదులు, నాటు కమ్యూనిస్టులు, భారతీయత లేని కాంగ్రెస్ క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తోంది. అంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటేరియనిజం పెట్రేగిపోతోందని వీరందరి సూత్రీకరణ.
ఇంతకీ హిజాబ్ వివాదం ఎవరు రేపినది? తమ పాఠశాలలకు వచ్చే పిల్లల (వాళ్లు ఎవరైనా) బ్యాగ్‌లలో మిగిలిన పుస్తకాలతో పాటు బైబిల్‌ను అనివార్యం చేసినదెవరు? ఉగాదికి రాజస్థాన్‌లోని కరౌలీలో మత ఘర్షణలు ఆరంభించినది ఎవరు? శాంతియుతంగా సాగుతున్న శ్రీరామనవమి శోభాయాత్రల మీద పది రాష్ట్రాలలో రాళ్లు విసిరినది ఎవరు? హనుమత్ జయంతికి ఢిల్లీలో హిందువుల ఊరేగింపు మీద తుపాకీ గుళ్లతో పాటు రాళ్లు రువ్వినది ఏ వర్గం? ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందువుల పండుగ యాత్రలకు ప్రవేశం లేదని బాహాటంగానే ప్రకటించినది ఎవరు? నడిరోడ్ల మీద నమాజులు చేయడాన్ని వ్యతిరేకిస్తే మైనారిటీలను అణచివేస్తున్నారని చాటుతున్నది ఎవరు? మతోన్మాదం తలకెక్కిన కొందరు మైనారిటీలు కాదా? రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో మూడు వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేయించినది ఇప్పటికీ హిందూ ఓటు మీద బతికే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా! ఆ యాత్రలలో హిందువుల మీదే కాదు, పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు. ఢిల్లీలో అయితే ఒకడు రివాల్వర్ తెచ్చి పోలీసును కాల్చాడు. దీనినంతటిని మైనారిటీలలో అభద్రతా భావంగానే చూడాలట. నిజానికి ఇక్కడ అభద్రత ఉండవలసింది హిందువులకే. వారు మెజారిటీ మతస్థులు కావచ్చు. అయినా ఈ దేశంలో హిందువులకు భద్రత లేదు. ఆ భావన మైనారిటీల వైఖరితో జనించినదే. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఉదారవాదులతో పాటు, కొన్ని కోర్టు తీర్పులతో ముస్లిం మతోన్మాదులకు చేకూరుతున్న భరోసాయే, దాని ఫలితాలే హిందువులలో అభద్రతా భావాన్ని నింపుతున్నాయి.హనుమాన్ చాలీసా చడవడం దేశద్రోహమైతే ఇంకేమనాలి?
ఆక్రమణలు చట్ట విరుద్ధమైతే, ఆక్రమించి కట్టేసిన ఇళ్లను, దుకాణాలను కూల్చడం అక్రమమెట్లా అవుతుంది? అప్రజాస్వామికమెందుకవుతుంది? హక్కుల ఉల్లంఘన ఎందుకయింది? ఈ వాదనను కోర్టులు ఎలా ఆమోదిస్తున్నాయి? ఏ ప్రాతిపదికన ప్రభుత్వాలను దోషులుగా నిలబెడుతున్నాయి? బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు అక్రమంగా చొరబడిన వారు. వీళ్లంతా పేద ముస్లింలైనా కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుందని కుహనా సెక్యులరిస్టులు, ఒవైసీ చేస్తున్న నికృష్టపు వాదనలను కోర్టులు ఎలా స్వీకరిస్తాయి? అన్నట్టు ఈ పేద ముస్లింల కేసులు డబ్బయ్ నుంచి ఎనభయ్ లక్షల వరకు పారితోషికం స్వీకరించే న్యాయవాదులే వాదిస్తున్నారు. ఇంకా చిత్రం, తమ ఇళ్లు, దుకాణాలు అక్రమంగా కట్టినవేనని అటు కూల్చివేతలు జరుగుతుంటే స్థానికులు కొందరు చానెళ్ల వాళ్లతో చెప్పారు. ఈ వాదన మాత్రం కోర్టులకు పట్టడం లేదు.
సీఏఏ అల్లర్లు, ఆ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన షాహీన్‌బాగ్ శిబిరం వెనుక ఏం ఉన్నదో కొంచెం ఆలస్యంగా అయినా బయటకు వచ్చింది. ఢిల్లీ శివార్లలో దొంగ రైతులు దీక్షా శిబిరం, అందులో అత్యాచారాలు, చివరికి జరిగినది దేశానికి తెలుసు. ఈ రైతుల ఆందోళన పట్ల రైతులలోనే ఉన్న ప్రతికూలత ఎంతో సుప్రీంకోర్టు నియమించిన బృందం ఇటీవలే నిర్ధారించింది కూడా. అయినా వీటిని అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ బీజేపీనీ, హిందూత్వను ‘డిజ్‌మ్యాంటిల్’ చేయడానికి ప్రయత్నాలు కొనసాతూనే ఉన్నాయి. ఇందుకు కోర్టులు వాదనలకు అనుమతిస్తూనే ఉన్నాయి. ఇదే దురదృష్టకరం.
అల్లర్లు చేసేదీ, రెచ్చగొట్టేదీ మైనారిటీలే. వాటిని ప్రతిఘటిస్తే హిందూ మెజారిటేరియనిజమవుతోంది. ఈ దేశం మరోసారి చీలిపోతుందంటూ వాచాలత్వం ప్రదర్శించే మౌల్వీలు ఉంటే, హిందువులు బాణాలు సిద్ధం చేసుకోవాలని చెప్పే సాక్షి మహరాజ్‌లు రావడం సహజం. జహంగీర్‌పురిలో అల్లర్లు రేపిన వాళ్లే ఇప్పుడు కొందరు వెర్రి హిందువులను వెంటేసుకుని, మువ్వన్నెల జెండాతో శాంతి యాత్రలు జరిపారు. మతం తలకెక్కి తందనాలాడే మైనారిటీలను పెంచితే స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో ఏం జరుగుతున్నదో గమనిస్తే తెలుస్తుంది. ఒక్కమాట. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉంటేనే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, జీవన వైవిధ్యం, మరేదైనా బతికి బట్టకడతాయి. మెజారిటేరియనిజం వంటి కృతక నినాదాలు మతోన్మాదులకే తోడ్పడతాయి.