– వి. రాజారామ మోహనరావు

ముందు పొడి దగ్గులా వచ్చింది. మర్నాడు, రెండోనాడు జలుబు, జ్వరం. మూడోనాటికి బాగా ఎక్కువైపోయింది. మామూలుగా వెళ్లే వీధి చివరి ఆసుపత్రికి తీసుకెళ్లాడు భార్య సావిత్రిని శివ. డాక్టరు చూసి పరీక్షలు చేసి, వాటి వివరాల కోసం మర్నాడు రమ్మన్నాడు. మందులిచ్చి పంపించేశాడు. డాక్టరుకి చూపించడం అయింది కదా అని భార్యని ఇంట్లో దింపి, ఆటో నడపటానికి వెళ్లాడు శివ. మర్నాడు ఆసుపత్రికి వెళ్లాడు. ఏదో పలానా జ్వరం అని చెపుతారని తేలిగ్గా ఊహించాడు. కానీ డాక్టరు చెప్పింది విన్నాక, శివ తలకిందులైపోయాడు.

‘‘మీ ఆవిడకి కరోనా పాజిటివ్‌. ‌మా దగ్గర వైద్యా నికి వీలు లేదు. హాస్పిటల్లో ఎక్కడైనా అడ్మిషన్‌ అం‌త తేలిగ్గా దొరకదు. మనకి దగ్గర్లో ఉన్న వైస్రాయి పెద్ద హాస్పిటల్‌. ‌మంచిది. ఉత్తరం రాసిస్తాను. వెళ్లి ప్రయత్నం చెయ్యి. యాభైవేలు ముందు కట్టించు కుంటారు’’ అన్నాడు డాక్టర్‌.

‘‘ఇం‌ట్లోనే ఉండి మందులు వేసుకుంటే..’’ అనడిగాడు శివ.

‘‘చాలా ప్రమాదం. ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది. వెంటనే వైద్యం జరిగి తీరాలి. లేకపోతే ప్రాణాల మీదకు రావచ్చు. ఆవిణ్ణి ఎడ్మిట్‌ ‌చేశాక, మీ కుటుంబంలో అందరూ కూడా కరోనా పరీక్ష చేయించుకోండి.’’

కొద్ది నిమిషాలలో శివ బుర్రంతా అల్లకల్లోలమై పోయింది. ఆ తర్వాత పనులన్నీ ఓ యంత్రంలా చేశాడు. తనకి అవసరమైనప్పుడు అప్పు తీసుకునే మార్వాడీ కొట్టుకి వెళ్లాడు. మార్వాడీ అడిగిన చోటల్లా సంతకాలు పెట్టి డబ్బు తీసుకున్నాడు. పిల్లలిద్దర్నీ, భార్యనీ తీసుకుని వైస్రాయి హాస్పిటల్‌కి వెళ్లాడు. బెడ్‌ ఉం‌దంటారో, ఎడ్మిట్‌ ‌చేసుకుంటారో లేదోనన్న టెన్షన్‌. ‌భార్యని ఎడ్మిట్‌ ‌చేసాడు. యాభైవేలు కట్టాడు. శివ, పిల్లలు కూడా టెస్ట్ ‌చేయించుకున్నారు. భార్యకి బెడ్‌ ‌దొరికిందన్న రిలీఫ్‌ ‌లేకుండా, తమ టెస్ట్ ‌రిపోర్టస్ ఏమోస్తాయోనన్న కొత్త టెన్షన్‌.

‌రిపోర్టస్ ‌వచ్చాయి. పిల్లలకి గానీ, తనకి గానీ కరోనా లేదు. నెగిటివ్‌ అన్నారు. హమ్మయ్య! అనుకు న్నాడు. హాస్పిటల్‌ ‌వాళ్లు మరో యాభైవేలు కట్ట మన్నారు. మార్వాడీ దగ్గరనుంచి మళ్లీ తెచ్చి కట్టాడు. ప్రతీసారి యాభైవేలంటే ఎలా? అన్న బెంగ పట్టు కుంది. కానీ సావిత్రి తన భార్యే కాదు, తన ఇద్దరి పిల్లల తల్లి. ఆమె ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదను కున్నాడు. ఈ విషయం తెలిసి సావిత్రి తల్లి వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటోంది. ఇంటి చుట్టుపక్కల వాళ్లు దూరం దూరంగా మెసులుతున్నారు. మొహ మాటానికి పలకరిస్తున్నారు.

సావిత్రిని ఐ.సి.యు.లో ఉంచారు. వైద్యం బాగానే జరుగుతోందని, ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందనీ చెబుతున్నారు. తగ్గడానికి ఎన్నాళ్లు పడుతుం దంటే, ‘ఏమో చెప్పలేం.. ముందు టెస్ట్‌లో నెగిటివ్‌ ‌రావాలి, ఆ తర్వాత మిగిలిన సంగతి’ అన్నారు.

హాస్పిటల్‌ ‌వాళ్లు చెప్పేది, చుట్టూ జనం చెప్పు కునే వార్తల వల్ల ఏదో అనుకోవటమే తప్ప, నిజంగా ఏం జరుగుతుందో, పరిస్థితి ఏమిటో శివకి తెలియదు. సావిత్రిని హాస్పిటల్‌లో చేర్చి పద్నాలుగు రోజులైంది. అప్పటికి ఏడు లక్షలు కట్టాడు. ఇంటి కాగితాలు, ఆటో సి బుక్‌ అన్నీ మార్వాడీ తీసుకు న్నాడు. రోజులు గడుస్తున్నది తెలుస్తోంది కానీ, ఏ విషయం మనసుకి పట్టడం లేదు. ఏదో మొద్దు స్థితిలో ఉన్నట్టు గడుపుతున్నాడు. ఆటో నడుపుతున్నాడు కానీ, ఆసక్తి ఎంతమాత్రం లేదు. వందల్లో ఆటో సంపాదన, వేలల్లో హాస్పిటల్‌ ‌ఖర్చు. తనొక భయంకరమైన ఊబిలో కూరుకుపోతున్నట్టుంది. బయటపడే ఆధారం కనపడటం లేదు. ఒకటే ఒక ఆశ, భార్య బతికి బయటపడితే చాలు. పిల్లలు తల్లిలేని వాళ్లు కాకుండా ఉండే చాలు.

శివ చుట్టూ భయం. ఆలోచనంతా కరోనా చుట్టూనే. హాస్పిటల్లో కరోనా చావులు, మాకు పదిహేను లక్షలైందని కొందరు, మాకు ఇరవై లక్షలైందని మరికొందరు. ఊరూరా కరోనా పెరుగు తోందని, కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతున్నా యనీ వార్తలు. భార్యకి ఎలా ఉంటుందోనన్న బెంగతోపాటు, తనకో, పిల్లలకో, అత్తగారికో కరోనా వచ్చేస్తుందేమోనన్న చచ్చే బెదురు శివకి. పైగా ధారలా అవుతున్న ఖర్చు. విపరీతంగా పెరిగిపోతున్న అప్పు. కేవలం పదిహేను రోజుల్లోనే పీనుగులా అయిపోయాడు.

శివ ఆ నగరానికి వచ్చి పదిహనేళ్లయింది. ముందు ఆటో అద్దెకు తీసుకుని నడిపాడు. రాత్రిం బవళ్లు కష్టపడి నాలుగేళ్లకి సొంత ఆటో కొనుక్కు న్నాడు. మరో రెండేళ్లకి, తాముంటున్న అద్దె ఇంటి దగ్గర్లో ఓ చిన్న ఇల్లు అమ్మకానికి వస్తే, ఊళ్లో పొలం అమ్మేసి కొనుక్కున్నాడు. సొంత ఇల్లు, సొంత ఆటో, చక్కటి సంసారం, అందమైన ఇద్దరు పిల్లలు… మంచి స్కూల్లో వాళ్లకి చదువు… ఇంకేం కావాలి? నువ్వు అదృష్టవంతుడివిరా… అనేవారు తోటివాళ్లు. శివ కూడా అదే తృప్తితో ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులైంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యంలా ఉంది. ఏ ఆసక్తిలేని నిర్లిప్తత. అంతూ, దరి కనబడని భయం, జంకు, బెదురు. భార్య చచ్చిపోతే అన్న దిగులు.

ఇరవై ఎనిమిది రోజులకి సావిత్రిని డిశ్చార్జ్ ‌చేశారు. ఇంటికి తీసుకొచ్చాడు. భార్య బయట పడినందుకు, తమకెవరికి అంటుకోనందుకు కొంత వరకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అన్నీ కలిపి చూసుకుంటే ఖర్చు ఇరవై లక్షలు దాటింది.

మార్వాడీ ఇల్లు, ఆటో స్వాధీనం చేసుకున్నాడు. పూర్తి నిరాధారంగా రోడ్డు మీద నిలబడిన పరిస్థితి శివది. కొన్నాళ్లు అదే ఇంట్లో ఉండి అద్దె కడతానన్నాడు. మార్వాడీ ఒప్పుకోలేదు, ఆ ఇంట్లో కొత్త షాపు పెట్టించాడు. కొడుక్కి ఆ షాపు అప్పగించాడు. అలా విస్తరించటం మార్వాడీ అలవాటు. శివ అద్దె ఇంట్లోకి సంసారాన్ని మార్చాడు. సావిత్రి మరింతగా కోలుకునే వరకూ అత్తగారు ఉంటానంది.

మళ్లీ అద్దె ఆటో. పిల్లల చదువు ఎలాగో? అంత ఫీజు కట్టలేడు. గవర్నమెంట్‌ ‌స్కూల్లో చేర్చాలేమో? లేదా చదువు మానిపించాలి. శివ జీవితం పది హేనేళ్లు వెనుకపడింది. అప్పుడు ఊళ్లో పొలం ఉండేది. ఇప్పుడు అదీ లేదు.

శివ బావమరిది గోపాల్‌ ‌వచ్చాడు. అక్క సావిత్రి బాగా నీరసపడింది. బావ శివ మానసికంగా అంతకన్నా నీరసపడినట్టు కనిపించాడు. గోపాల్‌ ‌లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. బావకి సహాయంగా ఉంటుందని ఓ పదివేలు తెచ్చాడు. జరిగిందంతా అతనికి తెలుసు.

ఆ డబ్బు ఇస్తూ… ‘‘దిగులుపడి నీరస పడిపోకు బావా. ఎవరు మాత్రం ఏం చెయ్యగలం చెప్పు’’ అన్నాడు. డబ్బు ఇచ్చాడు. వద్దంటూనే తీసుకోక తప్పలేదు శివకి. ఇంట్లో అవసరాలు అలా ఉన్నాయి. ‘‘ఒక్క నెల రోజులు… మీ అక్క… ఈ జబ్బు… మొత్తం నన్ను నేలమట్టం చేశాయి’’ అన్నాడు శివ. అలా వింటుంటే అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

‘‘బావా… ఇది అక్కకి వచ్చిన కరోనా వల్లే అనిపించినా, దీని వెనక చాలా కారణాలున్నాయి. మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్లు దాటింది. మన గవర్నమెంట్‌ ‌హాస్పిటల్స్ ‌మీద మనలో చాలామందికి నమ్మకంలేని పరిస్థితి. డబ్బు పెట్టగలిగితే ప్రైవేటు వైద్యానికే పరిగెడతాం. వైస్రాయిలో అక్కకి చేసిన వైద్యానికి సరిగ్గా లెక్క కడితే, కొన్ని వేలే. కానీ నీ దగ్గర లక్షలు గుంజారు. వాళ్లు ఏం చేసినా అడ్డుకునే వ్యవస్థ లేదు. వాళ్లు అంత దారుణంగా దోపీడీ చెయ్యటమూ, ఈ కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ అమానుష ప్రవర్తన కూడా దీనికి కారణం. కొన్ని దేశాల్లో విద్య, వైద్యం ప్రజలకి ఉచితం.

ప్రజల మంచి గురించి మనవాళ్లకి అక్కర్లేదు. వైద్యం, విద్య, రవాణా లాంటివి సజావుగా ప్రజలకి అందకపోతే బతకు ఇలాగే ఉంటుంది. ఇవన్నీ నీలాంటి వాళ్ల దృష్టికి రాని విషయాలు’’ అన్నాడు గోపాల్‌.

‌శివకి అంతా అయోమయంగా ఉంది. అతని పదిహేనేళ్ల ఎదుగుదలని నెలరోజులు దోపిడి చేసినట్టయింది. వైస్రాయివాళ్ల కార్పోరేట్‌ ‌దోపిడి, దాన్ని పట్టించుకోని ప్రభుత్వ తీరే ఇంత బాధగా అనిపిస్తుంటే, ఉత్తరం రాసి వైస్రాయికి పంపిన వీధి చివరి డాక్టరిక్కూడా, తను ఖర్చు చేసిన ఇరవై లక్షల్లో వాటా ముడుతుందని తెలిస్తే ఇంకెంత ఇదిగా ఉండేదో.

‘‘బావా మన కుటుంబమే కాదు. కరోనా బారిన పడిన ఎన్నో వందల, వేల కుటుంబాలు నేలమట్ట మయ్యాయి. వాళ్ల గురించి పట్టించుకొని, లెక్కలు వేసే వ్యవస్థ మనకి లేదు. మనలాంటి వాళ్ల ప్రాణ భయాన్ని డబ్బులా మార్చుకొని తీరని దాహంలా తాగే రాక్షస వ్యవస్థలో ఉన్నాం.

అక్కని వైస్రాయి వాళ్లు ప్రాణాలతో ఇంటికి పంపించారు. వాళ్ల వైద్యాన్ని కాదనలేం. అందుకు సంతోషించు. అదే అదృష్టం అనుకో’’ అన్నాడు శివకి ధైర్యం చెబుతూ గోపాల్‌.

‘‌సావిత్రిని ప్రత్యక్షంగా ప్రాణాలతో ఇంటికి పంపించారు. కానీ మరో రకంగా శివ కుటుంబం ఉసురు తీసారు. కంటికి కనిపించని హత్యే అది. ఈ హత్యల బాధ్యత ఎవరిదో లోతుగా చూస్తేనే కానీ అర్ధం కాదు’ అనుకున్నాడు గోపాల్‌ ఆ ఇం‌టి పరిస్థితి చూస్తూ.

‘శివ రాత్రింబవళ్లు మళ్లీ ఎన్నాళ్లు కష్టపడాలో, కష్టపడినా యథాస్థితికి రాగలడో, లేడో. ఎందుకంటే, సమాజ పరిస్థితులు ఎలా ఉంటాయో?’

About Author

By editor

Twitter
YOUTUBE