– మోహన్ దాసరి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
గాంధీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్ మీటింగు ఏర్పాటు చేశారు అధ్యక్షులు. కమ్యూనిటీ హాలులో నలుగురు మాత్రమే ఉన్నారు. అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఓ సభ్యుడు.
‘‘కాలనీ వాట్సప్ గ్రూప్‌లో మెస్సేజ్ పెట్టాను.. ఇంతవరకు పదిమంది కూడా రాలేదు..’’ అధ్యక్షుడు అసహనంగా అన్నాడు.
‘‘ఆదివారం సాయంత్రం అందరికీ అను కూలంగా ఉంటుందని ఆలోచించి సమయం నిర్ణయించాం. అయినా ఎప్పుడూ ఇలాగే లేట్ చేస్తారు.’’ కార్యదర్శి అందుకున్నాడు.
‘‘నేనూ నలుగురికి ఫోన్ చేసి చెప్పాను.. వస్తామన్నారు, ఆలస్యంగా రావడం అలవాటయి పోయింది. కొద్ది సేపు చూద్దాం..’’ అన్నాడు కోశాధికారి. ‘‘చెప్పిన సమయానికి మీటింగ్ మొదలు పెట్టాలి అందరూ వచ్చేదాక ఆగాలంటే ఎలాగ? మాకూ పనులున్నాయి..’’ ఉన్న ఒక్క సభ్యుడు, రమేష్ గారు, అన్నారు ప్రతిపక్ష సభ్యుడిలా.
‘‘ సారీ రమేష్ గారు… విందు అంటే పరిగెత్తుకు వస్తారు కాని, మీటింగ్ అంటే మెల్లగా బయలు దేరుతారు. మరో పది నిమిషాలు చూసి మొదలు పెడదాం…’’ కోశాధికారి సర్దిచెప్పాడు.
‘‘ పదిమంది కూడా లేకుండా ‘కోరమ్’ ఎలా అవుద్ది? కొంతమందికి ఫోన్ చేద్దాం..’’ కార్యదర్శి ‘రూలింగ్’ ఇచ్చారు. తలో ఇద్దరికి ఫోన్లు చేయ సాగారు.
పదినిమిషాల్లో ఇద్దరు.. మరి కాసేపటికి నలుగురు.. అర్థగంటకి మేమూ వచ్చాం అన్నట్లు మరి కొంతమంది వచ్చారు.
‘‘ఇంత లేటుగా వస్తే ఎలాగండి? మీటింగ్ ఉందని వాట్సప్‌లో పెట్టాను కదా! చూసుకోలేదా! వీధిలో పందులున్నాయి.. కుక్కలున్నాయి.. అని ఫొటోలు పెడతారు… రిమైండర్ 1, రిమైండర్ 2 అని గుర్తు చేస్తారు కూడా… మరి మీటింగ్ పెట్టినప్పుడు టైంకి రావాలి కదా!’’ అధ్యక్షుడు అరిచాడు.
‘‘ఫొటోలు పెట్టకూడదంటే ఇక నుంచి పెట్టం… డైరెక్ట్‌గా మన్సిపాలిటీ వాళ్లకే పెడతాం.. అసోసియేషన్ ఉంది కదా అని పోస్ట్ చేశాం.. దానికీ దీనికీ ముడి పెడతారెందుకు? కాస్త పనుండి లేటయింది, కావాలని చేస్తామా…? ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి..’’ నారాయణ గారు శివతాండవం చేశారు.
‘‘ఫొటోలు పెట్టొద్దని కాదు. మీటింగ్‌కి టైముకి రావాలన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెబుతున్నా!’’ అధ్యక్షలు కూడా తగ్గట్లేదు.
‘‘మీ ఒక్కరికే ఉందా రెస్పాన్సిబిలిటీ? మాకు లేదా? ఇంతకుముందు నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేయలేదు! ప్రతి దానికి మీటింగులు పెట్టానా?’’ సందు దొరికిందని నారాయణగారు తన గత వైభవాన్ని తవ్వుతున్నాడు.
‘‘ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? మీరు ఏమీ చేయలేదని ఎవరన్నా అన్నారా? ఆగండి, ఇంకో ఇద్దరు వస్తే మొదలుపెడదాం…’’ కార్మదర్శి చల్లబరిచే ప్రయత్నం.
దేశం మొత్తంలో ఉన్నన్ని రాజకీయాలు ఒక్క కాలనీలోనే అగుపడుతాయి. ఎప్పుడైతే కాలనీ అసోసియేషన్ ఎన్నికలు మొదలు అయినాయో… అప్పుడే గ్రూపులు మొదలయ్యాయి. అంతెందుకు? ఐక్యంగా ఉన్న కాలనీని పదవుల కొసమే రెండు భాగాలుగా సౌత్ కాలనీ – నార్త్ కాలనీ అని ఫేజ్-1, ఫేజ్-2 అని విడగొట్టిన మహానుభావులు ఉన్నారు. ఒక్కో గ్రూప్ ఒక్కో రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తాయి. ఎలక్షన్ అప్పుడు వీళ్ల హడావుడి అంతా ఇంతా కాదు… పార్టీలకు కూడా గ్రూపులు బాగా పనికి వస్తున్నాయి.. పనులు మాత్రం అలాగే ఎక్కడి వక్కడ అలాగే ఉండిపోతున్నాయి.
‘‘ఇక మొదలుపెడదాం సార్.. ఇప్పటికి గంట గడిచింది’’ కార్యదర్శి అధ్యక్షులతో అన్నారు. ‘‘సరే మొదలుపెడదాం… ఇంతకాన్నా ఎక్కువ వచ్చేలా లేరు’’ అని అధ్యక్షులు లేచి నిలబడి మొదలుపెట్టాడు.
‘‘గౌరవ సభ్యులకు నమస్కారములు.. మీ అందరికి తెలిసిన విషయమే… కొన్ని రోజుల నుంచి అదేపనిగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీ అంతా గందరగోళంగా ఉంది. మన కాలనీకి కూడా ఇబ్బంది వచ్చింది. రోడ్లు బాగా దెబ్బతిన్నాయి… మొన్న వెల్‌కం బోర్డు దగ్గర గుంతలో స్కూటీ పడిపోయి ఓ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయి.. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది.. రాత్రిపూట ఎవరు వచ్చినా భయంగా ఉంది. ఏమైనా జరుగవచ్చు.. కాబట్టి ఈ విషయం చర్చించడానికి అందరిని మీటింగ్‌కు పిల వడం జరిగింది.’’ సుధీర్ఘ ఉపన్యాసం, ఆనందంగా ఇస్తున్నాడు అధ్యక్షుడు. సభ్యులకే చిరాకుగా ఉంది..
‘‘కార్పొరేటర్‌కు ఫోన్ చేస్తే సరిపోద్ది కదా… లేదా మున్సిపల్ ఆఫీస్‌కు చెప్పండి.. మీటింగ్ ఎందుకు?’’ ఒక సభ్యుడు వెటకారంగా అన్నాడు.
‘‘అధ్యక్షులు మాట్లాడిన తర్వాత అందరికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాట్లాడండి. సభ్యు లకు క్రమశిక్షణ ముఖ్యం’’ ఉపాధ్యక్షుడి హెచ్చరిక.
‘‘క్రమశిక్షణ గురించి మీరే చెప్పాలి’’ అని అందు కున్నాడు ఇంకో సభ్యుడు. ‘‘నీకు లేదనే చెప్పాను’’ అన్నాడు ఉపాధ్యక్షుడు.
‘‘నీకు అని ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడ తారా… మీటింగుకి పిల్చింది మమ్మల్ని అవమానించ డానికా…?’’ అంటూ కొపంగా వాకౌట్ చేశాడు సభ్యుడు.
‘‘దయచేసి మీటింగ్‌లోని ఎజెండాకు సంబంధిం చిన విషయాలు ఒకరి తరువాత ఒకరు మాట్లా డుదాం.. ఓపిక పట్టండి.. మీ టర్మ్ వచ్చినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. దయచేసి సభ్యులు మధ్యలో మాట్లాడవద్దు..’’ చల్లబరచడానకి కార్యదర్శి ప్రయత్నం. ‘‘మేము మున్సిపాలిటీకి చెప్పాం..కానీ ఫండ్స్ లేవంటున్నారు.. కరోనా కాలంలో మనం అధికారుల చుట్టూ తిరిగేటట్లు లేదు. కావున కాలనీ వాసులు అందరం కొంత షేర్ చేసుకొని గుంతలు పూడుద్దామని నా ఆలోచన. ప్రతి సభ్యుడు కనీసం రెండువందలు వేసుకుంటే కాలనీ రోడ్ల మీదున్న గుంతల్ని మట్టితో నింపి ప్రమాదాలు కాకుండా చూడొచ్చు. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుప గలరు ధన్యవాదాలు’’ అధ్యక్షుడు చెప్పి కూర్చున్నాడు.
మాజీ అధ్యక్షుడు లేచి, ‘‘చిన్న చిన్న పనులను కూడా చేయించలేవా… అసోసియేషన్ దగ్గర డబ్బులు లేవా… ప్రతి నెలా ప్రతి ఇంటికి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు కదా! అవన్నీ ఏం చేసినట్లు?’’ అన్నాడు.
కార్యదర్శి లేచాడు సమాధానం చెప్పడానికి. అధ్యక్షుడు కల్పించుకొని ‘‘ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేదు… జెండా వందనానికి నా జేబులోంచి పెట్టుకున్నాను.. నెల నెలా వసూలు కావట్లేదు. చాలామంది సభ్యులు ఇవ్వట్లేదు’’
‘‘అందరి దగ్గర వసూల్ చేయనప్పుడు మీకు పదవులెందుకు’’ మాజీ అధ్యక్షుడు అందుకున్నాడు. ‘‘మీరు మాకు అప్పచెప్పినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ‘జీరో’ నే’’ అధ్యక్షుడు వెటకారంగా మాట్లాడాడు… ‘‘మేం చాలా పనులు చేశాం. కానీ మీలాగా చందాలు వసూలు చేయలేదు’’ మాజీ అధ్యక్షుడు నారాయణ లేచాడు.
‘‘సభ్యులు శాంతంగా మాట్లాడవలసిందిగా మనవి. ఇప్పటి సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి’’ ప్రధాన కార్యదర్శి చాలా మెల్లగా, ఓపిగ్గా చెప్పాడు.
‘‘ఎన్నికలప్పుడు అన్ని పనులు చేస్తానని, ఏం చేయలేదని మా మీద ప్రచారం చేశారు కదా… ఇప్పుడు మీటింగ్‌లు పెట్టి వసూల్ చేస్తారా….?’’ నారాయణ ఆగేటట్లు లేడు.
‘‘అవును. చెప్పినట్లు పనులు చేశాం.. ఎం.ఎల్.ఏ.తో మాట్లాడి నాలుగు రోడ్లు వేయించాం. కనబడట్లేదా..?’’ అధ్యక్షుడు ఊరుకుంటాడా మరి?
‘‘మీ ఇంటి చుట్టూ వేయించుకున్నారు… మా వైపు రోడ్డు కోసం ఎన్నిసార్లు అడిగాం…?’’ మాజీ ఉపాధ్యక్షుడు లేచాడు. చిన్న మోస్తరు అసెంబ్లీ లాగానే ఉంది వ్యవహారం.. వాతావరణం…
‘‘ప్లీజ్.. ప్లీజ్… ఇప్పుడు ఉన్న సమస్య గురించే మాట్లాడండి.. డబ్బులు లేకుండా ఈ పనే కాదు ఏ పనీ చేయలేం.. కాబట్టి సహకరించండి’’ కోశాధికారి బాధగా చెప్పాడు.
‘‘వినాయక చవితి డబ్బులు ఉన్నాయిగా.. అవి ఖర్చు పెట్టవచ్చు కదా!’’ ఒక సభ్యుడు లేచి అన్నాడు. ‘‘దేవుని డబ్బులు ముట్టరాదని తీర్మానం ఉంది.. ఆ అమౌంట్ వేరే దానికి ఖర్చు చేయరాదు’’ అన్నాడు కార్యదర్శి. ‘‘కాలనీ కోసం దేవుడు సహాయం చేయడా? తీర్మానం చేసింది మనమే కదా.. మారుద్దాం..’ సభ్యుడు సూచన చేశాడు.
‘‘అలా కుదరదు. మాటమాటకి తీర్మానం మార్చడం కుదరదు.. వినాయక చవితికి డబ్బులు ఇచ్చిన దాతలు అభ్యంతరం చెప్పవచ్చు’’ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చాడు.
‘‘అసలు ఎస్టిమేషన్ వేశారా? ఎన్ని గుంతలు ఉన్నాయి.. ఎంత డబ్బు అవసరం అవుతుంది? తెలుసుకోవాలిగా.. ఊరికే చందాలు అంటే ఎవరిస్తారు.. గణేష్ చతుర్దికే నాలుగు సార్లు తిప్పు కుంటారు.. ఒక పద్ధతి ఉండాలిగా… ఎవరు నమ్ముతారు..’’ ఒక పెద్దమనిషి చాలా పద్ధతిగా చెప్పాడు.
‘‘మీటింగ్ అయిన తరువాత వెళ్లి చూసి ఒక కమిటీ వేద్దామని అనుకున్నాము.. ఇప్పుడే వెళదాం పదండి… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు కూడా తెలుస్తుంది.. పదండి.. చూసి వచ్చాక మాట్లాడుకుందాం..’’ అధ్యక్షుడు అందర్ని ‘‘పదండి’’ అంటూ లేపాడు…
అందరూ కలిసి ఒక దండులా కదిలారు.
కాలనీ అసోసియేషన్ వాళ్లు కలిసి వస్తున్నారంటే.. కాలనీ వాసులు భయపడతారు… మళ్లీ ఏం చెప్పి డబ్బులు అడుగుతారో… చాలామంది తలుపులు కూడా వేసుకుంటారు. చూస్తే వాళ్లతో కలిసి వెళ్లవలసి వస్తుందని.. చాలామంది సభ్యులు మీటింగులంటే తప్పించుకుంటారు. కొందరు మాత్రమే ‘సంఘం’లో బాధ్యతతో వ్యవహరిస్తారు.
కాలనీ ప్రవేశం దగ్గర ఉన్న ‘వెల్‌కం టూ గాంధీనగర్’ బోర్డు దగ్గరకి చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఒక వృద్దుడు, ఒక పిల్లవాడు కలిసి అక్కడ ఉన్న గుంతలను పూడుస్తున్నారు. వాటిపైన మట్టి కప్పుతున్నారు. అది చూసిన అధ్యక్షుడు.. ‘‘ఎవర తను? ఎప్పుడూ చూడలేదు’’ అని కార్యదర్శిని మెల్లగా అడిగాడు. ‘‘రోడ్డు నెంబర్ 5లో కొత్తగా వచ్చాడు. రిటైర్డ్ టీచరట’’ కార్యదర్శి చెప్పాడు.
‘‘నమస్కారం సార్! మీరు ఒక్కరే చేస్తున్నారు. మమ్మల్ని పిలిస్తే వచ్చేవాళ్లం కదా!’’ మాజీ అధ్యక్షుడు ముందే అవకాశాన్ని అందుకున్నాడు. తమ గ్రూప్‌లో కలిపేసుకోవచ్చునని.
‘‘అందరికీ నమస్కారం.. చిన్న పనే కదా సార్! నిన్న సాయంత్రం చూసాను. రోడ్డు పక్కన కొన్ని రాళ్లు కూడా ఉన్నాయి.. ఇందులో వేసి మట్టి నింపాను. కొన్నిరోజుల వరకు ఉంటుంది. ఎవరూ పడి దెబ్బలు తగుల్చకోకుండా ఉంటారని, చిన్న ప్రయత్నం అంతే!’’ సంస్కారం నిండిన గొంతుతో చెప్పారు రిటైర్డ్ టీచర్.
‘‘పెద్దలు, మీకు ఇబ్బంది ఎందుకు సార్? మేమున్నాం కదా! దీని గురించే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. మున్సిపాలిటీ వాళ్లక్కూడా ఫిర్యాదు ఇచ్చాను’’ అధ్యక్షుల వారు తన ‘గుంత’ పూడ్చుకుంటున్నారు.
‘‘ఫరవాలేదు సార్! నేను ఖాళీయే కదా.. ఏదో..’’ ఆ పెద్దాయన మాట తీరు, సంస్కారం అందర్ని ఇబ్బంది పెడుతోంది. ‘‘చిన్నబాబుకు కష్టం కదా సార్!’’ కార్యదర్శి కూడా వంత పాడడం మొదలు పెట్టాడు.
‘‘మా మనుమడు ఆన్‌లైన్ క్లాసులు అని దినమంతా మొబైల్ పట్టుకునే ఉంటాడు. కొద్దిగా బద్దకం పోవాలని ఇలా తీసుకువచ్చాను.’’
‘‘అసోసియేషన్ బద్ధకాన్ని గుర్తుచేశారు, మీరు గొప్పవారు సార్!’’ మాజీ అధ్యక్షుడు చురక అంటించాడు.
‘‘అయ్యో, నా ఉద్దేశం అదికాదు. పిల్లలకు పనుల గురించి కాస్త చెప్పాలనే. అన్నీ పుస్తకాలు చెప్పవు కదా! రేపటి రోజున తను ఓ చోట ఇల్లు తీసుకుం టాడు కదా! అప్పుడు ఈ అనుభవం పనికి వస్తుంది. అన్ని సమస్యలు పైవారే తీర్చరు కదా! మనమూ కొన్ని పనులు చేసుకోవాలి’’ పంతులు క్లాస్ సమ్మగా అంటుకుంది అందరికి.
‘‘మొత్తానికి గుంతలు మీరే పూడ్చి, ఇంటింటికీ తిరిగే పని అధ్యక్షుల వారికి తప్పించారు.’’ మాజీ ఉపాధ్యక్షులు వదలడం లేదు.
‘‘అంత పెద్ద మాటలెందుకు సార్! అందరూ ఉద్యోగాలు చేసుకొనే వారే కదా! ఎన్నో పనులు ఉంటాయి. మీరు చేసేవి మీరూ చేస్తారు.’’ ఎవ్వరినీ బాధపెట్టడం మాస్టారుకు ఇష్టంలేదు. మాస్టారు ఎంత సౌమ్యంగా చెప్పినా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల మధ్య వాగ్యుద్ధం ఆగడం లేదు.
కాలనీలో మెంబర్స్ వెల్‌ఫేర్ కంటే ఈ మాటల యుద్ధమే తీవ్రంగా ఉంది.
దేవుడా! కాలనీ గుంతలు మాస్టారు పూడ్చాడు.. మరి, మనుషుల మనసులలోని గుంతలు ఎప్పుడు పూడుస్తావో…?