పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ముస్లిం దురాక్రమణదారులు కూల్చేసిన విశ్వేశ్వరాలయం మీద నిర్మించిన మసీదు ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని దాఖలైన వ్యాజ్యంలో భాగంగా సర్వే చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తే, మసీదు కమిటీ ఈ సర్వేను అడ్డుకుంటోంది. మరోవైపు మసీదు పశ్చిమ గోడ వెలుపల శృంగార గౌరీమాత విగ్రహానికి నిత్యపూజలకు అనుమతించాలని హిందువులు కోరుతున్నారు.

జ్ఞాన్‌వాపి సంస్కృత పదం. అర్థం జ్ఞానపు బావి. మరి ఈ పేరుతో మసీదు ఏమిటి? పైగా ఆ మసీదు గోడల మీద హిందూ ఆలయ ఆనవాళ్లు కనిస్తాయి. ఔరంగజేబు కాలంలో విశ్వనాథుని ఆలయాన్ని కూల్చేసినప్పుడు అర్చకులు అసలు జ్యోతిర్లింగాన్ని ఇక్కడి జ్ఞానపుబావిలో దాచారని చరిత్ర చెబుతోంది. ఈ వివాదం మీదే ఇప్పుడు దేశ ప్రజల దృష్టి నిమగ్నమైంది. వాస్తవానికి ఈ సమస్య కొత్తదేమీ కాదు. హిందువులు పరమ పవిత్రంగా భావించే గొప్ప ఆధ్మాత్మిక క్షేత్రానికి జరిగిన అవమానాన్ని సరిదిద్దాలని శతాబ్దాలుగా పోరాటాం సాగుతూనే ఉంది. 1669లో దురాక్రమణ దారుడైన మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్‌ ‌కాశీ విశ్వనాథుని అసలు ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టించాడు. దీన్నే జ్ఞాన్‌వాపి మసీదు అంటున్నారు. దీన్ని తమకు తిరిగి అప్పగించాలని శతాబ్దాలుగా హిందువులు కోరుతూనే ఉన్నారు.

సర్వేకు ఆదేశాలతో కదలిక

ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలంలోని పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి వారణాసి జిల్లా కోర్టులో 1991లో అసలు దావా దాఖలైంది. ఈ మసీదు ప్రాంగణమంతా ఆలయానికే చెందు తుందని న్యాయవాది విజయ్‌ ‌శంకర్‌ ‌రస్తోగి వారణాసి కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రెండు వేల ఏళ్లుగా అక్కడ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని, ఔరంగజేబ్‌ ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదుగా మార్చారని, వివాదాస్పద మసీదు వక్ఫ్ ఆస్తి కాదని వాదించారు. 2011 ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ప్రస్తుతం కాశీ విశ్వనాథ్‌ ఆలయంతో పాటు జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు అయ్యే ఖర్చును భరించాలని ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీతో ఈ సర్వే చేయించాలని కోర్టు సూచించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్‌ ఇం‌తేజామియా మసీదు కమిటీ (జ్ఞాన్‌వాపి) దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ ‌హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 21‌న తోసిపుచ్చింది.

ఈ విషయంపై 2021, ఆగస్టులో ఐదుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో మా శృంగార గౌరీ, వినాయక, హనుమాన్‌ ‌దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించాలని వీరు కోరారు.ఆ దేవాలయాల్లోని విగ్రహాలను జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ ధ్వంసం చేయకుండా ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం పరిరక్షించేలా ఆదేశాలు జారీచేయాలని ఆ ఐదుగురు మహిళలూ పిటిషన్‌లో కోరారు. వివాదాస్పద స్థలంలో సర్వేకు కోర్టు అనుమతి ఇవ్వడంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సర్వేకు అడ్డంకులు

కోర్టు ఆదేశాలతో సర్వే నిర్వహించడానికి వచ్చిన కోర్టు కమిషనర్‌ అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్ర బృందాన్ని ముస్లింలు అడ్డుకున్నారు. రెండు గంటలపాటు వేచి ఉన్నప్పటికీ వారు సర్వేను, వీడియో చిత్రీకరణను చేపట్టలేకపోయారు. లోపలికి వెళ్లకుండా మసీదులో ఉన్న ముస్లింలు అడ్డుకున్నారని, అందువల్ల కోర్టు ఆదేశించిన విధంగా సర్వే, వీడియో చిత్రీకరణ పూర్తి చేయలేకపోయామని హిందువుల తరఫు న్యాయవాది విష్ణు జైన్‌ ‌తెలిపారు. జిల్లా అధికారులు సహకరించ లేదని ఆరోపించారు. వరుసగా రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది.

హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశి. గంగానది ఒడ్డున ఉన్న ఈ నగరానికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. సాక్షాత్తు పరమశివుడే ఈ మహానగరాన్ని నిర్మించాడని భక్తుల విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన విశాలక్షి మందిరం ఇక్కడే ఉన్నాయి. చరిత్రకు అందిన వివరాల ప్రకారం 5,000 సంవత్సరాల ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన నగరమిది. వ్యాసుడు, ఆదిశంకరుడు, గౌతమ బుద్ధుడు, తులసీదాసు, కబీర్‌దాసు నడయాడిన పవిత్ర ధామం కాశి. ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం వారణాసి. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌తో ఈ పవిత్ర క్షేత్రానికి భక్తుల రాక మరింతగా పెరిగింది. అయోధ్యలో రామజన్మభూమితో పాటు కాశి, మధురల విముక్తి కోసం విశ్వహిందూ పరిషత్‌ ‌పోరాడుతూ వచ్చింది. సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా ఆయోధ్యను హిందువులకు అప్పగించడంతో భవ్య రామ మందిర నిర్మాణం సాకారమవుతోంది. అయోధ్య తరహాలో కాశీలోని జ్ఞాన్‌వాపి సమస్యకు కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది వీహెచ్‌పీ. రామ మందిరం తర్వాత జ్ఞాన్‌వాపి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తు న్నామని ఆ సంస్థ జాతీయ అధికార ప్రతినిధి విజయ్‌ ‌శంకర్‌ ‌తివారీ తెలిపారు. ‘జ్ఞాన్‌వాపి’ అనే పేరు సనాతన సంప్రదాయాన్ని సూచిస్తుందని, వివాదాస్పద కట్టడం గోడలపై హిందూ చిహ్నాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. నిజానికి జ్ఞాన్‌వాపి మసీదులో ఏం ఉన్నదో చిదంబర రహస్యం.

విముక్తి కోసం పోరాటం

వేలాది సంత్సరాలుగా పూజలు అందు కుంటున్న కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణం పక్కనే జ్ఞాన్‌వాపి మసీదు ఉంది. అసలు ఆలయం అదేనని చరిత్ర చెబుతోంది. విదేశీ దురాక్రమణ దారులు శతాబ్దాలుగా కాశీక్షేత్రం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. హిందువులు ఎప్పటికప్పుడూ రక్షించుకుంటూ వచ్చారు.

1194లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఆదేశంతో కాశీ విశ్వనాథుని ఆలయంతో పాటు నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేశాడు. 1211లో విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించినా ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఫిరోజ్‌ ‌షా తుగ్లక్‌ ‌కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలను కూల్చేశారు. హుస్సేన్‌ ‌షా షార్కి (1447-1458), సికిందర్‌ ‌లోడి  (1489-1517) పాలనలో మిగిలిన హిందూ ఆలయాలను పడగొట్టారు. అక్బర్‌ ‌పాలన కాలం 1585లో రాజా తోడర్‌మల్‌ ఆలయాన్ని తిరిగి నిర్మించాడు.

ప్రస్తుత వివాదానికి ఔరంగజేబ్‌ ‌పాలనలో అంకురార్పణ జరిగింది. 1669లో ఔరంగజేబ్‌ ‌కాశిలోని అసలై విశ్వనాథ ఆలయాన్ని పడగొట్టించి, ఆ శిథిలాల మీద మసీదు నిర్మించాడు. ప్రస్తుత మసీదు గోడలను గమనిస్తే ఇది హిందూ ఆలయం అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలయంలోనే జ్ఞాన్‌వాపి (జ్ఞానపుబావి) పేరుతో పిలిచే చిన్న బావి ఉంది. విశ్వనాథ క్షేత్రం మీద దాడి జరిగినప్పుడు ఇక్కడి ప్రధాన పూజారి దురాక్రమదారుల బారిన పడకుండా రక్షించేందుకు జ్యోతిర్లింగాన్ని ఈ బావిలో పడేశారని అంటారు.

ఆయన కూడా జ్ఞాన్‌వాపిలో దూకేశారు. మరాఠా పాలకుడు మల్హర్‌రావు హోల్కర్‌ (1693-1766) ‌మసీదును కూల్చివేసి ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే 1780లో అహల్యాబాయి హోల్కర్‌ ‌మసీదు ప్రక్కనే ఉన్న ప్రస్తుత కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని నిర్మించారు. 1833-1840లో జ్ఞాన్‌వాపి సరిహద్దు, ఘాట్లు, ఇతర దేవాలయాలను నిర్మించారు. జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించిన తరువాత కూడా, పూర్వపు ఆలయ అవశేషాలు పునాది, స్తంభాలను స్పష్టంగా చూడవచ్చు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE