గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
‘మాతా భూమిః పుత్రోహం పృథ్వివ్యాః’
తల్లి భూమి, నేను ఆమె పుత్రుడను అంటుంది ఆర్ష వాఙ్మయం. అంటే భూమి పట్ల భారతీయులకు ఉన్న దృష్టి అది. ఆ తాత్త్వికత ఎంత సనాతనమో, అంత ఆధునికం. ఎంత అవసరమో, అంత వాస్తవికం.
నేల తల్లి, కేవలం ఒక వనరు కాదు, తరతరాల ఆస్తి అని భావిస్తున్నది పాశ్చాత్య చింతన. పుడమిని రక్షించుకోవాలి. ఇదొక అమృతోపమానమైన భావన. నేడు భూగోళమే ప్రమాదంలో పడింది. నేల కూడా తల్లే. కాపాడుకోవాలి. రేపటి తరం కోసం అలాంటి స్పృహ, చైతన్యం తేవాలి. ఇలాంటి నిర్మాణాత్మకమైన ప్రయత్నం గతంలోనూ జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ఆకాంక్ష కోట్ల హృదయాలలో ఉంది. ప్రపంచ ప్రజాళి ఆశయం అని చెప్పినా చెప్పవచ్చు. అందుకు ఇటీవల కాలంలో భూమికి జరుగుతున్న చేటు కారణం. ఆ సంగతి దేశదేశాల అధినేతలకు తెలియచేసే ఉద్దేశంతో ఆరంభించినదే ‘సేవ్ ది సాయిల్’ అంతర్జాతీయ ఉద్యమం. కాన్షస్ ప్లానెట్ మూవ్‌మెంట్ టు సేవ్ సాయిల్‌గా ఈ ఉద్యమం విశ్వవ్యాప్తమవుతున్నది. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. నేల తల్లిని రక్షించుకోవడానికి, నేలనూ, ప్రకృతినీ పునరుత్తేజం చేయడానికి అన్ని దేశాల ప్రజలు పటిష్టమైన చట్టాలు రావాలని కోరుతున్న సంగతిని దేశాధినేతల దృష్టికి తీసుకురావడమే ఈ ఉద్యమం అసలు ఉద్దేశం.
పుడమిని రక్షించుకుందామన్న నినాదం వెనుక మహోన్నతమైన తాత్త్వికత ఉన్నది. భారతీయమైన ఆధ్యాత్మిక చింతన కలిగినవారు కాబట్టి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇంత ఉగ్రంగా స్పందించగలిగారన్నా అతిశయోక్తి కాదు. ప్రకృతిని తల్లిగా భావించి, పూజిస్తూ అది ఇచ్చే ఫలాలను ప్రసాదంగా స్వీకరించ మంటుంది మన ధర్మం. నీరు, భూమి, గాలి, అగ్ని, ఆకాశం- వీటిని పంచభూతాలుగా చెబుతుంది భారతీయత. ఇవి సహకరించకపోతే మానవుడు ఎంత ప్రయత్నం చేసినా అది విఫలమే. అలాగే అవి ఆగ్రహిస్తే ఎంత ఆధునికునికైనా ఎదురయ్యేది వినాశనమే. కాబట్టి పంచభూతాలకే కాదు, మనిషికి మూలాధారమూ పుడమేనని అంటారు సద్గురు. పుడమి సకల ప్రాణికోటికి ఆధారమే. కానీ దాని రక్షణలో పెద్ద బాధ్యత మాత్రం మానవాళిదే. ఎందుకంటే దానిని నాశనం చేస్తున్నది మనిషి మాత్రమే. పశుపక్ష్యాదులు కాదు.
ఆధ్యాత్మిక కోణం
నీ శరీరాన్ని ప్రాణంతో నిలిపి ఉంచేందుకు నీవు తీసుకునే ప్రతి ముద్ద, నీటిచుక్క భూమి అందించేదే. భూమి అవసరం అక్కడివరకే అనుకుంటే అదొక ద్రోహం. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుభూతులకు వేదిక కూడా ఈ భూమే. భూమి అంటే భౌతికావసరాలు తీర్చే ఒక గ్రహం అన్న భావన నుంచి బయటపడి, తల్లి అనే కోణం నుంచి ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృష్టితో పరికిస్తేనే మట్టి విలువ మనసును తాకుతుంది. మట్టి వాసన గుండెను ఊయలలు ఊపుతుంది. ప్రయోగశాలల్లో గాలి, నీరు, అగ్ని కొంచెమైనా సృష్టించవచ్చునేమో కానీ, పిడికెడు మట్టిని కూడా తేలేరు. భారతీయ సంస్కృతి అందుకే పుడమిని అంతగా ప్రేమించాలని చెప్పింది. కానీ ఇవాళ మట్టి అన్న పదాన్ని బురద అన్న అర్ధంలో కొందరు ప్రయోగించడం వింటున్నాం. మట్టిని చేతిలోకి తీసుకున్న పసివాళ్లను చూసి తల్లులు ‘ఛీ..ఛీ..మట్టి’ అంటున్నారు. వాళ్లు తాకినది బురదని కాదు, వాళ్లకు జన్మనిచ్చిన ఒక మూలకాన్ని. నీకు జన్మనిచ్చిన మట్టిని బురదగా చూడడం అంటే నీ వేళ్లు దాని నుంచి దూరమైనట్టే.
ఆధ్యాతిక కోణం నుంచి ఒక నిమిషం బయటకొచ్చి యోచించినా.. భూసంరక్షణ అంటే ఆహార భద్రత ఆలోచనకు కూడా రక్షణే అని అంటున్నారు జగ్గీ వాసుదేవ్. దీనిని నిరాకరించ గలమా? అభివృద్ధి పేరుతో భూసారాన్ని ధ్వంసం చేయడమంటే రేపటిరోజున జన్మించే వారి ఆహారం కూడా మనమే తింటూ వారికి లేకుండా చేస్తున్నామని చెబుతున్నారు సద్గురు. భూమి పట్ల ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటే భావి తరాలకు తిండిగింజలకు కరవు వస్తుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నదీ ఇదే కదా! అందుకే సద్గురు ఆరంభించిన నేలతల్లి రక్షణ ఉద్యమానికి విశేష ఆదరణ లభిస్తున్నది. సాధారణంగా ఆధ్యాత్మికవేత్తలు మత పరమైన అంశాల గురించి ప్రబోధనలు చేస్తుంటారు. అంతిమంగా మానవాళి శ్రేయస్సు గురించి చెబుతుంటారు. కానీ జగ్గీ వాసుదేవ్ ఇందుకు భిన్నం. మతపరమైన విషయాల గురించి బోధనలు చేస్తూనే పర్యావరణం గురించి ఆయన తపన పడుతుంటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడితే పరోక్షంగా మాధవసేవ చేయడమేనన్నది జగ్గీ వాసుదేవ్ భావన. ప్రకృతిని విస్మరిస్తే పరిణామలు తీవ్రంగా ఉంటాయన్నది ఆయన చేస్తున్న హెచ్చరిక. ఈ దిశగా తనవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు ఎవరూ భాగస్వామ్యం కావద్దని, ఎవరికి వారు దైనందిన పనులు చేసుకుంటూనే తనకు భరోసా కల్పించాలని, తన ఆశయానికి మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఆయన సదుద్దేశాన్ని గుర్తించిన వివిధ దేశాల పాలకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల మేధావులు వాసుదేవ్‌కు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
నిస్సారమవుతున్న నేల
సమస్త మానవాళికి ఆహారాన్ని అందించే ఏకైక వనరు నేల. ఇంతటి కీలకమైన సహజ వనరు నిస్సారమవుతోంది. ప్రజలు దాని ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్నారు. పట్టణ, నగర• ప్రాంతాల ప్రజలు అదేదో తమకు సంబంధమైన కార్యక్రమం కాదని భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 52 శాతం భూమి నిస్సారమైందని అంచనా. ఇది మానవాళికి కచ్చితంగా ప్రమాదకర సంకేతం. ఈ అంశం మీద వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పులు, భూనిర్వహణ పద్ధతుల్లో లోపాల వల్ల మున్ముందు ఆహార కొరత ఏర్పడనుంది. తాగునీటి కొరత ఏర్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా వలసలు మొదలు కానున్నాయి. 2030 నాటికి 700 మిలియన్ల మంది ప్రజలు కరవును ఎదుర్కోవలసి వస్తుంది. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం, అడవుల నిర్మూలన, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామిక కాలుష్యం, నిలకడ లేని వ్యవసాయ పద్ధతుల కారణంగా సగం నేల క్షీణించింది. సేంద్రియ ఎరువుల వాడకం, సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. దీనివల్ల వ్యవ సాయంపై పెడుతున్న ఖర్చును తగ్గించవచ్చు. సేంద్రియ ఉత్పత్తుల వాడకం ప్రజల ఆరోగ్యానికి మేలు. కోటి మైళ్ల ప్రస్థానమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఆ సత్యాన్ని గ్రహించిన జగ్గీ వాసుదేవ్ నేల, దాని ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నేలతల్లి రక్షణలో ఈ తరం బాధ్యతను గుర్తు చేయడానికి యాత్రను తలపెట్టారు.
యాత్రకు శ్రీకారం
మార్చి 21, 2022న సద్గురు సేవ్ ది సాయిల్ యాత్ర లండన్‌లో ప్రారంభమైంది. వెంటనే ప్రపంచమంతటా ఒక ఆసక్తి నెలకొన్నది. అనతి కాలంలోనే ప్రపంచంలోని అన్ని రకాల సమాజాల నుంచి మద్దతు వచ్చింది.3.5 బిలియన్ ప్రజల మద్దతు కోసం సద్గురు 24 దేశాలలో, 30,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం లండన్‌లో మొదలవుతుంది. కావేరి దగ్గర పూర్తవుతుంది. అక్కడే కావేరి కాలింగ్ ప్రాజెక్ట్ పని జరుగుతున్నది. కావేరీ జలాల శుద్ధి కూడా ఇందులో భాగం. ఇంతవరకు ఏడు కరిబియన్ దేశాలు, అజర్‌బైజాన్, రుమేనియా సేవ్ ది సాయిల్‌కు మద్దతు ఇస్తూ, అందుకు అవసరమైన చర్యలు చేపడతామని అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఇటలీ, బల్గేరియా, స్లోవాకియా, చెక్ రిపబ్లిక్, ది వాటికన్ దేశాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 74వ సభ్య దేశంగా నమోదైంది. మే 18వ తేదీన జగ్గీ వాసుదేవ్ అబుదాబి వెళ్లారు. ఆ దేశ పర్యావరణ మంత్రి మరియం మెహిరితో కలసి ఒక మొక్కను నాటారు. లండన్, బర్బింగ్ హోమ్, హేగ్, ఆమ్‌స్టర్‌డ్యామ్, బెర్లిన్, ప్రాగ్, వియన్నా, రోమ్, జెనీవా, పారిస్, ఇస్తాంబుల్, బాకు, అమ్మాన్, బ్రస్సెల్స్, బుడాపెస్ట్, బెలగ్రేడ్, సోఫియా, టెల్ అవీవ్, రియాద్, ఫ్రాంక్ ఫర్డ్ తదితర నగరాలను సందర్శిం చారు. అక్కడి పాలకులను కలిసి నేల సంరక్షణపై చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు, క్రీడాకారులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ఈ అంశం గురించి ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు.
రాజకీయ కోణం
ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో భాగస్వాములైతే పర్యావరణ అంశాలు కూడా ఎన్నికల అంశాలుగా అవతరిస్తాయి. అప్పుడే ప్రభుత్వాలు భూరక్షణ, పర్యావరణ రక్షణ వంటి వాటికి నిధులు కేటాయించి, పథకాలు రూపొంది స్తాయి. 1994లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ (నేలంతా ఎడారిగా మారకుండా పోరాడే సంస్థ) సద్గురు ఉద్యమంలో భాగస్వామిగా ఉంది. దుబాయ్‌లో మే 19న మాట్లాడిన జగ్గీ వాసుదేవ్ 60 శాతం ప్రజలు ఈ అంశాల మీద గొంతెత్తితే అది ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి అవుతుందని, అప్పుడు చట్టాలు చేయక తప్పదని అన్నారు. ఆయన కార్యక్రమం ఇప్పటికే కోట్లాది మంది ప్రపంచ పౌరుల హృదయాలను తాకింది. ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని భూరక్షణ పోరాట సమితితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు సాయం చేయడానికి కోటి పది లక్షల మంది స్వచ్ఛంద సేవకులు, 300 కేంద్రాలు ఉన్నాయి.
కావేరీ కాలింగ్
మే నెలాఖరు నాటికి యాత్ర భారత్‌లోకి ప్రవేశిస్తుంది. ముందుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరానికి చేరుకుంటుంది. అప్పటినుంచి 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాల్లో పర్య టిస్తారు. తమిళనాడులోని కన్యాకుమారికి జూన్ 21న చేరుకోవడం ద్వారా ఈ సుదీర్ఘ యాత్ర ముగియ నుంది. ఈ సందర్భంగా కావేరీ కాలింగ్ ప్రాజెక్టు పేరుతో సుమారు 1.25 లక్షల మంది రైతులు 62 మిలియన్ల మొక్కలను నాటనున్నారు. కావేరీ నది పునరుద్ధరణకు, కావేరీ బేసిన్‌ను సారవంతంగా తీర్చిదిద్దేందుకు ‘సేవ్ ది సాయిల్’ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టనున్నారు. తన యాత్రలో భాగంగా 3.5 బిలియన్ల మంది ప్రజలకు చేరువ కావాలన్నది జగ్గీ లక్ష్యం. నిత్యం ప్రజల కోసం పరితపించే వాసుదేవ్ తన వయసును కూడా పక్కనపెట్టి ఉద్యమం చేపట్టడం విశేషం. తనకు ప్రత్యేకంగా విశ్రాంతి అవసరం లేదని, ప్రజల కోసం పని చేయడంలోనే తనకు విశ్రాంతి దొరుకుతుందని వాసుదేవ్ వివిధ సందర్భాల్లో చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. తన యాత్రలో పాల్గొనా లంటూ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. కేవలం తనొక్కరే ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో వివిధ దేశాల పాలకులు, ప్రజలు, ఆయా రంగాల మేధావులతో సమావేశమవుతున్నారు. తన లక్ష్యాన్ని, ఆశయాన్ని సవివరంగా వివరిస్తున్నారు. వారి మద్దతును కూడగడుతున్నారు. నేల నిస్సారాన్ని అరికట్టేందుకు, దానికి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు పెద్ద పెద్ద త్యాగాలు ఏమీ చేయనక్కర్లేదని, ఎవరివంతు వారు ప్రయత్నాలు వారు చేస్తే చాలని ఆయన సూచిస్తున్నారు. నేల నిస్సారమవడానికి ప్రత్యేకంగా ఎవరినీ నిందించనక్కర్లేదని, ఇది ఒకరినొకరు విమర్శించుకునేందుకు, లోపాలను ఎత్తిచూపేందుకు సమయం కాదని, అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని జగ్గీ వాసుదేవ్ చెబుతున్నారు.
——————
పర్యావరణ పరిరక్షణ పౌరులందరి బాధ్యత
పర్యావరణం.. ప్రస్తుతం ఇది ఒక ప్రాంత సమస్యో, ఒక దేశ సమస్యో కాదు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనకబడిన అనే తేడా లేకుండా అన్ని దేశాలూ ఈ సమస్యను ఎలా అరికట్టాలో తెలియక సతమతమవు తున్నాయి. ఏటా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా, ఘనంగా తీర్మానాలు చేస్తున్నా, అధినేతలు బాసలు చేస్తున్నా పరిష్కార దిశగా మాత్రం నిర్దిష్టంగా అడుగు ముందుకు పడటం లేదు. పర్యావరణ పరిరక్షణలో వైఫల్యం వల్ల ఎదురవుతున్న అనర్థాలు కళ్లెదుట ప్రత్యక్షంగా కనపడుతున్నా అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేయడానికి, ఆవేదన చెంద డానికి మాత్రమే పరిమితమవుతోంది. అంతేతప్ప కచ్చితమైన, నిర్దిష్టమైన కసరత్తు జరగడం లేదు. ఈ నేపథ్యంలో జూన్ 5న మరోసారి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణ సదస్సుకు ఈసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఐరోపా దేశం స్వీడన్ ముందుకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశం అయినప్పటికీ దీనికి సంబం ధించి ఏటా ఏదో ఒక అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడం, దానికి సంబంధించి లోతుగా చర్చించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ అన్న నినాదాన్ని ఎంచుకున్నారు. పర్యావరణం అన్నది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన విషయం ఏమీ కాదు. దశాబ్దాల క్రితం నుంచే దీని ప్రాధాన్యం, ప్రభావం, కలిగే అనర్థాలపై అంతర్జాతీయ సమాజం అధ్య యనం చేస్తోంది. ఏటా ఏదో ఒక దేశం సదస్సుకు ఆతిథ్యం ఇస్తూ ముందుకు వెళుతున్నాయి. యూఎన్‌ఈపీ (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ పోగ్రామ్) కింద 1972 నుంచి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తొలి సదస్సుకు స్టాక్ హోమ్ వేదికైంది. జూన్ 5న జరగనున్న సదస్సు 50వది కావడం విశేషం. 2008, 2011ల్లో ఈ సదస్సులకు భారత్ ఆతిథ్యమిచ్చింది. 2019లో చైనా ఆతిథ్యమిచ్చింది.
అభివృద్ధి చెందిన, ప్రగతికాముక దేశాలమని చంకలు గుద్దుకునే దేశాలు తొలి రోజుల్లో పర్యావరణ ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. వాటి చూపంతా వస్తూత్పత్తి, తద్వారా వచ్చే లాభాలపైనే ఉండేది. అదే సమయంలో శ్రుతి మించిన పారిశ్రామికీకరణ వల్ల కలిగే అనర్థాలపై అవి ఏనాడూ ఆలోచించలేదు. పారిశ్రామికీకరణను ఎవరూ వద్దనరు. కానీ దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఆలోచించకపోవడం వల్ల సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పాపాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, వెనకబడిన దేశాలపై మోపి చేతులు దులిపేసు కుంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు. ఈ ద్వంద్వ వైఖరిని అనేక అంతర్జాతీయ సదస్సుల్లో భారత్ ఎండగట్టింది. తనవంతుగా చర్యలు చేపట్టింది. వాస్తవానికి వస్తే పర్యావరణ ప్రాధాన్యాన్ని భారత్ ఏనాడో గుర్తించింది. ఆ దిశగా చర్యలు కూడా చేపడు తోంది. రాజ్యాంగంలోని 51-ఏ(జి) అధికరణం పర్యావరణం గురించి ప్రస్తావిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా కృషి చేయడం ప్రతి పౌరుడి బాధ్యతని ఈ అధికరణం తెలుపుతోంది. కేవలం రాజ్యాంగంలో రాసుకోవడమే కాకుండా ఆ మేరకు చట్టాలు చేయడం, చర్యలు చేపట్టడం, వాటి అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం చేస్తోంది. మోదీ ప్రభుత్వం ఈ దిశగా మరింత వేగంగా ముందుకు సాగుతోంది.
పర్యావరణ పరిరక్షణలో వైఫల్యం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. నానాటికీ తీవ్రమవుతున్న వాయు, జల కాలుష్యం, మితిమీరిన శిలాజ ఇంధన వాడకం, ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత, మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం, తగ్గుతున్న అటవీ విస్తీర్ణం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. ఎండలు అధికమవుతున్నాయి. నీటి వనరులు నిండు కుంటున్నాయి. అవి నానాటికీ క్షీణిస్తున్నాయి. తగిన మేరకు వర్షపాతం కురవడం లేదు. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నీరు ఆమ్లత్వాన్ని సంత రించుకుంటోంది. జలచరాలకు ముప్పు ఏర్పడు తోంది. జీవవైవిధ్యానికి హాని కలుగుతోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని పరిమితం చేయడం, తక్కువ మైక్రాన్లు గల ప్లాస్టిక్ వాడకం, వ్యర్థ పదార్థాల రీ సైక్లింగ్, మొక్కల పెంపకం, శిలాజ ఇంధనం బదులు విద్యుత్ వాహనాల వాడకం వల్ల పర్యావరణాన్ని కాపాడుకో గలం. కానీ ఆ దిశగా నిర్దుష్ట కార్యాచరణ కొరవడటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడు సంవత్సరాల (2015- 2021) కాలంలో అంతర్జాతీయంగా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యా యని సంస్థ స్టేట్ ఆఫ్ క్లైమెట్ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది అంతర్జాతీయ సగటు ఉష్టోగ్రతలు పారిశ్రామిక యుగానికి ముందు (1850-1900) ఉష్టోగ్రతలతో పోలిస్తే అధికంగా నమోదైనట్లు హెచ్చరించింది. పర్యావరణ విధ్వం సాన్ని అడ్డుకోవడంలో మానవ వైఫల్యమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా శిలాజ ఇంధన వాడకంవల్ల కలిగే కాలుష్యానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. ఈ పరిస్థితిని నివారించేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదక ఇంధనాల వాడకం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సూచించారు. 2021లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన అతి తీవ్ర ఉష్టోగ్రతలు, తుపాన్లు, వరదల వల్ల వాటిల్లిన నష్టం రమారమి 7.71 లక్షల కోట్లని అంతర్జాతీయ వాతావరణ సంస్థ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉందని స్పస్టం చేసింది. పర్యావరణ పరిరక్షణలో వైఫల్యం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి పెరుగు తోంది. దీనివల్ల భూమి మరింత వేడెక్కుతోంది. రాత్రి పూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. దీనివల్ల భూతాపాలు పెరిగి హిమనీ నదాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా తీరప్రాంతాలు, సమీప లోతట్టు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. ఇది అనేక ఉపద్రవాలకు దారితీస్తుంది. 2013-21 మధ్య కాలంలో సగటున ఏటా 4.5 మిల్లీ మీటర్ల మేర సముద్ర మట్టాలు పెరిగాయి. గతంలో పోలిస్తే ఇది అత్యధికం. ఇదే పరిస్థితి కొనసాగితే తీరప్రాంతానికి మరింత తుపాను ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక సముద్ర జలాల ఆమ్లీకరణ విషయానికి వస్తే గాలిలో కర్బన ఉద్గారాల స్థాయి ఎంత పెరిగితే సముద్ర జలాలు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోవడం అంతగా పెరుగుతుంది. అనంతరం జరిగే రసాయన చర్యల కారణంగా సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది సముద్ర జీవరాసులపై ప్రభావం చూపుతుంది. సముద్ర జలాల ఉష్టోగ్రతలు పెరగడం వల్ల తీరప్రాంత ప్రజలతో పాటు సముద్ర జీవాలపైనా, జీవ వైవిధ్యంపైనా, ఆహార భద్రతపైనా పెను ప్రభావం పడుతుంది. వచ్చే పదేళ్లలో ప్రపంచ సగటు వార్షిక ఉష్టోగ్రతలు పారిశ్రామిక యుగంతో పోలిస్తే 1.5 డిగ్రీల మేరకు పెరిగే ప్రమాదం 50 శాతం ఉంది. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తన నివేదికలో స్పష్టంగా హెచ్చరించింది. ఈ నివేదికను విస్మరించి నట్లయితే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుంది. ఈ దిశగా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం స్వీడన్‌లో జరగనున్న సదస్సుపై ఉంది.
——————
మీడియా బాసట
వాసుదేవ్ యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 18 దేశాలకు చెందిన 250కిపైగా మీడియా సంస్థలు పని చేస్తుండటం విశేషం. మార్చి 21న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకు రెండు నెలలకు పైగా పూర్తయింది. యూరప్ ఖండంతో పాటు అనేక మధ్య ఆసియా దేశాలను వాసుదేవ్ సందర్శించడం విశేషం. అదే సమయంలో రెండు బిలయన్లకు పైగా ప్రజల మనసులను యాత్ర తాకిందని అంచనా. ఈ సందర్భంగా 72 దేశాలు జగ్గీ వాసుదేవ్ సూచనలపై చర్యలు తీసుకునేందుకు, ఆ మేరకు చట్టాలు చేసేందుకు ముందుకు రావడం కీలక పరిణామం.ఈ కార్యక్రమం విజయవంతమవుతుందనడానికి ఇంతకు మించిన మరో నిదర్శనం అక్కరలేదు. యాత్రలో భాగంగా జోర్డాన్ రాజధాని అమ్మాన్ నగరం చేరుకున్నప్పుడు వాసుదేవ్‌కు ఘన స్వాగతం లభించింది. ‘ఈద్’ పండగ హడావిడిలో ఉన్నప్పటికీ ప్రజలు సద్గురును సాదరంగా స్వాగతించారు. జోర్డాన్‌లోని భారత రాయబారి హెచ్.ఇ.అన్వర్ హలీమ్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), మస్కట్, బహ్రెయిన్‌ల్లో యాత్ర సందర్భంగా అయా దేశాల ప్రజలు, పాలకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ముస్లిం దేశమైన జోర్డాన్ పూర్తిగా పొడి ప్రాంతం. సేవ్ ది సాయిల్ ఉద్యమం ఆవశ్యకత అక్కడ మరింతగా ఉంది. పుడమిని కాపాడేందుకు కేంద్ర, రాఫ్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అయిదు మిలియన్ల మంది విద్యార్థులు లేఖలు రాశారు.
భారతీయ నాయకుల మద్దతు
భారతదేశంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు సద్గురు యాత్రకు మద్దతు ప్రకటించడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు భూపేశ్ యాదవ్, హర్దీప్ సింగ్ పూరీ, నరేందర్ సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్, మీనాక్షి లేఖీ, గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, గిరిరాజ్ సింగ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, పెమా ఖండూ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీ.ఎన్. సింగ్, కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవ్‌రా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ బదౌరియా, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి, యోగా గురువు బాబా రామ్ దేవ్ తదితరులు జగ్గీ యాత్రకు మద్దతు పలికారు.
ర్యాలీ ఫర్ రివర్స్
జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు. దూరదృష్టి గల నాయకుడు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది నేతల్లో వాసుదేవ్ ఒకరు కావడం విశేషం. ఈ యాభయ్ మందిలో ఒకరుగా ఉండేందుకు ప్రతి రాజకీయ నాయకుడు పరితపిస్తారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారే ఈ స్థానానికి చేరుకుంటారు. విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం పని చేయడం జగ్గీ వాసుదేవ్‌కు కొత్తేమీ కాదు. గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతం చేసిన చరిత్ర ఆయనది. ఒక మత ప్రబోధకుడు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రపంచ శ్రేయస్సుకు కూడా పాటుపడాలన్నది ఆయన ఆశయం. కేవలం పిలుపునివ్వడం, సూచనలు చేయడం, మంచి మాటలు చెప్పడమే కాకుండా ఆ దిశగా ముందు తాను చొరవ చూపాలన్నది ఆయన ఆలోచన. 2017లో నదుల సంరక్షణకు, వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ‘ర్యాలీ ఫర్ రివర్స్’ అనే ఉద్యమాన్ని మన దేశంలో చేపట్టారు. నదిని భారతీయులు తల్లిగా, దేవతగా పరిగణిస్తారని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏ దేశంలో అయినా తల్లి బాధపడితే బిడ్డలు చూడలేరు. ఆమె క్షేమంగా ఉంటేనే తామూ క్షేమంగా ఉండగలమన్నది ప్రజల విశ్వాసం. ఈ విషయాన్ని ఉదాహరణలతో వివరిస్తూ జగ్గీ వాసుదేవ్ అప్పట్లో చేపట్టిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ ఉద్యమం విజయవంతమైంది. ఇది దేశంలో చేపట్టిన అతి పెద్ద పర్యావరణ కార్యక్రమం. నదులు కోతకు గురవకుండా, నదీగర్భం ఎండిపోకుండా, నదీ గట్లు, ప్రాంతం ఆక్రమణలకు గురికాకుండా, కలుషితం కాకుండా, నదుల్లో వేసవిలోనూ నీరు ప్రవహించేం దుకు తీసుకోవలసిన చర్యలపై ఆయన పాలకులు, ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రాణాధారమైన తాగునీటిని అందించే నదుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన వివరించారు. నదుల గట్లను పటిష్ఠపరచడం ద్వారా వరద నీటిని లోతట్టు ప్రాంతాలకు, సమీప పల్లెల్లోకి చేరకుండా అడ్డుకోవచ్చు. అదే సమయంలో పట్ట్టణాలు, పల్లెల్లోని మురుగునీరు నదుల్లోకి చేరకుండా నివారించడం ద్వారా నీరు స్వచ్ఛంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. 2019లో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టారు.
కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) – 15వ సదస్సులో చేసిన ప్రసంగంలో నేల ప్రాధాన్యం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో పాల్గొన్న 93 దేశాలకు చెందిన ప్రతినిధులు దానిని శ్రద్ధగా ఆలకించారు. నేలను సారవంతం చేసేందుకు తమ వంతుగా చేయవలసిన కార్యక్రమాలు, చర్యలపై ఆయా దేశాల ప్రతినిధులు చర్చించుకున్నారు. సమస్యకు అర్థవంతమైన పరిష్కారం కనుగొనవలసిన ఆవశ్యకత గురించి వారు మాట్లాడుకున్నారు. దీనిని మంచి ముందడుగుగానే చెప్పవచ్చు.
జగ్గీ వాసుదేవ్ చేపట్టిన కార్యక్రమంలోని మంచిని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు అందులో భాగస్వాములయ్యాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆయనకు బాసటగా నిలిచాయి. 1948 నాటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యు.ఎన్.సి.సి.డి)తో ఒప్పందం కుదరడంలో జగ్గీ వాసుదేవ్ సారథ్యంలోని ‘ఈషా ఫౌండేషన్’ కీలక పాత్ర వహించింది. నేల బాగుంటేనే మనిషి బాగుంటాడు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం ఆహారం నేల నుంచే వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. సారవంతమైన నేల లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయలేం. మట్టి ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదు. లేదా భూములున్న వారి ఆస్తి మాత్రమే కాదు. ఇది యావత్ ప్రజల ఉమ్మడి ఆస్తి. దీనిని మన పూర్వికుల నుంచి వారసత్వంగా పొందాం. ఇప్పుడు దానిని మన ముందుతరాలకు ఆర్యోగకరంగా అందించాలి. అది మనందరి బాధ్యత. ఇప్పటికే సగానికిపైగా నిస్సారమైన నేలను మన వారసులకు అందించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సారమైన, ఆరోగ్యకరమైన నేలను ముందుతరాలవారికి అప్పగించడం అంత తేలికైన విషయం కాదు. నిస్సారమైన నేలను సారవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్