తెలుగువారి కళారూపాలలో అపురూపమైనది బుర్రకథ. అది ఉద్యమాలలో పుట్టింది. వాటి మధ్యే విస్తరించింది. ప్రజలను విశేషంగా ప్రభావితం చేసింది. దేశభక్తిని ప్రబోధించింది. రాజకీయ అవగాహన పెంచింది. పురాణాలను సామాజిక దృష్టికోణంతో గానం చేసింది. చరిత్రను వర్తమానానికి చోదకశక్తిగా బోధించింది. పేదల కన్నీటి గాథలను ఆర్ద్రంగా వ్యక్తీకరించింది. పల్లెలనూ, పట్టణాలనూ ఉర్రూతలూగించిన అద్భుత జానపద కళారూపం బుర్రకథ. జంగం కథ, యక్షగానం, హరికథల సమాహారమే బుర్రకథ. రసవత్తరమైన, సారవంతమైన, అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు కళాఖండమిది. తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు వేషం, పలుకుబడి, తెలుగుదనం నిండిన మహత్తరమైన కళ.
బుర్రకథకు చాలా పర్యాయ పదాలున్నాయి. తందాన పాట, తబూర కథ, డక్కీల కథ, గుమ్మెట కథ- ఈ కళారూపం పేర్లే. ప్రధాన కథకుడు చెప్పే ప్రతి మాటకూ ఇరుప్రక్కల ఉండే వంతలు ‘తందాన’ అంటూ వంత పాడడం వల్ల ఇది ‘తందాన పాట’ అయింది. తంబుర భుజంపై పెట్టుకొని ప్రధాన కథకుడు పాడుతూ, దాని శ్రుతిలో కథ చెప్పటం వల్ల ‘తంబూర కథ’ పేరు సార్థకమైంది. వంతలు చేతులలోని వాద్యాలను డక్కీలంటారు. అందువల్ల ‘డక్కీల కథ’ అయింది. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. వాటిలో ‘గుమ్మెట కథ’ అన్న పేరుకే ఎక్కువ ప్రాచుర్యం.
శ్రీనాథుడి ప్రస్తావన
బుర్రకథ ప్రస్తావన శ్రీనాథుని క్రీడాభిరామంలో ఉంది. ‘‘ద్రుత తాళంబున’’ – అనే పద్యంలో గుమ్మెట మ్రోగిస్తూ చిందేసే పక్రియగా వర్ణించాడు మహాకవి. ప్రారంభంలో మౌఖిక ప్రచారంలో తరతరాలుగా ‘వీరగాథలు’ సంక్రమించాయి. వీటి రూపాంతరమే ‘జంగం కథలు’. వీరగాథల్లో శ్రవ్య లక్షణం ఉంటే, ‘జంగం కథ’ల్లో దృశ్య లక్షణం ఎక్కువ. ‘జంగం కథ’ ఇద్దరితో సాగుతుంది. 20వ శతాబ్ది పూర్వార్ధంలో దీనికి ప్రచారం ఎక్కువ. జాతీయోద్యమంతో పాటు అనేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలకు ‘జంగం కథ’ సాధనమైంది. రాజకీయ పక్షాల ప్రచారాలు జంగంకథతో ప్రారంభమయ్యాయి. ఆ సాంప్రదాయక వీరగాథలను ముఖ్యంగా జంగం కథలను అనుకరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942) గుంటూరు జిల్లా నుండి ‘నాజర్’ ప్రభావంతో బుర్రకథలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయని ఆచార్య తంగిరాల సుబ్బారావు అభిప్రాయం.
సుంకర సత్యనారాయణ, కాకుమాను సుబ్బారావులు ఇప్పటి బుర్రకథకు ఒక రూపాన్ని తీసుకువచ్చారు. నాజర్ ప్రవేశంతో ఈ కళారూపం బాగా విస్తరించింది. ఒక్కొక్క సామాజిక సంఘటనతో ఒక్కొక్కరి కథ ఆవిర్భవించింది. బుర్రకథలో ముగ్గురు కళాకారులుంటారు. ప్రధాన కథకుడితో పాటు రాజకీయ వ్యాఖ్య చెప్పే పాత్ర, కేవలం హాస్యం కోసం మరొక పాత్ర ఉంటాయి. అందుకే ఈ పక్రియలో సమయానుకూలంగా, ఆశువుగా అనేక రాజకీయ, సామాజిక విషయాలు చొప్పించడానికి అవకాశం ఉంటుంది. స్థానిక చరిత్రలు, సమస్యలు మొదలు అంతర్జాతీయ వాదవివాదాల వరకు బుర్రకథకు ఇతివృత్తాలుగా ఇమిడిపోయాయి. ఇందుకు ఫాసిజాన్ని నిరసిస్తూ వచ్చిన ‘టాన్యాకథ’, వలసవాదాన్ని నిరసిస్తూ ‘కష్టజీవి’, ‘బెంగాలు కరువు’ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దేశచరిత్ర ఘనతను, దేశ ఔన్నత్యాన్నీ ఈ కథలలో వివరిస్తూ ఉంటారు.
పురాణగాథలు, చారిత్రకాంశాలు కూడా బుర్రకథలుగా ప్రజల ముందుకు వచ్చాయి. పురాణగాథలను కూడా సామాజిక సంఘర్షణకు, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని చెప్పే ఇతివృత్తాలుగా మలుచుకోవడం కనిపిస్తుంది. జాతీయోద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమదేవి, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు వంటివి బుర్రకథల రూపంలో ప్రజలను ఉత్తేజపరచాయి. పలనాటి యుద్ధం, బొబ్బిలియుద్ధం, శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, మంత్రి తిమ్మరుసు వంటి కథలు ప్రజల్లో గత వైభవాన్ని, శౌర్య పరాక్రమాలను స్మరింపజేసి వర్తమాన కర్తవ్యమైన స్వాతంత్య్రం పోరాటానికి ప్రజల్ని ఉద్యుక్తుల్ని చేశాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి కథ
ఝాన్సీరాణి చరిత్రను వారాణాసి సత్యనారాయణ, దంటు కృష్ణమూర్తి బుర్రకథలుగా రాశారు. కృష్ణమూర్తి కథ వారణాసి వారి కథ కంటే ప్రసిద్ధం. కథారంభంలో ‘‘వినరా! భారతపుత్రా! ఝాన్సీ వీరగాథ నేడు’’ అంటారు. 19వ శతాబ్ది నాటికి బ్రిటిష్ పాలన విస్తరిస్తుంది. మహారాష్ట్రలో రెండో బాజీ పీష్వాను ఆంగ్లేయులు మభ్య పెట్టి సాలుకు 8 లక్షల రూపాయలు పింఛన్ ఏర్పాటుచేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని తమ్ముడు చీమాజీ పీష్వా కాశీలో ఉండేవాడు. ఇతని మిత్రుడు మోరోపంత్ తాంబే అనే బ్రాహ్మణుడికి సహాయం చేసేవాడు. అతడు చనిపోయిన వెంటనే మోరోపంత్ తన కుమార్తె ఝాన్సీ లక్ష్మీబాయి, (మనూబాయి) భార్యతో కలిసి బాజీరావు పీష్వా దగ్గరకు చేరాడు. బాజీరావు పీష్వా తన దత్తపుత్రుడైన నానా సాహెబ్‌తో పాటు ‘మనుబాయి’కి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఝాన్సీ సంస్థానాధిపతి గంగాధరరావు భార్య చనిపోగానే ‘మనూబాయి’ని వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు జన్మించి వెంటనే చనిపోయాడు.
ఆ దిగులుతో గంగాధరరావు మంచం పట్టాడు. చివరి రోజుల్లో ఆనందరావు అనే బాలుని దత్తత చేసుకుని మరణించాడు. ఆంగ్లేయులు ఆ దత్తత చెల్లదని ఝాన్సీ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వేచ్ఛా జీవన ప్రవృత్తి ఉన్న లక్ష్మీబాయి అదును చూసి తన సైన్యంతో ఆంగ్లేయులపై దాడి చేసి తన సంస్థానాన్ని స్వాధీనపరచుకొంది. దెబ్బతిన్న బ్రిటిష్‌వారు లక్ష్మీబాయిపై క్రోధంతో పెద్ద సైన్యబలంతో, మారణాయుధాలతో ఝాన్సీ కోటను ఆక్రమించుకొన్నారు. మరలా తన కోటను స్వాధీనం చేసుకొనేందుకు లక్ష్మీబాయి నానాజీ వంటి మిత్రులతో కలిసి ప్రయత్నించింది. కొందరు స్వదేశీ వెన్నుపోటుదార్లకు కుట్ర వల్ల ఫలితం దక్కలేదు. ఊపిరి ఉన్నంతవరకు స్వతంత్రంగా పోరాడి అసువులు బాసిన వీర నారీమణి ఝాన్సీరాణి లక్ష్మీబాయి. కథకుడు ‘‘భరతఖండపు మహిళలు / తిరుగులేని శక్తి స్వరూపుణులనీ/ధర చాటినట్టి ధన్య వీరఝాన్సీకి మనము జోహారులనియె’’- అంటూ ఆమె సాటిలేని ధైర్య స్థైర్యాలను ప్రబోధించి యువకుల్లో వీరత్వాన్ని ప్రదీప్తం చేసి స్వాతంత్య్ర సాధనకు దోహదం చేశాడు రచయిత.
శివాజీ మహరాజ్ గాథ
జాతీయోద్యమంలో ప్రజలను గొప్పగా ప్రేరేపించిన వీర శివాజీ చరిత్రను ‘మహారాజ్ శివాజీ’ పేరుతో వారణాసి సత్యనారాయణ ‘శివాజీ ఛత్రపతి’ పేరుతో దంటు కృష్ణమూర్తి, ‘తందాన తాన! వీర శివాజీ’ పేరుతో కవుల ఆంజనేయశర్మ, ‘ఛత్రపతి శివాజీ’ పేరుతో షేక్ బాపూజీ బుర్రకథలుగా రచించారు. దంటు కృష్ణమూర్తి ‘శివాజీ ఛత్రపతి’ బుర్రకథను ‘‘వీరశివాజీ చరితము/ నినాదం భారతీయ పుత్రా!’’ అంటూ ప్రారంభించాడు. 17వ శతాబ్దంలో జన్మించిన భారతీయ వీరుల్లో ప్రముఖుడు శివాజీ. తల్లి జిజా బాయి. తండ్రి షాహాజీ.
జిజా బాయి తన కుమారుడు శివాజీకి ఆర్షధర్మాన్నీ, భారతీయ పురాణాలను నూరిపోస్తూ, క్షత్రియోచిత విద్యతో తీర్చిదిద్దింది. ఆ విషయాన్ని షేక్ బాపూజీ ‘‘ఉగ్గుపాలతో వీరగాథ నేర్పె / శయ్యా జోలలో శూర చరితలు కూర్చే’ అంటాడు. సమర్థ రామదాసు శివాజీ ఆధ్యాత్మిక గురువు. శివాజీ శౌర్యప్రతాపాలను పరీక్షించదలచిన సమర్థ రామదాస స్వామి, ‘‘నాయనా! శివాజీ! నాకు పులి పాలు కావాలి’’ తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో కథారచయిత ‘‘శివాజీ బలమో /గురుభక్తి ఫలమో/పంతం వీడి చెంత చేరిన పులి / పాలను ఇచ్చిందా! సంతసాన పులి పాల పాత్ర/ గురుచెంత చేర్చె శివాజీ’’ అంటూ కథకు అందమైన కల్పనను, అందులో ఔచిత్యాన్ని కూడా జోడించాడు. గురువు ఆశ్చర్యంతో ‘‘మహారాష్ట్రమున మహారాజువై ఘనతకెక్కుము’’ అని ఆశీర్వదించి పులిపాలు తాగించాడట. ‘‘ఛత్రపతిగా చరితకెక్కెను/ మహారాష్ట్రమును మహారాజై ఏలెను’’ అంటూ శివాజీ ధైర్యస్థైర్యాలను రచయిత ప్రశంసిస్తూ ‘‘ధరిత్రి మోసిన ధీరసుతులలో జ్యేష్టుండితయ్యా! భక్తి ప్రపత్తుల కీర్తి ప్రతిష్టల బంధుమిత్రుడీతడే / పరస్త్రీలను గౌరవించు సత్సీలుడితడయ్యా!’’ శౌర్య ధైర్య స్థిర చిరునామాగా శివాజీ గుణగణాలను రచయిత గొప్పగా కీర్తించాడు.
శివాజీ బీజాపూర్ దుర్గాన్ని వశపరచుకొనేందుకు ప్రయత్నం చేసే సందర్భంలో అది తెలిసిన సుల్తాన్ శివాజీ తండ్రిని బంధించి తనకు నష్టపరిహారం కావాలన్నాడట. వెంటనే శివాజీ అగ్గిపిడుగై ‘‘పండు ముసలిని బంధించుట/ పరుషం కాదు సుల్తాన్’’ గుండెలుంటే ముందుకొచ్చి/ఖడ్గమునెదురొడ్డి చూడమన్నాడు’’.
బీజాపూర్ సుల్తాన్ తల్లి శివాజీని రాజీకి రమ్మని పిలిచి కత్తి దూసే ప్రయత్నం చేయగా శివాజీ అఫ్జల్‌ఖాన్‌ను అంతమొందించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే ఔరంగజేబు శివాజీని బంధించి తెమ్మని తన సేనాని షాయిస్తాఖాన్‌ను పంపించాడట – అతడు శివాజీలేని సమయంలో దుర్గాన్ని ముట్టడించి కోటలో డేరా వేసి భార్యతో సహా ఉన్నాడు. అది తెలిసిన శివాజీ ఒకరోజు రాత్రి డేరాలో చొరబడి ఖాన్‌ను ‘‘నిద్రలేరా! అని గర్జింపగా’’ అతడు నివ్వెరపడి నేలపై దొర్లాడు. అతడి భార్య నల్లని ఘోషా దుస్తుల్లో ‘‘అన్నా! ఆగు. పరస్త్రీని తల్లిగా, చెల్లిగా భావిస్తావన్న ఆశతో అర్థిస్తున్నా’’నని వేడుకొంది. వెంటనే శివాజీ, ఎత్తిన ఖడ్గం దించి ఎరుగను. కాబట్టి అతడి చేతివ్రేళ్లను ఛేదించనిమ్మని నరికివెళ్లి పోయాడు. ఆ విషయం తెలిసిన ఔరంగజేబు శివాజీని బంధించి ఖైదులో పెట్టాడు. మహారాష్ట్రను మరో సుల్తాన్‌కు అప్పగించాడు. శివాజీ మరో ఎత్తుగడతో ‘‘ఔరంగజేబు నాకు భవానీ పూజకు అవకాశం కల్పించిన మీకు నేను లొంగినట్లేనని’’ చెప్పాడు. శివాజీ లొంగుతాడన్న ఆశతో శివాజీ ఉన్న ఖైదుకు భవానీ పూజా సామగ్రి పంపమని’’ ఔరంగజేబు సేవకులను ఆజ్ఞాపించాడు. పూజా నిమిత్తంగా ఏర్పాటు చేసిన మిఠాయి గంపలో దాగిన శివాజీ ఖైదు నుండి పారిపోయాడు. అక్కడ తన జాగీరుదార్లంతా జైజై నినాదాలతో ఘనస్వాగతం పలికారు. గురువర్యుడు సమర్థ రామదాసు రత్నకిరీటంతో అలంకరించి ఛత్రపతి బిరుదుతో సత్కరించాడు. శివాజీ సామ్రాజ్యాధినేతగా రాజ్యాన్ని విస్తరించాడు. మసీదులను ఆదరించాడు. పరస్త్రీలను గౌరవించాడు. వీరశివాజీ సాహసోపేత గాధ దేశభక్తి తత్పరులైన యువకులను స్వాతంత్య్ర సాధనకు గొప్పగా ప్రేరేపించింది.
అల్లూరి అమరగాథ
జాతీయోద్యమంలో అల్లూరి సీతారామరాజు సాహసగాథ తెలుగువారినే కాక, ఇతరరాష్ట్రాల ప్రజలను సైతం పులకింపజేసింది. జాతీయోద్యమ సాహితీ పక్రియల్లో నాటకం, బుఱ్ఱకథ వంటి వాటికి సీతారామరాజు ఇతివృత్తం ఆరాధ్యమైంది. అల్లూరి ఇతివృత్తంపై చాలా బుర్రకథలు వచ్చాయి. బూరెల సత్యనారాయణమూర్తి, దంటు కృష్ణమూర్తి, సుంకర సత్యనారాయణ వంటివారు బుర్రకథలు రాశారు. వాటిలో సుంకర కథ నాజర్ గానంతో బాగా ప్రసిద్ధమైంది.
సీతారామరాజు భారత స్వాతంత్య్రం కోసం గోదావరి లోయలో, విశాఖ మన్యంలో ఉన్న కోయలు, బగతలు వంటి గిరిజనులను సమీకరించి 1922-24 ప్రాంతాల్లో పెద్ద విప్లవాన్ని లేవదీశాడు. గాము గంటం దొర, గాము మల్లుదొర, అగ్గిరాజు, పడాలు మొదలైన గెరిల్లా యోధులు రామరాజు సైన్యంలో ఉన్నారు. పోరును అణచివేయడానికి బ్రిటిషువారు మొదటి రిజర్వ్‌పోలీసు దళాలను ప్రయోగించారు. రామరాజు గెరిల్లా సైన్యం అర్థరాత్రివేళ వారి తుపాకులను దోచుకొని తరిమికొట్టింది. తర్వాత ఆంగ్లేయులు గెరిల్లా పోరాటంలో నిపుణులైన ‘కవర్టు-హైటర్’ – అనే తెల్లదొరల నాయకత్వంలో దళాలను పంపించారు. సీతారామరాజు మల్లు సోదరులను, పడాలును పంపించి ఆంగ్ల సేనానులైన ‘కవర్టు-హైపరులను’ చంపించాడు. సీతారామరాజు చేస్తున్న గెరిల్లా యుద్ధానికి బ్రిటిష్ ప్రభుత్వం భయపడి పారిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం మర తుపాకులతో, మర ఫిరంగులతో, ఘార్కాసేనలను అసంఖ్యాకంగా దింపింది. అయినా గెరిల్లా పోరాటంలో ఆరితేరిన రామరాజుతో యద్ధం చేయలేక ఉక్రోషంతో గిరిజన గూడేలను తగలబెట్టి స్త్రీలను, పిల్లలను హింసించారు. గాము మల్లుదొరవాళ్లకు పట్టుబడ్డాడు. ఆంగ్ల సైనికులు సీతారామరాజు జాడ చెప్పమని గిరిజనులను చిత్రహింసలు పెట్టారు. సీతారామరాజు తన మూలంగా గిరిజనులు బాధపడటం ఇష్టంలేక తానే ఆంగ్ల సైనికులకు లొంగిపోయాడు. వారు కాల్చి చంపారు.
ఈ కథలో రచయిత గోదావరీ తీరంలో అరణ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘‘నగ శిఖరంబుల నుండి దూకుటానదులకు్ల అలవాటు / సొగసు తుంపరులిట తుషార మున నెగసియాడుచుండు/ పౌరుషమును క్రాంతిని శాంతిని-వనము పూయుచుండు జలజల ప్రవహించెడి సెలయేరుల- కలకల నాదములు/ పలు రకంబులగు పక్షులు తమ శ్రుతి గలిపి పాటపాడు / స్వాతంత్య్రము నా జన్మ హక్కేయని / శబ్దించును వనము -’’
గోదావరీ నదీ తీర పరిసరాల్లో సొగసైన తుంపరులు తుషార బిందువుల్లా ఆహ్లాదం కలిగిస్తాయట. గోదావరీ తీరవనంలో చెట్లు పౌరుషపు క్రాంతినీ, శాంతినీ పూలుగా పూస్తున్నాయట-ఆ పరిమళాల ఆస్వాదనతో గిరిజనుల్లో పౌరుషోద్రేకాలు పెల్లుబికేయుట. జలజల ప్రవహించే సెలయేటి కలకల మధుర నాదాల్లో ‘‘స్వాతంత్య్రము నా జన్మహక్కే’’ అన్న నినాదం వనంలో మార్మ్రోగుతుందనీ, స్వాతంత్య్రం సాధనకు ప్రకృతి కూడా సహకరించి నినదిస్తుందని వర్ణించడం ఎంతో ఔచిత్యంగా ఉంది.
మన్యంలో గిరిజనులు పండ్లు, దుంపలు తింటూ స్వేచ్ఛగా జీవించేవారు. కాని పరాయి పాలకులు వారి స్వేచ్ఛను హరించి, ఎన్నో బాధలు పెట్టేవారు. వారు అనుభవించే బాధలను రచయిత హృదయ విదారకంగా వర్ణించాడు.
‘‘దేశమంతటిని దోచుకొన్న పరదేశ ప్రభుత్వంబు
నాశముజేయుచు దోచుకొనుట తన నాగరికతనము
కానన సీమకు రయమున జనవి – జ్ఞానమెత్తుననుచు
పాదము మోపీ మోపుటే తడవుగ – ప్రభుత్వమా ప్రజల
ఆదరించదామెను స్వాతంత్య్రము నణచజూచెగాని
ముందుగనడివి రిజర్వ్ చేసి ఖా మందులమన్నారు
పందులు స్వేచ్ఛగ తినెడి దుంపలను ప్రజలు తినిన శిక్ష
పచ్చగ పెరిగిన పచ్చిక నచ్చటి పశువులంటరాదు
అచ్చట నట్లే యెండిపోవలె – అన్యులంటరాదు
మండుటాకలి నోర్వలేక యే మన్యంవాసియైన
పండుగోసితినెనా, యిక వానిని పీల్చెడి జమీందార్ల నిచట
నిలిపిన రీతిగ ముఠాదార్లనట నెలకొల్పిరి వారు’’
బ్రిటిష్ ప్రభుత్వం ంచగొండి, అవినీతి పరులకు ఉద్యోగాలిచ్చి వర్గభేదాలు లేని మన్యంలో చీలికలతో ముఠాదార్లు, కూలీలు, రైతులు అనే వర్గాలను సృష్టించింది. మన్యంలో సంపదలను కొల్లగొట్టి ఓడలపై తరలించాలంటే రహదారులు అవసరమయ్యాయి. అందుకే రోడ్లు, వేయించాలనుకున్నారు. దుర్మార్గుడైన బాస్టియన్ అనే అధికారి అడవి జాతులవారిని నానా బాధలు పెట్టి హింసించేవాడు. రచయిత వాడిని ‘‘మూర్తీభవించిన అవగుణాల దిట్ట / అవినీతి పాపాలపుట్ట’’గా వర్ణించాడు. రోడ్లు వేయించే కాంట్రాక్టు పనిని మరొకరి పేరుతో తానే తీసుకొని కూలీలకు ఆరణాల కూలీ బదులు, రెండణాలు కూలీ యిచ్చి నాలుగణాలు దోచుకొనేవాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని హింసించేవాడు. రచయిత వారి దైన్య స్థితిని ‘‘భళాభళా నోయ్ తమ్ముడా ।।సై।। బాయీ /అడివి పండ్లు వేలున్నవీ ।।సై।। అంటుకుంటే /యమ బాధ ।।సై।। వెదురు బియ్యమేయున్నవీ / పిడికెడు నమలిన శిక్షరా ।।సై।।’’ అని వర్ణించారు. ఆకలి బాధ తట్టుకోలేక మన్యం ప్రజలు చింతంబలి తాగి, జ్వరాలతో మందులిచ్చే నాథుడు లేక దయనీయంగా మరణించారు.
సీతారామరాజు దారుణంగా బ్రిటిష్‌వారి తుపాకీ గుండ్లకు బలై మరణించిన సందర్భంలో రచయిత ‘‘రాలిన దొక నక్షత్రంబవనికి – రామరాజు ఒరిగె / కూలీ రైతుల కల్పవృక్షమట కూలిపోయెను / తలచి రాజు నా మన్య సోదరులు వలవల యేడ్చారు /జలజల కన్నీరొలుకబోసెదరు తెలుగుదేశమంతా’’ – ప్రజలంతా ముక్తకంఠంతో రామరాజు ధైర్య సాహసాలను సంస్మరిస్తూ స్మృతి గీతాలను ఆలపించారు. రచయిత తెలుగువారి దైన్య స్థితిని ఆవేదనతో ‘‘తెలుగువారు మూడుకోట్లు జీవచ్ఛవాలయ్యారని’’ విలపించాడు. ఆచార్య తంగిరాల సుబ్బారావు ‘‘బుర్రకథా రచనకు ఈ బుర్రకథ ఒక లక్షణ గ్రంథం. సాహిత్యపరంగా ఇంత ఉత్తమమైన కథ మరొకటిలేదు. ఇందులో అడుగడుగునా గొప్ప కవిత్వం ప్రత్యక్షమవుతుంది. ఆనాటి జాతీయోద్యమానికి ఇది ప్రతిబింబమైన రచన’’ అని వ్యాఖ్యానించారు. (రక్తతిలకం-వీరపాణం పీఠిక).
కన్నెగంటి హనుమ వీరగాథ
కన్నెగంటి హనుమంతు 1870 ప్రాంతంలో పలనాడులోని మించాలపాడు గ్రామంలో కన్నెగంటి అచ్చమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించాడు. రచయిత ‘‘వినరా! సోదర కన్నెగంటి హనుమంతు ఘనచరిత్ర / సమరయోధుడు తెలుగు వీరుడు కన్నెగంటి హనుమంతు’’- అని కీర్తించాడు. ‘‘కన్నులురమితే తొలకరి మెరుపు/ గర్జించాడా సింగమే వురుకు/ పిడికిలెత్తితే పిడుగైజారు/అడుగుకదిపితే కొండలే ఊగు/అష్టదిక్కులే హనుమంతుడన్న/పిక్కటిల్లి తెగ ప్రతిధ్వనించు / శౌర్యములే కన్నెగంటిగా/ సృష్టిచేసే విధికర్తను బ్రహ్మ’’ అంటూ కన్నెగంటి ధైర్య సాహసాలను రచయిత అనితర సాధ్యంగా వర్ణించాడు. శౌర్యమంటే ‘కన్నెగంటి’గా సృష్టికర్త బ్రహ్మ రూపొందించాడని చెప్పడం రమణీయం. పుల్లరి కోసం పేద రైతులను దోచుకొనే తెల్లవారిని ఎదిరించి నిలిచాడు. రైతులకు అండగా నిలిచి మించాలపాడు గ్రామంలో విప్లవ సైనిక శిబిరాన్ని నిర్వహించాడు. రూథర్‌ఫర్డ్ మిలిటరీ సేనతో తరలి వచ్చి గ్రామకరణం సదాశివయ్యను హనుమంతు దగ్గరకు రాయబారిగా పంపించాడు. వారు హనుమంతుని ప్రలోభపెడుతూ ‘‘ప్రస్తుతము నా మద్దతు పన్నుల పాశ్చాత్యుల కప్పగింపుము. చుట్టూ నలభై ఐదు పల్లెల ఎస్టేటు ఏలు కొమ్మని’’ చెప్పారు. ఆ రాయబారాన్ని తిప్పికొట్టి ‘‘పలనాటి సంపదతో పెరిగి పాశ్చాత్యులకు వత్తాసు పలకడానికి నీకు సిగ్గులేదా?’’ అని రాయబారిగా వచ్చిన గ్రామకరణం సదాశివయ్యను నిందించాడు. పాశ్చాత్యులెవ్వరూ మించాలపాడులో కనిపించరాదని హెచ్చరించి పంపించాడు. ఉగ్రుడైన రూథర్‌ఫర్డ్ మిలటరీ సేనతో దండెత్తి వచ్చి కన్నెగంటి హనుమంతుని తుపాకులతో కాల్చి చంపాడు.
ఆ సందర్భంలో రచయిత, ‘‘స్వరాజ్యమిమ్మని సేనతో కదిలెను సుభాస్‌చంద్రబోస్/ దండి సత్యాగ్రహానికి గాంధి తరలినాడు / – కన్నెగంటి వీర మరణంతో యావత్ భారతదేశం జాగృతమైంది. దేశభక్తి తత్పరులంతా ఉద్యమించారు. స్వాతంత్య్రం సాధనకు కన్నెగంటి వంటి వీరుల ప్రాణత్యాగం బలీయమైన కారణమైంది. ఇక్కడ భారత స్వాతంత్య్రోద్యమం కొనసాగింపును అద్భుతంగా సూచించారు.
పద్మశ్రీ నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలియుద్ధం; పాలడుగు నాగయ్య తందాన తాన బాలచంద్రుడు; పోలు శేషగిరిరావు శ్రీకృష్ణదేవరాయచరిత్ర, దండు కృష్ణమూర్తి రుద్రమదేవి కథ, తిమ్మరుసు మంత్రి కథ గత వీరుల శౌర్య పరాక్రమ ప్రాభవాలను స్మరింపజేసి ప్రజలను జాతీయోద్యమంలో దేశభక్తి తత్పరులుగా ప్రేరేపించాయి. అప్పటి నిరక్షరాస్యులైన జానపదులను బుర్రకథలు ప్రేరేపించి వారిలో స్వాతంత్య్ర దీక్షను రేకెత్తించాయి. రచయితల రచనల ప్రేరణ, ప్రజల దేశభక్తి పరాయణత్వం, నాయకుల త్యాగ తత్పరతుల స్వాతంత్య్ర సాధనకు కారణాలయ్యాయి.
డా।। పి.వి.సుబ్బారావు 9849177594 రిటైర్డ్ ప్రొఫెసర్