‘భీమవరం పట్టణాన్ని రెండవ బార్డోలీగా పిలిచేటట్లు చేసిన సర్దార్‌ ‌దండు నారాయణరాజు అంకితభావం చిరస్మరణీయమే!’
‘హరిజన్‌’ (1928)

‌పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పట్టణం భీమవరం. గుజరాత్‌లో ఒక ప్రాంతం బార్డోలీ. భీమవరాన్ని రెండో బార్డోలీగా చరిత్ర పుటలలోకి ఎక్కించిన వ్యక్తిగా గాంధీజీ ఆయనను కీర్తించారు. నిజమే, రైతులకీ, వారి భూములకీ మధ్య సంబంధం అతి నిగూఢం. ఏనాడు వారి తాతముత్తాతలు ఆ భూములను సంపాదించిపెట్టారో! తరతరాల నుండి అనుభవిస్తున స్థిరాస్తులవి. పంటలు పండినా, పండకపోయినా, వాటినే కనిపెట్టుకొని ఉండి సంసారాలను ఏదో విధంగా పోషించుకుంటూ వస్తున్నారు. యజమాని పాదం పైని పడినప్పటికీ, భూమి ఆనందముతో పొంగి పోతుందని పెద్దలు చెబుతారు. ఇంతకీ గాంధీజీ ప్రస్తావించిన ఆ స్వాతంత్య్ర సమరయోధుడు దండు నారాయణరాజు.
వ్యవసాయదారునిగా, న్యాయవాదిగా ఉద్యమంలో పాల్గొని, జైలులోనే తనువు చాలించిన ధన్యజీవి. ఇందులో కొన్ని లక్షణాలు బార్డోలీ సత్యాగ్రహం నిర్వహించిన సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌ను చూస్తాం. బార్డోలీ సత్యాగ్రహం పటేల్‌ ‌వంటి మహోన్నత నేతను స్వరాజ్య ఉద్యమానికీ, స్వతంత్ర భారతానికీ కూడా ప్రసాదించింది. పటేల్‌ ‌రైతులను కూడగట్టారు. ఇక్కడ దండు నారాయణరాజు కూడా అంతే. పటేల్‌ ‌బారిష్టరు. నారాయణరాజు న్యాయ వాది. ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టే గాంధీజీ ఆ రకమైన పోలిక తెచ్చారు. అయితే నారాయణరాజు రైతు నాయకత్వ పాత్ర 1923లో మొదలు కాగా, పటేల్‌ ‌నాయకత్వం 1925-1928 మధ్య సాగింది. కానీ నారాయణరాజు ఉప్పు సత్యాగ్రహంలో ఒక చేతిని కోల్పోయారు. క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో జైలులోనే ప్రాణాలు విడిచారు.

ధృడ నిశ్చయం, కార్యదీక్ష, నిర్మాణ చాకచక్యం, స్వాతంత్య్రం కోసం పరిపూర్ణ పిపాస- దండు నారాయణరాజు జీవితంలో కనిపించే విశిష్ట లక్షణాలు. 1923లో ఆయన ఏలూరులో ‘పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం’ నెలకొల్పారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో ఏర్పడిన తొలి సంఘం.
అమెరికా వెళ్లి, వ్యవసాయశాస్త్రంలో ఎమ్మెస్సీ చేసి వచ్చిన మాగంటి బాపినీడు, రైతు నాయకులు వేంచేటి సత్యనారాయణ, ఎం.సుబ్బారావు, మందేశ్వరశర్మల సహకారంతో 1931లో పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో ‘రైతు విద్యాలయం’ ఆయన స్థాపించారు. మాగంటి బాపినీడు, ఇతర నాయకులు రైతులకు తరగతులు నిర్వహించే వారు. నీటి సద్వినియోగం, వరి సాగులో మెలకువలు, వ్యవసాయోత్పత్తుల నిల్వ, గింజలు లేని పండ్లతోటల పెంపకం, సహజ ఎరువుల వాడకం, నీటి పన్ను, గిట్టుబాటు ధరల మీద అవగాహన వంటి అనేక విషయాలను బోధించేవారు.

బార్డోలీ ఉద్యమ ప్రభావం ఆనాడు దేశమంతా కనిపించింది. అక్కడ కరవు కాటకాలతో సతమత మవుతున్న రైతులు పన్ను తగ్గించాలని ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా 22 శాతం పెరిగిన పన్ను వారిని ఆందోళన బాట పట్టించింది. ఈ పన్నును ఉపసంహరించుకోవాలని సర్దార్‌ ‌పటేల్‌ ‌నాటి బొంబాయి గవర్నర్‌కు లేఖ రాశారు. అతడు ఈ లేఖను బుట్టదాఖలు చేయడమే కాకుండా, పెంచిన పన్ను వసూలుకు తేదీ కూడా ప్రకటించాడు. 137 గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేశారు. అయితే ఇది అహింసాయుత ఉద్యమమే. కానీ అధికారుల జులుం మాత్రం దారుణంగా ఉంది. రైతుల ఆస్తులు వేలం వేశారు. పశువులను తీసుకుపోయారు. ఇక్కడ కూడా రైతులపై విధించిన పన్ను గురించి పునరాలోచించాలని నారాయణరాజు ఏలూరు కోర్టులో జిల్లా రైతు సంఘ కార్యదర్శిగా కేసు వేశారు.

మందేశ్వరశర్మ ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకూ నిర్వహించిన రైతు యాత్రకు నారాయణరాజు సాయమందించారు.
దండు నారాయణరాజు భీమవరం తాలూకా, నేలపోగుల గ్రామంలో భగవాన్‌ ‌రాజు, వెంకాయమ్మ దంపతులకు 15, 1889 ఆగస్టులో జన్మించారు. నరసాపురం తాలూకా పోడూరులో ప్రాథమిక విద్య, తణుకు ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్య అభ్యసించారు. ఆయన చదువు లోనూ, క్రీడారంగం లోనూ ప్రతిభ చూపారు. 1907లో మెట్రిక్యులేషన్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందారు. 1910లో మహాదేవపట్నం కాపురస్థులు కలిదిండి వెంకటరామ రాజు కుమార్తె సుబ్బాయమ్మతో వివాహమయ్యింది. తణుకు ఉన్నత పాఠశాలలో కొంత కాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత బి.ఎల్‌ ‌పట్టా తీసుకున్నాక ఏలూరు జిల్లా కోర్టులో కొంత కాలం న్యాయవాదిగా పని చేశారు.

ఆ కాలంలో గాంధీజీ విధానాలకు ఆకర్షితులైన వారిలో దండు నారాయణరాజు ఒకరు. 1921 లో గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాద వ ృత్తిని వదిలి సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. తిలక్‌ ‌సహాయ నిధికి అధిక మొత్తం వసూలు చేసి గాంధీజీకి బహూకరించారు. అల్లూరి శ్రీరామరాజు నడిపిన మన్య విప్లవం కాలంలో ప్రభుత్వం నారాయణ రాజును అరెస్టు చేసి, కాకినాడకు తరలించి 17 రోజులు జైలులో ఉంచి విచారించింది. నిర్దోషి అని తేలడంతో విడుదల చేశారు. 1927లో మద్రాసు శాసనసభకు పోటీ చేసి గెలిచారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో సర్దారు దండు నారాయణ రాజు, శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి ఇతర కార్యకర్తలతో కలసి ఖద్దరు వ్యాప్తికై విశేషంగా ప్రచారం చేశారు. 1923 నుండి 1926 వరకూ ఖద్దరు బోర్డుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఏలూరులో శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి సహాయంతో ఆగస్టు 18,1922న రూ. 2500/-పెట్టుబడితో ‘మోహన్‌దాస్‌ ‌ఖద్దరు పరిశ్రమాలయం’ ప్రారంభించారు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లా లోని తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరుల లోను ప్రారంభించారు.
మార్చి 12, 1930న గాంధీజీ దండియాత్ర ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ఏప్రిల్‌ 6-13 ‌తేదీల మధ్యన తమకనుకూలమైన రోజున చేసే స్వేచ్ఛను రాష్ట్రాలకిచ్చారు. ప్రతీ రాష్ట్రంలో ఉద్యమ నిర్వహణకు డిక్టేటర్‌లను నియమించారు. ఆంధ్రరాష్ట్ర డిక్టేటర్‌గా కొండా వెంకటప్పయ్యను నియమించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా డిక్టేటర్‌గా సర్దార్‌ ‌దండు నారాయణరాజును నియమించారు. రాజు మొదట పాలకొల్లు దగ్గరి మట్లపాలాన్ని సత్యాగ్రహ కేంద్రంగా నిర్ణయించారు.
నారాయణరాజు మార్చి 31న జాతీయ విద్యా లయం ఉప్పు సత్యాగ్రహయాత్ర ఆరంభించారు. ఏప్రిల్‌ 10‌న మట్లపాలెం చేరారు. 11వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటలకు వశిష్ట గోదావరి నుండి ఉప్పు నీటిని తెచ్చి మండిగలలో పోసి మరగబెట్టి ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించారు. తరువాత మట్లపాలెం శాసనోల్లంఘన శిబిరాన్ని తూర్పుతాళ్లు అనే గ్రామానికి మార్చారు.

అక్కడ సర్దార్‌ ‌దండు నారాయణరాజు ప్రదర్శించిన తెగువ, అదే సమయంలో గాంధీజీ ఆశయాన్ని వీడకుండా చూపిన నిగ్రహం చరిత్రా త్మకం. వండిన ఉప్పును చేతితో పట్టుకుని వదలలేదు. పోలీసులు ఆ పిడికిలి తెరిపించలేకపోయారు. ఆ చేతిని దగ్గర్లో గల పడవ అంచున పెట్టి పెద్ద కట్టెతో చితకకొట్టి, ఉప్పును పారబోయించారు. ఆ దెబ్బలకు అయన చేయి పూర్తిగా పనికి రాకుండా పోయి అంగవైకల్యం ఏర్పడింది. ఉప్పు సత్యాగ్రహం చేసినందుకు ఓ సంవత్సరం జైలుశిక్ష విధించి, వెల్లూరు జైలుకు పంపారు. కానీ గాంధీ – ఇర్విన్‌ ఒప్పందం వలన ఏడునెలల శిక్షాకాలం తరువాత విడుదల చేశారు. అయినా ‘బార్డోలీ సత్యాగ్రహ విజయం, భారత స్వరాజ్య యుద్ధం, గాంధీ విజయం, పూర్ణ స్వాతంత్య్రం’ మొదలయిన కరపత్రాలు పంచుతున్నారన్న కారణంతో మరోసారి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన అకుంఠిత దీక్షకు ప్రజలు దండు నారాయణరాజుకు సర్దారు బిరుదును ఇచ్చి గౌరవించారు.

డిసెంబర్‌ 14, 1940‌న వ్యక్తిగత సత్యాగ్రహం చేసినందుకు అరెస్టు చేసి వెల్లూరు, తిరుచునాపల్లి జైళ్లకు పంపారు. ఆగస్ట్ 6, 1941‌న నరసాపురంలో సత్యాగ్రహం చేసినందుకు సంవత్సరం జైలుశిక్ష, 500 రూపాయలు జరిమానా విధించి ‘ఆలీపూర్‌ ‌క్యాంపు’ జైలుకు పంపారు. తిరిగి విడుదల అయిన వెంటనే ప్రభుత్వ శాసనాలను ధిక్కరించాడనే కారణంగా మళ్లీ నిర్బంధించారు.

కానీ క్విట్‌ ఇం‌డియా ఉద్యమ వేళ జరిగిన నిర్బంధం ఆయన జీవితాన్ని బలి తీసుకుంది.ఆగస్టు 12, 1942న క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పాల్గొన్నందుకు నారాయణరాజును అరెస్టు చేసి వెల్లూరు, తంజావూరు జైళ్లలో ఉంచారు. చివరకు ఆయన సెప్టెంబర్‌ 10, 1944, ఆరు గంటల సమయంలో తంజావూర్‌ ‌జైల్లో తుది శ్వాస విడిచారు. గుండె జబ్బుతో మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ‘ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం’ అని గాంధీజీ అక్టోబర్‌ 9,1944‌న సంతాపం ప్రకటించారు.

నారాయణరాజు కారాగారంలో ఉండగా మాగంటి అన్నపూర్ణాదేవి అనేక అంశాలతో ఉత్తర ప్రత్త్యుత్తరాలు జరిపారు. వారు ప్రారంభించిన పరిశ్రమాలయం గురించి, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను ఆ లేఖలలో ప్రస్తావించారు.

‘‘తాను చేసిన యద్భుత సృష్టి యందలి మానవులు సోమరులై యుండకుండా గొన్ని కార్యములను చేయించుచుండును. మానవుల ద్వారా తన అద్భుత సంకల్పముల నెరవేర్చుకొనుచుండును. కాబట్టి మీరు లేనందువలన నిచ్చట జిల్లా సంఘమునకు, పరిశ్రమాలయమునకు నష్టము వాటిల్లుచున్నదని చింతిపవలదు’’ అని ఆమె తన మొదటి ఉత్తరంలో రాశారు. రెండవ ఉత్తరంలో ధార్మిక విషయాలు ఉన్నాయి.

‘‘ప్రాపంచిక రాజకీయ సాంఘిక విషయము లటుంచుడు, మనకు జన్మ జన్మాంతము విముక్తికి గారణంబగు ధార్మిక విషయములను గురించియే ముచ్చటింతము, చర్చింతము, ఆలోచింతము, లిఖింతుము, భావింతుము. ఆ ఉద్దేశ్యములతో మన ప్రాణములర్పింతుము.’’
నారాయణరాజుతో కలిసి పని చేసిన శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి అమెరికాలో ఉన్న తన భర్త బాపినీడుకు అక్టోబర్‌ 4, 1922‌న రాసిన లేఖలో తన అనుభవాన్ని ఇలా రాసారు. సర్దార్‌ ‌దండు నారాయణరాజుతో కలిసి వెళ్లిన ‘‘ప్రతీ స్థలము నందాయన చేసిన త్యాగమునకు, సేవను కొనియాడుచూ అభినందించుచున్నారు’’.

సంప్రతించిన గ్రంథాలు

1. Dictionary of Martyrs : Indian Freedom Struggle (1857-1947)
Vol – 5, P – 44
2. అన్నపూర్ణాదేవి లేఖలు-ప్రకాశకుడు : బాపినీడు – P- 177, 178, 190, 191, 198
3. డా. గాదం గోపాలస్వామి – శాసనోల్లంఘన ఉద్యమంలో చరిత్రకందని నారీమణులు జాగృతి వ్యాసం Dt. ఏప్రిల్‌ 11-17
4. ‌4. “Harijan” dated 9, అక్టోబర్‌ 1944

5. Mandeswara Sharma as Peasant Leader by M Suseela Rao — Vijayawada 6. Highlights of Freedom Movement  by Sarojani Regani

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE