గోరక్ష పేరుతోనో, మరొక కారణంతోనో హిందువుల చేతిలో ఒక ముస్లిం చనిపోతే అది నేరం. ఉదారవాదులు గగ్గోలు పెట్టకున్నా అది ఘోరమే. క్షమించరాని నేరమే. కానీ హిందువు అన్న కారణంగా ముస్లింల చేతిలో హిందువు చనిపోతే అది ఘోరం కాదా? అది నేరం కాబోదా? ‘హిందూత్వవాదుల’ చేతిలో ఒక ముస్లిం చనిపోయినప్పుడు ఉదారవాదులు, సెక్యులరిస్టులు, కాంగ్రెస్, కమ్యూనిస్టు విద్రోహశక్తులు గొంతు చించుకున్నట్టు, ముస్లింల చేతిలో ఒక హిందువు చనిపోతే కనీసంగా కూడా నోరు మెదపరేమి? ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న ప్రశ్న ఇదే. మే 4న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన బిల్లీపురం నాగరాజు హత్యోదంతం తరువాత అందరూ వేస్తున్న ప్రశ్న ఇదే. నిజానికి ప్రశ్న పాతదే. ఈ ఉదంతంలో అది ప్రస్పుటంగా వినిపించింది. సాధారణ ప్రజానీకం నోరు విప్పడానికి ఇంత సమయం పట్టింది. మారెడుపల్లెకు చెందిన బిల్లీపురం నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా అనే యువతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఎస్‌సీ వర్గానికి చెందిన నాగరాజును నడిరోడ్డు మీదే అతి కిరాతకంగా హత్య చేసినా బీజేపీ ఎస్‌సీ విభాగం, ఏబీవీపీ తప్ప మరెవరూ వెంటనే నోరు విప్పలేదు. దొంగలు పడిన ఆరుమాసాలకు అన్నట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసినీ అలీ మొత్తానికి మే8న మొసలి కన్నీరు కార్చారు. కాంగ్రెస్, తెరాస, మిగిలిన ఆమాంబాపతు పార్టీలు ఇంతవరకు నోరెత్తలేదు. ఎందుకు?
హిందువుల చేతిలోనే కాదు, ఎవరి చేతిలో ఎవరు హత్యకు గురైనా, అంటే అవతలి వారి జీవించే హక్కును హరించినా అది నేరమే. మత విశ్వాసాలను అందుకు ఆధారం చేసుకుంటే అంతకంటే పెద్ద నేరం. దానిని ఎవరు ప్రశ్నించినా తప్పులేదు. కానీ ముస్లింల చేతిలో ఒక హిందువు మరణిస్తే హక్కుల కార్యకర్తలు, దళిత సంఘాల వారు ఎవరూ ఎందుకు నోరెత్తడం లేదు? ముస్లింల చేతిలో హిందువు చనిపోయినా పట్టించుకోనక్కరలేదని సూచనా? ముస్లింలు చంపితే నేరం కాదని భావించే స్థితికి సమాజం వచ్చిందా? హిందూ ముస్లిం ఐక్యతకు ఇలాంటి ఎంపిక చేసుకున్న మౌనం చక్కని మార్గమని నిర్ణయానికి వచ్చారా?దళిత సంఘాలు సైతం నోరు విప్పకపోవడం ఆత్మహత్యాసదృశం కాదా?
తమ వివాహం ఎక్కడికి దారితీసే అవకాశం ఉన్నదో ఆ ఇద్దరికీ తెలియకపోలేదు. వీరిది వికారాబాద్ వద్ద మర్పల్లి. పెళ్లికి ముందే సుల్తానా సోదరుడు (మొబిన్) ఈ పెళ్లీ ప్రేమ తక్షణం ఆపాలంటూ రెండుసార్లు హెచ్చరించి, వినక పోవడంతో సోదరికి ఉరి వేసి చంపడానికి ప్రయత్నిం చాడు. ఇది స్వయంగా సుల్తానాయే చెప్పింది. తరువాతే సుల్తానా, నాగరాజు హైదరాబాద్ వచ్చి ఆర్య సమాజ్ మందిర్‌లో పెళ్లి చేసుకున్నారు (ఈ జనవరిలో పెళ్లి తరువాత తన పేరును ఆమె పల్లవి అని మార్చుకుంది. ఇది తన పుట్టింటివాళ్లకు ఆచూకీ దొరకకుండానే. హిందూమతంలోకి మారడం వల్ల కాదు). ఆఖరికి సుల్తానా తల్లి కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ అన్న నిన్ను చంపుతాడు అని భయం వ్యక్తం చేసింది. కానీ నాగరాజు మాత్రం చావైనా, జీవితమైనా నీతోనే అని స్పష్టంగా చెప్పాడు. నీ కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధమేనని అన్నాడు. అశ్రిన్ సోదరుడే మొత్తానికి ఆమెకు వైధవ్యం తెచ్చిపెట్టాడు. మొబిన్ తీవ్రంగా కొట్టడం వల్లే తన తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోయాడని మరొక తీవ్రమైన విషయాన్ని కూడా అశ్రిన్ ఇటీవలే బయటపెట్టింది. కాగా నాగరాజు అతని తల్లిదండ్రు లకు ఏకైక సంతానం.
సరూర్‌నగర్ ఉదంతాన్ని తెరాస (ప్రభుత్వ) పోలీసులు తప్ప దేశంలోని చాలామంది పరువు హత్యగా కంటే, మతోన్మాదంతో ముడిపడిన అంశంగా పరిగణించడానికి మొగ్గు చూపుతున్నారు. ‘ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ హత్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది’… ముస్లిం థింకర్స్ డయాస్ పేరుతో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో (మే 7) వచ్చిన సంపాదక లేఖలోని తొలి వాక్యాలు ఇవి. ‘హైదరాబాద్‌లో దళితుడైన నాగరాజును అతడి భార్య కుటుంబం చంపేసింది. వీళ్లు ముస్లింలలో అత్యున్నత కులానికి చెందిన సయ్యద్‌లు, కులం అనేది ప్రేమకు వ్యతిరేక మైనది. నాగరాజు, అశ్రిన్‌ల ఐక్యత క్రూరమైన కుల వ్యవస్థ మీద తిరుగుబాటు. నాగరాజు అమరు డయ్యాడు.’ అంటూ ఖాలిద్ అనీస్ అన్సారీ (సోషియాలజీ ప్రొఫెసర్) ఇచ్చిన ప్రకటన కూడా అదే రోజు అదే పత్రికలో కనిపించింది. ‘మతోన్మాదం మనల్ని నీచమైన సామాజిక పశువులుగా తయారు చేస్తోంది. ముస్లిం మహిళను పెళ్లాడినందుకు హిందూ పురుషుడిని చంపడం అనేది మానవ ఉనికికి అత్యంత వినాశకరమైనది. నిందితులను వీలైనంత త్వరగా శిక్షించాలి.’ అంటూ అనికా నజీర్ అనే సామాజిక కార్యకర్త వ్యాఖ్యానించారు. ‘హైదరా బాద్‌లో జరిగిన దళిత యువకుడు నాగరాజు పరువు హత్య టుక్డే టుక్డే గ్యాంగులకు చెంపపెట్టు వంటిది. యువకుడు కాకుండా అతడి ముస్లిం భార్య హత్యకు గురై ఉంటే ఇప్పుడున్న నిశ్శబ్దం స్థానంలో గందరగోళం చెలరేగేది. దళిత బిడ్డను హత్య చేస్తే టుక్డే గ్యాంగ్ నోరు మెడదపడం లేదు’.. ఇది కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పట్నా నుంచి ఇచ్చిన ప్రకటనలోని భాగం. ఆయన దృష్టికోణం వేరుగా ఉన్నా, అంచనా సరైనదే. అదే జరిగితే ఎన్నో నోళ్లు పెగలేవే.
ఇంతమంది ఈ హత్యను మతోన్మాదంతో కూడిన చర్యగా చెబుతున్నా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు పరువు హత్యగా కనిపించడానికి ఉన్న కారణాలు వేరు. ముస్లిం యువకులు చేసే ఏ నేరాన్నయినా మాఫీ చేయడానికి ముందుండే మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ నాయకులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ఇలాంటి హత్యను ముస్లిం సమాజం అంగీకరించదు అంటూ ఆ పార్టీ నాయకుడు అసదుద్దీన్ లాంఛనంగా ఒక ప్రకటన విడుదల చేసినప్పటికి దానిని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కొన్ని నెలల క్రితం, ఒక ముస్లిం యువతి కోరి ఒక హిందూ యువకుడి ద్విచక్ర వాహనం ఎక్కినందుకు ఆ వర్గ యువ మతోన్మాదులు హిందూ యువకుడిని చావగొట్టారు. అప్పుడు కూడా ఇలాంటివి ఇస్లాం అంగీకరించదు అని మాత్రమే ఓవైసీ కంటితుడుపు ప్రకటన ఇచ్చారు. ఈ ధోరణి దేనికి నిదర్శనం?
ఇక బుజ్జగింపు రాజకీయాలకు ఆద్యులైన కాంగ్రెస్‌వాదులు ఎలాగూ మాట్లాడరు. కాటికి కాళ్లు చాచుకున్న కామ్రేడ్ల పార్టీ కూడా అంతే. పైన ఇచ్చిన వ్యాఖ్యలలో ఒకటి చెబుతున్నట్టు, అదే ఆ ముస్లిం యువతి హత్యకు గురై ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అనుకోకుండా నాగరాజు హత్య దేశంలో చర్చనీయాంశంగా మారడానికి ఇవన్నీ కారణాలు కావడమే చిత్రం. ఎంపిక చేసుకున్న నిరసనలలోని దగాకోరుతనమే ఇప్పుడు వాళ్ల నిజాయితీని నిలదీసే శక్తిగా తయారయింది.. ఇందులో అరెస్టులు, అశ్రిన్ ఆక్రోశం వంటివన్నీ మరొకసారి చెప్పవలసిన అవసరం లేదు. వ్యవస్థలు తమంతట తాము కదలి ఈ అంశం గురించి వాకబు చేశాయి. నాగరాజు హత్యపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియ చేయవలసిందిగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను, పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. కమిషన్ తనకు తానుగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ నివేదిక కోరారు. ఈ హత్య వెనుక పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రమేయం ఉండవచ్చునన్న బీజేపీ గోషామహల్ (హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణ మీద కూడా దర్యాప్తు అవసరం. అలాగే అశ్రిన్ ఆరోపించిన అంశాలు, చిన్న నాటి నుంచి మొబిన్ నేర మనస్తత్వం, తండ్రిని కొట్టి చంపడం వంటి విషయాలను కూడా వెలుగులోకి తేవడం అవసరం. పోలీసుల చర్య ఒక వర్గానికి అనుకూలంగా ఉందన్న ఆరోపణలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి.
నాగరాజు, ఆశ్రిన్ పెళ్లి, తరువాత అతడి హత్య, అందులోని నిజాలు ఎస్‌సీ వర్గాలకు కొత్త దృష్టిని ఇస్తాయని, ఇవ్వాలని ఆశించాలి. పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులు ఎస్‌సీ, ముస్లిం ఐక్యత గురించి పదేపదే ప్రకటనలు చేశారు. ముస్లిం పార్టీల నాయకులు కొందరు ఇలాంటి ప్రకటనలు చేయడం కొత్త కాదనీ, అది రాజకీయ ప్రయోజనం కోసమేనని చాలాసార్లు రుజువైంది. తాజాగా జరిగిన నాగరాజు హత్య దానిని ధ్రువీకరిస్తున్నది. ఎస్‌సీలను ముస్లింలు మతాంతరీకరణకు ఉపయోగించు కుంటారు. ఆ విధంగా ముస్లిం బలాన్ని పెంచుకునే వ్యూహంలో పావులను చేస్తారు. అంతేగాని, వారికి తమతో సమ స్థానం కల్పించరు. దీనిర్థం తమ వర్గ యువతులను ఇష్టానిష్టాలతో నిమిత్తం ఏకుండా ఎస్‌సీ వర్గాలకు ఇచ్చి రాజకీయ పెళ్లిళ్లు చేయమని కాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో ప్రేమ పేరుతో దగ్గరయినప్పటికీ అది కూడా సహించరని అర్ధమయి పోయింది. ఎస్‌సీలను పార్టీ ఆఫీసులకు ఆహ్వానించ గలరే గానీ, సొంత ఇళ్లకు కాదు. జంటలో హిందువు హిందువుగా మిగిలిపోతే ఇలాంటి గతి పడుతుంది. మతం మారితే సంగతి వేరు. ఇక యువతికి మతం మారడం తప్పనిసరి. ప్రేమించినప్పుడు ప్రదర్శించిన విశాల హృదయం కుంచించుకుపోయి, మతమార్పిడి తరువాతే పెళ్లి అనే స్థితికి వస్తుంది. అందుకే దీనిని చాలామంది లవ్ జిహాద్‌గా పేర్కొంటున్నారు. ఎస్‌సీలు ముస్లింల వలలో పడకుండా ఉండడం దేశ హితానికి సంబంధించిన విషయమో, సంస్కరణకు సంబంధించిన విషయమో కాదు. ఇది ఎస్‌సీల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తమ వర్గానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఎస్‌సీని హిందువుగానే పరిగణించి చంపారు. నిన్న మొన్న ఇచ్చిన ‘దళిత-ముస్లిం ఐక్యత’ నినాదాన్ని కీమా చేశారు. క్రైస్తవుల కూడా దీనికి తీసిపోరు. వీళ్లు కాస్త నాజూకుగా గొంతు కోయగలరు. క్రైస్తవంలోకి మార్చినా పాత కుల వ్యవస్థ, వివక్ష నుంచి ఎస్‌సీలకు విముక్తి కలిగిన దాఖలాలు లేవు. వారు ‘దళిత క్రైస్తవు’లే అవుతున్నారు. కొన్నిచోట్ల వారికి వేరే ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. చిత్రంగా కమ్యూనిస్టులకు ఏడుపదుల తరువాత గానీ, కేంద్ర స్థాయి కమిటీలో ఎస్‌సీకి సభ్యత్వం ఇవ్వడానికి సమయం దొరకలేదు.
ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మతాంతరీకరణ వల్ల ఎస్‌సీల సామాజిక స్థితిగతులు మారవు. ఆ రెండు ఎడారి మతాలలోను ఆది నుంచి ఉన్న విభేదాలు, విద్వేషాల సంగతేమిటో తేలితే కదా! కాబట్టి ఎస్‌సీలు హిందూ సమాజంలోనే ఉంటేనే ఆత్మ గౌరవంతో జీవించగలరు. తమ హక్కులను గౌరవప్రదంగా సాధించుకోగలరు. హిందూ సమాజంలో సంస్కరణలకు అవకాశం ఉంది. ఆ మతాలలో ఆ ఊసే లేదు. ఎన్నటికీ యథాతథ స్థితే.
– జాగృతి డెస్క్