– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
అమెరికాకు, అభిజాత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిని వేర్వేరుగా చూడలేం. అగ్రరాజ్య అధినేతలు, అగ్రనేతల్లో అడుగడుగునా అభిజాత్యం, అహంకారం ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వారి మాటలు, చేతలు ఆ తీరుగానే ఉంటాయి. అన్ని దేశాలూ తాము చెప్పినట్లే వినాలని, తమ బాటలోనే నడవాలని ఆ దేశ నాయకులు కోరు కుంటారు. అంతేతప్ప తాము మాట్లాడుతున్నది ఒక సార్వభౌమ దేశంతో అని, దానికంటూ ప్రత్యేక ఆలోచనలు, అభిప్రాయాలు, విధానాలు ఉంటాయన్న ఆలోచన వారికి ఉండనే ఉండదు. చర్చల్లో తమదే పైచేయి ఉండాలని భావిస్తుంటారు. తాము చెప్పినట్లు వినకపోతే ఆంక్షల రూపంలో బెదిరిస్తారు. వాటిని లెక్కచేయకపోతే మానవహక్కులు మంటగలుస్తు న్నాయని బురద జల్లుతారు. దీనిని తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తారు. ఆ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి నాయకుల తీరు అదే. కానీ ప్రపంచం మారుతున్నదనీ, అంతర్జాతీయంగా ప్రతి దేశం తనదైన విధానంతో ముందుకు సాగుతున్నదని, దానిని గౌరవించాలన్న ఆలోచనే వారికి ఉండదు. అయితే, పరిస్థితులు మారాయని, తమకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని, అన్ని దేశాలతో మాట్లాడినట్లు భారత్‌తో మాట్లాడితే కుదరదని అగ్రరాజ్య నాయకులకు ఇటీవల అనుభవ పూర్వకంగా అర్థమైంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. యావత్ ప్రపంచం రష్యా అనుకూల, వ్యతిరేక దేశాలుగా చీలిపోయింది. అమెరికా, ఐరోపా దేశాలు, ఇతర పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ వైపు నిలిచాయి. ఆ దేశానికి నైతికంగా, ఆర్థికంగా, ఆయుధ పరంగా అండగా నిలిచాయి. చైనా వంటి కొన్ని దేశాలు రష్యా వైపు ఉన్నాయి. భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. అటు ఉక్రెయిన్, ఇటు రష్యా.. రెండూ మనకు మిత్ర దేశాలే. రష్యాతో భారత్ బంధం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పూర్వ సోవియట్ యూనియన్ నుంచి ఇప్పటి రష్యా దాకా ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో భారత్‌కు ఆ దేశం బాసటగా నిలిచిన విషయం అంతర్జాతీయ సమాజానికి తెలియని సంగతి కాదు. తొలి రోజుల్లో అమెరికా దూరంగా ఉన్నప్పటికీ భారత్‌కు నాటి సోవియట్ యూనియన్ అండగా ఉన్న విషయం తెలిసిందే. సోవియట్ విచ్ఛిన్నం అనంతరమూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పుతిన్ హయాంలోనూ ఈ బంధం బలోపేతమవుతూనే ఉంది. ఇక 90ల్లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఉక్రెయిన్‌తోనూ భారత్‌కు భేషైన సంబంధాలు ఉన్నాయి. అనేక అంశాల్లో రెండు దేశాలు కలసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి భారత్‌కు సంకట పరిస్థితిని కొని తెచ్చింది. భారత్ ఎవరివైపు నిలుస్తుందన్న ఆసక్తి అంతటా ఏర్పడింది. ఈ విషయంలో ఒక శాంతికాముక దేశంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం తనదైన పాత్రను పోషించింది. రష్యా చిరకాల మిత్ర దేశమైనప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించలేదు. ఎక్కడా నీళ్లు నమలలేదు. నంగినంగిగా మాట్లాడలేదు. అసలు ఆధునిక ప్రపంచంలో యుద్ధం అనే మాటకు తావులేదని విస్పష్టంగా పేర్కొంది. దేశం ఎంత చిన్నదైనప్పటికీ దాని సార్వభౌమత్వాన్ని గౌరవించి తీరాల్సిందేనని శషభిషలకు తావులేకుండా స్పష్టంచే సింది. అదే సమయంలో ఉక్రెయిన్‌కు నైతికంగా మద్దతు తెలిపింది. చర్చలతో సమస్య పరిష్కరించు కోవాలని ఉభయ దేశాలకు సూచించింది. అవసర మైతే తనవంతుగా మధ్యవర్తి పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ సమాజం సైతం భారత్ వైఖరిని అభినందించింది. దాడికి గురైన ఉక్రెయిన్ సైతం భారత్ పాత్రను తప్పు పట్టలేదు. ఒక తటస్థ దేశంగా తన వంతు పాత్రను సమర్థంగా పోషించింది.
భారత్ ఇంత స్పష్టంగా తన వైఖరిని అనేకమార్లు వెల్లడించినప్పటికీ అగ్రరాజ్యమైన అమెరికాకు అసలు విషయం అర్థం కావడం లేదు. నిజానికి విషయం అర్థమైంది. కానీ అర్థంకానట్లు వ్యవహరిస్తోంది. రష్యాను తాను వ్యతిరేకిస్తున్నందున అందరూ వ్యతిరేకించాలన్నది దాని వైఖరి. ఇది పూర్తిగా తప్పు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతి దేశానికీ తనదైన విధానం ఉంటుంది. ప్రయోజనాలు ఉంటాయి. ద్వైపాక్షిక అంశాలుంటాయి. వీటిని విస్మరించి అందరూ తాను చెప్పినట్లే వినాలని, తన బాటలోనే నడవాలనుకోవడం అర్థరహితం. ఒక సార్వభౌమ దేశంగా ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంటుంది. అంతే తప్ప ఏ దేశం మరో దేశంపై తన అభిప్రాయాన్ని, విధానాన్ని రుద్దలేదు. ఈ విషయాన్ని గుర్తించకపోవడం అమెరికా పొరపాటు. ఇటీవల జరిగిన భారత్, అమెరికా టూ ప్లస్ టూ (ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం) చర్చల్లో అమెరికా ఈ విషయాన్ని ప్రస్తావించి అభాసుపాలైంది. రష్యావైపు భారత్ నిలిచిందని తన అక్కసు వెళ్లగక్కింది. చర్చల్లో అమెరికా, భారత్ రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాను భారత్ గట్టిగా వ్యతిరేకించలేదన్న భావన బ్లింకెన్ మాటల్లో వ్యక్తమైంది. అంతకుముందు అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ భారత్ పర్యటన సందర్భంగా అసందర్భ, అనవసర ప్రేలాపన చేశారు. భవిష్యత్తులో భారత్‌పై చైనా దురాక్రమణకు దిగితే రష్యా మీకు అండగా ఉంటుందా? అని ప్రశ్నించి తన కురచబుద్ధిని, అపరిపక్వతను చాటుకున్నారు. ఒక దేశానికి ప్రాతినిథ్యం వహించే నాయకుడు ఇలా సందర్భ శుద్ధి లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం ఎంతమాత్రం సహేతుకత అనిపించుకోదు. ఇదే భావనను టూ ప్లస్ టూ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత్ ముడిచమురును కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాక భారత్‌లో మానవ హక్కులు హననానికి గురవుతున్నాయంటూ అజెండాలో లేనివి ప్రస్తావించారు.
ఇలాంటి సందర్భాల్లో గతంలో సాధారణంగా భారత్ ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శించేది. అగ్రరాజ్యానికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించేది. అమెరికా ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు తాపత్రయ పడేది. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ గతానికి భిన్నంగా, దీటుగా స్పందించింది. పదునైన వాదనతో ప్రత్యుత్తురం ఇచ్చింది. విదేశాంగ మంత్రి జైశంకర్ భారత వాదనను పకడ్బందీగా వినిపించి అమెరికా నోరు మూయించారు. ఇంధన భద్రత కోసం రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడిచమురు చాలా స్వల్పం. మేము ఒక నెల మొత్తంలో కొనుగోలు చేస్తున్న రష్యా ఇంధనం కంటే ఐరోపా సమాజం ఒక పూట కొనుగోలు చేస్తున్నది ఎంతో ఎక్కువ. ఈ విషయాన్ని అమెరికా గ్రహించ నట్లు లేదని దీటుగా బదులిచ్చారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసినంత మాత్రాన ఉక్రెయిన్‌పై ఆ దేశం దాడిని సమర్థించినట్లు కాదని, ఉక్రెయిన్‌ను వ్యతిరేకించినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి సార్వభౌమత్వ దేశానికి తనకంటూ ఒక విధానం ఉంటుందని, అది తన ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. అన్ని విషయాల్లోనూ తాను చెప్పినట్లు వినాలనే వాదన సరికాదని స్పష్టం చేశారు. భారత్‌లో మానవ హక్కులు గురించి మాట్లాడే ముందు తన సొంత రికార్డును సరిచూసుకోవాలని అమెరికాకు సూచించారు. గత వారమే అమెరికాలో ఇద్దరు సిక్కులపై దుర్విచక్షణతో దాడి జరిగిందని, స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతి రూపంగా పేర్కొనే అగ్రరాజ్యంలో జరిగిన ఇటువంటి ఘటనలను తామూ ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో మానవ హక్కులకు, మైనార్టీల హక్కులకు ఎలాంటి ఇబ్బంది లేదని, అలాంటి సంఘటనలు జరిగితే ప్రతిస్పందించడానికి చట్టబద్ధమైన జాతీయ మానవ హక్కుల కమిషన్, మైనార్టీ, బీసీ హక్కుల సంఘాలు, సంపూర్ణ స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఉన్నాయని చెప్పడంతో ఆంటోనీ బ్లింకెన్‌కు నోట మాట రాలేదు. అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్ష తమకు తెలుసని వ్యాఖ్యా నించడం ద్వారా బ్లింకెన్‌కు దీటుగా బదులిచ్చారు. వాషింగ్టన్ భాగస్వామిగా లేని రోజుల నుంచే రష్యాతో భారత్‌కు బలీయమైన సంబంధాలు ఉన్నాయని, ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదన్న జైశంకర్ వాదనకు చివరికి అమెరికా తల ఊపక తప్పలేదు. చైనా దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో భారత్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలను దీటుగా తిప్పికొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో 20 మంది తమ సైనికులు అమరులైన విషయాన్ని పేర్కొనగా, చైనా మాత్రం మరణాల విషయాన్ని తొక్కిపెట్టింది. చివరకు భారత్ కన్నా ఎక్కువ ప్రాణనష్టం చైనాకే జరిగిందని తరవాత అంతర్జాతీయ మీడియా వెల్లడించిన విషయం గమనార్హం. ఇక్కడ అమెరికా, చైనా, పాకిస్తాన్ లేదా మరే ఇతర దేశమైనా గ్రహించాల్సిన విషయం ఒకటుంది. 1960ల నాటి భారత్‌కు 2020ల నాటి భారత్‌కు చాలా తేడా ఉందన్న విషయన్ని గుర్తించడం ముఖ్యం. దొంగదెబ్బ తీసిన ప్రతిసారీ పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల నాటి కార్గిల్ మోసాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని అటల్ బిహారీ వాజపేయి సర్కారు తిప్పికొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. నేటి నరేంద్ర మోదీ సర్కారు సైతం అంతకుమించిన బలం, వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ విషయం చైనా సైతం గుర్తించింది. అందుకే సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగడం లేదు. ఎవరి మద్దతు లేకుండానే చైనాను నిలువరించే శక్తి భారత్‌కు ఉందన్న విషయాన్ని అగ్రరాజ్యం గ్రహించాలి. టూ ప్లస్ టూ చర్చలకు ముందు రష్యా అంటే భారత్‌కు వణుకు… అని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించి తరవాత నాలుక కరచుకున్నారు. ప్రధాని మోదీతో జరిగిన వర్చువల్ భేటీలో ఈ విషయాన్ని విస్మరించి రెండు దేశాలూ కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.
మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్, అమెరికాలు కలసి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల రెండు దేశాలతోపాటు అంతర్జాతీయ సమాజానికీ మేలు కలుగతుంది. రెండు అతిపెద్ద, ప్రజాస్వామ్య దేశాలు చేయి చేయి కలిపి ముందుకు నడవాల్సిన అవసరం గతంలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారత్ ఒక పక్క రష్యాతో స్నేహం కొనసాగిస్తూనే మరోపక్క గత కొన్నేళ్లుగా వాషింగ్టన్‌తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్వాడ్ (చతుర్భుజ కూటమి)లో భాగస్వామిగా చేరింది. ఇందులో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా భాగస్వామ్య దేశాలు. టూ ప్లస్ టూ చర్చలు ఒక్క అమెరికాతోనే భారత్ జరపడం లేదు. ఆస్ట్రేలియా, జపాన్, రష్యాతోనూ ఇదే తరహా చర్చలను కొనసాగిస్తోంది. గత ఏడాది డిసెంబరు మొదటివారంలో రష్యా అధినేత వ్లాదిమిర్ భారత్ సందర్శించడం గమనార్హం. అమెరికాతో అనుబంధం ఎంత ముఖ్యమో ఇతర దేశాలతో సంబంధాలు కూడా భారత్‌కు అంతే కీలకం. ఒక దేశంతో స్నేహంగా ఉన్నంత మాత్రాన మరో దేశంతో వ్యతిరేకంగా ఉన్నట్లు కాదు. ఇది భారత్ విధానం. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. రమారమి 44 లక్షల మంది మేథా సంపన్న ప్రవాస భారతీయులు అగ్రరాజ్యంలో ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా పనిచేస్తున్నారు. అమెరికాలో సుమారు 2.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోరంత విషయాన్ని కొండంతగా చూడటం ఉభయులకూ శ్రేయస్కరం కాదు.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్