– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు, 9440172642

శ్యామశాస్త్రిగారి తాంబూల చర్వణం

శ్యామశాస్త్రిగారికి తాంబూల సేవన బాగా అలవాటు. ఒకచేత్తో తంబురా పుచ్చుకుని, ఇంకో చేత్తో తాళం వేస్తూ ఆయన పాడుతుంటే, ఎదురుగా తమలపాకుల కరండం పెట్టె, దానిపక్కనే వక్కలు కత్తిరించే అడకత్తెర కనిపించేలా శ్యామశాస్త్రిగారి చిత్రం ఒకటి బహుళ ప్రచారంలో ఉంది.

టి. యస్‌. ‌పార్థసారథిగారు వ్రాసిన ‘‘శ్రీశ్యామ శాస్త్రికృతులు’’ అనే గ్రంథం భావరాజు నరసింహా రావుగారి సంపాదకత్వంలో వెలువడింది. అందులో శ్యామశాస్త్రిగారి నిరంతర తాంబూల సేవన గురించిన ఒక ఉదంతం ఉంది:

శ్యామశాస్త్రిగారికి గురువు సంగీతస్వామి. ఆయన ఒకరోజు ‘‘ఇంక నీ విద్య ముగిసింది, సంగీతాన్ని వినడం మొదలు పెట్టు. తంజావూరు వెళ్లి పచ్చిమిర్యం ఆదియప్పయ్య సంగీతం విను. కానీ, ఆయన దగ్గర సంగీతం మాత్రం నేర్చుకోకు’’ అని హెచ్చరించి పంపించారట. ఆదియప్పయ్య గొప్ప విద్వాంసుడేగానీ, మంచి గురువు కాదని గురువు అభిప్రాయం. గురువాదేశం ప్రకారం శ్యామశాస్త్రిగారు తంజావూరు వెళ్లి ఆదియప్పయ్య గారిని పరిచయం చేసుకున్నారు. క్రమేణా ఆ ఇద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరింది.

ఒక రోజు శ్యామశాస్త్రిగారు తాంబూల సేవనచేస్తూండగా, నోటి చిందులు వెళ్లి, ఆదియప్పయ్యగారి బట్టమీద పడ్డాయి. శ్యామశాస్త్రి క్షమాపణ కోరి, ఆ బట్టమీద మరక తుడిచేయటానికి నీళ్లకోసం లేచాడు. కానీ, ఆదియప్పయ్య వారించి, ‘‘శ్రీదేవి తాంబూలముఖి కదా! ఈ మరక నాకు ఆ కామాక్షీదేవి అనుగ్రహం. ఇప్పుడే నాకు నిజమైన సంగీత లోకానికి ప్రవేశం లభించింది’’ అన్నాడని చెప్తారు.

దమయంతిగారి తాంబూలం పెట్టె

భైమీసమీ సే స నిరీక్ష్య యత్ర తాంబూల జాంబూనదహంసలక్ష్మీమ్‌?

‌కృత ప్రియాదూత్య మహోపకార మరాళ మోహ ద్రఢిమాన మూహే!!

కవులంతా కథలో మలుపులు తిప్పటానికి తాంబూలాన్ని ఉపయోగించుకుంటే శ్రీ హర్షుడు శృంగార నైషధంలో కరండం (తాంబూలం పెట్టె) మీద చిత్రించిన స్వర్ణహంసని ఉపయోగించు కున్నాడు: నలుడిని దమయంతినీ ఓ హంస కలిపింది. స్వయంవరంలో తమనే వరించేలా చూడమని దేవతలు అతన్ని తమ రాయబారిగా పంపుతారు. ఆమె నలుణ్ణి మాత్రమే పెళ్ళాడతానని గట్టిగా చెప్తుంది స్వయంవరం మొదలౌతుంది.

దమయంతి దగ్గర తాంబూల పెట్టె మీద ఆ రోజు రాయబారం నడిపిన స్వర్ణహంస బొమ్మ అతని సందేహాన్ని తీర్చింది. దమయంతి తననే కోరు తోందనటానికి అది సాక్ష్యంగా భావించాడు నలుడు.

తాంబూలం కథలు మన సాహిత్యంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. తాంబూలాన్ని గౌరవించటం, తాంబూల గౌరవం పొందటం మన సంస్కృతి. ఇందులో పొగాకు చేరటమే మన సంస్కృతిని కలుషితం చేసిన అంశం.

కారాకిళ్లి

కారాకు అంటే పండుటాకు, ముదిరిన ఆకు అని! ఈ ఆకులో పొగాకుని చేర్చి ఇతర సుగంధద్రవ్యాలతో చుట్టిన కిళ్లీని కారాకిళ్లీ అంటారని మాండలికపదకోశం పేర్కొనగా, కారపుకిళ్లి మసాలా వస్తువులు చేరిన తాంబూలము అని ఆంధ్రవాచస్పత్యం అర్థాన్నిచ్చింది.

1939లో మంచికంటి రాజారావు అనే కవి ‘కారకిళ్లి మహోపన్యాసము’ అనే పుస్తకంలో కారకిల్లీ ఆత్మకథని, కారకిళ్లీ దండకాన్ని, కారకిళ్లి నవరత్నాల్ని రాశాడు.

చేమకుర వేంకట కవి విజయవిలాసంలో రాజధాని నగరాన్ని తాంబూలంతో మిళితం చేసి వర్ణిస్తాడు:

‘‘పోకమ్రాకుల మహిమ కప్పురపుటవటి/యాకుతోటల సౌభాగ్య మందు కలదు

ప్రబలు మౌక్తిక సౌధ సంపదల మహిమ/వీటి రహి మెచ్చవలయుఁ బో వేయునోళ్ల’’

ఆ ఊళ్లో వక్కచెట్లు, తమలపాకుల తోటలు, ముత్యాల్లాంటి సౌధాల సంపదలు తాంబూలాన్ని తలపిస్తున్నాయని ఈ పద్యంలో అంతరార్థం. ఆ నగరానిది తాంబూల శోభ! కవితా శోభలో ఈ తాంబూలం గుబాళించింది.

తాంబూలం కథలు

పొడుపు కథలు:

‘‘శిల వృక్ష లతల బుట్టిన

చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్‌

‌తలవాకిట రమియింతురు

సలలితముగ దీనినెరుగు సరసులు గలరె’’ శిలల నుండి రాతిసున్నం, వృక్షం నుండి వక్క, లతల నుండి తమలపాకు. ఈ ముగ్గురు స్నేహితురాళ్లూ చిడిముడి అంటే తొందరపడుతూ తలవాకిట్లో (నోట్లో) రమిస్తుంటారు. అంటే ఆనందంగా తిరుగు తుంటారట.

‘‘అతన్ని పోనీకుండా పట్టుకోండి! వెన్ను విరిచి వెన్నపూయండి, భద్రంగా బంధించండి’’ వెన్నెముక విరవడం అంటే తమలపాకు మధ్య ఈనె తీయటం. వెన్నపూయటం అంటే ఆకులకు సున్నం రాయటం. గదిలో బంధించటం అంటే నోట్లో వేసుకుని నమలటం. తాంబూలం పొడుపుకథ ఇది

చెట్టున బుట్టిన చెంగి

రాతిన బుట్టిన రంగి

తీగనుబుట్టిన తిమ్మి

బావనోట్లో వసంతాలాట’’

చెంగికాచు/వక్క, రంగిసున్నం; తిమ్మితమల పాకు. వసంతాలాట తాంబూలం ఎర్రగా పండి పరిమళం వెదజల్లటం

మా తాత మూడెద్దులను కాలవవతల నుండి తీసుకొస్తుంటే

ఒక ఎద్దు మునిగింది, ఒక ఎద్దు తేలింది, ఒక ఎద్దు కరిగింది.

తాంబూలచర్వణం నాగరికులే కాదు జానపదులు కూడా చేస్తారు. ఓ జానపదుడు తాంబూలం గురించి ఇలా చెప్తున్నాడు: మా తాతకి మూడు ఎద్దులున్నాయి. ఒక ఎద్దు మునిగింది. ఒక ఎద్దు తేలింది. ఒక ఎద్దు కరిగింది…అని! పచ్చి వక్క తెల్లగా ఉంటుంది. అది నీటిలో వేస్తే మునుగుతుంది. అదొక ఎద్దు. తెల్లతమలపాకులు ఇంకో ఎద్దు. అది నీటిలో వేస్తే తేల్తుంది. ఇంకో ఎద్దు తెల్లని రాతి సున్నం. అది నీటిలో వేస్తే కరుగుతుంది. వీటి తెల్లరంగుని బట్టి ఎద్దులతో పోల్చి, వాటి స్వభావాన్ని వివరిస్తాడీ పొడుపుకథలో!

‘‘పండిన దెండిన దొక్కటి ఖండించిన వచ్చి దొకటి కాలిన దొకటై తిండికి రుచియై యుండును ఖండితముగ దీని తెల్పు కవియుం గలడే! అంటూ ఓ చాటుకవి చిన్న పొడుపు కథని ఈ కందపద్యంలో ఇమిడ్చాడు. ‘‘పండిన దొకటి, ఎండినదొకటి, ఖండించగా వచ్చినదొకటి, కాలినదొకటితిండికి రుచైన ఉండేది అది ఏది? ఎవరైనా చెప్పగలరా’’ అని ఈ పొడుపు కథ అడుగుతుంది. ఆకు, వక్క, సుగంధ ద్రవ్యాలు, సున్నం ఇవి కలిసిన తాంబూలం రుచిగా ఉంటుందని దీని భావం .

తాంబూలాన్ని బట్టి రోగనిర్ధారణ

గాజుల లక్ష్మీనర్సుశెట్టి (1806-1868) ప్రసిద్ధ రాజకీయవేత్త. వాణిజ్య వేత్త. దేశాభిమాని. మద్రాసు ప్రెసిడెన్సీలో హిందువుల అణచివేత, క్రైస్తవ మత మార్పిడులు, ప్రభుత్వ మతపక్షపాతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు. గురువైద్యులు ఒకాయన మద్రాసులో ఆయన కుటుంబ వైద్యుడుగా ఉండేవారట!

ఒకరోజు తాంబూలం వేసుకుని నములుతూ మేడమీంచి సెట్టిగారు తమ్మని కిందికి ఊశాడట. సరిగ్గా అదే సమయానికి ఓ వైద్యగురువు తన శిష్యుడు నెల్లూరు తాలూకా ఇందుకూరుపేట వాస్తవ్యుడైన గాడేపల్లి సుబ్బాభొట్లుగారితో కలిసి ఆ వీధిన పోతున్నారు. గాజులవారు ఉమిసిన తమ్మని చూసి గురువైద్యులు ‘‘శెట్టిగారికి ఫలానా అనారోగ్యం సోకింది’’ అన్నాడట. శిష్యుడు మర్నాడు శెట్టిగారిని కలిసి, ‘‘నాలుగు మాసాలలోపు ఫలానా జంతుమాంసం తిన్నారా?’’ అనడిగితే ఔనని జవాబు చెప్పారట శెట్టిగారు. దానికి విరుగుడుగా ఫలానా మాంసం తినమని గురువుగారు చెప్పినట్టు, మీరు ఉమిసిన తమ్మను చూసి గురువుగారు మీకు ఈ అనారోగ్యం సోకిందని కనుగొన్నట్టూ చెప్పాడట. ఉమిసిన తమ్మని చూసి రోగ నిర్ధారణ చేసిన ప్రతిభావంతుడైన ఆ వైద్యుడి గురించి గునుపాటి యానాదిరెడ్డిగారు సదరు శిష్యుడైన గాడేపల్లి సుబ్బాభట్టుగారి ద్వారా తెలుసుకున్నట్టు చెప్పాడని జమీన్‌ ‌రైతు పత్రిక 30-3-45 సంచికలో ప్రచురించింది.

గయుడి తాంబూలం

తాంబూలం వేసుకుని కిందా పైనా చూసుకోకుండా ఆకాశంలో విహరిస్తూ ఉమ్మి వేయటం వలనే కదా గయుడి ప్రాణాల మీది కొచ్చింది! గయోపాఖ్యాన నాటకం మొత్తానికి తాంబూలమే మూలం. అది చివరికి కృష్ణుడికీ అర్జునుడికీ మధ్య యుద్ధం దాకా వెళ్లింది.

చిలకమర్తి లక్షీనరసింహం పంతులుగారు గొప్ప సంఘసంస్కర్త. అనేక ప్రహసనాలు వ్రాశారు. నవలా రచయిత నాటకకర్త. గయోపాఖ్యానం నాటకాన్ని 1889లో వ్రాశారాయన. 1909లో పుస్తకరూపంగా వెలువడే నాటికే అనేక వందలసార్లు ప్రదర్శించారు.

 తాంబూల గౌరవాలు

రాయలవారి యుగాన్ని తాంబూల యుగంగా చెప్పుకోవచ్చు. పరస్పర గౌరవాలకు, ఆత్మీయతలకు, అభిమానాలకు ఆ రోజుల్లో తంబూలాన్ని ఒక సాధనంగా వాడుకునేవారు. తాంబూలం ఇవ్వటం, తీసుకోవటం, సేవించటం మూడూ గౌరవప్రదాలే విజయనగర కాలంలో! తాంబూలాన్ని ఇవ్వటంలో ఎంత నిబద్ధత ఉండేదో తాంబూలాన్ని పుచ్చుకోవటం లోనూ అంత నిబద్ధత ఉండేది. మంచి ప్రబంధాలు వ్రాయమని కోరుతూ శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనామాత్యుడికీ, ముక్కుతిమ్మనార్యుడికీ ఒకేసారి తాంబూలం ఇచ్చాడని రాయవాచకం చెప్తోంది. అడిగిందే తడవుగా తిమ్మనగారు చెకచెకా పారిజాతా పహరణ ప్రబంధాన్ని ముగించి, ఇచ్చేశాడు. పెద్దనగారిలా కాకుండా లలితమైన పదాలతో కోమలమైన భావాలతో ఈ పారిజాతాపహరణం కావ్యరచన చేశాడు. ముక్కు తిమ్మన ముద్దు పలుకులుగా ఆయన్ని సమకాలికులుకూడా మెచ్చుకున్నారు.

ఆంధ్రకవితా పితామహుడుగా ప్రసిద్ధుడైన అల్లసాని పెద్దనగారు మాత్రం తాంబూలం పుచ్చు కున్నాడు గానీ రచన పూర్తి చేయలేదు. గజపతులమీద రాయలవారు విజయం సాధించాక కూడా ఆయన రచన పూర్తిచేసే ప్రయత్నం చెయ్యలేదు. మధ్యమధ్య రాయలవారు ‘‘ఎందాకా వచ్చిందీ మీ రచన’’ అని గుర్తుచేస్తూనే ఉండేవాడట. మరీ గట్టిగా అడిగేసరికి, కవిత్వం వ్రాయడమంటే మాటలా? అన్నట్టుగా పెద్దన చెప్పిన విసుగుపద్యం ఇది. కవిత్వం వ్రాయాలంటే కవులకు కావలసిన సామాన్ల పట్టీ ఇందులో ఇచ్చాడు.

‘‘నిరుపహతి స్థలంబు రమజణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క

ప్పురవిడె మాత్మ కింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయు రస్ఞలూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌

‌దొరకిన గాక! యూరక కృతుల్‌ ‌రచియింపు మటన్న శక్యమే?’’

ఎప్పుడు పడితే అప్పుడు కవిత్వం రాదు. అన్ని సౌకర్యాలతో క్షితమైన వ్యక్తిగత ఛాంబర్‌ (‌నిరుపహతి స్థలము) కావాలి. ఆపైన ఉయ్యాల మంచం, ఒప్పుతప్పు తెలిసి కవిత్వాన్ని ఆస్వాదించగల రసికులు ఎదురుగా ఉండాలి, ఊహ తెలుసుకోగలిగి చెప్పింది చెప్పినట్టు వ్రాసే లేఖకులు దొరకాలి. అన్నింటికీ మించి పాఠకోత్తములు ఉండాలి. అప్పుడే పారవశ్యంలో కవిత్వం వస్తుందన్నాడు. ఈయనకన్నా వేగంగా కృతిని పూర్తి చేసిన నందితిమ్మనగారికి ఈ సౌకర్యాలు తనకన్నా ఒకింత ఎక్కువగానే ఉన్నాయనే అధిక్షేపం ఏదో ఈ పద్యంలో దాగుంది. రాయల భార్య తిరుమల దేవికి అరణంగా వచ్చిన కవి నంది తిమ్మన కాబట్టి, రాణివాసంలో ఆయన సుఖభోగి. ఆయన కున్న ‘ప్రైవసీ’ పెద్దనగారికి ఉండి ఉండదు. మొత్తం మీద మనసు తెలిసిన వ్రాయసగాండ్రు వేగంగా వ్రాస్తుంటే ఈయన చక్కగా రమణీ ప్రియదూతిక అందించే తాంబూలం నములుతూ కవిత చెప్పేవాడన్నమాట.

పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. 1633 నుండి 1673 వరకు తంజావూరు నేలిన విజయరాఘవ నాయకుని భోగపత్ని. ఆస్థాన కవయిత్రి. ‘‘మన్నారు దాస విలాసము’’ అనే కావ్యం రాయటానికి ‘‘సబహు మానంబుగ తాంబూల జాంబూనదాంబర మాల్యాభరణాదు లొసంగిన, నేనును బరమా నందము నొందుచు బతియును గతియును గులదై వంబు నైన నీదు పాదారవిందంబులు…’’ అంటూ వస్త్రాభరణాలు, కానుకలతో కూడిన తాంబూలం ఇచ్చిన తన పతి, గతి, దైవం కూడా అయిన ప్రభువు విజయరాఘవనాయకుడికి పాదాభివాదాలు చెప్పుకొంది. కవిత్వ శృంగార కళానుభవాలన్నింటికి తాంబూలంతోనే సంబంధం ఉండేది. రాగభోగా లన్నింటికీ తాంబూలం ఓ ఉపకరణం!

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE