– క్రాంతి

కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌.. ఉన్న చింతలు తొలగిపోకపోగా కొత్త చింతలను మిగిల్చింది. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఊకదంపుడు ఉపన్యాసాలు, అయోమయం ప్రకటనలు, తీర్మానాలు తప్ప ఉదయ్‌పూర్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌లో హస్తంపార్టీ సాధించింది ఏమీ లేదు. ఉన్న మిత్రపక్షాలను దూరం చేసుకోవడం, సోనియా, రాహుల్‌ ఉక్కు పిడికిళ్లను పార్టీపై మరింత బిగించడానికి ఇది ఉపయోగపడింది. ఈ చింతన్‌ ‌శిబిర్‌ ‌తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంపై కమలనాథుల్లో ధీమా మరింత పెరిగింది.

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ముగిసిన మూడురోజుల కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన్‌ ‌శిబిర్‌ ‌మీద ఆ పార్టీ సానుభూతిపరులు ఏమైనా ఆశలు పెట్టుకొని ఉంటే అది అత్యాశేనని గ్రహించి ఉండాలి. నూటా ముప్ఫై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు పెద్దగా సంతృప్తిని కలిగించలేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతూ, కాంగ్రెస్‌ ‌పార్టీ క్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో ఆ పార్టీలో జి-23గా పిలిచే సీనియర్ల ఆందోళనలకు, వారు లేవనెత్తిన ప్రశ్నలకు పెద్దగా సమాధానమేమీ దొరకలేదు. చింతన్‌ ‌శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలు చూస్తే చింత ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టి వచ్చే ఎన్నికల నాటికి కిందిస్థాయి నుంచి పటిష్టపరిచే నిర్ణయాలు తీసుకుంటారని ఆశించినా, ఆ పార్టీ నాయత్వం తామింకా మూసధోరణి నుంచి బయట పడలేదని పరోక్షంగా చెప్పింది.

యూపీఏను వదిలేసినట్లేనా?

చింతన్‌ ‌శిబిర్‌ ‌ముగింపు ప్రసంగాలలో సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన సంకేతాలపై పార్టీ వర్గాలే భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నాయి. బీజేపీని గద్దె దింపడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదని.. కేవలం కాంగ్రెస్‌ ‌పార్టీ వల్లే అవుతుందని చాటడం ద్వారా ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకున్నట్లే కనిపిస్తోంది. యునైటెడ్‌ ‌పొగ్రెసివ్‌ అలయెన్స్ ‌ప్రస్తావన అసలు కనిపించలేదు. మిత్రపక్షాల అవసరం తమకు లేదని కాంగ్రెస్‌ ఒక్కటే బీజేపీకి చెక్‌ ‌పెట్టగలదని సోనియా, రాహుల్‌ ‌తమ సందేశాల్లో అభిప్రాయపడ్డారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ ‌పార్టీ తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను వీలైనంతగా కలుపుకుని పోవాలని, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో రెండో పార్టీగా ఉండేలా ఒదిగి పోవాలని ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌కొద్ది రోజుల క్రితం సోనియా గాంధీకిచ్చిన ప్రజెంటే షన్‌లో పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ‌మహారాష్ట్రలో శివసేన, బెంగాల్‌లో టీఎంసీతో పొత్తుకోసం కాస్త తగ్గాలని సూచించారు. ఆయా రాష్ట్రాలలో రెండో పార్టీగా ఉండేందుకు సిద్ధం కావాలని, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ‌పార్టీకి పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని స్తుందని పీకే పేర్కొన్నారు. కానీ ఈ అంశాలను కాంగ్రెస్‌ ‌పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని చింతన్‌ ‌శిబిర్‌ ‌ముగింపు ప్రసంగాలు చాటాయి. రాహుల్‌ ‌కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన సందర్భంలోను టీఆర్‌ఎస్‌తో పొత్తుండదని చాటారు. కేసీఆర్‌తో కయ్యానికి కాలు దువ్వారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయేతో ఉన్న శివసేన ఆ తర్వాత కాంగ్రెస్‌ ‌పంచన చేరింది. అలాంటి పార్టీలకు కూడా కాంగ్రెస్‌ ‌పెద్దలు చేసిన కామెంట్లు బహుశా రుచించకపోవచ్చు.

ఒంటరి పోరు సాధ్యమేనా?

2014లో కాంగ్రెస్‌ ‌కేవలం 44 లోక్‌సభ సీట్లు తెచ్చుకుంది. 2019లో కేవలం 19.49 శాతం ఓట్లతో 52 లోక్‌సభ సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే పెంచుకోగలిగింది. తర్వాత పార్టీ ప్రాభవం మరింత క్షీణిస్తూ వచ్చింది. అయినప్పటికీ తానే సొంతంగా 300 సీట్లకు పైగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించగలనన్న ధీమా కనబరచడం ఆశ్చర్యం కలిగించక తప్పదు. ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌, ‌ప్రియాంక తెగ ప్రచారం చేసినా కేవలం రెండంటే రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. పంజాబ్‌లో ఘోర పరాజయంతో ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంది. అయినా చింతన్‌ ‌శిబిర్‌ ‌తర్వాత 52 నుంచి ఏకంగా 272 సీట్లకు పెరగగలమన్న ధీమా వ్యక్తం చేయడం అతిశయోక్తిగా చెప్పాలి.

నాయకత్వం మాటేమిటి?

ఇంతకీ కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రస్థావన కూడా చింతన్‌ ‌శిబిర్‌లో వినిపించలేదు. రాహుల్‌ ‌గాంధీ నాయకత్వ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పకున్నట్లేనా? అదే నిజమైతే ప్రియాంకకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. ప్రియాంకను అధ్యక్షురాలిని చేయాలంటూ కొందరు తన ప్రసంగాల్లో చెప్పబోతే, ఎజెండాలో లేని అంశాలను ప్రస్తావించవద్దంటూ మల్లికార్జున ఖర్గే వంటి నేతలు వారించారు. దీని ద్వారా నాయకత్వ మార్పు అనేది ఉత్త మాటేనని అర్థమైపోయింది. పార్టీ అధ్యక్ష ఎంపిక లేదా ఎన్నికలపై ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేసిన సూచనలను సోనియా పట్టించుకోలేదు. సోనియా-రాహుల్‌ ‌పార్టీపై పెత్తనాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. పీకే నివేదికను కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌పరిగణనలోకి తీసుకోలేదు అనడానికి రాహుల్‌ ‌విదేశీ విహార యాత్ర, ప్రియాంక అమెరికా పర్యటనలను రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన అంశాలు నచ్చకనే రాహుల్‌ ‌విదేశాలకు వెళ్లిపోయారంటున్నారు. తద్వారా పీకే నివేదికపై చర్చను ముగించారని చెబుతున్నారు.

పార్టీ నాయకత్వాన్ని మార్చాలన్న సూచనను పుత్ర ప్రేమ కోసం పక్కన పెట్టిన సోనియా గత విధానాలనే కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. ఆర్భాటంగా నిర్వహించుకున్న చింతన్‌ ‌శిబిర్‌ ‌తర్వాత కూడా పార్టీ దిశ మారలేదనడానికి ఈ రెండంశాలు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చి వేసి.. కొత్త రక్తాన్ని ఎక్కించడం, యువతకు పెద్ద పీట వేయడం వంటి పీకే సూచనల్లో కొన్నింటిని తీసుకుని, మరికొన్నింటిని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత ఎవరన్న అంశంపై కనీస ప్రస్తావన లేకుండానే శిబిర్‌ ‌ముగిసింది.

సీనియర్ల మధ్య విభజన

2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌లో జీ-23 పేరుతో పార్టీ నాయకత్వంపై సీనియర్లు తిరుగుబాటు లేవనెత్తారు. పార్టీని ప్రక్షాళన చేయాలని, ఇందుకు తీసుకోవల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ అధినేత్రి సోనియకు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. అప్పట్లో ఆ లేఖ మీడియాలో సంచలనంగా మారింది. ఉలిక్కి పడ్డ కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ఆ ‌తర్వాత వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించింది. కొందరు నేతలకు పార్టీ వేదికలపై ప్రాతినిధ్యం కల్పించారు కూడా. కానీ, ఆ చర్యలు ఉత్తుత్తివేనని చింతన్‌ ‌శిబిర్‌ ‌తేటతెల్లం చేసింది. జీ-23 లేఖను కపిల్‌ ‌సిబల్‌ ‌తయారు చేశారని గుర్తించిన సోనియా గాంధీ, చింతన్‌ ‌శిబిర్‌కు ఆయన రాకుండా జాగ్రత్తపడింది. తమ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నించే వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కదని పరోక్షంగా ఆమె చాటి చెప్పారు. పార్టీ మేలు కోసం చేసే సద్విమర్శ లను కూడా సోనియా సహించరన్న సందేశం స్పష్టంగా కనిపించింది. జీ-23 నేతల్లో గులాంనబీ ఆజాద్‌కు మాత్రమే చింతన్‌ ‌శిబిర్‌లో కాస్త ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కశ్మీర్‌లో ఏకైక పెద్ద నాయకుడు కాబట్టే ఈ మాత్రమైనా గౌరవం దక్కింది.

పాదయాత్రకు సిద్ధమైన రాహుల్‌

‌ప్రజల్లో కోల్పోతున్న ఉనికిని కాపాడుకునే దిశగా రాహల్‌గాంధీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలుపుతూ యాత్ర సాగేలా కాంగ్రెస్‌ ‌వర్గాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. శిబిరం తీర్మానాల్లో రాహుల్‌ ‌పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ చేసిన ప్రతిపాదనను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాహుల్‌ ‌చేపట్టనున్న పాదయాత్ర పేరును ‘కన్యాకుమారి టు కశ్మీర్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర’ అని ఖరారు చేశారు. ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా అక్టోబర్‌ 2 ‌నుంచి పాదయాత్రను ప్రారంభిస్తామంటున్నారు. ప్రజలతో సంబంధాలు తమ రక్తంలోనే ఉన్నాయంటున్నారు రాహుల్‌.. ‌దేశంలో మతపరమైన విభజన జరగకుండా సమైక్య భావన పెంచాలనేది ఈ యాత్ర ఉద్దేశం అన్నారు. ఈ పాదయాత్ర ప్రకటన వెలువడగానే బీజేపీ సూటిగా స్పందించింది. 1947లో బీజేపీ లేదు. అప్పుడు దేశాన్ని రెండు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెసే అంటూ ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

రాహుల్‌పై ప్రాంతీయ పార్టీల ఆగ్రహం

ప్రాంతీయ పార్టీలపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మిత్ర పక్షాలకు కూడా మింగుడు పడలేదు. కాంగ్రెస్‌ ‌ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాకుండా ఆరెస్సెస్‌ ‌దాడిని నిరోధించేందుకు సైద్ధాంతికంగా తీవ్ర కృషి చేస్తోందని రాహుల్‌ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతం కరవైంద న్నారు. వాటికి వేర్వేరు దృక్పథాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ పార్టీల నేతలకు ఆగ్రహం తెప్పించాయి. చాలా రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీల మైత్రే కీలకం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాయి ఆ పార్టీ మిత్ర పక్షాలైన జేఎంఎం, ఆర్జేడీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్.

‌టీ కాంగ్రెస్‌ ‌నాయకుల్లో భయం!

చింతన్‌ ‌శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ కాంగ్రెస్‌ ‌సీనియర్లలో భయాలు మొదలయ్యాయి. ఐదేళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టాలనే నిర్ణయం కలకలం రేపింది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌, ‌వంశీ, మాజీ ఎంపీ మధుయాష్కి కొనసాగుతున్నారు. వీళ్ల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. చిన్నారెడ్డి చాలా కాలంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. సంపత్‌ ‌మహారాష్ట్ర వ్యవహారాలను చూస్తున్న పార్టీ నేతల్లో ఒకరు.

వంశీచంద్‌ ‌రెడ్డి పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న కేసీ వేణుగోపాల్‌కు తోడుగా ఉన్నారు. వీళ్లంతా తిరిగి ఏఐసీసీలో కొనసాగుతారా? అనే అంశంపై గాంధీభవన్‌ ‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. మధుయాష్కి తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్‌గా, కర్ణాటక వ్యవహారాలు చూసే నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ఒకరికి ఒకే పదవి అనే షరతు వర్తింపచేస్తే తన దగ్గర ఉన్న రెండు పదవుల్లో దేనిని ఎంచుకుంటారో తెలియదు.

సుదీర్ఘకాలం పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డికి హైకమాండ్‌లో తనకంటూ ఓ కోటరీ ఉంది. అంతేకాదు సోనియాగాంధీ కోటరిలోనే ఆయన ఉన్నారని చెబుతారు. పీసీసీ చీఫ్‌ ‌పదవికి రాజీనామా చేసిన సమయంలోనే ఉత్తమ్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఆయన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తారని.. ఏదో ఒక రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా పంపుతారనే వాదన ఉంది. ఇలా మొత్తానికి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌ ఆ ‌పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది ఏమిటో తెలియదు కానీ అయోమయాన్ని మరింత పెంచేసింది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE