తిరుమల కొండమీద జరిగిన తొక్కిసలాట దేశం దృష్టిని ఆకర్షించింది. ఎందరో భక్తుల మనో భావాలను గాయపరిచింది కూడా. సెక్యులర్‌ అని చెప్పుకునే ప్రభుత్వాల హయాంలో వెంకన్న బాధలు ఒకరకం. క్రైస్తవ అనుకూల ముద్ర ఉన్న వైకాపా ప్రభుత్వ హయాంలో బాధలు మరొకరకంగా ఉన్నాయి. మొత్తానికి తిరుమల వెంకన్నకీ, ఆయన భక్తులకీ ప్రభుత్వాల నుంచి హింస తప్పడం లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హిందూధర్మ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది అని ఎవరైనా ఆరోపిస్తే ఖండించడం కష్టం. దేవస్థానంలో ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పడానికి తిరుమల గొప్ప ఉదాహరణ.

 ప్రముఖ ఆలయాల నిర్వహణ విషయాల్లో అనవసర జోక్యం, భక్తులకు సౌకర్యాలు కల్పించక పోవడం, ఇబ్బందులు సృష్టించడం వెనుక హిందూ ధర్మాన్ని కావాలనే అవమానానికి గురిచేస్తున్నట్లు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. పవిత్ర తిరుమల క్షేత్రంలో భక్తులకు దర్శనాలు చేయించడంలో, వారికి వసతి సౌకర్యాలు కల్పించడంలో, ఆర్జిత సేవల టిక్కెట్లు భారీగా పెంచడం వంటి చర్యలన్నీ పథకం ప్రకారం హిందూధర్మంపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా చెప్పవచ్చు. దేవాయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైకాపా ప్రభుత్వం మార్చింది. పదవులు ఇవ్వని వారందరికీ తిరుమల, తిరుపతి దేవస్ధానం బోర్డు సభ్యులుగా నియమించింది. కాని కార్యనిర్వ హణ వహించే పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్‌ అధికారిని మాత్రం నియమించలేదు. ఈఓ జవహర్‌రెడ్డికి సిఎంఓలో అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన నెలలో 20 రోజుల పాటు బయటే ఉంటారు. పార్ట్‌టైం ఈవో ధర్మారెడ్డికి సర్వాధికారాలు ఇస్తే ఆయన నిర్లక్షం వహిస్తున్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే ఈ ప్రభుత్వం హిందువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనేది ఎవరికైనా స్పష్టం అవుతుంది. 150కి పైగా ఆలయాలు, విగ్రహాలు, పవిత్ర వస్తువులు ధ్వంసం చేయడం కొనసాగుతోంది. హిందువులెవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తూ మత మార్పిడికి అనువైన వాతావరణాన్ని వైకాపా ప్రభుత్వం సృష్టి స్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌, ‌భజరంగ్‌దళ్‌ ‌వంటి సంస్థలు, భాజపా వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవుల సంతుష్టీకరణ కోసం ఈ ప్రభుతం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టోకెన్ల ఆంక్షలు-భక్తుల ఇక్కట్లు

తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు, పాలక మండలి భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా దర్శనానికి సంబంధించి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. స్వామివారి దర్శనానికి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి కావాలనడం లక్ష లాదిగా తరలివచ్చే భక్తులంతా టోకెన్లు తీసుకున్నాకే వేంకటేశ్వరుని దర్శనానికి రావాలనడం చాలా విడ్డూరం ఉంది. తిరుమలను పరమ పవిత్ర క్షేత్రంగా భావించే హిందువులు రోజూ వేల సంఖ్యలో దేశం నలుమూలల నుంచి తిరుపతికి వస్తుంటారు. దర్శన టిక్కెట్లు గురించి ఆలోచించరు. గతంలో నడకదారిలో వచ్చేవారికి దారి మధ్యలో టోకెన్‌లు ఇచ్చేవారు. బస్సుల్లో వచ్చిన వారికి క్యూలైన్ల గదుల్లో ఉంచి వరు సగా సర్వదర్శనం కలిగించేవారు. అక్కడే భక్తులకు ఆహారపదార్ధాలు కూడా ఇచ్చేవారు. అక్కడ 24 గంటలున్నా భక్తులు విసుగుచెందక స్వామివారి దర్శనం చేసుకునేవారు. 30కి పైగా వున్న క్యూ హాళ్లు నిండిపోతే, ప్రత్యేక దర్శన టిక్కెట్లు లభించ కున్నా టోకెన్లు లభించకుంటే అఖిలాండం వద్ద కొబ్టరికాయ కొట్టి, హారతి వెలిగించి అదే స్వామివారి దర్శనంగా భావించి వెనక్కి వెళ్లిపోతుంటారు. కరోనా సమయంలో రెండేళ్లుగా సర్వదర్శనాన్ని రద్దు చేశారు. కరోనా తగ్గడంతో సర్వ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడే దేవస్ధాన నిర్వహణ అయోమయంగా ఉంది. టోకెన్లు లేకుండా కొండ మీదకు రాకూడదనే కొత్త నిబంధన విధించడం భక్తులకు తీవ్ర ఇబ్బం దులు కలిగించింది. పైగా టోకెన్లు ఉన్నవారికే వసతి సౌకర్యం ఇవ్వడం మరింతగా సమస్యలు సృష్టిం చింది. సర్వదర్శనం టోకెన్లు తిరుపతి, అలిపిరి సమీపంలోని కొన్ని కౌంటర్లలో ఇస్తామని ప్రకటించ డంతో భక్తులు భారీగా తిరుపతికి రావడం ప్రారంభిం చారు. రోజుకు 30 వేల టిక్కెట్లు ఇస్తున్నట్లు దేవస్థానం పేర్కొంది. మిగిలినవారు కిందే ఉండి పోయారు. తెల్లారేసరికి మరో లక్షమంది భక్తులు వచ్చేశారు. మిగిలిపోయిన వారితో కలసి టోకెన్ల కోసం క్యూలైన్లలో వెళ్లడానికి పోటీపడటంతో భక్తులు నలిగిపోయారు. ఎక్కువ మంది భక్తులు వచ్చినపుడు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం, అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయకపోవడం, ఎండ తగల కుండా చలువ పందిళ్లు వేయకపోవడం, మంచినీరు, ఆహార సదుపాయాలు కల్పించక పోవడం, లేదా వసతి సౌకర్యాలు కల్పించక పోవడంలో దేవస్ధానం తీవ్రంగా విఫలమైంది. భక్తులు ఇబ్బందిపడ్డ విషయం లోకమంతా తెలిసాక ప్రజతో అక్షింతలు వేయించుకున్న దేవస్ధానం ఇప్పుడు భక్తులు టిక్కెట్‌ ‌లేకున్నా కొండపైకి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

5 రెట్లు పెరిగిన ఆర్జిత సేవల ధరలు

శ్రీవారి ఆర్జిత సేవల ధరల పెచుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలని బోర్డు సమావేశంలో అధికారులు చేసిన ప్రతిపాదనలకు చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి తలవూపారు. అంతేనా.. వారు 100 శాతం ధరలు పెంచుతామంటే ఆయన 500 శాతం పెంచమని ఆదేశించిన వీడియోను భక్తులంతా చూశారు. పైగా 25 ఏళ్ల క్రితం ధరలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అందుకే పెంచాలని నిర్ణయించి నట్లు బుకాయించుకున్నారు. వారి నిర్ణయం ప్రకారం ఇక నుంచి సుప్రభాత సేవకు రూ.2,000, తోమాల, అర్చన సేవలకు రూ.5,000, వేద ఆశీర్వచనానికి రూ.10,000, కల్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రా లంకరణ సేవా టికెట్‌ ‌ధరను రూ.లక్షకు పెంచారు. అసలు తిరుమలను వ్యాపార సంస్థగా భావిస్తున్నందు వల్లే ఈ రకమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై భక్తులు, హిందూ సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశాయి. ఆఖరికి లడ్డూ ప్రసాదాల ధరలు పెంచేశారు. గతంలో రూ. 300 టిక్కెట్‌ ‌తీసుకున్నవారికి 2 లడ్డూలు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్కటే ఇస్తున్నారు. అదనంగా తీసుకొనే ఒక్కొక్క లడ్డూ ధర రూ.50 కి పెంచారు.

పునరావాస కేంద్రంగా బోర్డు

తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా అధికారంలోకి వచ్చిన పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తితిదే బోర్డును స్వాధీనం చేసుకుం టుంది. చైర్మన్‌ను, బోర్డు సభ్యులను నియమిస్తుంది. గతంలో బోర్డుకు 20 మంది సభ్యులుండేవారు. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులతో కలసి 80 మంది సభ్యులయ్యారు. ఒక్కో సభ్యుడి నియామకానికి లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల కావాల్సిన వారికి పదవులు లభించగా, నాయకులకు దండీగా డబ్బులు లభించాయి. ఇదిలా ఉంటే సభ్యులుగా ఎన్నుకున్నవారిలో నేరచరితులున్న వారు కూడా ఉండటంతో హిందూ సంఘాలు ఆగ్రహించాయి. నేరచరితులను తితిదే బోర్డు సభ్యు లుగా నియమించడాన్ని బీజేపీ నేత భానుప్రకాశ్‌ ‌రెడ్డి.. హైకోర్టులో సవాల్‌ ‌చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు తితిదే బోర్డు నేరచరితులను ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. అంతేగాదు, మీ కేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ ‌తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడీ కేసు విచారణలో ఉంది. ఇక ప్రస్తుత పాలక మండలి సభ్యుల వ్యవహారశైలిపై భక్తులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. గతంలో పాలకమండలి చైర్మన్‌ ఎప్పుడో ఓ సారి వచ్చి దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు కొండ పైనే తిష్ట వేస్తున్నారని.. వచ్చిన వీఐపీలు అందరికీ దగ్గరుండి దర్శనం చేయించి.. తామే దర్శనం చేయించామన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. 80 మంది బోర్డు సభ్యులు కూడా తిరుమలలో తిష్టవేసి దర్శనాలకు వెళ్తుంటే వారి సేవల్లోనే సిబ్బంది తరిస్తున్నారు. అలాగే 80 మంది సభ్యులతో కూడిన తితిదే సమావేశాలు శాసనసభ సమావేశాలు జరిగి నట్లుగా జరుగుతున్నాయి. వీరిలో ఒక్కరు కూడా భక్తుల సమస్యలు, సౌకర్యాలు, వారికి కలిగిన అసౌకర్యంపై మాట్లాడే సాహసం చేయడం లేదు.

హోటళ్ల తొలగింపు వివాదం

తిరుమల కొండపై ఉన్న ప్రైవేటు హోటళ్లను తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. తిరుమ లకు రోజు రూ.80 వేలకు పైగా భక్తులు వస్తారు. వారికి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రిళ్లు భోజన సదుపాయాలు అవసరమని వేరే చెప్పనక్కరలేదు. దేవస్ధానం అందించే అన్నప్రసాదం పథకంతో రోజుకు 60 వేల మంది భోజనం చేస్తున్నారు. 80 శాతం మంది భక్తులు ఒక పూట మాత్రమే అన్నప్రసాదం తింటారు. మరోపూట బయట హోటళ్లలో భోజనం చేస్తారు. ఇవి కాక అల్పాహారాన్ని కూడా ఎక్కువ మంది తీసుకుంటారు. ఇందుకోసం తిరుమలలో ప్రస్తుతం ఉన్న హోటళ్లు త్రీ స్టార్‌ ‌కేటగిరీ హోటల్‌ ఒకటి మధ్య స్థాయి హోటళ్లు, 8 ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లు 150. ఇవి గాక టిఫిన్‌లు నెత్తిన పెట్టుకుని కాటేజిల వద్దకు తెచ్చి అమ్మేవారు పాతిక ముప్పయి మంది ఉన్నారు. ఇన్ని సదుపాయాలు ఉండటం వల్లే భక్తులకు ఆహార కొరత లేకుండా ఉంది. ఇటీవల కొండపై హోటళ్లను తొలగించడం అందరూ దేవస్ధానం ఇచ్చే పదార్ధాలనే తినాలని ఆదేశించడం కూడా వివాదమైంది. అన్న ప్రసాదాలతో పాటు అల్పాహారాలు, టీ, కాఫీలు, భోజనాలు కూడా విరివిగా లభిస్తేనే దేవస్ధానంపై ఎలాంటి వత్తిడి ఉండదు. భక్తులకు అవసరమైన పదార్ధాలు తితిదే వండి వడ్డించడం సాధ్యం కాదు. పైగా రాత్రి యే సమయంలో దర్శనం చేసుకుని వచ్చినా ఆహారం దొరుకుతుంది. అన్నదాన కేంద్రాల్లో ఇది సాధ్యం కాదు. సంపన్న వర్గాలు అన్నిపూటలా అన్నదానంతో సరిపెట్టుకునే అవకాశమే ఉండదు. పైగా అన్ని తామే భరించాలనుకోవడం కూడా తితిదేకు శక్తికి మించిన భారం కావచ్చు.

అధికారుల బాధ్యతారాహిత్యం

అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రానికి పార్ట్ ‌టైమ్‌ ఈవోని నియమించారు. పూర్తిస్థాయి ఈవోని నియ మించకుండా భక్తులతో ఆడుకుంటున్నారు. ధర్మారెడ్డికి సర్వాధికారాలు ఇచ్చారు. ఆయన గతంలో టీటీడీ జేఈవోగా ఉండి ఆల్కహాల్‌ ‌తీసుకున్నాడని నిరూపితమైనప్పుడు వై.ఎస్‌. ‌రాజశేఖర్‌రెడ్డి బదిలీ చేశారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్‌ ‌రెడ్డి టీటీడీలో పార్ట్ ‌టైమ్‌ ఈవోగా నియమించి, సర్వాధికారాలు కట్టబెట్టి తిరుమలను ఏలుకోమని చెప్పారు. అక్కడ పనిచేస్తున్న జవహర్‌రెడ్డిని తీసుకెళ్లీ సీఎంవోలో పెట్టుకున్నారు. ధర్మారెడ్డి రిటైర్డ్ ఆర్మీ అధికారి, అలాంటి వ్యక్తికి తిరుమల కొండపై సర్వాధికారాలు కట్టబెట్టడం వెనుక అంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తితిదే ఈవో 24 గంటలూ పనిచేసినా సమయం సరిపోదని, అలాంటిది అదనపు బాధ్యతలుగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భక్తుల తాకిడి ఎంతో ఎక్కువ ఉన్నా సమన్వయం చేసుకున్న చరిత్ర తితిదేకి ఉంది. తీవ్రమైన ఎండల్లో అన్ని వేల మంది భక్తుల ఇబ్బందులను ఇబ్బంది పెట్టడం సరికాదు. టోకెన్లు ఉన్న వారినే కొండపైకి అనుమతించాలన్న ఏకపక్ష పోకడల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE