భారత పార్లమెంట్‌ ఎగువసభ లేదా పెద్దల సభలో మూడు దశాబ్దాల తరువాత నమోదైన ఘట్టం-ఒక రాజకీయ పార్టీకి మూడంకెల బలం దక్కింది. 1988-1990 ద్వైవార్షిక ఎన్నికల తరువాత ఏ పార్టీ కూడా ఇంత బలం నమోదు చేసుకోలేకపోయింది. ఆ ఘనతను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది. లోక్‌సభలో సంపూర్ణ ఆధిక్యం ఉన్నా, కొన్ని బిల్లుల విషయంలో ఆ ఆధిక్యం బీజేపీకి అక్కరకు రావడం లేదు. కారణం రాజ్యసభలో మెజారిటీ లేదు. ఇంతకాలానికి ఆ సమస్య పరిష్కారమై రాజ్యసభలో కూడా బీజేపీ మెజారిటీ సూచీకి సమీపంలోకి వస్తున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు చోట్ల బీజేపీ సాధించిన విజయాలు ఇందుకు తొలిమెట్టు కాబోతున్నాయి. దేశ హితానికి సంబంధించి, జాతీయతా స్ఫూర్తితో కొన్ని ప్రయోజనాలను సాధించాలని జనసంఘ్‌ ‌తరువాత బీజేపీ శ్రమిస్తున్నాయి. లోక్‌సభలో అఖండ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో ప్రవేశించిన కొన్ని శక్తులు బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయి. దీనితో లోక్‌సభలో ఆధిక్యం కూడా అన్ని విధాలా ఆశయ సిద్ధికి అనుకూలం కాలేకపోతున్నది. ఇప్పుడు ఎగువ సభలోను బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. అలాంటి శుభ ఘడియలు వచ్చాక దేశప్రజలు మొదట ఆశించేది ఉమ్మడి పౌరస్మృతి. బీజేపీ నెరవేర్చవలసి ఉన్న హామీలలో ఇది ప్రధానమైనది. ఇక్కడ గమనించవలసిన అంశం- ప్రజలు నేరుగా ఎన్నుకున్న సభ చేసిన నిర్ణయాలని, పరోక్ష ఎన్నిక ద్వారా వచ్చిన సభ అడ్డుకోవడం. 


మార్చి 31న దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 97 నుంచి 101కి చేరుకుంది. అవన్నీ ఈశాన్య భారతం నుంచి బీజేపీ ఖాతాలో చేరినవి కావడం గమనార్హం. అంటే ఆవిర్భవించిన నాలుగు దశాబ్దాల తరువాత మాత్రమే బీజేపీ మూడంకెలక• చేరింది. కాబట్టి బీజేపీ చరిత్రలో ఇదొక నమోదు కాదగిన ఘట్టమే అవుతుంది. ఇది నరేంద్ర మోదీ వల్ల పార్టీకి వచ్చిన విశేష ప్రతిష్ట అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన 2014లో ఎగువ సభలో బీజేపీ బలం 55. ఇప్పుడు 101కి చేరింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రజా క్షేత్రంలో దారుణంగా విఫలమైన విపక్షాలు రాజ్యసభలో బలంతో బీజేపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో విశేష విజయాలు నమోదు చేసిన పార్టీని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నికైన వారు దొడ్డిదారిన ఇరుకున పెట్టడం మన ప్రజాస్వామ్యంలో ఒక వికృత ధోరణి. ఆర్థిక బిల్లులు తప్ప మిగిలిన బిల్లులకు రాజ్యసభ ఆమోదం అవసరం. ఈ నిబంధనను ఉపయోగించుకుని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ, తృణమూల్‌, ‌డీఎంకే వంటి పార్టీలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. వీటి దుష్ట పన్నాగమంతా మైనారిటీల బుజ్జగింపు చుట్టూ తిరిగేదే.

క్రమశిక్షణా రాహిత్యానికి చిరునామా వంటి కొందరు ‘పెద్దల సభ’లో సభ్యులు కావడంతో ఆ సభా వ్యవహారాలు ప్రహసనప్రాయంగా మారాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ ఆధికారంలోకి వచ్చిన తరువాత భూసమీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. దేశంలో వ్యాపారరంగాన్ని విస్తరింపచేయడం దీని ఉద్దేశం. ఇది లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో వీగిపోయింది. అక్కడ విపక్షాలు చేసిన రగడతో మోదీ ప్రభుత్వం బిల్లునే ఉపసంహరించుకోవలసి వచ్చింది. దేశంలో జీఎస్‌టీ అమలుకు రాజ్యసభలో విపక్షాలను ఒప్పించడానికి నాటి ఆర్థికమంత్రి అరుణ్‌ ‌జైట్లీ తన శక్తియుక్తులన్నింటిని ధారపోయవలసి వచ్చింది. 370 అధికరణ రద్దుకు, సాగు సంస్కరణల చట్టాలకు రాజ్యసభ నుంచి ఎంతో ప్రతిఘటన ఎదురైంది. చిత్రంగా వాటితో దేశానికి మంచే జరిగిందని ఇప్పుడు నిరూపణ అయింది. బీజేపీ ఏం చేసినా మతం రంగు చూపి వీలైన చోటల్లా అడ్డుకోవడం విపక్షాలకు క్రీడగా మారింది.  రాజ్యసభలో బలం నానాటికీ సడలిపోతున్నా తనదైన వ్యూహాలతో కాంగ్రెస్‌ ‌పార్టీ బీజేపీని అడ్డదారిన నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉంది. 1990లో కాంగ్రెస్‌ ‌బలం రెండంకెలకు పరిమితమైపోయింది. లోక్‌సభ పరిధిలో మోదీ తిరుగులేని విజయాలు సాధిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌, ఉదారవాద పార్టీలు రాజ్యసభను మరింతగా దుర్వినియోగం చేయడం మొదలయింది. రాను రాను పెద్దల సభ కూడా రణరంగమైపోతోంది. సాగు చట్టాల మీద చర్చ సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు బల్లలు ఎక్కారు. అందులో ఒకరు ఆప్‌ ‌సభ్యుడు సంజయ్‌ ‌సింగ్‌. ఇతడు నల్ల జెండా ప్రదర్శించాడు. ఇతడిని కిందికి దింపి సభను వాయిదా వేయడంతో, కాంగ్రెస్‌ ‌సభ్యుడు ప్రతాప్‌ ‌సింగ్‌ ‌బాజ్వా చైర్మన్‌ ‌స్థానం మీదకు  ఫైలు విసిరాడు. దాదాపు ఆరుగురు విపక్షాల సభ్యులు బల్లలు ఎక్కి వీరంగం సృష్టించారు. సభలో చర్చిస్తున్న విషయం ఏదైనా కావచ్చు. కానీ సభ్యుల ఆనాటి ప్రవర్తన రాజ్యసభ చరిత్రలోనే అవమానకరమైనదిగా చెబుతున్నారు. చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయవలసి వచ్చింది. పైగా రాజ్యసభకు ఎన్నిక కావడం ఒక ప్రత్యేక అర్హతతో కూడుకున్నది. కానీ పార్టీ అధిష్ఠానం దీవెనలు ఉంటే, లోక్‌సభలో దారుణంగా ఓడిపోయిన వారు కూడా రాజ్యసభకు వచ్చారు. అలాంటివారిలో ఒకరు కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మల్లికార్జున్‌ ‌ఖర్గే. ఇలాంటి అవాంఛనీయ దృశ్యాలకు పెద్దల సభ వేదిక కాకుండా ఉండే శుభ ఘడియలు వస్తున్నందుకు సంతోషించాలి.

రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌బలం నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టే ఉంది. ఈ సంగతి కాస్తకూడా పట్టించుకోకుండా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్‌ ఏం ‌సాధించాలని అనుకుంటున్నదో అధిష్టానానికే తెలియాలి. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. అప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌బలం 146. తరువాత వరసగా ఆయా ద్వైవార్షిక ఎన్నికలకు ఆ పార్టీ బలం ఈ విధంగా ఉంది. ఒక్క 1962-64 (162), 1982-84 (152) సమయాలలో తప్ప మిగిలిన కాలమంతా ఆ పార్టీ బలం క్రమంగా పడిపోతూనే ఉంది. ఇలా-1952 (146),1962-64 (162), 1972-74 (128), 1982-84 (152), 1988-90 (108), 1990-92 (99), 2012-13 (72), 2022 (29). ఇక 1951-52లో ఏర్పడిన భారతీయ జనసంఘ్‌, 1980‌లో అదే బీజేపీగా ప్రస్థానం ఆరంభించిన తరువాత రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం ఇలా ఉంది. 1951 (1), 1962-64 (4), 1972-74 (14), 1982-84 (8), 1988-90 (17), 1990-92 (45), 2012-13 (47), 2022 (101).

 245 స్థానాలు కలిగిన రాజ్యసభలో ఇప్పుడు బీజేపీ బలం 101. ఎన్‌డీఏ బలం 117(ఈ 101 స్థానాలలో ఒక స్థానం ఈ ఏప్రిల్‌ 9‌న బీజేపీ కోల్పోబోతున్నది. పంజాబ్‌ ‌సభ్యుడు షావైత్‌ ‌మాలిక్‌ ‌పదవీకాలం ఆరోజుతో ముగుస్తున్నది). కాంగ్రెస్‌ ‌పార్టీ బలం 29కి పడిపోతున్నది. 13 స్థానాలతో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌విపక్షంలో రెండో స్థానంలో ఉన్నది. డీఎంకె(10), బీజేడీ (9), సీపీఎం, టీఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సీపీ ఆరు స్థానాల వంతున సభ్యులను కలిగి ఉన్నాయి. ఈ దఫా ఆరు రాష్ట్రాలకు- అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల్‌, ‌కేరళ రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ కోల్పోయినది ఈ పంజాబ్‌ ‌స్థానాన్నే. రాజ్యసభలోని 245 స్థానాలలో ప్రస్తుతం 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 245 మంది సభ్యులలో 233 మందిని రాష్ట్రాల శాసనసభలు, శాసనమండలి సభ్యులు ఎన్నుకుంటారు. 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, కళ, సామాజిక సేవా రంగాలలో విశేష సేవలు అందించిన వారికి ఆ అవకాశం ఇస్తారు.

13 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో మిగిలిన పార్టీల పరిస్థితి ఏమిటి? ఆప్‌ ఐదు స్థానాలు గెలిచింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ ఘన విజయం కారణంగా ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఆ పార్టీ బలం రాజ్యసభలో ఎనిమిదికి చేరింది. కాంగ్రెస్‌, ‌సీపీఐ, సీపీఐ(ఎం), యునైటెడ్‌ ‌పీపుల్స్ ‌పార్టీ లిబరల్‌  (అస్సాంలో బీజేపీ మిత్రపక్షం) ఒక్కొక్క స్థానం గెలుచుకున్నాయి.

వాజపేయి నాయకత్వంలో దాదాపు ఆరేళ్లు, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎనిమిదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి రాజ్యసభలో బీజేపీ వందస్థానాల సూచీకి చేరడానికి ఇంతకాలం పట్టింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పార్టీ అఖిల భారత అధికార ప్రతినిధి గురుప్రకాశ్‌ ‌పశ్వాన్‌ ‌వ్యాఖ్యా నించారు. రాజ్యసభలో పార్టీ తొలిసారి సాధించిన ఈ విజయం వెనుక ఎందరో కార్యకర్తల త్యాగం ఉందని అన్నారు. అలాగే బీజేపీ సిద్ధాంతబలం, నాయకత్వ పటిమ కూడా కారణమని పశ్వాన్‌ అన్నారు. బీజేపీకి తొలిసారి దక్కిన ఈ విజయాన్ని సూత్రబద్ధ రాజకీయాలకు దక్కిన గౌరవంగా పశ్వాన్‌ ‌చెప్పడం అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌ అనే వంశ పారంపర్య పార్టీని ప్రజలు పూర్తిగా నిరాకరించారని చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతంలో బీజేపీ దూసుకుపోవడం నిజంగా శుభ పరిణామం. అక్కడ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో అస్సాంలోని రెండు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒకటి బీజేపీ, ఒకటి ఎన్‌డీఏ మిత్రపక్షం యూపీపీఎల్‌ ‌గెలిచాయి. అస్సాంలో అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి కాకపోయినా, యూపీపీఎల్‌కు అనుకూలంగా పనిచేశారు. ఒకరు క్రా ఓటింగ్‌ ‌చేశారు. మరొకరు ఓటు వృథా చేశారు. ఈ ఇద్దరిని కాంగ్రెస్‌ ‌సస్పెండ్‌ ‌చేసింది. త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరిగితే, ఆ స్థానాలను కూడా బీజేపీ గెలిచింది. అంటే ఈశాన్యంలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగితే మొత్తం బీజేపీ/ఎన్‌డీఏ విజయం సాధించాయి. ఈశాన్య భారతం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేని పరిస్థితి మొదటిసారి త•స్థించింది. కాబట్టి పంజాబ్‌ ‌నుంచి ఒక స్థానం కోల్పోయినప్పటికి ఈశాన్యం నుంచి మూడు దక్కాయి. నాగాలాండ్‌ ‌నుంచి బీజేపీ అధికార ప్రతినిధి పంగ్నాన్‌ ‌కొన్యాక్‌ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది కూడా ఒక చరిత్ర. అక్కడ నుంచి రాజ్యసభకు వెళుతున్న తొలి మహిళ కొన్యాక్‌ ‌కావడం విశేషం.

పెద్దల సభలో మూడంకెల స్థాయికి బలం చేరినంతనే బీజేపీ విజయోత్సవాలకు సిద్ధం కావడం లేదు. నిజానికి ఈ ఏడాది 75 స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో మార్చి 31న 13 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అంటే ఇంకా 62 స్థానాల ఫలితాలు ఈ ఏడాది తేలతాయి. వాటిలో బీజేపీ సాధించగలిగిన విజయాలు ఉంటాయని చెప్పడం తొందరపాటు కానేకాదు. ఆ 62 స్థానాలు ఉత్తర ప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధప్రదేశ్‌, ‌రాజస్తాన్‌, ‌బిహార్‌, ‌కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లకు చెందినవే. కాబట్టి 62 స్థానాలలో బీజేపీకి కనీసం 30 దక్కుతాయని బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు ఒకరు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఆ సంఖ్య ఇప్పుడే చెప్పలేక పోతున్నారు.

జూలై తరువాత ఏ పార్టీ బలం ఎంతో స్పష్టమవుతుంది. అయితే ఆగస్ట్‌లో కాంగ్రెస్‌కు చెందిన 13 మంది పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి ఆగస్ట్‌లో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాలు నిలవగలిగే అవకాశం లేదు.  మొన్న గెలిచిన నాలుగు రాష్ట్రాల కారణంగా ఈసారి కూడా రాష్ట్రపతి భవన్‌లో బీజేపీ కోరుకున్న అభ్యర్థే ప్రవేశిస్తారు. 17 రాష్ట్రాలలో బీజేపీ మెజారిటీ పార్టీగా కొనసాగుతున్నది. అందులో అత్యధిక ఓటు విలువ కలిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలోను, తక్కువ స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలోను బీజేపీదే మెజారిటీ.

త్వరలో ఉత్తరప్రదేశ్‌కు జరిగే రాజ్యసభ ఎన్నికలలో మూడు బీజేపీకే దక్కుతాయి. అస్సాం, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అవి కూడా బీజేపీవే. ఈ విధంగా మొత్తం ఎన్‌డీఏ కూటమికి 19 స్థానాలు దక్కుతాయి. అంటే రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 123కు చేరుకుంటుంది. 245 స్థానాల ఈ సభలో మెజారిటీ పార్టీకి కావలసిన స్థానాలు 122. ఈ ఆధిక్యంతో బీజేపీ నడక నల్లేరు మీద నడక కావచ్చు. లోక్‌సభలో రెండు స్థానాలతో ప్రయాణం ప్రారంభించిన బీజేపీ 300 సంఖ్యను అధిగమించింది. రాజ్యసభలో జనసంఘ్‌గా 1 స్థానంతో ప్రయాణం ప్రారంభించి, బీజేపీగా 123 స్థానాల దిశగా దూసుకుపోతూ ఉండడం  ఆధునిక భారత రాజకీయ చరిత్రలో విశేషమైన అధ్యాయం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE