వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన
ప్రియమైన శేఖర్‌కు!
ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నువ్వు ఊరెళ్లి దాదాపు మూడు నెలలవుతుంది. నిన్ను చూడక.. నీ గుండె సవ్వడి వినపడక రోజులన్నీ నిర్లిప్తంగా సాగుతున్నాయి. దిండుకింద దాచుకున్న నీ ఫోటో ఒకటి ఎవరూ లేనప్పుడు చూసుకోవడం.. మళ్లీ దాచుకోవడంతో భయము.. ఉద్వేగం లాంటి ఓ వింత అనుభూతి మనసుకీ దేహానికీ కొత్తగా పరిచయమవుతున్నాయి. నువ్వు మీ పిన్ని ఇంటికని ఈ ఊరు రావడం, మీ పిన్ని ఇల్లు మా ఇంటి పక్కనే ఉండడం, మన మాటలు.. స్నేహం.. అవి ప్రేమగా పరిణమించిన తీరు.. జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో నిన్ను వెతుక్కుంటూ.. నీతో సంభాషిస్తూ.. నువ్వు వస్తావన్న ఆశతో ప్రతిరోజు నిద్ర మేల్కొంటున్నాను. అదే ఆశతో నిద్రపోతున్నాను
మన స్మృతిపథంలో ఎన్ని జ్ఞాపకాలు? వేసవి కాలం డాబా మీద ఒకవైపు నీవు మీ పిన్ని కొడుకుతో పడుకుంటావు. మరోవైపు నేను, చెల్లి, తమ్ముడు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వు కుంటూ అసలు సమయమే తెలిసేది కాదు. మిగతా వాళ్లంతా నిద్రపోయాక మనం కూడా కళ్లు మూసుకునే నిశ్శబ్దంగా ఒకరి ఆలోచనల్లో ఒకరం ఉండే వాళ్లం.
మన హృదయ స్పందనలు మీటుతూ ఎన్ని వెన్నెలరాత్రులు కరిగిపోయాయో! ఎన్ని చీకటి గాలులు మన తనువుల్లో వెచ్చదనాన్ని నింపాయో!
ఏదో ఉద్యోగం కోసమని, ఆ ఉద్యోగం నీకు తప్పక వస్తుందని చెప్పి వెళ్లావు. ఉద్యోగం రాగానే మన పెళ్లి విషయం కూడా మీ ఇంట్లో మాట్లాడు తానన్నావు. మరి నీకు ఉద్యోగం రాలేదా.. లేక మన పెళ్లికి మీఇంట్లో అంగీకరించలేదా? లేక ఉద్యోగం రాలేదని నువ్వే ఇంట్లో చెప్పలేదా! నాకు ఏ విషయం తెలియక దిగులుగా ఉంది.
శేఖర్! నీకు గవర్నమెంట్, లేదా పర్మినెంట్ జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను కూడా డిగ్రీ చేశాను కదా! ఇద్దరం ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చూసు కుందాం. అది చేస్తూనే మరో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిద్దాం.
ఉద్యోగం మార్చుకోవచ్చు.. డబ్బు సంపాదించు కోవచ్చు.. కానీ, నన్ను నీవు – నిన్ను నేను కోల్పోయాక తిరిగి సంపాదించుకోలేం కదా! నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ మధ్యే ఓ సంబంధం వచ్చింది. అతని పేరు విశ్వనాథం. బ్యాంకులో పనిచేస్తాడట. ఇంట్లో అందరికీ నచ్చాడు. వాళ్లు కూడా కట్నకానుకలు అవసరంలేదు, అమ్మాయి నచ్చింది చాలు అన్నారు.
శేఖర్! నీ ప్రమేయం లేకుండా ఇంట్లో పెద్ద వాళ్లకు అడ్డుచెప్పే శక్తి నాకులేదు. వారం పది రోజుల్లో మీ వాళ్లతో వచ్చి నువ్వు మాట్లాడకపోతే మనం శాశ్వతంగా దూరంకావాల్సి ఉంటుంది. వస్తావు కదూ! ఎదురుచూస్తూ..
నీ స్నేహితురాలు
శారద
* * * * * * * * * * *
ప్రియమైన విశ్వానికి,
నీవు లేవని.. ఇక రావని తెలిసినా నీతో చెప్పాలనుకున్న విషయాల్లో కొన్నింటిని అప్పుడప్పుడు ఇలా డైరీలో రాసుకోవడం అలవాటుగా మారింది. ఇది నువ్వు చదవలేవని..నీ నుంచి ఏ స్పందన రాదని నాకు తెలుసు. అయినా కాస్త గుండె బరువు దించు కోడానికి ఈ నాలుగు మాటలు..
పదికాలాలపాటు తోడుగా ఉంటావని..నీతో ఏడడుగులు నడిచిన పదేళ్లకే.. ఓ జీవితకాలానికి సరిపడే దుఃఖాన్ని మిగిల్చి నువ్వు దూరమయ్యావు. ఆరోజు బాబుని స్కూల్ నుంచి బైక్ మీద తెస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో.. గాయాలతో మిగిలిన మన బాబు నా ప్రేమలో సంరక్షణలో పెరిగి పెద్దవుతూ నీవు చేసిన గాయానికి మందు రాస్తున్నాడు. నీవు లేని ఆ గాయం పూర్తిగా నయం కాదని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నన్ను నేను ఓదార్చుకుంటూ మన బాబులో నిన్ను చూసుకుంటా, వాడిని ప్రయోజకుడిని చేసే బాధ్యతలో నిమగ్న మయ్యాను. అయినా కుటుంబంలో నీ లోటు ప్రతి రోజు ఏదో సందర్భంలో తెలుస్తూనే ఉంది. నా అసహాయతని గుర్తు చేస్తూనే ఉంది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినా, ప్రయాణం చేయాలన్నా, శుభ కార్యానికి వెళ్లాలన్నా.. ఒంటరితనం నాలో శూన్యాన్ని నింపుతుంది. నీతోనే చెప్పుకోగల ఎన్నో రహస్యాలు నన్ను జాలిగా చూస్తూ నాలోనే మిగిలిపోతున్నాయి.
బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. సన్నని మీసాల కింద ఎర్రని పెదాలతో అచ్చం నీలాగే ఉన్నాడు. నువ్వు నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో.. అలా! కానీ.. ‘నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మమ్మీ’ అని వాడు చెప్పేదాక వాడికి పెళ్లీడు వచ్చిందనే విషయాన్ని గ్రహించలేకపోయాను. అమ్మను కదా..! నా కోణంలోంచి చూస్తున్నప్పుడు ఇంకా చిన్న పిల్లాడిలాగే నా కొంగు పట్టుకొని కాళ్లకు అడ్డుపడుతున్నట్లే ఉంది. నేను వాడు ప్రేమించిన అమ్మాయితో మాట్లాడాను. ఫోటోలు కూడా చూపిం చాడు. చాలా చక్కగా ఉంది. చక్కగా మాట్లాడుతుంది. వాళ్ల పెద్దవాళ్లు కూడా పెళ్లికి అంగీకరించారట. మనవాడు పెద్దవాడై ఒక ఇంటివాడు అవుతున్నందుకు ఓవైపు సంతోషంగా ఉన్నా.. నాకు ఉన్న ఒకే ఒక తోడు కూడా దూరమవుతుందని మరోవైపు బెంగగా ఉంది. వాడు ఎక్కడో సిటీలో ఉద్యోగం చేస్తూ నన్ను కూడా రమ్మంటున్నాడు. కానీ నీ జ్ఞాపకాలతో కట్టుకున్న ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ పోలేను. వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నేను కూడా వాడికి ఒక బంధువు లాగా కనిపించడం సాధా రణమే కదా! నేను బంధువుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేను. ఈ భూ పరిభ్రమణంలో మనం యాత్రికులం. అన్ని దశలనూ దాటుకుని ఓ చోట ప్రయాణాన్ని ముగించక తప్పదు. కానీ ఏ ఆనందాన్నయినా, అనుభూతినయినా పంచుకునేందుకు ఓ తోడు లేని జీవితం.. ఎంతటి నరకప్రాయమో కొన్ని వందల సార్లు నాకు అనుభవంలోకి వచ్చింది. నా బాధ్యతలన్నీ తీరాక వీలైనంత త్వరలో ఈ నరకం నుంచి తప్పించుకొని నీకు దగ్గరయ్యే అవకాశాన్ని అదృష్టాన్ని ఇవ్వమని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. బయట వెన్నెల కాస్తోంది. నా అంతరంగంలోని చీకటిని పారద్రోలేందుకు విఫలయత్నం చేస్తూ..
ఇట్లు
నీ అర్థాంగి
శారద
* * * * * * * * * * *
ప్రియమైన కుమారుడు శ్వేతన్‌కు,
నేను క్షేమము. నువ్వు, కోడలు, మనవడు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మొన్న పండుగకు మీరు ఇక్కడికి వచ్చిన ఆ పదిరోజులు నాకు లోకమే తెలియ లేదు. నీ కొడుకును చూస్తుంటే చిన్నప్పుడు నిన్ను చూసినట్లే ఉంది. నువ్వు నాతో మాట్లాడుతుంటే మీ నాన్న మళ్లీ వచ్చి ఆప్యాయంగా పలకరించినట్లే ఉంది
కొన్ని అనుభూతులు అందవని తెలిసినా అందు కోలేమని గ్రహించినా మనసు వాటి చుట్టూ పరిభ్రమి స్తూనే ఉంటుంది. గతంలో అనేకసార్లు నీతో ఎన్నో విషయాలను పంచుకోవాలని ప్రయత్నించాను. కానీ నీది అర్థం చేసుకోలేని చిన్న వయసు అనో, కొడు కుగా నీతో చెప్పుకోలేని సందేహం వల్లనో అవి నా తోనే ఉండిపోయాయి. కానీ.. ఇప్పుడు నీకు చెప్పా ల్సిన సందర్భం, అవసరం కూడా వచ్చాయి. ఇప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పటికీ నీకు చెప్పలేనేమోనని అనుమానం. ఎందుకంటే 75 వసంతాలు నిండి.. ఎప్పుడు రాలిపోతానో తెలియని పండుటాకులాంటి దాన్ని. రోజురోజుకు ఆరోగ్యం నా నుంచి దూర మవుతూ మీ నాన్న జ్ఞాపకాలను చేరువ చేస్తున్నాయి. తొందరగా చేరుకొనమంటూ ఆహ్వానం పలుకు తున్నాయి
నా బాల్యమంతా ఓ చిన్న పల్లెటూరులో గడిచింది. మానాన్న.. అంటే మీ తాతయ్యకు మద్యం అలవాటుంది. ఉన్న కాస్త పొలం మీద వచ్చే కాసిన్ని డబ్బులు కూడా తాగుడుకు తగలేసేవాడు. మా అమ్మ కూలిపనులు చేసి తినీ తినక నన్ను చదివించింది, తాను కడుపు మాడ్చుకొని. తాగి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చిన భర్తకు సేవలు చేసి బతిమిలాడి భోజనం పెట్టేది. మా నాన్న మద్యం మత్తులో అన్నం కూడా సొంతగా తినలేని పరిస్థితి. అంత మత్తులో పడి జోగుతుంటే బలవంతంగా చిన్న పిల్లలకు పెట్టినట్లు అన్నం కలిపి తినిపించేది మా అమ్మ. ఎప్పుడైనా బంధువులు ఇరుగుపొరుగు వారు అంటుండేవారు ‘అతనితో నువ్వేమి సుఖ పడుతున్నావే.. పిచ్చితల్లీ! అలాంటివాడు ఉంటేనేమి పోతేనేమి’ అని. దానికి అమ్మ నవ్వి అనేది..
‘సుఖం లేకపోయినా మనిషి తోడుగా ఉంటే అది ఒక ధైర్యం కదా’ అని. నా 15వ యేటనే అదే తాగుడు కారణంగా మంచాన పడి మా నాన్న చని పోయాడు. అప్పుడు కొన్నాళ్ల తర్వాత మా అమ్మను చూశాక అర్థమైందినాకు.. ఆ తోడును బతికించు కోవడం కోసం అమ్మ ఎందుకంత తాపత్రయపడిందో అని! ఏ మధ్య రాత్రో నాకు మెలకువ వచ్చి చూసి నప్పుడు ఏడ్చి ఎండిన కళ్లతోనో.. ఇంకా తడి ఆరని కళ్లతోనో అమ్మ నాకు కనిపించేది. ఒక అసంతృప్త భారాన్ని మోస్తున్న దైన్యస్థితి అమ్మ ముఖంలో చీకటి నింపేది. మా అమ్మ తలరాతనే ఆ భగవంతుడు నాకు రాశాడేమో.. నీకు తొమ్మిదేళ్ల వయసప్పుడే మీ నాన్న దూరమై.. నేను కూడా ఒంటరితనాన్ని అను భవించాను. అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు..నీకు తెలియని ఒక కొత్త విషయాన్ని నీకు చెప్పాలను కుంటున్నాను.
మా నాన్నే కాదు.. మీ నాన్న చనిపోవడానికి కారణం కూడా.. మద్యపాన వ్యసనమే. మీ నాన్న తాగి బండి నడపడంవల్లనే ఆరోజు యాక్సిడెంట్ జరిగింది. మా నాన్న వల్ల మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో ప్రత్యక్షంగా చూసిన నేను దురలవాట్లు ఉన్న వ్యక్తిని చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
నేను డిగ్రీ చదువుతున్నపుడు..మా పక్కింటికి చుట్టపు చూపుగా శేఖర్ అనే కుర్రాడు వచ్చాడు. అతనికి సరైన ఉద్యోగం లేకపోయినా ఎలాంటి దురలవాట్లు లేవని తెలుసుకొని.. అతని ప్రేమను అంగీకరించాను. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉండగానే నాకు మరో సంబంధం వచ్చింది. ఉద్యోగస్తునికి ఇస్తే నా బిడ్డ సుఖంగా బ్రతుకుతుందని మా అమ్మ ఆలోచించింది. పెద్దలతో వాదించి గెలిచేందుకు నాకు తగిన కారణాలు కనపడలేదు. ఫలితంగా.. మీ నాన్నతో నా పెళ్లి జరిగింది. నేను కూడా సంతోషంగానే భర్తతో కొత్త కాపురాన్ని మొదలుపెట్టాను. కానీ మీ నాన్నకు అప్పటికే తాగే అలవాటు ఉండేదట. తరచుగా తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ తర్వాత క్రమంగా అది వ్యసనంగా మారింది. ఒక్కోసారి మరీ ఎక్కువ తాగేసి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించేవాడు. మామూలుగా ఉన్నప్పుడు మనిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వాడు. అన్ని విషయాల్లోనూ.. అందరి తోనూ చాలా మర్యాదగా ఉండేవాడు. కానీ తాగుడు అనే బలహీనత తనను మరణం దగ్గరకి ఈడ్చుకు పోయింది. నన్ను ఒంటరిని చేసి.. నీకు తండ్రి లేని లోటును మిగిల్చింది. మాట పంచుకునే తోడు లేనప్పుడు ఆ జీవితం ఎంత అసంపూర్ణమో అర్థమై ఏమీ చేయలేని నిస్సహాయ బతుకును కన్నీళ్లతోనే వెళ్లబుచ్చాను
శ్వేతన్.. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మొన్న మీరు వచ్చినప్పుడు నీ భార్య ముఖంలో ఒక అసంతృప్తినీ అశాంతినీ నేను గమనించాను. మీరు వెళ్లడానికి ముందు రోజు సాయంత్రం నేను దీప్తి తల దువ్వుతూ నెమ్మదిగా ఆమె అంతరంగాన్ని కదిలించాను. ఆమె ఆవేదనతో తన మనసు విప్పింది.
నువ్వు కూడా తరచుగా తాగుతూ ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని, స్నేహితులతో పార్టీలని ఫంక్షన్లనీ తిరుగుతూ బాబుని తనని సరిగా పట్టించుకోవడం లేదనీ. ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చి ఓసారి తనమీద చెయ్యి కూడా చేసుకున్నావని చెప్పింది. ఆమె చెప్పినవన్నీ నిజాలే అని నాకర్థ మయింది.
మా నాన్న తాగుడుకు బానిసై మా అమ్మను ఒంటరిని చేశాడు. అదే నరకాన్ని నేను కూడా అనుభవించాను. నాలాంటి మరో స్త్రీ అదే శిక్ష అనుభవించకూడదని నిన్ను చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో పెంచాను. అయినా నా పెంపకంలో లోపమో, చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావమో కానీ.. నువ్వు కూడా ఆ వ్యసనానికి లోనయ్యావని తెలిసినప్పటినుంచీ గుండెల్లో ఎవరో మంట పెట్టినట్టే ఉందిరా!
నిన్ను ఇష్టపడి వచ్చిన కోడలికి ..నా తల రాతనే రాయకురా! క్షణికమైన మత్తు కోసం బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు పాడుచేసుకుంటావు నాన్నా? నిన్ను చదివించడానికి నేను ఎంత కష్ట పడ్డాడో నాకు తెలుసు. అయినా నేను బాధపడలేదు. కుంగిపోలేదు. ఆ బాధ నుంచే సానబెట్టిన వజ్రంలా రాటుదేలి పైకిలేచాను. నిన్ను ప్రయోజకుడిని చేసి ముచ్చటైన మీ సంసారాన్ని చూసి మురిసిపోవాలను కున్నాను. కుటుంబంలో.. ఉద్యోగపరంగా ఎన్నో సమస్యలు రావచ్చు. ఒత్తిళ్లు ఉండవచ్చు. కానీ దానికి తాగుడు పరష్కారం కాదు. దయచేసి ఆ తాగుడు మానుకోరా! నీ కోసం, నీ ప్రేమ కోరి వచ్చిన నీ భార్యను దగ్గరకు తీసుకో. ఆమె కోసం, నీ బాబు కోసం సమయాన్ని కేటాయించు. పక్కన మనిషి ఉండి కూడా ఒంటరి తనంలో బ్రతకాల్సిన రావడం ఇంకా పెద్ద నరకం. అలాంటి పరిస్థితి నీ భార్యకు తీసుకురావద్దు. నా ఆరోగ్యం బాగుండడం లేదు. ఏ క్షణంలో ఏమవు తుందో తెలియదు. నేను పోయేలోపు మారిన నీ వ్యక్తిత్వాన్ని.. మీ అన్యోన్య దాంపత్యాన్ని చూసి తృప్తిగా పోవాలని ఉందిరా!
ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని వ్యసనాలకు లోను చేసి నిన్ను నమ్మి వచ్చిన భార్యను మా అమ్మ లాగా.. నాలాగా ఒంటరిని చేయకు. నిన్ను అనకూడని మాటలు ఏమైనా అని ఉంటే.. ఈ ముసలి తల్లిని పెద్ద మనసుతో క్షమించు నాన్నా!
నా మాట వింటావు కదూ..
ప్రేమతో.. అమ్మ
శారద
* * * * * * * * * * *
ఆ ఉత్తరం పోస్ట్ చేసిన వారం రోజుల తర్వాత.. కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది శారదమ్మకు. కొడుకు గొంతు వింటూనే కుశల ప్రశ్నలు వేయ సాగింది. కానీ.. అతను మాట్లాడలేదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ..’’ నన్ను.. క్షమించమ్మా !’’ అని మాత్రం అనగలిగాడు.
అంతే.. ఆ తల్లి గాజుకళ్లు ఆనందంతో చెమ్మ గిల్లాయి!
– గంగవరపు సునీత