– క్రాంతి
సామరస్యంతో చదువుకోవాల్సిన చోట ‘హిజాబ్’ చిచ్చు రాజేయడం వెనుక అంతర్జాతీయ కుట్రకోణం ఉందనే అనుమానాలు నిజమయ్యాయి. ఎప్పుడో చనిపోయాడని ప్రచారంలో ఉన్న కరడుగట్టిన ప్రపంచ ఉగ్రవాది స్పందించిన తీరు ఈ అనుమానాన్ని బలపరచింది. ఆఫ్ఘానిస్తాన్‌లో ఆడపిల్లల చదువులు, మహిళల సాధికారితను నిషేధించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని అందుకు భిన్నంగా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది.
ప్రశాంతంగా ఉన్న విద్యాలయాలల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలోని మాండ్యలో ఓ కళాశాలలో కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది మతపరమైన హక్కు అంటూ వాదించారు. మొదట్లో వీరు యూనిఫాం ధరించి వచ్చేవారు. హఠాత్తుగా హిజాబ్ ధరించి రావడంతో వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా మరి కొందరు విద్యార్థినీ, విద్యార్థులు కాషాయ ఖండువాలు ధరించి కళాశాలకు రావడం మొదలు పెట్టారు. రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, జిల్లాలకు కూడా ఈ వివాదం వ్యాపించింది. విద్యాసంస్థల్లో సమానత్వాన్ని, సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అనుమతించేది లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు కూడా తన తీర్పులో తేల్చి చెప్పింది. స్కూల్ యూనిఫాం విషయంలో ప్రొటోకాల్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
కర్ణాటక బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో ప్రతిపక్షాలు, మీడియా సమస్యను పెద్దగా చూపించాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టమీద దుష్ప్రచారం సాగింది. ఇండియాలో ఇస్లామోఫోబియా పెరిగిందని ప్రచారం మొదలు పెట్టారు. సమస్య ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా హిజాబ్‌ను సమస్యగా మార్చింది ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? అనే అంశంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ‘టూల్‌కిట్’ కుట్రలో అందరూ భాగస్వాములుగా మారిపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందేందుకు హిజాబ్‌ను ఒక సమస్యగా చిత్రీకరించారు. చివరకు వారి ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.
రెచ్చగొట్టిన యువతి ఎవరు?
కర్ణాటక మాండ్య జిల్లాలోని ఓ కాలేజీలో హిజాబ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇంతలో హిజాబ్ ధరించిన ఓ యువతి టూవీలర్ మీద అక్కడికి వచ్చింది. వాహనం పార్క్ చేసి ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ తరగతి గదులవైపు దూసుకెళ్లింది. ప్రతిగా విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అనుసరించారు. ఆ యువతి పేరు ముస్కాన్ జైనాబ్ ఖాన్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు అబ్దుల్ సుకూర్ కుమార్తె. ఈ సంస్థకు చెందిన కాలేజీ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI)లో ముస్కాన్ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. PFI సంస్థ దేశ విద్రోహక కార్యలాపాలు పలు సందర్భాల్లో బయట పడ్డాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనల్లో కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేసింది.
ఈ పని చేసినందుకు ఇస్లామిక్ సంస్థలు, వివిధ పార్టీల నాయకులు ముస్కాన్ మీద ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ మాండ్యాలోని ముస్కాన్ ఇంటికి వెళ్లి అభినందించాడు. ఆమెకు ఐఫోన్, స్మార్ట్ వాచ్‌ను బహుకరించాడు. ముస్కాన్‌ఖాన్‌కు ఇస్లామిక్ సంస్థ జమియత్ ఉలామా-ఇ-హింద్ కూడా 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో ఒక హిజాబీ (ముసుగు ధరించిన మహిళ) భారత ప్రధాని అవుతుందని వ్యాఖ్యానించాడు.
ముస్కాన్‌ను హిందూ విద్యార్థులు వెంటాడినా ధైర్యంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన నాటకం అని ఎవరూ చెప్పడంలేదు. ముస్కాన్‌ను కొన్ని కెమేరాలు అనుసరించి ఆమెను వీర వనితగా చూపించాయి. ఆమె రెచ్చగొట్టే వినాదాలకు ప్రతిగా నినదించిన విద్యార్థులను గూండాలుగా ప్రచారం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముస్కాన్ ఎంత రెచ్చగొట్టినా వారంతా సంయమనం పాటించారు. ఏ ఒక్కరూ ఆమెపై దాడికి దిగలేదు. దగ్గరికి కూడా వెళ్లలేదు. నినాదాలు మాత్రమే చేశారు. ఆ విద్యార్థుల సంస్కారాన్ని మాత్రం ఎవరూ ప్రశంసించలేదు. పైగా హిందూ గూండాలు అని ప్రచారం చేశారు.
జవాహిరీ ప్రశంసల కలకలం
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటక హైకోర్టు తీర్పు తర్వాత చల్లారిపోయిన హిజాబ్ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్‌మాన్ అల్ జవాహిరీ విడుదల చేసిన 8.43 నిమిషాల నిడివి గల వీడియో హిజాబ్ వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రను బయటపెట్టింది. ఇదంతా ‘ఘజ్వా-ఎ-హింద్ జిహాదీ’ పథకం, ఎజెండాలో భాగమేనని మరోసారి స్పష్టమైపోయింది.
జవాహిరీ ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసించాడు. ఆమె వాస్తవాలను బయట పెట్టిందన్నాడు, ఈ అల్‌ఖైదా నాయకుడు. నిరాడంబరులు, స్వచ్ఛమైన వారు అయిన ముస్లిం సమాజానికి, నైతికంగా దిగజారిన, నీతిబాహ్యులైన బహు దేవతారాధకులు, నాస్తిక శత్రువులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ స్వభావాన్ని ఆమె బయటపెట్టిందన్నాడు. నైతికంగా, సాంస్కృతికంగా దిగజారిన పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన ఆత్మన్యూనతా భావంతో కొట్టు మిట్టాడుతున్న ముస్లిం మహిళలకు ఆచరణాత్మకంగా ఓ పాఠం చెప్పినందుకు ముస్కాన్ ఖాన్‌కు అల్లా గొప్ప పురస్కారాన్ని ఇస్తాడని చెప్పాడు. హిందూ ఇండియా నిజస్వరూపాన్ని, దాని పాగన్ డెమొక్రసీ మోసకారితనాన్ని బయటపెట్టినందుకు ఆమెకు అల్లా శుభాన్ని స్తాడన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ముస్లింలకు ఉన్న మార్గం గురించి వివరిస్తూ షరియాకు కట్టుబడి ఉండాలని, ఏకైక సమాజంగా ఏకం కావాలని చెప్పాడు. చైనా నుంచి ఇస్లామిక్ మఘ్రెబ్ వరకు, కాకసస్ నుంచి సోమాలియా వరకు సమైక్య సమాజంగా అనేక రూపాల్లో సమష్టి యుద్ధం చేయాలన్నాడు. నిజాయితీ గల స్కాలర్స్‌ను చేర్చుకుని, సైద్ధాంతికంగా యుద్ధం చేయా లని జవాహిరీ తన వీడియో సందేశంలో చెప్పాడు. ఇస్లాం శత్రువులకు వ్యతిరేకంగా మీడియాను, యుద్ధ రంగంలో ఆయుధాలను ఉపయోగించుకుంటూ మేధాశక్తితో యుద్ధం చేయాలన్నాడు. పాశ్చాత్య దేశాలు ముస్లింలపై మోసపూరిత పథకాన్ని అమలు చేస్తున్నాయని ఆరోపించాడు జవాహిరీ. ఫ్రాన్స్, హాలండ్, స్విట్జర్లాండ్ హిజాబ్‌ను నిషేధించడం ద్వారా తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయన్నాడు. ఇస్లాంకు శత్రువులంతా ఒకే విధంగా ఉంటారన్నాడు. ఈజిప్టు, మఘ్రెబ్ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారంతా ఒకే రకమైన అవకాశవాద దౌర్జన్యకారులని పేర్కొన్నాడు. అదంతా ఇస్లాంపై యుద్ధమని, ఇస్లాం మౌలిక సిద్ధాంతాలు, చట్టాలు, సంప్రదాయాలపై యుద్ధమని పేర్కొన్నాడు.
ముస్కాన్ తండ్రి ఆందోళన
ముస్కాన్ వెనుక ఎవరున్నారు? అనే అనుమా నాల నేపథ్యంలో వాస్తవాలు బయట పడటంతో ఆమె తండ్రి భయపడిపోతున్నాడు. జవాహరీ తన కుమార్తెను ప్రశంసించడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. అసలు జవాహరీ ఎవరో తెలియ దన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని కోరాడు. ‘ఆ వీడియోలో అతను అరబ్బీలో మాట్లాడాడు. మనమంతా ఈ దేశంలో శాంతి యుతంగా కలిసిమెలసి జీవిస్తున్నాం. మనలో విభేదాలు సృష్టించే ప్రయత్నమే ఇది’ అని అన్నాడు.
జవాహిరీ బతికే ఉన్నాడా?
ఈజిప్టులో పుట్టిన డాక్టర్ అయ్‌మాన్ అల్ జవాహిరీ.. అల్ ఖైదాలో ఒసామా బిన్‌లాడెన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. 2011లో బిన్ లాడెన్ మరణం తర్వాత అల్‌ఖైదా నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అతనిపై అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. అతను చివరిగా చేసిన వీడియో 9/11 ఉగ్రదాడుల 20వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించినది. జవాహరీ 2020లో అనారోగ్యంతో చనిపోయాడనే ప్రచారం జరిగింది.
హిజాబ్ విషయంలో జవాహిరీ చేసిన ప్రకటన కన్నా ఆయన బతికే ఉన్నాడని స్పష్టం కావడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ తర్వాత ఆయన ప్రసంగాలు పలు సందర్భాల్లో విడుదలయ్యాయి. ఇందులో చారిత్రక వైరుధ్యాలు, సైద్ధాంతిక సమస్యల గురించి మాత్రమే చెప్పాడు. దీంతో అవన్నీ జవాహిరీ మరణించక ముందు చిత్రీకరించారని భావిస్తూ వచ్చారు. అయితే హిజాబ్ వివాదంపై స్పందించడంతో బతికే ఉన్నాడని ప్రపంచానికి స్పష్టమైపోయింది. అతను ఆఫ్ఘాని స్తాన్‌లో ఉన్నాడని భావిస్తున్నారు.
భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు
జవాహిరీ వీడియోను ప్రభుత్వేతర ఉగ్రవాద వ్యతిరేక సంస్థ SITE ఇంటెలిజెన్స్ కూడా ధృవీక రించింది. భారత్‌లో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ప్రయత్నాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. హిజాబ్ వివాదంపై జవాహిరీ వీడియోతో మన భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భావోద్వేగ అంశాన్ని ఉగ్రవాద సంస్థలు వినియోగించు కుంటున్నాయని నిఘావర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. అటు, జవాహిరీ వీడియోపై కర్ణాటక కూడా అప్రమత్తమైంది. ఈ వివాదం వెనుక అదృశ్యశక్తుల హస్తం ఉన్నట్లు జవాహిరీ వీడియోతో నిరూపితమైందని కర్ణాటక హోంమంత్రి అన్నారు. హిజాబ్ వివాదం వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్‌లో బాలికల విద్యను నికారిస్తున్నారని పాకిస్తాన్ మొసలికన్నీరు కారుస్తోంది. నిషేధానికి గురైన ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేయాలని ISI ప్రయత్నిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కోసం ఉద్యమ నిర్వహణకు నిధులు ఇస్తామని, కార్యక్రమాలను నిర్వహిస్తామని భారతీయ ముస్లింలకు సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను భరోసా ఇచ్చాడు.
హిజాబ్ విషయంలో భారత్‌లో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన కాలేజీ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఇప్పటికే స్పష్టమైపోయింది. మరోవైపు హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను తమిళనాడు తౌహీద్ జమాత్ (TMTJ) నాయకుడు కోవై రహమతుల్లా బహిరంగంగా బెదిరించాడు. ఉడిపిలోని కళాశాల దగ్గర ఆయుధాలతో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులను రజాబ్, హాజీ అబ్దుల్ మజీద్‌గా పేర్కొన్నారు. శివమొగ్గ జిల్లాలో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న భజరంగ్ దళ్ సభ్యుడు హర్ష హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవన్నీ హిజాబ్ వెనుక ఉన్న కుట్ర కోణాలను బయటపెడుతున్నాయి.
జవాహిరీ భారత్‌లో హిజాబ్ విషయంలో ముస్కాన్‌ను ప్రశంసించడం ఇస్లామిస్ట్ ఉగ్రవాద శక్తుల ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. ముస్లిం మహిళల ఉన్నత చదువులను వారు అంగీక రిస్తున్నారా లేదా అనే విషయంలో వారికే స్పష్టత లేదు అన్నది నిజం. భారత నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలని నోబెల్ గ్రహీత యూసఫ్‌జాయ్ మలాలా తన ట్వీట్ ద్వారా స్పందించారు. చిన్నారుల విద్య విషయంలో తాలిబన్ 2012లో ఆమె మీద కాల్పులు జరపడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. పాకిస్తాన్‌లో హిందూ బాలికలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో మాత్రం మలాలా ఎప్పుడూ నోరు విప్పలేదు. ఆమె ద్వంద్వ వైఖరి ఇక్కడే బయటపడిపోయింది.
తిప్పికొట్టిన భారత్
భారత అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని మన విదేశాంగ శాఖ అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే స్పష్టం చేసింది. తమ అంతర్గత విషయాలపై విదేశీ ప్రముఖులు, ఇతర దేశాలు రెచ్చగొట్టే విమర్శలు చేయడం తగదని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారతదేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందని మన విదేశాంగశాఖ స్పష్టంచేసింది.