ఆరోగ్యం:ఆనందం

భోజనం చేయాల్సిన వేళలు, భోజనవిధులు, భోజన పాత్రలు, అరిటాకు ల్లోనూ, మోదుగాకుల విస్తట్లోనూ భొజనం, తాంబూలం గుణాలు ఇలా ఎన్నో విశేషాలు భోజుడి చారుచర్య గ్రంథంలో ఉన్నాయి.

అనిధాయ ముఖే పర్ణం పూగం ఖాదతి యో నరః ।

సప్తజన్మదరిద్రత్వం నాంతే నారాయణస్మృతిఃద్విపూగం ధననాశనమ్‌ ।।

‌త్రిపూగం సర్వదాయోగ్యం చతుఃపూగం తు వర్జయేత్‌ ।

ఆకుల్లేకుండా కేవలం వక్క నమలితే ఏడుజన్మల దరిద్రం పస్తుంది. చనిపోయేప్పుడు నారాయణ స్మరణం కూడా కలగదు. తాంబూలంలో ఒక వక్కే వేసుకోవాలి. అది ఆరోగ్యకరం. రెండు వేసుకుంటే ధననాశం. మూడు వక్కలు నయమే! కానీ, నాలుగు వద్దు.

ఏకపూగం పంచపర్లా శ్చూర్లం నిష్పావమాత్రకమ్‌ ।

‌కర్పూరం చ తదర్ధం స్యాత్తక్కోలం త్రిచతుష్టయమ్‌ ।।

‌లవంగకుసుముం తద్వ త్తదర్ధం జూతికీఫలం।

క్రమేణ భక్షయే ద్విద్వాన్‌ ‌తాంబూలం సర్వరోగజిత్‌ ।।

‌వక్క ఒకటి, ఆకులైదు, సున్నం అనుముల గింజంత వెయ్యాలి. అందులో సగం పచ్చకర్పూరం, మూడుగాని నాలుగు గాని తక్కోబిలములు, లవంగ మొగ్గలు, వాటిలో సగం జాబికాయ ఈ క్రమంలో చేర్చిన తాంబూలం సర్వ రోగాల్ని హరించేదిగా ఉంటుంది తమలపాకు కొనని తొడిమనీ వదిలేయాలి, నున్నపాకు, జంటాకు, రాలిన ఆకు, కుళ్లిన ఆకుల్ని పారేయాలి. ప్రొద్దునపూట వక్క, మధ్యాహ్నం పూట సున్నం, రాత్రిపూట ఆకులూ ఎక్కువగా ఉండే విధంగా తాంబూలం వేసుకోవాలి! తాంబూలంలో బెల్లం వేస్తారు కొందరు. అల్లం/శొంఠి చేరిస్తే మంచిదని కొందరంటారు. రాయలవారు శోంఠి తాంబూలాన్నే పేర్కొన్నాడు. వెండి, బంగారు రేకులు వేస్తే ఉన్నతంగా పనిచేస్తుంది!

తాంబూలంతోపాటుగా ఇవి వద్దేవద్దు

‘‘క్షీరభోజియై యపుడు వేగిరముతోడం తమ్ములముఁగొన్న గుష్ఠమాతని వశించు’’ పాలు లేదా పాలు కలిసిన కాఫీ టీ, పాయసం లాంటి పాల పదార్ధాలను తిన్న వెంటనే తాంబూలం తీసుకుంటే కుష్టు లాంటి భయంకర చర్మ వ్యాధులొస్తాయని చారుచర్యలో భోజరాజు హెచ్చరించాడు. పాలు తీసుకున్న వెంటనే తాంబూలం వేసుకుంటే కడుపులో పాలు విరిగిపోయి విషదోషాలు ఏర్పడతాయి. పనసపండు, వెలగపండు, అరటిపండు, చెరకురసం, కొబ్బరి, ఆల్కహాలు, కందిపప్పు లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాల్ని తిన్న వెంటనే తాంబూలం వేసుకోకూడదు. కనీసం ఒక గంటయినా ఆగటం మంచిది.

మద్యం కన్నా తాంబూలమే మేలు

జాతీయోద్యమకాలంలో కల్లు మానండోయ్‌ ‌బాబూ! కళ్లు తెరవండోయ్‌’’ అని పాటలు పాడుతూ మద్యపాన నిషేధాన్ని కూడా ప్రచారం చేసేవారు. కానీ, ఇప్పుడున్నంత తీవ్రంగా గుట్కా, జర్దా, పొగాకు కిళ్లీలు అప్పటికి తెలీవు. కాబట్టి తాంబూలం వేసుకోవటాన్ని ఆనాడు మాదక ద్రవ్యంగా భావించలేదు. మద్యపానం కన్నా తాంబూలమే మేలనే అనుకునేవాళ్లు.

సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో 1940లో వెలువడిన మద్యనిరోధక గీతావళి సంకలనంలో చెన్నమరాజు కొండలరావు-వెంకటేశ్వర రావులు వ్రాసిన పద్యం ఇది:

పలకులు జాజికాయలు పొలిమి/తాంబూల చిర్వశో పాయంబు

ల్యెన్నొనరించిన మద్యము గ్రోలిన/పెనుకంపు నోట గొట్టుర సుమతీ

పచ్చకర్పూరం, జాజికాయల్లాంటి పరిమళ ద్రవ్యాలు పులిమిన తాంబూలం నమలటం లాంటి చిట్కాలెన్ని చేసినా మద్యపానం చేసిన నోటి ‘పెనుకంపు’ వదల బొమ్మాళీ వదల అన్నట్టు జన్మజన్మాలకూ వదలదంటాడు కవి.

తమలపాకుల మంచిగుణాలు

నాగుపాము పడగలా ఉందని, నాగలోకం నుండి వచ్చిందని, లేక పాములాగా పాకుతూ పెరుగుతుందని తమలపాకు తీగని ‘నాగవల్లి’ అని పిలిచారు. తమలపాకులు వివిధ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఒక్కో ప్రాంతం ఆకులకు ఒక్కోరకం గుణాలుంటాయి. సాధారణంగా తమలపాకులు చిరుచేదు, కారం, తీపి రుచుల్ని కలిగి ఉంటాయి. బెంగాలీ ఆకులు ఎక్కువగా కారాకిళ్లీలకు ఉపయోగిస్తారు.

నోరు జిగురుగా ఉండటం, నోటి దుర్గంధం, రుచి తెలియకపోవటం, కఫం, వాతం, గుండెల్లో భారం, అజీర్తిలను తమలపాకు పోగొడుతుంది. వీర్యంలో వేడిని కలిగించి స్ఖలనం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. మనసుకు సంతోషం కలిగిస్తుంది. ఆకలి పెంచుతుంది. పొట్టకి, గుండెకి, మెదడుకీ బలాన్నిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరాన్ని తాజా పరుస్తుంది. దంతవ్యాధుల్ని తగ్గించి గొంతుకని శుభ్రపరుస్తుంది. తమలపాకును తినడం వల్ల లాలాజలం విడుదలై దప్పిక తగ్గుతుంది. శ్లేష్మం తగ్గి, అరుగుదల పెరుగుతుంది. భుక్తాయాసం రాకుండా ఉంటుంది.

బాలింతలు పండుటాకుల తాంబూలం వేసుకుంటే గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. తమలపాకుల రసంలో మూడు పూటలా మిరియాల పొడిని తగినంత కలిపి తీసుకుంటూ ఉంటే జ్వరం తగ్గుతుంది. మిరియాల పొడి వేసి, తేనెతో రంగరించి ఆకుతో సహా నమిలితే కొవ్వు, స్థూలకాయం, నరాలజబ్బులకు ఔషధం. తమలపాకుల్లో కొద్దిగా ‘‘డి. ఇ. సి’’ ఉప్పు(di-ethylcarbamazine citrate) కలిపి తింటే బోదవ్యాధి త్వరగా తగ్గుతుంది. లేదా ఈ బిళ్లలు వేసుకుని తమలపాకులు నమలాలి.

తమలపాకు నమిలిన తమ్మని పేనుకొరుకుడు (ఎలోపీషియా ఏరియేట) మీద పెడితే త్వరగా నయమౌతుంది. తమలపాకులోని కాల్షియం, ఫోలిక్‌ ‌యాసిడ్‌, ఎ.‌విటమిన్‌. ‌సి.విటమిన్లు ఎముక పుష్టినిస్తాయి.

తమలపాకుల్ని వెచ్చచేసి రసం తీసి 1-2 చెంచాల మోతాదులో తాగితే జ్వరం, దగ్గు, కఫం తగ్గుతాయి. ఈ రసాన్ని ఒకటి రెండు చుక్కలు తరచూ కళ్లలో వేస్తుంటే రేచీకటి తగ్గుతుంది. ఇది వైద్యుల సలహా మీద చేయాలి.

తమలపాకులు, తులసాకులు, అల్లం మిరియాలు మెత్తగా నూరి రసం తీసి సమానంగా తేనె కలిపి ఒక చెంచా మోతాదులో తినిపిస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి. వీటిని నూరి తీసిన రసం గానీ, లేక ఎండించి దంచి నీళ్లలో వేసి మరిగించిన టీ గానీ రోజూ తాగుతుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా లాంటి కఫ వ్యాధులు రాకుండా ఉంటాయి. జఠరాగ్ని బలంగా ఉంటుంది. గుండె బలహీనత తగ్గుతుంది. పిల్లలకు రొంప చేసినప్పుడు తమలపాకులకు ఆముదం రాసి, వెచ్చజేసి రొమ్ముకు కాపటం పెడితే రోగికి హాయిగా ఉంటుంది.

తమలపాకుల్ని మెత్తగా నూరి, అతిమధురం పొడి (యష్టిచూర్ణం) దానికి సమానంగా కలిపి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకుని ఆరనిచ్చి ఓ గాజు సీసాలో భద్రపరచు కోండి. వీటిని 1-2 మాత్రలు చప్పరిస్తే దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి. కంఠ స్వరం శ్రావ్యంగా ఉంటుంది. పాటలు పాడేవారు, నటులు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులకి ఇది మంచిది.

సుగంధ ద్రవ్యాలు కలిసిన తాంబూలం లైంగిక శక్తిని పెంచుతుంది. లేత తమలపాకుల్ని విడిగా తింటే అతి కామోద్రేకం తగ్గి సమస్థితి ఏర్పడుతుంది. లైంగిక శక్తిని కోరుకునేవారు కప్పురవిడెమునే తీసుకోవాలి. కడుపులో బల్ల (లివర్‌ ఎన్లార్జిమెంటు) వచ్చినచోట ఇలా కాపు పెడితే వాపు నెమ్మదిగా తగ్గుతుంది. కీళ్లవాతంలో తమలపాకును వెచ్చచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. దీన్నే గొంతుక పైన కాపుపెడితే గొంతులో పుండు, గొంతునొప్పి, సోర్‌‘‌త్రోట్‌ ‌తగ్గుతాయి. పాలిచ్చే తల్లులకు రొమ్ములపైన కాపు పెడితే తల్లి పాలు తగ్గిపోతాయి. గవదబిళ్లలు వచ్చిన చోట ఇలా కాపు పెడితే నొప్పి, వాపు తగ్గుతాయి. మొండి వ్రణాలు తగ్గటానికి తమలపాకును నూరిన ముద్దతో కట్టు కట్టాలి.

ప్రతిరోజూ ఒక తమలపాకు 10 మిరియం గింజలతో నమిలి వేణ్ణీళ్లు తాగితే స్థూలకాయం అదుపులోకొస్తుంది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే హిష్టీరియా తగ్గుతుంది.

తమలపాకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వాడే ఔషధాలతోపాటుగా తమలపాకుల్ని తీసుకుంటే ఆ ఔషధాలు శక్తిమంతంగా పనిచేస్తాయి.

వీటిలో ఆహార పీచుపదార్ధం (డయటరీ ఫైబర్‌) ఎక్కువగా ఉంటుంది. తోటకూర, పాలకూరల్లాగే ఇవి కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఒకింత ఎక్కువ శక్తిదాయకంగా పనిచేస్తాయి. విషదోషాల్ని హరిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను కట్టడి చేస్తాయి.

రిఫైండ్‌ ‌నూనెలు కాకుండా, స్వచ్ఛమైన వంటనూనె- గానుగ నుండి తీసింది దొరికితే ఆ నూనెలో ఒకటి రెండు తమలపాకుల్ని వేసి ఉంచండి. నూనె చెడకుండా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వంటనూనెలు ఎక్కువ రోజులు నిలవుంటే వాటిలో అసంతృప్త కొవ్వు ఆక్సీకరణానికి గురై మాగుడు వాసన వేస్తుంది. దీన్ని ‘తీ•అమీఱ•ఱ••’ అంటారు. తమలపాకు దీన్ని ఆపుతుంది. వీటిలో బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టే రసాయనాలు కూడా ఉన్నాయి. తమలపాకులో ఉండే స్థిరతైలం (ఎసెన్షియల్‌ ఆయిల్‌) ‌ఫంగసుకి వ్యతిరేకంగా పనిచేసి, ఫంగస్‌ ‌పెరుగుదలను అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.

తమలపాకుల్లో రకాలు

తాంబూలంలో చాలా రకాలున్నాయి. తెలుగు ప్రాంతాల్లో కారపాకులు, చెన్నోర్‌ ఆకులు, తెల్లాకులు, బంగ్లా ఆకులు, కల్లిపట్టి ఆకులు ఎక్కువగా దొరుకుతాయి. ఇతర రాష్ట్రాల్లో దొరికే తమలపాకుల పేర్లు ఇలా ఉంటాయి: ,

అస్సాం: అస్సాంపట్టి, అవనీపాన్‌, ‌బంగ్లా ఆకులు, ఖాసిపాన్‌

‌బిహారు: దేశీ పాన్‌, ‌కలకత్తా పాన్‌, ‌పతాన్‌ ‌పాన్‌, ‌మఘాయ్‌ ‌పాన్‌, ‌బంగ్లా పాన్‌

‌కర్ణాటక: కరియేల్‌, ‌మైసూరేరియేల్‌ అం‌బడియేల్‌

ఒరిస్సా: గోడి బంగ్లా, నోవా కటక్‌, ‌సాంచీ, బిర్కోళీ.

మధ్యప్రదేశ్‌: ‌దేశీ బంగ్ల్, ‌కలకత్తా, దేశవాళీ ఆకులు

మహరాష్ట్ర: మాఘై, కల్లిపట్టి, కపూరి, బంగ్లా ఆకులు.

పశ్చిమ బెంగాల్‌: ‌సాంచి, మీఠా, కళి, బంగ్లా, షిమురాలి బంగ్లా ఆకులు

తమలపాకుల్ని ఇలా పండిస్తారు

తమలపాకు తోటలు వేయటానికి మే-జూన్‌ ‌నెలలో భూమిని బాగా దున్ని చదునుచేసి మీటరు దూరానికొక చాలు చొప్పున ఏర్పాటు చేస్తారు. సుమారు 20 కిలోల అవిశ విత్తనాలు తీసుకుని ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ చాళ్లలో వత్తుగా విత్తుతారు. 2 నెలల వయసు అవిసె మొక్కలు ఎదిగాక చాళ్ల మధ్య మట్టిని తీసి అవిశ మొక్కల మొదళ్ల దగ్గర వేసి కయ్యలు చేస్తారు. ఈ కయ్యల్లో 50 సెం.మీ. లోతు 20 సెం.మీ. వెడల్పు గల గుంటలు మూడురోజుల వరకు రెండు పూటలా నీరు కడతారు. 6-8 కణుపులున్న తమలపాకు తలతీగలు తెచ్చి 0.5 % బోర్డో మిశ్రమంం250 పి.పి.యం స్ట్రెప్టోసైక్లిన్‌ ‌మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధిచేసి ఈ గుంటల్లో నాటుతారు. తగినంత నీరు కడుతూ చాలినంత తడిని మొక్కలకు అందేలా చూడాలి.

సాధారణంగా తమలపాకు తోటల్ని రెండేళ్ల పాటు ఉంచుతారు. మధ్యలో ఒకసారి మొక్కజొన్న తోటలు వేస్తే నేల సారవంత మౌతుంది. నాటిన 2 నెలలకి ఆకులు కోతకు వస్తాయి. నెలకొకసారి ఆకుల్ని ఇనుప గోరుతో కత్తిరించి సేకరిస్తారు. 100 ఆకుల్ని ఒక ‘పంతం’ అంటారు ఎకరాకి 30,000 నుండి 40,000 పంతాలు దిగుబడి వస్తుందంటున్నారు. రెండో ఏడాది దిగుబడి కొంత పెరుగుతుంది.

15 రోజుల్లో అవిశమొక్కలు, పక్కనే చిగురించిన తమలపాకు తీగలు జమిలిగా పెరగటం మొదలుపెడతాయి. తమలపాకు తీగల్ని అవిశ మొక్కల్ని కట్టి పాకిస్తారు. తమలపాకులకు సరిపడ గాలి వెలుతురూ అందేందుకు అడ్డురాకుండా అవిశాకుల్ని కత్తిరిస్తారు.

– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు

About Author

By editor

Twitter
YOUTUBE