శ్రీశైలం దేవస్థానం అరాచక మూకల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. పవిత్రమైన ఈ ఆలయానికి హిందూభక్తులు రాకుండా చేయాలని, ఇక్కడ మతమార్పిడులు చేసి తమ మత ప్రాంతంగా మార్చాలనేది వీరి లక్ష్యం. అందుకోసం ఇక్కడ తిష్టవేసుకుని దేవస్థాన పవిత్రతకు భంగం కలిగించే పనులన్నీ చేస్తున్నారు. దేవస్థానం అంగళ్లు వీరి ఆధీనంలోనే ఉన్నాయి. వస్తువుల ధరలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, గంజాయి, మాంసం తదితరాలు సరఫరా చేస్తున్నట్లు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా నడుపుతూ ప్రశ్నించిన వారిపై భౌతికదాడులు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరిపే నిర్మాణ పనులు వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కాంగ్రెస్‌, ‌తెదేపా, వైకాపాలు వీరిని తమ అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నాయి. గుండాయిజం, అరాచకాలు యథేచ్ఛగా కొనసాగేలా ప్రోత్సహిస్తున్నాయి. వీరెన్ని తప్పులు చేసినా ఈగ వాలనీయకుండా కాపాడుతున్నాయి. దేవస్థానం పాలకవర్గం కూడా వీరు చెప్పినట్లు వింటోందని విమర్శలున్నాయి. శ్రీశైలం మొత్తం తమ నియంత్రణలోకి తీసుకున్న ఈ రౌడీమూకలు హిందువులకే కాదు, భారత శిక్షాస్మృతికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి సవాల్‌ ‌విసురుతున్నాయి.

శ్రీశైలం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తారు. మహాశివరాత్రి, సంక్రాంతి, ఉగాది, కార్తికమాసం, మాఘమాసాల్లో వచ్చే పండుగలకు ఇక్కడికి విశేషంగా భక్తులు తరలివస్తారు. మండల దీక్షలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఉగాదికి కర్ణాటక భక్తులు విశేషంగా తరలివస్తారు. భ్రమరాంబ అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఉగాది రోజు చీరే, సారె, ఒడిబియ్యం సమర్పిస్తే ఆ సంవత్సరమంతా మంచి జరుగు తుందనే విశ్వాసంతో నెల రోజుల ముందు నుంచి పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. కొండల్లో, లోయల్లో ప్రయాణించి, వేసవి మండుటెండల్లో కూడా భక్తిభావంతో శ్రీశైలం చేరుకున్న భక్తులు ధూళిదర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం జగద్గురు పీఠాధిపతి, దేవస్థానం సిబ్బంది కలిసి ఉగాదికి ముందు కర్ణాటక ప్రాంతానికి వెళ్లి అక్కడ భ్రమరాంబ, మల్లికార్జునస్వామి కల్యాణం చేసి భక్తులను ఉగాది పండుగకు శ్రీశైలానికి స్వాగతించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా పూజ్య జగద్గురు పీఠాధిపతి, ఆలయ ఈఓ, సిబ్బంది తదితరులు కలిసి కర్ణాటకలోని బాగల్కోట్‌లో స్వామివారి కల్యాణం పూర్తిచేసి భక్తులను ఉగాదికి రావలసిందిగా స్వాగతించారు. వీరితో పాటు ఒక ప్రచారరథం కూడా వెంట ఉండి గ్రామాల్లో ప్రచారం చేస్తుంది. ఈ ఏడాది మార్చి 30 వరకు స్పర్శ దర్శనం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ప్రతి ఏటా ఉగాది నాటికి కర్ణాటక ప్రాంతం నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. వీరు నాలుగు లేదా ఐదురోజులు శ్రీశైలంలో ఉంటారు.

ఈ ఏడాది కూడా ఉగాది పండుగ కోసం కర్ణాటక నుంచి శ్రీశైలానికి కొందరు భక్తులు వచ్చి విడిదిచేశారు. మార్చి 30న రాత్రిపూట ఒక వ్యక్తి మంచినీళ్ల సీసా కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. దుకాణదారుడు సామియేలు రూ.25 విలువచేసే సీసాను రూ.50 అని చెప్పాడు. ఈ అరాచకాన్ని ప్రశ్నించిన భక్తుడిని సామియేలు తిట్టడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. కోపం పట్టలేని సామియేలు తన వద్ద ఉన్న గొడ్డలితో దాడిచేయగా ఇద్దరు కర్ణాటక భక్తులకు గాయాలయ్యాయి. దీనికి ప్రతీకారంగా కర్ణాటక భక్తులు ఆగ్రహంతో దుకాణాన్ని, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేయగా, స్థానిక వ్యాపారులు కూడా కర్ణాటక భక్తులపై దాడిచేసి వారి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడి మొత్తం రఫీ, రజాక్‌ అనే ఇద్దరు వ్యక్తుల ప్రోద్బలం వల్లే జరిగిందని భాజపా వేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక వెల్లడిస్తోంది.

పవిత్రమైన శ్రీశైలంలో ఈ రకమైన విధ్వంస కాండ, అశాంతి గత కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనికి అన్యమతాలకు చెందిన అరాచకశక్తులే కారణం. ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను, దేవస్థానం నిర్వహణను తమ కనుసన్నల్లో ఉంచుకుని ఆదాయ మార్గాలను వశం చేసుకున్నారు. దేవస్థానానికి సంబంధించిన దుకాణాలు, హోటళ్లలో 90 శాతం ముస్లింలు, క్రైస్తవులే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రఫీ అనే వ్యక్తి, ఇప్పుడు వైకాపా హయాంలో రజాక్‌ అనే వ్యక్తి ఇక్కడ తిష్టవేసి పెద్దసంఖ్యలో గ్రూపులను తయారుచేశారు. ముస్లింలు, క్రైస్తవులను ఇక్కడకు తీసుకువచ్చారు. వీరంతా ఇక్కడే స్థిర పడిపోయారు. వైకాపా ప్రభుత్వం వీరికి ఇక్కడ వేల ఇళ్లను కేటాయించి శాశ్వత నివాసం కల్పించింది. స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి నిర్వాహకుడిగా హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దేవస్థానం నిర్వహించే దుకాణాల నుంచి కాంట్రాక్టు పనుల వరకు శిల్పా చక్రపాణి అనుచరుడు రజాక్‌ ‌కనుసన్నల్లో జరగాల్సిందే. దేవస్థాన ఉద్యోగుల విధుల కేటాయింపు, సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా ఇతని కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఆలయానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా ఇతనికి తెలీకుండా జరగదు. శ్రీభ్రమరాంభ, మల్లిఖార్జునస్వామి వార్లకు పూజల కోసం వినియోగించే పూలను తీసుకొచ్చే సమయంలో పూలకింద మద్యంబాటిళ్లు, మాంసాన్ని శ్రీశైలానికి తరలిస్తున్నట్లు హిందూసంస్థలు ఆరోపి స్తున్నాయి. అన్యమత ప్రచారం, మతమార్పిడి వీరి లక్ష్యం అంటున్నాయి. దేవస్థానం నిర్వహించే గోశాలలో నెలకు 2 ఆవులు వ్యాధులతో మరణిస్తున్నా యని చెబుతున్నారని, కాని వాటిని మాంసం కోసం వధిస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

పాపాల చెరువు ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. సున్నిపెంట గ్రామంలో రెండు వైన్‌ ‌షాప్‌లు న్నాయి. శ్రీశైలంలోని కొత్తపేట, అన్నదానం వెనక ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్ ‌షాప్‌లు నడుపుతున్నారు. ఇటీవల ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం బాటిళ్లు పట్టుకున్నప్పటికి పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోనై కేసులు నమోదు చేయలేదు. దీనంతటికీ కారణమైన రజాక్‌పై ఎన్ని ఆరోపణలు ఉన్నా పోలీసులు కేసులు నమోదుచేయడం లేదు. శ్రీశైలంలో సుమారు 250 వరకు ఆటోలున్నాయి. వీటిలో 100కి పైగా ముస్లింలు సొంతదారులుగా కానీ, డ్రైవర్లుగా కానీ ఉన్నారు. 20 నుండి 30 మంది వరకు క్రిస్టియన్లు డ్రైవర్లుగా ఉన్నారు.

ఏటా మహాశివరాత్రి, ఉగాది, కార్తికమాసం, సంక్రాంతి, శివదీక్షల సమయంలో శ్రీశైలానికి భక్తులు కాలినడకన నల్లమల కొండల నుంచి వస్తారు. ఈ మార్గం మొత్తం రాళ్లు, చెట్లతో నిండి ఉంటుంది. సుమారు 50 వేల మంది ఈ మార్గంలో వస్తారు. దారిలో వసతి సదుపాయం కూడా కల్పించలేదు. ఒక్క ప్రాంతంలో మాత్రం నీరిస్తారు. 12 గంటల పాటు సాగే ఈ నడకదారిలో ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి. పోలీసుల రక్షణ కూడా ఉండదు. భక్తుల నుంచి విరాళాలకై చూపే శ్రద్ధ వారికి కల్పించాల్సిన సదుపాయాల గురించి ఆలోచించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆలయ అధికారులు, పోలీసులు, రాష్ట్ర అటవీశాఖ సహా అందరూ అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారని భాజపా నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది.

శ్రీశైలంలో కులానికో సత్రం ఉంది. ఇవన్నీ ప్రైవేటు సంస్థలవే. ఉచితంగా వసతి సౌకర్యం ఇవ్వరు. డబ్బులు చెల్లించాల్సిందే. అంటే ఒక విధంగా కులాల పేరుతో నడిచే లాడ్జీలన్న మాట. వాస్తవానికి దేవస్థానాలే దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి. కాని పాలక వర్గాలు దేవస్థానాలను ఆదాయం తెచ్చే వ్యాపార సంస్థలుగా భావిస్తున్నాయి. దాంతో కులసంస్థలు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి భవనాలు నిర్మించి ఆలయానికి వచ్చిన భక్తులకు నగదు చెల్లిస్తే వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అధిక ధరలు వసూలుచేస్తూ భక్తులను పీడించుకుతింటున్నారు. భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు దేవస్థానమే కల్పిస్తే ఈ పరిస్థితి రాదు.

హిందూధర్మంపై దాడి!

గజనీ, ఘోరీలతో పాటు మొగల్‌ ‌పాలకుల దాడుల నుంచి ఏ ధార్మిక వ్యవస్థను రక్షించుకునే క్రమంలో హిందువులు ప్రాణాలు సైతం ధారపోశారో ఆ త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించినా, ప్రజాస్వామ్యం అమలు చేసుకుంటున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నా అదంతా మాటలకే పరిమితమవుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఓటుబ్యాంకుగా చేసుకుని అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చిన ముస్లిం, క్రైస్తవ సమాజాలు ఇప్పుడు హిందువుల మనుగడకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఒకవైపు మత మార్పిడులకు భారీగా పాల్పడుతున్న వీరు అత్యంత పవిత్రంగా భావించే హిందూధార్మిక సంస్థలపైనా కన్నేశారు. దేవస్థానాలున్న ప్రాంతంలో ఉపాధి కోసం చేరినట్లు నాటకమాడుతూ హిందూధార్మిక విధానాలకు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ దేవస్థానాల్ని అపవిత్రం చేస్తున్నారు. దేవస్థానం పాలనా వ్యవ హారాల్లో జోక్యం చేసుకొని నిర్వహణను తమకు అనువుగా మార్చుకుంటున్నారు. ఓటుబ్యాంకు రాజకీయల కోసం వీరు చెప్పినట్లు రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. దేవస్థానాలను అపవిత్రం చేసి హిందూధర్మాన్ని అపహాస్యం చేయడమే వీరి ప్రధాన కుట్రగా హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దేవస్థాన పరిపాలన ప్రభుత్వాల చేతిలో కాకుండా హిందూ ధార్మిక సంస్థల నిర్వహణ కింద ఉంటేనే ఇలాంటి దుర్మార్గాలకు అంతం పలకవచ్చని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ ‌చేస్తోంది.

షిర్డీ సాయి సంస్థాన్‌ ‌ట్రస్టు ఆదర్శం

భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో షిర్టీలోని సాయి సంస్థాన్‌ ‌ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ భక్తులకు రూ. 150 నామమాత్రపు ధరలతో వసతి సౌకర్యం లభిస్తుంది. వసతి సౌకర్యాలు ఇచ్చిన చోట ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తారు. రూ.3కు ఐదు రొట్టెలు, రూపాయికి టీ, కాఫీ, పాలు ఇస్తారు. రూ.5కు నీళ్ల సీసా ఇస్తారు. ఇందులో పరిమితి లేదు. ఎన్నయినా తీసుకోవచ్చు. తిరుపతిలో కూడా వసతి నామమాత్రపు ధరకు, ఉచితంగా భోజన సదు పాయం లభిస్తుంది. చాలా వరకు దేవస్థానాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాని అందుకు విరుద్ధంగా శ్రీశైలంలో జరుగుతోంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE