– కామరాజుగడ్డ వాసవదత్త రమణ
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన
‘బాబు, ఎక్కువ లోడు వేస్తున్నా వెంటీ?’ మోటారు వ్యానులోని కొబ్బరి బోండాల వంక చూస్తూ అడిగాడు, నాయక్.
చిన్ననాటి స్నేహితుడి వంక చూస్తూ, ‘సంతపల్లి దగ్గర పెద్దబేరం కొత్తగా వచ్చిందిరా. ఇంతకి నీ పట్నం ప్రయాణం ఎప్పడు?’ పైకెక్కి తాడువేసి కడుతూ అన్నాడు, రాంబాబు.
‘ఆదివారం’ తన ఎకరం పొలం కళ్లముందు మెదులుతూండగా దిగులుగా అన్నాడు, నాయక్.
పట్నంలో ఉన్న నాయక్ బావమరిది అతనికి వాచ్‌మెన్ ఉద్యోగం చూసింది మొదలు, అతని భార్య వెళ్లిపోదామని ఒకటే పోరు పెట్టేస్తోంది. కాని అతనికి సుతారము ఇష్టంలేదు.
‘ఒకప్పుడు బాగా బతికిన మన రైతు కుటుం బాలన్ని పల్లెల్లో ఆదాయమేమి కనపడక పట్నానికి వలసపోతున్నాయి.’ తాడు అందిస్తూ అన్నాడు.
‘నిజమేరా నాయక్. ఉమ్మట్లో ఉన్నంతవరకు మా అన్నయ్యలే అన్నీ చూసుకున్నారు కాబట్టి నాకు సేద్యంలోని ఇబ్బందులేమి తెలియలేదు. ఇప్పుడు పొలంపని, అమ్మకాలు ఒక్కడిని చూసుకోవడం కష్టం అవుతోంది. జగ్గమ్మను పనికి తీసుకెళదామంటే అన్నయ్యలు ఆడవాళ్లు పొలానికెళితే పరువు పోతుందని వద్దంటున్నారు.’
‘నువ్వెన్ని చెప్పినా మీ అన్నయ్యలంతా ఉమ్మట్లో బాగానే ఒడ్డెక్కేసారు. నువ్వే నష్టపోయావు’ కోపంగా అన్నాడు.
‘అలా అనుకోను కాని ఇప్పుడు ఎవరికి వారే అయ్యామని మటుకు చాలా బాధపడుతున్నాను. వేసవి కాబట్టి బోండాల అమ్మకం ఆదుకుంటోంది. తరువాత ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈసారి వరదలతో చేతికి పంట దక్కలేదు’ నిరాశగా అన్నాడు.
‘పట్నంలో నేను కాస్త కుదురుకున్నాక నువ్వు వచ్చేసి ఏదైనా ఉద్యోగంలో చేరుదువు కాని. ఇద్దరం కలిసే ఉందాము’
‘కాని జగ్గమ్మ అసలు ఒప్పుకోవడం లేదు. సొంతింట్లో పస్తులైనా ఉంటాను కాని పట్నంలోకి అడుగుపెట్టనని గట్టిగా తేల్చిచెప్పేసింది.’
కాసేపు మాట్లాడి అతనికి వీడ్కోలు చెప్పి రాంబాబు బండెక్కాడు.
భార్య మాటలు అతని మదిలో మెదిలాయి.
‘మనం పుట్టినచోటే పెరగడం నేర్చుకోవాలి. పోయింది పడ్డచోటే వెతుక్కోవాలి. కన్నతల్లి లాంటి పల్లె వెచ్చటి ఒడిని, తండ్రిలాంటి పొలంనీడను వీడి ఎక్కడికి వెళ్లినా వేడిసెగకు మాడిపోవడమే కాని ఎదిగిపోవడం అన్నది ఉండదు. నేనూ పొలం పని చేస్తాను. వాళ్లు వీళ్లు ఏదో అంటారని అనుకుంటే ఎలా? రంగయ్య పక్కపొలాన్ని మనమే కౌలుకి తీసుకుందాం. కరం ఉచితమే. రైతుసంఘాలు వేయమన్న పంటే వేసి చూద్దాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. మనకీ మంచిరోజులు వస్తాయి’
* * *
రాంబాబు ఆలోచనలన్ని తన ఉమ్మడి కుటుంబం మీదకుమళ్లాయి.
అయిదుగురు అన్నదమ్ములలో అతనే ఆఖరు వాడు. అంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండే వాళ్లు. తల్లి, తండ్రి పోయాక వేరుపడ్డారు. అతనికి ముందు నుంచి అన్నయ్యల వెనుక పొలానికి వెళ్లడమే తెలుసు. కాని వ్యవహారాలూ చేతకాదు. భార్య జగ్గమ్మ చాలా ఒద్దికైన మనిషి. ఆమె పెదనాన్న కొడుకు చదువుకుని గల్ఫ్‌లో బ్రహ్మాండంగా స్థిరపడ్డాడు. అందుకనే ఆమెకు తన పిల్లలు పెద్దచదువులు చదవాలన్న కోరిక ఎక్కువ.
రెండేళ్ల బట్టి ఆదాయం తగ్గింది. దానికితోడు కొబ్బరిబోండాలను స్వయంగా టోకుగా అమ్ముకుంటే లాభం ఎక్కువగా వస్తుందని సలహా చెప్పిందే తడ వుగా రాంబాబు మోటారువ్యాను కొనేసాడు. చివరికి ఆ వ్యాను మీద చేసిన అప్పు మెడకు గుదిబండలా తయారయ్యింది. భార్య ఒంటిమీద తాళి తప్ప మిగతా బంగారమంతా హారతి కర్పూరం లాగా కరిగి పోయింది. అందుకే పట్నం వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాడు. కాని ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు.
‘మన పిల్లలు వ్యవసాయం మీద పెద్దచదువులు చదువుదామని, మన ఊళ్లో కొత్తరకాల పంటలు వేసి దిగుబడులు పెంచాలని అనుకుంటూ ఉంటారు. నాకా మాటలు వింటూంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. గల్ఫ్ అన్నయ్య వైభవాన్ని చూసి నేనెంత భ్రమలో ఉన్నానో ఇప్పుడు నాకర్ధమవుతోంది. పాపం ఇన్నేళ్లలో వాడేమి సుఖపడ్డాడు? నాలుగేళ్లకోమారు మా ఊరు వచ్చి మళ్లా వెళ్లిపోతాడు. వాడు అంత దూరంలో డబ్బు మిషనులా మారి ఒంటరిగా బతుకు తోంటే మా వదిన పిల్లల్ని చదివించుకుంటూ, ఏ సుఖసంతోషాలు లేని వట్టిపోయిన గోవులా మిగిలి పోయింది. మొగుడో చోట, పెళ్లామోచోట ఉంటే ఎన్ని మేడలు కడితేనేమిటి? ఎంత సొమ్ములు వెనకేసుకుంటే ఏంటి? మన పొలాన్ని, కౌలుకు తీసుకున్న పొలాన్ని కూడా సాగు చేసుకుంటూ మనూళ్లోనే ఉందాం. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయాన్ని వదిలేసి పట్నానికి వెళ్లి ఏం బావు కుంటాము?’
ఇలా ఎన్నిసార్లు భార్య చెబుతూ వస్తున్నా ఆమె మాటలను అతను తేలిగ్గా కొట్టిపారేస్తూ వస్తున్నాడు. పట్నంవెళ్లి బాగా డబ్బులు సంపాదించాలన్న కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. అతను చేరాల్సిన ఊరు రావడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు.
* * *
పెద్దరోడ్డు మీదనుంచి ఊరివైపుకు బండిమలుపు తిప్పగానే పక్కగా ఉన్న రావిచెట్టు మొదట్లో కూరల గంప పెట్టుకుని కూర్చున్న వ్యక్తి అతనికి చిరపరిచిత మైన ముఖంలాగా అనిపించింది. రాత్రి అన్నం తిన్నాకా దొడ్లో వెన్నెల్లో మడత మంచం మీద పడుకుని ఉండగా ఆమె ఎవరో టక్కున జ్ఞాపకం వచ్చింది.
* * *
ఒక ముప్ఫై ఏళ్ల కిందటి మాట. ఆమె ఎవరో, పేరు ఏమిటో తెలియదు. ఒక తెల్లారగట్ట బస్సు ఆగే చెట్టుకింద ఇద్దరు మగపిల్లలను ఒళ్లో పెట్టుకుని వర్షానికి తడిసిపోతూ నేల మీద ముడుచుకుని కూర్చుని ఉంది. ఊరి కరణం రామచంద్రయ్య ఆలయానికి వెళుతూ ఆమెను చూసి వివరాలను వాకబు చేయగా భర్త వేరే పెళ్లి చేసుకుని ఇంట్లోంచి గెంటేసాడని, పుట్టింటికి వెళ్లడానికి ముఖం చెల్లక ఈ ఊళ్లో దిగిపోయానని ఆమె చెప్పడంతో కరణం గారు జాలిపడి ఊరవతల తన పొలం పక్కన ఉన్న పూరిపాకలో ఆమె ఉండటానికి ఏర్పాట్లు చేశారు.
ఆమె మునుపు పొలంలో పనిచేసేదిట. ఎవరి పొలంలో నాట్లువేసేది ఉన్నా వరి కోత ఉన్నా అక్కడికి పనికి వెళ్లిపోయేది. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండక ఎప్పుడు చూసినా పాక ముందు, వెనుకా ఏవేవో మొక్కలు పెడుతూ నీళ్లు పోస్తూ ఉండేది. మొక్కలు కాయడం మొదలుపెట్టాకా బస్‌స్టాపులో పెద్దకొడుకుని కూర్చోబెట్టి కూరగాయలు అమ్మించేది. అలా ఆ పడిపోయిన పాకలో ఆమె తన పిల్లలతో తన జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించింది.
ఆమె హస్తవాసి మంచిదని, ఇంట్లో ఏ శుభ కార్యం ఉన్నా ముందు ఆమెనే పిలవడం మొదలు పెట్టారు. ఎవరికి ఎటువంటి అవసరం పడినా ఆమె పేరునే ముందు తలుచుకునే వారు. టక్కున వచ్చి పని అందుకునేది. చేసిన పనికి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకునేది కాదు, అలా అని తక్కువ తీసుకునేది కాదు. నిప్పులాంటి ఆడదని, నికార్సైన మనిషని మంచిపేరు తెచ్చుకుంది.
ఆమె పాక దాటాక ఊళ్లోకి వచ్చే మొదటి ఇల్లు రాంబాబు వాళ్లదే. అప్పటికి అతను చిన్నవాడు. రాంబాబు తండ్రి పిల్లవాడిని భుజంమీద కూర్చో బెట్టుకుని పొలానికి వెళ్లి వస్తూ ఉన్నప్పుడు ఆమె రాంబాబుని ఎత్తుకుని బాగా ముద్దుచేసేది. కొద్ది రోజులకి రామచంద్రయ్యగారు డబ్బుసాయం చేయగా ఒక తెల్లటి గోవుని, తరువాత పాడి గేదెని కొనుక్కుంది. రోజూ కుండలో పాలుపోసుకుని ఇంటింటికి అమ్మేది. అప్పటి నుంచి ఆమెను అందరూ గోవమ్మ అని పిలవడం మొదలుపెట్టారు.
రామచంద్రయ్య గారింట్లో వాళ్లమ్మాయి పెళ్లికి నెలరోజులకి పైగానే ఒళ్లు పులిసిపోయేలా పని చేసింది. కాని కరణంగారి భార్య ఎంత బలవంత పెట్టినా గోవమ్మ ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదు.
‘కరణంగారు నాకు దేవుడు. దేవుడికి సేవ చేసినందుకు హుండీలో డబ్బు తీసుకుంటానా?’ అని ఎదురుప్రశ్న వేసి వెళ్లిపోయిందిట. ఆమె విశ్వాసాన్ని గురించి చాలారోజుల వరకు ఊళ్లో అంతా చెప్పు కుంటూనే ఉన్నారు.
చూస్తుండగానే ఆమె పాలవ్యాపారం చేస్తూ, ఒక ఎకరం పొలం కూడా కొనుక్కుని బాగానే నిల దొక్కుకుంది. చేసిన అప్పంతా అణా పైసాతో సహా తీర్చేసింది. ఆమె పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దవాడు టౌన్‌లో కారు డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. చిన్నవాడు రేవు ప్రాంతాలలో ఇసుక వ్యాపారంలో ఉన్నాడు. పదేళ్ల క్రితమే పొలాన్ని అమ్మేసి అన్నదమ్ములు వాటాలు పంచేసుకుని గోవమ్మను తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఒక్కప్పుడు బాగా బతికిన గోవమ్మ ఇన్నేళ్ల తరువాత మళ్లీ కూరలు అమ్ము కుంటూ కనపడటమన్నది చాలా ఆశ్చర్యంగా అని పిస్తోందనుకుంటూ రాంబాబు నిద్రలోకి జారి పోయాడు.
* * *
పదిరోజుల తర్వాత రాంబాబు అదే ఊరెళ్లాడు. వెనక్కి వస్తూ గోవమ్మను కలవాలని పక్కన ఉన్న కొట్టు దగ్గరికి వెళ్లి వాకబు చేస్తే వెనుక వైపు ఉన్న పెద్ద స్థలంలో ఉంటుందని ఆ కొట్టతను దగ్గరుండి చూపించి మరీ వెళ్లాడు. నాలుగు గుంజల పైన తాటాకులు వేసిన చిన్నగుడిసెలో వెలిసిపోయిన పాత నేతచీరలో నేలమీద ముడుచుకుని కూర్చుని ఉన్న గోవమ్మ అతనికి కనిపించింది.
అతనిని గుర్తుపట్టి అమితాశ్చర్యంతో చూస్తూ ‘రాంబాబు, ఎంత పెద్దోడివయి పోయావురా’ అంటూ ఆపేక్షగా దగ్గరకు తీసుకుని వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. అతని కుటుంబ విష యాలన్నీ అడిగి తెలుసుకుని సంపాదన లేక పట్నానికి వెళదామని అనుకుంటున్నాడని విని చాలా బాధ పడింది.
‘గోవమ్మా, ఒక్కదానివే ఉన్నావు. పిల్ల్లలేరి?’ అని అడిగాడు. ముందు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ అతను తరచి తరచి అడగడంతో ఆమె చెప్పు కొచ్చింది.
* * *
‘పెద్దదిక్కుగా ఉండే కరణంగారు పోయారు. పెద్దాడు బలవంతపెట్టడంతో వాడితో వెళ్లిపోయాను కానీ మనూళ్లో పొలం అమ్మేసినందుకు ఇప్పటికి బాధ పడుతూనే ఉన్నాను. కాని కొద్దిరోజులకే పెద్దాడు చేసే డ్రైవరు పని ఏమిటో తెల్సివచ్చింది. గొప్పొళ్ల నుంచి డబ్బులకట్టలను తన కార్లో అక్రమంగా వేరే ఊళ్లకు తరలిస్తాడు. ఎంతడబ్బు చేరిస్తే వాడికంత కమిషన్ వస్తుంది. పోలీసులకు దొరికిపోతే అసలు నోరువిప్పడు. జైలుకెళ్లి వచ్చాకా రూటుమార్చి అదే హవాలా పని చేస్తున్నాడు. జైలుకు వెళితే కోడలికి తోడుగా ఉంటానని నన్ను తెచ్చిపెట్టుకున్నాడు. విషయం అర్ధం అయ్యాకా నాకా పాపపుకూడు అసలు తినబుద్ధి కాలేదు. హితవు చెప్పినా వినే స్థితిని నా కొడుకు దాటిపోయాడని అర్థంచేసుకుని చిన్నోడి దగ్గరకు వెళ్లిపోయాను. చిన్నవాడు బాగానే చూసు కున్నాడు కానీ కోడలికే ఎందుకనో నా పొడ అసలు గిట్టలేదు. పెద్దపోట్లాటలు ఏమి లేవు కాని రోజు సూటిపోటి మాటలతో కాకిలాగ నన్ను పొడి చేసేది. నేను ముందునుంచి అనవసరంగా మాటపడే రకం కాదు. చిన్నవాడు మౌనంగా ఉండిపోయేవాడు. పిల్లలిద్దరూ ఎవరికి నచ్చినవిధంగా వాళ్ల జీవితాలను గడుపుకుంటున్నారని, నేనే వాళ్ల గూట్లో ఇమడలేక పోతున్నానని అర్ధం చేసుకుని వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుని అప్పుడేలా ఏ ఆధారం లేకుండా మన ఊరికి వచ్చానో మళ్లీ ఈ ముసలితనంలో ఈ లోకంలో నాకో చోటుకోసం వెతుక్కుంటూ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి బయటపడి ఊరుపేరు తెలియని స్టేషన్‌లో దిగేసాను.’ గోవమ్మ చెబుతూ ఆగింది.
వెండితీగల్లా మెరుస్తున్నజుట్టుతో వాడిపోయిన ముఖంతో ఉన్న ఆమెకేసి జాలిగా చూసాడు.
‘రాంబాబు, ఇప్పుడు చెబుతున్నాను. అందరూ అనుకున్నట్టుగా మా ఇంటాయనేమి నన్ను వదిలేయ లేదు. నేనే వదిలేసాను. నన్ను, ఆ రెండో పెళ్లాన్ని ఇద్దరినీ చూసుకుంటానన్నాడు. ఆ మాటకి నాలో రక్తం మరిగిపోయింది. ఏ విలువ లేకుండా వాడు పడేసే ముష్టిముద్ద కోసం పడి ఉండటం ఇష్టంలేకే పిల్లల్ని తీసుకుని నేనే ఇల్లు విడిచేసి మన ఊరికి చేరాను.’
గతాన్ని గురించి చెబుతూంటే ఆమె కళ్లల్లో ఆత్మగౌరవం ఒక మెరుపులా మెరిసింది.
‘టికెట్టు లేని నన్ను రైల్వేపోలీసులు పట్టుకుని జాలిపడి ఒక వృద్ధాశ్రమంలో చేర్పించారు. కాని ఆ నాలుగుగోడల మధ్య నేను ఉండలేకపోయాను. పళ్లెంలో నాకింత తిండిపడేస్తే ఆ ముద్ద కోసం ఆశ పడుతూ బతకడమన్నది నా వల్ల కాలేదు. పుట్టినప్పటి నుంచి పచ్చటి ప్రకృతిలోని చేలలో చెమటోడ్చి బతికిన మట్టిమనిషిని నేను. రైతు బిడ్డను. నా ఒంట్లో ఇంకా సత్తువ ఉంది. చివరికి ఈ ఊరుకి చేరాను.’
ఆమె కష్టాల గురించి వింటుంటే రాంబాబు హృదయం ద్రవించిపోయింది. గోవమ్మ ముడతపడిన ముఖంలో జ్ఞాపకాల నీలినీడలు వేగంగా కదులు తున్నాయి. తన అస్తిత్వం కోసం ఆమె చేసిన జీవన పోరాటమంతా లోతుకుపోయిన ఆమె కళ్లలో స్పష్టంగా ప్రతిఫలిస్తున్నది.
చుట్టూ చాలా దూరం వరకు విస్తరించి ఉన్న పెద్ద మైదానం లాంటి ఆ స్థలాన్ని కలియచూస్తూ ‘అయ్యో, ఇలా ఎండనక వాననక ఒంటరిగా బతుకు తున్నావా?’ బాధగా అన్నాడు.
‘రైతుకు ఎండేమిటి, వానేమిటి? రైతు బతుకంతా ఆకాశపు చూరుకింద పైరు ఒడిలోనే గడిచిపోతుంది. ఈ స్థలమంతా ఇబ్రహీం అన్న పెద్దమనిషిది. ఆయన పిల్లలంతా లండన్లో ఉంటారు. ఎప్పుడో ఈ ఎక రాలన్నీ కొనేసి చుట్టూ గోడకట్టి పెట్టాడు. ఈ గుడిసె వేయించి ఇక్కడ ఉండటానికి నాకింత చోటిచ్చాడు.’
‘ఎన్ని బాధలు పడ్డావు? మన ఊరు తిరిగి వచ్చేయాల్సింది గోవమ్మా.’
‘ఎలా రాను? ఊళ్లో అందరిముందు నా పిల్లలను పలుచన చేయడానికా? తల్లిగా ఆ తప్పు నేను చేయగలనా?’ అభిమానంగా అంది.
‘ఎవరూ ఏమి అనుకోరు. మా అమ్మలాగా నిన్ను చూసుకుంటాను. పద మన ఊరు పోదాం.’ ఆమె వ్యథలకు మనస్సంతా వెన్నలా కరిగిపోతుండగా ఆవేదనగా అన్నాడు.
బోసునవ్వు నవ్వి ‘ఈ గోవమ్మ మీద ఎప్పుడు జాలి చూపకు. నేనది అసలు భరించలేను. ఇలా ఈ వెనకకు రా.’ అతని చేయి పట్టుకుని తీసుకెళ్లింది. పందిరి మీద చిక్కగా అల్లుకున్న దొండపాదులు, కూరగాయల మొక్కలతో గుడిసె వెనుక ఒక పచ్చటివనమే ఉంది.
‘నేను వచ్చేటప్పటికి ఆ మూల చిన్నవేపమొక్క, మోటారు బావి ఉండేవి. అంతే. ఆ తరువాత పక్కనే మడులు చేసి టమాట, ఆకుకూరలు అన్ని వేసాను. పుట్టినప్పటి నుంచి ఈ నేలనే నమ్ముకున్నాను. తెల్లారగానే నేలతల్లి ఇన్ని కూరగాయలు ఇస్తుంది. పొద్దున్నే అన్ని కోసుకుని ఆ బస్సు ఆగే చెట్టు మొదట్లో కూర్చుంటాను. పదిమంది వచ్చి కొన్నా వందదాకా వస్తాయి. అంతకన్నా ఎక్కువవచ్చినా నాకవసరమే లేదు’ నిబ్బరంగా అంది.
రాంబాబు మౌనంగా వింటూ ఉన్నాడు. డెబ్భై పదులు దగ్గరపడుతున్నా ఆమె గుండెలో చెక్కు చెదరని స్థైర్యం అతన్ని అబ్బురపరుస్తోంది.
‘పొద్దున్న వండుకు తింటాను. రాత్రికి రెండు ఇడ్లీలు తెచ్చుకుంటాను. లేదంటే పాలుతాగి పడు కుంటాను. కూరలమ్మిన డబ్బులు వస్తే వస్తాయి. ఒక్కోసారి రావు. నా దగ్గర డబ్బెక్కువున్నా నేను ఉంచుకోను. నేనే తెల్లారితే ఉంటానో లేదో తెలియదు కదా’ నిశ్చలంగా అంది.
లోతుకుపోయిన కళ్లు, ఎండిపోయిన బుగ్గలు, వంగిపోయిన నడుముతో సన్నగా, బలహీనంగా ఉన్న ఆమెలో మెండుగా తొణికిసలాడుతున్న ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే రాంబాబుకి కంట్లో చెమ్మ చేరింది. అలాగే అతని మనసులోంచి ఏదో మానసిక స్థైర్యం కూడా పైకి తన్నుకువచ్చింది.
‘ఈరోజు ఒక్కటే మనది. రేపు కాదని, మనం ప్రతీక్షణం సంతోషంగా బతకాలని మీ తరం తెలుసు కోవాలి. ఈ నేల ఒక్కటే శాశ్వతమని నమ్మాలి. ఈ నేలసాగును విడిచి నువ్వు మోటార్ బండిని నడుపు కుంటూ ఉంటే, పెద్దోడు కారును, చిన్నోడు లారిని నడుపుకుంటున్నారు. ఇన్నేసి ఎకరాలు కొనేసిన ఆ ఆసామి పిల్లలంతా విమానాల్లో ఎక్కడెక్కడో తిరుగు తున్నారు. ఉన్నఊళ్లో సుఖంగా బతకకుండా మీరంతా ఆశతో పరుగులు పెడుతున్నారు. గల్లాపెట్టినిండా డబ్బు కూడపెట్టినా పూటకు తినేది గుప్పెడు బువ్వే కదా. ఇంత ముద్దన్నం అడిగితే ఈ నేలతల్లి ఆప్యాయంగా పెట్టదా? అన్నమొక్కటే కాదు ఇంకా చాలా ఇస్తుంది. సొంతూళ్లను వదిలేసి సంపాదనల కోసం ఎక్కడికీ పరుగులు పెట్టకండి. డబ్బు మాయలో అసలు పడకండి. రాంబాబు, దూరపుకొండలు నునుపని తెలుసుకో.’
గోవమ్మ మాటలకు చెంప చెళ్లుమన్నట్టుగా అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు. భార్య జగ్గమ్మ ముఖం అతని కళ్లముందు మెరుపులా తళుక్కున మెరిసింది. తొలిసారిగా భార్య ఆవేదన అతని హృదయాన్ని తాకుతూ అతనిని ఆలోచనల సుడిలో ముంచేసింది.
‘బాబు, ఒకప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ భూమే. మనకులాగే ఇక్కడి రైతులు వలసలు వెళ్లిపోతూ ప్లాట్ల కింద అమ్మేసుకున్నారు. నేనొచ్చి ఈ ఎండినమట్టి మీద నాలుగుచుక్కల నీళ్లు చల్లగానే, భూమిని చీల్చుకుంటూ ఇన్ని పచ్చటిమొక్కలు పుటుక్కున పుట్టుకుంటూ పైకి వచ్చేసాయి. నాకో బతుకుతెరువును చూపించాయి’
ఇంతలో ఒక అబ్బాయి బయటనుంచి ‘అవ్వ, పాలు’ అంటూ కేక పెట్టాడు. ఖాళీ గ్లాసు అతనికి ఇవ్వగా. అందులో వేడిపాలు పోసి ఆమెకిచ్చాడు.
‘జాన్, టీ ఉందా? మా ఊరి అబ్బాయి వచ్చాడు’ అడిగింది అతనిని.
టీ తాగి రాంబాబు డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని వారిస్తూ గోవమ్మే ఇచ్చింది.
‘నన్నిక్కడికి తీసుకొచ్చిపెట్టింది ఈ అబ్బాయే. పొద్దునే వచ్చి నేను మోయలేనేమోనని కూరలబుట్టని తీసుకెళ్లి చెట్టుదగ్గర అతనే పెడతాడు. నన్ను చాలా ప్రాణంగా చూసుకుంటాడు’ అతని వంక ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో అంది.
జాన్ బదులుగా నవ్వుతూ, ‘పైకి అలా చెబుతుంది కాని నిజానికి అవ్వే పెద్దదిక్కులా నిలబడి ఈ చుట్టుపక్కలందరిని చూసుకుంటుంది సార్. ఆమె నుంచి ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుంది. ’ అన్నాడు.
అతను వెళ్లిపోతుంటే పిలిచి కొంగుముడిలోంచి డబ్బుతీసి, ‘మీ ఆవిడకి మల్లెపూలు పట్టుకెళ్లు. మర్చిపోకు’ అంటూ చేతిలో పెట్టింది.
‘ప్రతి శుక్రవారం పూలకు డబ్బు ఇవ్వకుండా నన్ను వదలవు కదా అవ్వా’ నవ్వుతూ అంటూ సైకిల్ మీద వెళ్లిపోయాడు.
ఊదుకుంటూ వేడిపాలు తాగుతూ, ‘ఏమిటో మన ఊళ్లో గేదెపాలంత రుచి రాకపోయినా పాలు తాగే అలవాటు నాకిప్పటికీ పోలేదు. కాఫీలు, టీలు నన్నెప్పుడు అంటుకోలేదు.’ అంది.
చుట్టూ కలియచూసి, ఆమెవంక లోతుగా చూస్తూ ‘ఒక్కదానివి ఉండటానికి నీకసలు భయం వేయదా?’ అనడిగాడు.
‘ప్రకృతి తోడుంటే భయందేనికి? నమ్ముకున్నం దుకు నేలతల్లే నన్ను కాపాడుకుంటుంది’
‘ఎన్ని చెప్పినా వర్షంపడితే కష్టమే. లోపలికి నీళ్లు వచ్చేస్తాయి. రోడ్డు ఎత్తుగా, గుడిసె పల్లంగా ఉందిగా’ అన్నాడు.
‘ఎండకు ఎండాలి. వర్షానికి తడవాలి. చలికి వణకాలి. జీవితంలో ఏది మనకి ఎదురుగా వస్తే అది ఆనందంగా స్వీకరిస్తూ అనుభవించాలి. మని షన్న వాడు అన్నిటినీ సమానంగా తీసుకోగలగాలి. బతుకంటే అదే కదా రాంబాబు.’
ఆ వేదాంతపు మాటలకు చలించిపోతూ, ‘నిజం చెప్పు గోవమ్మా. నువ్వు చదువుకున్నావా. బాగా జ్ఞానంగా మాట్లాడతావు. ధైర్యంగా బతుకుతున్నావు. ఇన్ని మాట్లాడినా కూడా నీ పిల్లల మీద ఒక్క నింద కూడా వేయలేదు? నీ మాటలు వింటూంటే నాలో ఏదో తెలియని ధైర్యం, స్ఫూర్తి కలుగుతున్నాయి’ అన్నాడు.
‘చదువా’ బదులుగా చిన్నగా నవ్వింది.
‘అన్ని ధైర్యాలు ఆ దేముడే ఇస్తాడు. మనుషులు చేసిన దేముళ్ల కన్నా ప్రతి మనిషిలోను దేవుడుంటా డని నాకు మనుషుల మీదే విశ్వాసం ఎక్కువ. చంటిపిల్లల్ని భుజాన వేసుకుని వానలో తడుస్తూ కటిక చీకట్లో చెట్టు కింద అగమ్యగోచరంగా కూర్చుని ఉంటే రామచంద్రంగారి రూపంలో రాములవారు వచ్చి నన్ను, నా పిల్లల్ని కాపాడాడు. పిల్లలు దగ్గరలేక ఒంటరిగా ఈ ముసలిది ఎలా బతుకుతుందని కాసింత నీడనిచ్చి ఇబ్రహీం సారూ అల్లా రూపంలో నన్ను ఆదుకున్నాడు. ఈ జాన్ రూపంలో ఆ యేసు ప్రభువు నిండైన ప్రేమను నాకు పంచుతూ బతుకు మీద ఆశను ఇంకా సజీవంగా ఉంచాడు.’
ఆమె మాటలు అతని మనసుని లోతుగా తాకుతుండగా కదిలిపోతూ, ‘నువ్వు నిజంగా మట్టిలో మాణిక్యానివే’ ఆమె చేతిని పట్టుకుని ప్రేమతో అన్నాడు.
బయలుదేరుతుంటే తీసుకోదని అతనికి కచ్చి తంగా తెలుసు. అయినా కూడా మనసొప్పక, ‘నీ కొడుకులా ఇస్తున్నాను. కాదనకుండా తీసుకో’ ఆమె చేతిలో బలవంతంగా డబ్బుని పెట్టబోయాడు.
ఆ డబ్బువంక పామును చూసినట్టుగా చూసి ‘వద్దు. చిన్నవాడివి నీ దగ్గర తీసుకోలేను. నువ్వెంతో అభిమానంతో నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నాకదే సంతోషం. ఈ కరివేపాకును తీసుకెళ్లు. మీ దొడ్లోను చెట్టు ఉంటుంది. కాని ఈ ఆకు సువాసన చాలా బాగుంటుంది.’ కాగితంలో చుట్టబెట్టి ఇచ్చింది.
రాంబాబు చేతిని ఆప్యాయంగా పట్టుకుని అతనితో పాటుగా దడి దాటి బయటకు వచ్చి అతను వెళ్లే కనుచూపుమేర వరకు చెమ్మగిల్లినకళ్లతో అలా చూస్తూ గోవమ్మ నిలబడిపోయింది.
అతను బండివరకు వెళ్లి కొన్ని కొబ్బరిబోండాలు తీసుకుని మళ్లీ వెనక్కి వచ్చి, ‘ఇవి మన కొబ్బరి తోటలోవే. నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. నేను మళ్లీ నీ కోసం వస్తాను’ అని లోపలపెట్టేసి ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా గబగబా బండిదగ్గరకు వెళ్లిపోయాడు. ఎందుకో తెలియదు కాని రాంబాబు కళ్లలో నీళ్లు ధారగా కారిపోతూనే ఉన్నాయి.
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన ఈ రెండేళ్ల నుంచి అతనిలో అలుముకున్న ఆవేదనలు, ఆక్రోశాలు అన్నీ ఆ కన్నీటివరదలో ఒక్కసారిగా కొట్టుకుపోయి అతని మనసు ఒక్కసారిగా తేలిక పడింది. భరోసాతో కూడిన ప్రశాంతత మంచుపొగ లాగా అతని మనసును చల్లగా ఆవరించింది.
బండిని నడుపుకుంటూ వెళుతూ ఉంటే అతనిలో అవ్యక్తమైన ఆనందం ఏదో పొంగి పొరలసాగింది. రోజు చూసే రహదారే అయినా ఆ రోజు ఎందుకో ఎంతో విశాలంగా, ఏదో కొత్త దోవను చూస్తున్నట్టుగా అతనికి అనిపించసాగింది. గోవమ్మ జీవితపాఠం రగిలించిన స్పూర్తితో తన సమస్యలకి పరిష్కారాలెన్నో అతనికి ఒక్కొక్కటిగా కళ్లముందు గోచరించసాగాయి.
ప్రాణస్నేహితుడు నాయక్‌ను పట్నం వలస వెళ్లనివ్వకుండా ఆపాలని, భార్య చెప్పినట్టు ఊళ్లోని పక్కపొలాన్ని కౌలుకు తీసుకుని దున్నుకుంటూ వివిధ ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ భావిజీవితానికి అందమైన పూలబాటలు పరుచుకోవాలని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది.
తన సరికొత్త నిర్ణయాలతో భార్య ముఖంలోని వెలుగుల మెరుపులను తనివితీరా చూడాలన్న తపనలో మునిగితేలుతూ నూతనోత్సాహంతో ఉర కలు వేస్తూ సంతోషం పొంగిపొరలుతున్న మనసుతో రాంబాబు ఊరివైపుగా తన బండిని వేగంగా ముందుకు దూకించాడు.