ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను పురస్కరించుకొని దేశ పూర్వ ప్రధానుల జీవిత విశేషాలను తెలిపే ‘‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’’ పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాన నరేంద్రమోదీ ఏప్రిల్ 14న ప్రారంభించారు. అదేరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కావడం విశేషం. మాజీ ప్రధానులు దేశానికి చేసిన సేవలు, చూపిన మార్గదర్శకత్వాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ మ్యూజియం ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 సంవత్సరాల కాలంలో మనదేశం గర్వించదగ్గ ఎన్నో సంఘటనలు జరిగాయి. మనదేశ చరిత్ర గవాక్షంలో ఈ సంఘటనల ప్రాముఖ్యాని వేటితోనూ సరి పోల్చలేం. ఈ కాలంలో ప్రధానులుగా పనిచేసిన వారు రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్య లక్ష్యాలను సాధించడానికి అహరహం కృషి చేశారనడంలో సందేహంలేదు. ఇక్కడ ఎవరు ఏ సిద్ధాంతాన్ని అనుసరించారన్నది కాదు ముఖ్యం. వారి నిబద్ధత దేశ ప్రగతికి ఎంతగా దోహదం చేసిందనేది ప్రధానం. అటువంటి మాజీ ప్రధానులకు, ఈ సంగ్రహాలయను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అంకితం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను అందిపుచ్చుకోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్షణం. అందుకనే ఎన్ని సైద్ధాంతికతలు ప్రచారంలో ఉన్నా ప్రగతి పథం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. పరంపరాగతంగా భారత ప్రజలు నమ్మిన ధర్మం, ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషిస్తోంది. ఇందుకు గుర్తుగా ఈ సంగ్రహాలయం లోగో ‘ధర్మచక్రం’ ప్రజానీకం అంటిపెట్టుకొని ఉండే ధర్మాన్ని సూచిస్తుంది. నిరంతరం దేశ సౌభాగ్యం కోసం చేసే కఠోర శ్రమకు ఈ ధర్మచక్రం లోని 24 ఆకులు చిహ్నం. ఇది మన జాతి, ధర్మం, ప్రజా స్వామ్యాలకు గుర్తు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ప్రధానులుగా పనిచేసిన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలను ఈ మ్యూజియంలో పొందు పరచారు. ఒక్కొక్క మహనీయుని జీవితం ఒక్కొక్క స్ఫూర్తినిస్తుంది.
చాలామంది పేదకుటుంబాలనుంచి వచ్చినవారే
మాజీ ప్రధానుల జీవిత చరిత్రలను చూస్తే వీరిలో చాలామంది పేద, మధ్యతరగతి, రైతు కుటుంబాలనుంచి వచ్చినవారేనన్న సంగతి తెలుస్తుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారు కూడా ప్రధాని పదవిని అధిష్టించ వచ్చునని మన ప్రజాస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పష్టమవు తుంది. ఇది యువతకు రాబోయే తరాలవారికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే అంశం. అందు వల్లనే ఈ మ్యూజియం సందర్శించేవారు విజ్ఞానంతో పాటు ‘స్ఫూర్తి’ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంతేకాదు స్వాతంత్య్రోద్యమం, స్వాతంత్య్ర సాధన తర్వాత నెలకొన్న పరిస్థితులపై అవగాహన ఏర్పరచు కున్న యువత వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త నిర్ణయాలతో దేశాన్ని కొత్త మార్గంలో ముందుకు తీసుకెళ్లేవిధంగా ఈ సంగ్రహాలయం స్ఫూర్తినిస్తుంది.
ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచంలో రాజకీయ, భౌగోళిక పెనుమార్పులకు దోహదం చేశాయి. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు ప్రపంచ క్రమాన్ని మార్చి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మం, నిజాయితీ, ఆపన్నులకు సహాయం అందించడం వంటి లక్ష్యాలతో ముందు కెళుతున్న భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏ అగ్రరాజ్యమూ మనపై కత్తిదూసే పరిస్థితి లేదు. మరి మనం నేడు ఈ స్థాయికి చేరుకున్నామంటే, స్వాతంత్య్రం అనంతరం నుంచి దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారు చేసిన నిరంతర కృషి, చేసిన కఠోరశ్రమ, దేశానికి దిక్సూచులై వ్యవహరించిన తీరే కారణం. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోయినా, జీ7 దేశాల్లో సభ్యురాలు కాకపోయినా, ప్రపంచ రాజకీయాలకు కేంద్రస్థానంగా భారత్ నేడు వెలుగొందుతోంది. నేడు మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఎన్నో దేశాలకు మార్గదర్శకం. వీటన్నింటికి ప్రధానకారణం మన దేశ ప్రధానులు చూపిన మార్గదర్శకాలు మాత్రమే కాదు ప్రస్తుత ప్రధాని అనుసరిస్తున్న విధానాలు కూడా.
తీన్‌మూర్తి భవన్‌లో నిర్మాణం
ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియం నిర్మాణానికి సంబంధించి రూ.271కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు 2018లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంగ్రహాలయాన్ని న్యూఢిల్లీ లోని తీన్‌మూర్తి భవన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో బ్లాక్-1, బ్లాక్-2 అనే రెండు విభాగాలుండగా, బ్లాక్-2 కొత్తగా నిర్మించినది. ఈ రెండో బ్లాక్‌లోనే సంగ్రహాలయను నిర్మించారు. ఈ రెండు బ్లాక్‌లు కలిపి 15,600 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి వున్నాయి. ఈ సంగ్రహాలయ నిర్మాణం 10,000 చదరపు మీటర్ల ప్లాట్‌లో, నెహ్రూ మెమోరియల్ మ్యూజియంకు, తీన్‌మూర్తి భవన్‌లోని లైబ్రరీకి సమీపంలో కొనసాగింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో నెహ్రూ రచనలు, ఆయనకు సంబంధించిన సేకరణలు పొందుపరచి ఉన్నాయి.
ఈ సంగ్రహాలయాన్ని అత్యంత ఆధునిక రీతుల్లో నిర్మించారు. హోలోగ్రామ్‌లు, వర్చువల్ రియాలి టీలు, మల్టీ-టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనెటిక్ శిల్పాలు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, ఇంటరా క్టివ్ స్క్రీన్‌లు, ఎక్స్‌పర్ మెంటల్ ఇన్‌స్టాలేషన్స్ వంటి ఆధునిక సాంకేతిక సౌ కర్యాలు మ్యూజియం విశేషాలను, అందులోని అంశాలను పరస్పరం తెలియ జెప్పుకునేందుకు, విషయపరిజ్ఞానాన్ని గ్రహించేందుకు దోహదం చేస్తాయి.
ఈ సంగ్రహాలయంలో మొత్తం 43 గ్యాలరీ లున్నాయి. మాజీ ప్రధానుల అత్యంత అరుదైన చిత్రాలు, ఉపన్యాసాలు, వీడియో క్లిప్‌లు, ఇంటర్వ్యూ లతో పాటు వారి స్వదస్తూరితో రచించిన రచనలను ఈ మ్యూజియంలో ప్రదర్శిం చారు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఎగ్జిబిట్స్‌తో ప్రారంభమై, రాజ్యాంగ రచనతో పాటు, మనదేశ ప్రధానులు అప్పట్లో ఎన్నో సవాళ్ల మధ్య మనదేశ పురోగతికి మార్గదర్శనం చేసిన కథనాలను ఈ సంగ్రహాలయం వివరిస్తుంది. 14మంది మాజీ ప్రధానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీకు, వారి పదవీకాలాలకు అనుగుణమైన రీతిలో గౌరవిస్తూ అవసరమైన ప్రదేశాలను నిర్దేశించినట్టు కేంద్ర సాంస్కృతికశాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రదర్శన శాలలో ఆర్కివ్స్‌ను సముచిత రీతిలో వినియోగించి నట్టు స్పష్టమవుతుంది. మాజీ ప్రధానులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు, బహుమతులు, జ్ఞాపికలు, వారి ఉపన్యాసాలు, వారి సైద్ధాంతిక చరిత్ర, జీవితాల్లోని ముఖ్యాంశాలను పొందుపర చారు. ఈ మ్యూజియంలోకి ప్రవేశించేందుకు ఆన్‌లైన్ టిక్కెట్ ధర రూ.100 కాగా ఆఫ్‌లైన్ టిక్కెట్ ధర రూ.110. అదే విదేశీయులైతే రూ.750 చెల్లించాలి. 5-12 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు యాభైశాతం రాయితీ ఉంటుంది.
ఇందులో పొందుపరిచిన ప్రధానుల వివరాలు
- జవహర్‌లాల్ నెహ్రూ: 1947 ఆగస్టు నుంచి 1964 మే. ప్రధమ ప్రధాని.
గుల్జారీలాల్ నందా: 1964 మే నుంచి 1964 జూన్. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు.
- లాల్‌బహదూర్ శాస్త్రి: 1964, జూన్ నుంచి 1966 జనవరి. రెండో ప్రధాని. పదవిలో ఉండగానే దివంగతులయ్యారు.
గుల్జారీలాల్ నందా: 1966 జనవరి నుంచి 1966 జనవరి. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.
- ఇందిరాగాంధీ: 1966 జనవరి నుంచి 1977 మార్చి. తొలి విడత.
- మొరార్జీ దేశాయ్: 1977 మార్చి నుంచి 1979 జులై. 81వ ఏట ప్రధాని అయ్యారు.
- చరణ్‌సింగ్: 1970 జులై నుంచి 1980 జనవరి. పదవీకాలంలో పార్లమెంట్ ముఖం చూడలేదు.
ఇందిరాగాంధీ: 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్. రెండో విడత ప్రధాని.1984లో హత్యకు గురయ్యారు.
- రాజీవ్‌గాంధీ: 1984 అక్టోబర్-1989 డిసెంబర్. అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని. 40వ ఏటనే ప్రధాని పదవిని చేపట్టారు.
- వి.పి.సింగ్: 1989 డిసెంబర్-1990 నవంబర్. నేషనల్ ఫ్రంట్ కూటమి. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజీనామా చేశారు.
- చంద్రశేఖర్: 1990 నవంబర్-1991 జూన్. ఏ ప్రభుత్వశాఖను నిర్వహించని తొలి భారత ప్రధాని.
- పి.వి. నరసింహారావు: 1991 జూన్ -1996 మే. మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన ప్రధాని. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.
- అటల్ బిహారీ వాజ్‌పేయి: 1996 మే-1996 జూన్. ఈయన ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగింది.
- హెచ్.డి. దేవెగౌడ: 1996 జూన్ -1997 ఏప్రిల్. వి.పి. సింగ్ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో జనతాదళ్ నాయకుడు.
- ఇందర్‌కుమార్ గుజ్రాల్: 1997 ఏప్రిల్-1998 మార్చి. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించు కోవడంతో రాజీనామా చేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి: 1998, మార్చి – 2004 మే. రెండోసారి ప్రధాని. కేవలం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి 1999లో పదవికి రాజీనామా చేశారు. 1999లోనే మళ్లీ మూడోసారి ప్రధాని అయ్యారు.
- మన్మోహన్ సింగ్: 2004 మే -2014 మే. నెహ్రూ, ఇందిరల తర్వాత రెండు పూర్తి పదవీకాలాలు పనిచేసిన మూడో కాంగ్రెస్ నేత.
- నరేంద్రమోదీ: 2014 మే నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. భాజపా తొలిసారి సొంత బలంతో మెజారిటీ సాధించింది.
మార్పు ప్రకృతి ప్రధాన లక్షణం. సకల జీవజాలాలలో క్రమానుగత పరిణామమే చివరిగా మార్పుకు దోహదం చేస్తుంది. అంటే ప్రతి మార్పునకు ఆధారం దాని పూర్వ చరిత్ర, రూపం. ఆ ఆధారం నుంచే పరిణామక్రమం జరుగుతుంది. ఆకస్మికంగా వచ్చేది ఏదైనా అది శాశ్వతం కాదు. పరిణామ క్రమం ద్వారా వచ్చే మార్పే శాశ్వతం. మనదేశ చరిత్ర ప్రాచీన, మధ్యయుగం, ఆధునిక యుగాల్లో ఎన్నో పరిణామాలను చూసింది. ఆటుపోట్లను భరించింది. మధ్యయుగాల్లో ప్రారంభమైన పరాయిపాలనా ప్రభావం అనేక మార్పులు చెందుతూ చివరకు 1947లో మనం స్వాతంత్య్రం వచ్చేవరకు కొనసాగింది. మనల్ని మనం పాలించుకునే అవకాశం రావడానికి దేశం ఇన్ని వందల సంవత్సరాలు వేచిచూడాల్సి వచ్చింది. ఇటువంటి మన దేశ చరిత్రపై పటిష్టమైన అవగాహన కలిగిన ఉద్దండులే మన ప్రధానులుగా వ్యవహరించారు. వారి అనుభవాలనుబట్టి తమ సైద్ధాంతిక నిబద్ధతను బట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ ముందుకు తీసుకెళ్లడం అనేది కాలంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా లేకపోతే దెబ్బతినాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రస్తుత తరానికి, రాబోయే తరాలవారికి స్ఫూర్తిదాయక అవగాహన కల్పిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్