‘సంచలనం’ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పటం చాలా కష్టం. కాని ప్రసన్న శ్రీకి మాత్రం సులువు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆంగ్లాన్ని బోధించే ప్రసన్న శ్రీ వృత్తినీ ప్రవృత్తినీ సాహసోపేతం చేసుకున్నారు కనుక. ఒక ప్రొఫెసర్‌కి సాహసంతో పనేమిటి అనైతే అడగకండి. ఎప్పుడో చదువుకున్న వాటిని గుర్తు పెట్టుకుని, లేదంటే నోట్సుగా రాసుకుని ఆ అంశాలనే పదే పదే అదేపనిగా తరగతి గదిలో వల్లె వేయరు. రోజువారీ పరిణామాల్ని జోడించి, హేతుబద్దతను రంగరించి, పాఠాల అంతరార్థాన్ని బోధిస్తారు. పరీక్షల్లో మార్కులు, ఆ తర్వాత ఏదో విధంగా ఉద్యోగాల సాధనే అంతిమం అన్నట్లు ఒత్తిడినంతా కేంద్రీకరించరు. మనసునీ మెదడునీ సమన్వయించేలా, గత ప్రస్తుత భవితవ్యాలను సవ్యరీతిలో విద్యార్థినీ విద్యార్థుల ముందుంచుతారు. అలనాటి పాఠ్యాంశాలే అయినా, వాటిని నవీకరించి ఎప్పటికప్పుడు సరికొత్త సృజన రీతులను జోడించి చాలా చక్కగా బోధిస్తారు. పుస్తకాలనేవి మానసిక శక్తిని పెంచేవే తప్ప, పరీక్షల్లో జ్ఞాపకశక్తిని వెళ్లగక్కే సాధనాలు కాదంటారు. బోధనలో ఏ రోజుకు ఆ రోజునే నవ్యతను ఆవిష్కరించినప్పుడే విశ్వ విద్యాలయం తన పేరును సార్థకం చేసుకుంటుందని గాఢంగా నమ్ముతారామె. అన్నింటినీ ఆచరించి చూపుతారు కాబట్టే తాను సంచలనాల స్త్రీ. వరుసగా రెండేళ్లకూ జాతీయ స్థాయి పురస్కారాన్ని రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌ ‌చేతుల మీదుగా ఈ మధ్యనే అందుకున్న నారీ శక్తి!


ఐదుపదుల వయసు దాటిన సత్తుపాటి ప్రసన్న శ్రీ నిత్యమూ ఉత్సాహం తొణికిసలాడేలా భాష, సాహిత్య పక్రియల్లో మునిగి తేలుతుంటారు. విద్యార్థులైనా, తోటి అధ్యాపకులైనా ఏదైన అంశాన్ని ప్రస్తావిస్తే పూర్వాపరాలన్నింటినీ ఉదాహరణలతో విపులీకరిస్తారు. అందునా గిరిజన భాషల గురించి చర్చకు వస్తే-ఇప్పటిదాకా ఎవరికీ తెలియని, ఇంత వరకూ ఏ గ్రంథాల్లోనూ లభించని సమాచారాన్ని వెల్లడించి అందరినీ చకితుల్ని చేస్తుంటారు. కొండదొర, కోయ, సవర, సుగాలి, పదాల్ని, ఆయా ప్రత్యేకతల్ని మనలో కొంతమందైనా తెలుసుకునే ఉంటారు. కానీ అందరికీ తెలియాల్సిన గిరిజన భాషలు, సంస్కృతులు, పద్ధతుల వివరాలను సరళరీతిన విశదీకరించడంలో ఆమె దిట్ట. విశాఖ సరిహద్దు ప్రాంతం ఒడిశాలో మరీ ముఖ్యంగా కోరాపుట్‌ ‌జిల్లాలో గిరిజన జీవనరీతులన్నీ ఆమెకు కొట్టిన పిండి. భాషా కుటుంబాల తీరుతెన్ను లన్నింటినీ ఆమూలాగ్రం పరిశీలించి లిఖితరూపంలో పొందుపరిచారు. తాను ప్రత్యేకించి చదివిన ఆంగ్లం, మాతృభాష తెలుగు, సమీప ఒడియాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రదేశాలవారి ఆచార వ్యవహారాలకు సంబందించి గట్టిపట్టు సంపాదించారు. ప్రత్యేక లిపి నిర్మాణక్రమంలో తనదైన కీలకపాత్ర వహించారు.

తెలంగాణ, మహారాష్ట్రల్లోని విస్తృతభాష ఆనుపానుల్నీ పరిశీలించి పరిశోధించి ఒకరూపు తెచ్చారు. మధ్యప్రదేశ్‌ ‌ప్రాంతీయుల భాషానురక్తికీ పరవశించి శాశ్వత భద్రత కార్యక్రమాలు చేపట్టారు. అనేకానేక చోట్ల నూతన సంవిధానాల ఆవిష్కర్తగా విధులు నిర్వర్తించారు. పర్వత, మైదాన ప్రాంతాల్లోని వివిధ భారతీయ గిరిభాషలకు వర్ణమాల తయారీలోనూ ఈమె ముందడుగు. విభిన్న అధ్యయన సంస్థల పనుల్లో తలమానికంగా నిలుస్తున్నారు. హిందీ, బెంగాలీ భాషలన్నా తనకెంతో మక్కువ. ఇవన్నీ సంచలనాలు కావూ?

సేవా సహాయాల కలనేత

ప్రసన్నశ్రీ తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో, బదిలీల రీత్యా ఎప్పుడూ చలనాలే.  ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడి భాషలను నేర్చుకోవడం ఆమె అలవాటుగా చేసుకున్నారు. ఎంత దూరమైనా వెళ్లడం, ఆ స్థానికుల భాషను ఎంతో ఇష్టంగా అభ్యసిస్తారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆదివాసీలకు ఆమె ఆత్మీయురాలు. ‘భాషలు దూరాలను కలిపే దారాలంటారు. మనసుల్ని మంచిగా మార్చే సాధనాలని చెబుతారు. అటువంటప్పుడు కొండ, అరణ్య ప్రాంతాల వాసుల భాషలకీ సమప్రాధాన్యం ఇవ్వాలి కదా. వారికంటూ ప్రత్యేక లిపి ఉంటే, అన్ని విధాలా పురోగతి సాధ్యపడుతుంది. అందుకే నా సమయాన్ని, శక్తిని, వికాసాన్ని ఆదివాసీల భాషోన్నతికే వినియోగిస్తున్నా. దేనికైనా గట్టి నమ్మకం ఉండాలి. నా మీద నాకు ప్రగాఢ విశ్వాసముంది. గిరివాసుల అంకితభావం మీద మరింతగా ఉంది. మాటకు, మనసుకు, మంచి పనికి ప్రాణమిచ్చే వారి కోసం ఎంతైనా, ఏమైనా చేస్తాను. ఆ మాండలికాలను నేర్చుకుని, తరగతి గదుల్లోనూ నేర్పిస్తాను. జీవనశైలుల అధ్యయనం పుస్తకాల్లో ఉండదు. వర్సిటీల బోధన గదులకే అది పరిమితం కాకూడదు. ప్రతి అధ్యాపకుడు, అధ్యాపకురాలు తమ ఆలోచన పరిధులను విస్తరించి గ్రామీణ జన జీవితాలతో పూర్తిగా మమేకం కావాలి. అప్పుడే భాష వికసిస్తుంది, సాహిత్యం విస్తరిస్తుంది. అనుభవాలతో వెలువడేదే రచన అవుతుంది కానీ, పదాలను పేర్చడం కాదు’ అంటున్నారామె. డజనుకు పైగా భాషల లిపిని పొందుపరచిన సమర్థురాలు. ఆదివాసీల సంస్కృతికి అక్షర రూపాన్నిచ్చి, వారి హృదయాల్లో స్థానం పొందిన, పొందుతున్న భాషావేత్త. ఇప్పటికే పాతిక పుస్తకాలు రాశారు. అనేకానేక అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో ప్రసంగాలు చేశారు. రచయిత్రిగా, ప్రసంగకర్తగా ఎంతో వైవిధ్యం కనబరచి దీక్షాదక్షతలు చాటుకున్నారు. నవలల్లో స్త్రీ అనే అంశంమీద విస్తారంగా శోధన జరిపి, ప్రత్యేక గ్రంథాన్ని వెలువరించారు. ఆధునిక సారస్వత పక్రియల్లో వనితల అంతరంగం ఏ విధంగా ఆవిష్కృతమైందో విశదీకరిస్తూ పెద్ద పుస్తకమే తెచ్చారు. వీటితోపాటు మానసిక విశ్లేషణలన్నీ పుస్తకాలుగా ముద్రించి, తనదైన మరో కోణాన్ని చదువరులందరి ముందూ ఉంచారు. మాటల మూటగా పేరొందిన ఈ అధ్యాపకురాలికి మౌనం గురించిన అవగాహనా ఎక్కువ. ఆ తీరులోనూ ఓ సంకలనాన్ని తీసుకొచ్చారు.

శోధనతోనే సాధన

సర్దార్‌పటేల్‌ ‌పేరిట ఉన్న మహా విద్యాలయంలో పరిశోధన చేసినందుకే,భావాల రీత్యా ఇంతటి ఉక్కు వనిత అయ్యారనిపిస్తుంది. దేశీయంగానే కాదు, విదేశీయంగా బ్రిటన్‌ ‌కవితా రూపాల్నే సమగ్ర అధ్యయనం చేశారు ప్రసన్నశ్రీ. అధ్యాపక, పరిపాలక రంగాల్లో మూడున్నర దశాబ్దాలకు పైగా విశేష అనుభవం. మహిళా కళాశాలలో, ఆంధ్రా వర్సిటీలో తన నిబద్ధత తెలియనివారంటూ ఉండరు.ఆష్రో ఏషియాటిక్‌ ‌స్టడీస్‌ ‌సంస్థకు విజిటింగ్‌ ‌సీనియర్‌ ‌రీసెర్చి ఫెలోగా ఎన్ని సేవలందించారో విదేశీయు లందరికీ విదితమే. ఇక తాను సముపార్జించిన ఇతర పురస్కారాల మాట ఏమిటంటారా? పెద్ద జాబితానే ఉంది మరి. ఏపీ రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళావక్తగా అవార్డు. విశిష్ట వనితగా, సమాజ హితాభిలాషిగా, ఆదర్శ బోధకురాలిగా, గిరిజన అక్షర శిల్పిగా లెక్కకు మిక్కిలి బహూకృతులు ఈమె సొంతమయ్యాయి. విజయవాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే నాయకత్వ ప్రతిభ వెల్లడైంది. వరుసగా ఐదేళ్లూ విద్యార్థి సంఘ నాయకుల్లో ఒకరిగా పనిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అగ్రభాగాన నిలచి ఎస్‌ఎస్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగ అధ్యక్షురాలయ్యారు. యూనివర్సిటీ స్థాయిలో ఆమె స్వతంత్ర పరిశోధకురాలు.

శోధనలో భాగంగా దాదాపు పాతికేళ్లు వివిధ ప్రాంతాల్లో పర్యటనలు సాగిస్తూనే వచ్చారు. లిపి రూపకల్పనలో విశిష్టపడతిగా ప్రత్యేకత సంతరించు కున్నారు. లక్ష్య సాధనలో చేదు అనుభవాలు ఎదురైనా సహనంతో భరించారు. ప్రతికూల స్థితిగతులు చూసి వెరవలేదు. రెట్టించిన పట్టుదలతో ముందుకు కదిలారు. తాను పర్యటించిన మారుమూల పల్లెల సంఖ్య వందల్లోనే. సమస్యలు తెలుసుకోవటం, వివరాలను నమోదు చేసుకోవడం, స్వరాలను ధ్వనిబ్ధం చేసుకోవడం, ఓర్పూనేర్పులతో సమాచార సమీకరణ కొనసాగించడం… వీటన్నింటికీ ఎంత సత్తువ ఉండాలి? ఇంకెంత సహనశీలత కావాలి? అన్నీ ఉన్నాయి కాబట్టే ప్రసన్నశ్రీ నారీశక్తిగా నిలిచారు, గెలిచారు.

ఒకే ఒక్కరు… దీక్షా దక్షురాలు

మన దేశంలో, అందులోనూ దక్షిణాది విశ్వవిద్యాలయ స్థాయిల్లో ఇంతగా గిరిజన భాషాసేవ చేసిన, చేస్తున్న మహిళా అధ్యాపకురాలు లేరనే చెప్పాలి. ఎప్పుడో ముప్పయి సంవత్సరాల క్రితం విశాఖ ప్రాంత అరకులోయను తన చిన్నారి పాపతో సందర్శించారీమె. అక్కడి గ్రామీణ వాతావరణ శోభకు పులకించి, పల్లెవాసుల ఆదరాభిమానాలకు చలించి, ఆనాడే అనుకున్నారు- ఈ పర్యటనలకు ముగింపు అనేదే ఉండకూడదని. అప్పటి నుంచి కొనసాగుతూనే వస్తున్న సుదీర్ఘ యాత్రలో మలుపులు లెక్కలేనన్ని. ఆదివాసీల జీవన రీతుల్ని కళ్లద్దాలతో కాదు, కళ్లతో చూశారు. వారి గుండె చప్పుళ్లను చెవులతో కాక మనసుతో విన్నారు.చూసిందీ, విన్నదీ అక్షరీకరించి శాశ్వతత్వం కలిగించేందుకు జీవితాన్నే అంకితం చేస్తున్నారు. ఈ కృషి ఫలితంగానే 2020, 2021 సంవత్సరాలకు శక్తి మహిళగా ఈమెను కేంద్రం ఎంపిక చేసింది. అవార్డు ప్రదానోత్సవ తరుణంలో ఇటీవల ఆ సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకీ సంబంధించి, ఈ మహిళామణి ఒక్కరికే ఇటువంటి మహోన్నత పురస్కృతి. గ్రామీణ, భాషా సాహిత్యాలు, సేవారంగాల పరంగా ఇంత విస్తృతి, విలక్షణతను ఆసియాలో మరెక్కడా ఏ వనితలోనూ చూడలేం. ప్రసన్నశ్రీ ఒక పతాక, ప్రతీక. ఓ చలనం, జ్వలనం. ఇప్పుడు చెప్పండి మీరే సంచలనం అంటే ఏమిటీ? ఎంచుకున్న రంగంలో అంచులు చూడటం. ఇందులో మించిన ఆమె అక్షరాలా నారీశక్తి కాక మరేమిటి?

– జంధ్యాల శరత్‌బాబు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE