రాజకీయ కక్షలు ఇంత కర్కశంగా, ఇంత ఘోరంగా, అమానుషంగా ఉండగలవా? మార్చి 21వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్‌లో, బీర్‌భూమ్‌ ‌జిల్లాలో బొగ్తుయి గ్రామంలో జరిగిన ఘోరకలి గురించి వింటే ఈ ప్రశ్నలే వెంటాడతాయి. అభివృద్ధి పతనపథంలో, హింస అగ్రస్థానంలో- ఇదీ ఇవాళ్టి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖచిత్రం. కొనసాగుతున్న రాజకీయ కక్షలతో ఆ రాష్ట్ర భవితవ్యం అగమ్యగోచర స్థితిలో పడింది. రాజకీయ గుత్తాధిపత్యం కోసం అధికార పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌తహతహ, ఉపాధి అవకాశాలు లేక కేవలం పార్టీలపై అధారపడి రోజువారీ జీవనం వెళ్లదీస్తున్న కిరాయిమూకలు హింసకు ప్రధానకారణం. రాజకీయ చైతన్యానికీ, మేధో సంపత్తికీ ఒకప్పుడు చిరునామాగా ఉన్న ఆ రాష్ట్రం అందుకు తగిన రీతిలో ముందడుగు వేయలేక చతికిల పడింది. ఇప్పటివరకు పాలించిన రాజకీయ పార్టీల స్వార్థం, మూర్ఖత్వం కారణంగా దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా, ఆటవిక పాలనకు ఉదాహరణగా భాసిల్లుతోంది.

ఆటవిక న్యాయం

బీర్‌భుమ్‌ ‌జిల్లా బొగ్తుయి గ్రామంలో ఆ రాత్రి జరిగిన దురాగతం దేశం ఉలికిపడేలా చేసింది. కొందరు దుండగులు పది గుడిసెలకు నిప్పు పెట్టడంతో ఎనిమిదిమంది సజీవదహనమవడం సంచలనం సృష్టించింది. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం కలచివేసే అంశం. అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ స్థాయి నేత బహదూర్‌ ‌షేక్‌ ‌హత్యకు గురయ్యాడు. అందుకు ప్రతీకారమే ఈ దారుణం. రెండు వర్గాలు తృణమూల్‌ ‌తాను ముక్కలే. హత్యకు సంబంధించి 22 మందిని అరెస్ట్ ‌చేసినట్టు పోలీసులు వెల్లడించడం బాగానే ఉన్నా, హింసా రాజకీయాలకు పెట్టింది పేరైన పశ్చిం బెంగాల్‌లో, దీనికి ప్రతీకారంగా దారుణ కృత్యాలు జరుగుతాయని అంచనా వేయలేక పోవడం వైఫల్యం లేదా నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇందుకు బాధ్యత హోంశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీదే. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ హత్యలకు సంబంధించి ప్రాథమిక నివేదికను ఏప్రిల్‌ 7‌వ తేదీకే సమర్పించవలసి ఉన్నది కూడా. 20 మంది సభ్యులు ఉన్న సీబీఐ బృందం సంఘటనా స్థలిని సందర్శించింది. మృతులందరు గుర్తుపట్టలేనంత దారుణంగా బుగ్గి అయ్యారు. ఈ సంఘటనకు అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సర్కారు వైఫల్యమని, రాష్ట్రంలో అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న హింస నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్ష బీజేపీ నేత సుబేందు అధికారి డిమాండ్‌ ‌చేశారు. కేవలం వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 26 హత్యలు జరిగాయంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన తొమ్మిదిమంది ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షాను కలిసి తక్షణం కలుగజేసుకొని నేరగాళ్లను శిక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంఘటనపై నివేదిక కోరడం గమనార్హం. అంతేకాదు జాతీయ మానవహక్కుల సంఘం బీర్‌భూమ్‌ ‌సంఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్‌ ‌ప్రభుత్వానికి, పోలీస్‌ ‌బాస్‌కు మార్చి 24న నోటీసులు జారీచేసింది. ఇదిలావుండగా కోల్‌కతా హైకోర్టు బొగ్తుయి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ మార్చి 25న ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఘాతుకానికి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన బ్లాక్‌ అధ్యక్షుడు అనరుల్‌ ‌హుస్సేన్‌ ‌కారణమంటూ స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతడిని అరెస్ట్ ‌చేయాలంటూ డీజీపీని ఆదేశించడం కొసమెరుపు.

ఉత్తర ప్రదేశ్‌లో రక్తపాతం జరిగిపోతున్నదంటూ బొబ్బలు పెట్టిన మమతా బెనర్జీకి తన సొంత రాష్ట్రంలో రాజకీయ హింసకు సంబంధించిన గణాంకాలు తెలియకుండా ఉంటాయా? అయినా ఆమె నిస్సిగ్గుగా బీజేపీ పాలిత రాష్ట్రాలలోని చెదురుమదురు ఘటనల గురించి కుళాయి తిట్లు లంఘించుకుంటారు. 1997లో నాటి ముఖ్యమంత్రి బుద్ధదేబ్‌ ‌భట్టాచార్య ఏం చెప్పారు? సాక్షాత్తు శాసనసభలోనే చెప్పిన మాట- 1977 నుంచి 1996 వరకు 28,000 రాజకీయ హత్యలు జరిగాయి. కమ్యూనిస్టుల పాలనకు సమాధి కట్టడానికి ముందు వరకు అంటే 1977 నుంచి 2009 వరకు 55,000 రాజకీయ హత్యలు జరిగాయని మెయిన్‌‌స్ట్రీమ్‌ అనే వామపక్ష పత్రికే వెల్లడించింది.

ఈనాటిది కాదు

బెంగాల్‌లో హింసా సంస్కృతి ఇప్పటిది కాదు. 1950 కాలం నుంచి ఆ రాష్ట్రంలో హింస ఒక అంతర్గత భాగంగా భాసిల్లుతూ రావడం దేశ చరిత్రలో ఒక విషాదం. దశాబ్దాలుగా కొనసాగుతున్న అశాంతి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైన నేపథ్యంలో ఇక్కడి సామాజిక సంస్కృతిలో అల్లుకుపోయి జీవితాలను కొనసాగించిన ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని వలసపోయారు.

స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో గొడవలు కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీల మధ్య మాత్రమే పరిమితమయ్యేవి. ఆ తర్వాత వచ్చిన నక్సల్‌ ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలతో ఏర్పడ్డ వివిధ గ్రూపుల మధ్య హింస రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. కమ్యూనిస్టులు బెంగాల్‌లో రాజకీయ హింసను ఇంకాస్త విస్తరించారు. ప్రస్తుత హింసకు పునాదులు అటువంటి 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలనలోనే పడ్డాయి. స్వాతంత్య్రానికి పూర్వం 1946-48 మధ్యకాలంలో బెంగాల్‌లో తెభాగ ఉద్యమం రూపంలో మొట్టమొదటి రాజకీయ హింస జరిగింది. బెంగాల్‌లో భూస్వాములకు కాంగ్రెస్‌ ‌పార్టీ కొమ్ముకాస్తే అప్పటి యునైటెడ్‌ ‌కమ్యూ నిస్ట్ ‌పార్టీ రైతులకు మద్దతుగా నిలిచింది. కోసిన పంటలో 2/3వ వంతు కావాలంటూ కౌలు రైతాంగం భూస్వాములను డిమాండ్‌ ‌చేయడంతో ఈ ఉద్యమం చెలరేగింది.

తర్వాత 1959లో చెలరేగిన విద్యార్థి ఉద్యమంలో కూడా రక్తపాతం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయపార్టీల మధ్య జరిగిన పోరాటం, శాంతిభద్రతల కోసం పోలీసులు చేపట్టిన చర్యల్లో ఎంతోమంది మరణించారు.  1967,1969 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ‌వ్యతిరేక యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ ‌చేయడం కూడా రాష్ట్రంలో అస్థిరతకు దారితీస్తే, 1967లో చారు ముజుందార్‌ ‌నేతృత్వంలో ప్రారంభమైన నక్సల్‌ ఉద్యమం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసింది. తర్వాత 1970ల్లో జరిగిన ‘శైన్‌బరి’ హత్యలు మరో రక్తచరిత్రకు తెరలేపాయి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సోదరులను వామపక్ష సమర్థకులు దారుణంగా హత్యచేసి, వారి రక్తంతో తడిచిన అన్నాన్ని హతుల తల్లిచేత బలవంతంగా తినిపించా రన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఇక 1980 తొలినాళ్లలో చేపట్టిన ‘‘ఆపరేషన్‌ ‌బర్గా’’ కింద, భూమిలేని పేదలకు భూములను పంచడంతో బెంగాల్లో నయా భూయాజమాన్య వర్గం ఆవిర్భ వించి, బెంగాల్‌ ‌గ్రామీణ ప్రాంతాల్లో చెదురుమదురు సంఘర్షణల్లో తనవంతు పాత్రను పోషిస్తోంది.

1998లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఏర్పాటైన తర్వాత, విపక్షాలకు చెందిన  చాలామంది ఇందులో చేరడంతో హింసా ప్రవృత్తి కొనసాగుతోంది. భూసేకరణకు వ్యతిరేకంగా 2007లో చోటుచేసు కున్న నందిగ్రామ్‌ ‌సంఘటనలో పోలీసుల కాల్పుల్లో 14 మంది మరణించారు. అటుతర్వాత టీఎంసీ, సీపీఐ(ఎం) మధ్య జరిగిన రాజకీయ పోరులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 2008-2011 మావోయిస్టులు దాదాపు వందకు పైగా సీపీఐ(ఎం) కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. ఇది 1960-70 నాటి పరిస్థితులను ఒక్కసారికి స్ఫురణకు తెచ్చిందనే చెప్పాలి. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చాక 2013, 2018 పంచాయతీ ఎన్నికల్లో విపరీతమైన హింస చోటుచేసుకుంది. తర్వాత సీపీఐ(ఎం) స్థానాన్ని బీజేపీ భర్తీ చేసినప్పటికీ తృణమూల్‌ ‌వైఖరిలో మార్పులేదు. గత ఏప్రిల్‌-‌మే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో గణనీయంగా బలాన్ని పెంచుకున్న ప్పటికీ అధికారాన్ని హస్తగతం చేసుకోలేకపోయింది. 2021 మొదట్లో భాజపాకు చెందిన వంద మందికి పైగా కార్యకర్తలు దారుణహత్యకు గురయ్యారన్న ఆరోపణలున్నాయి.

ఎన్నికల అనంతర హింస

బెంగాల్‌లో గత ఏప్రిల్‌, ‌మే నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న భయానక హింసాకాండపై బెంగాల్‌ ‌హైకోర్టు విచారణకు ఆదేశించడం అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం. రాజకీయంగా ఎంతో చైతన్యవంతులమని ఘనంగా చెప్పుకునే బెంగాలీలు, ఆ చైతన్యం మితిమీరి నేడు పతనావస్థ రాజకీయాలకు కారణ భూతులవుతున్నారు. అధికార పార్టీ మద్దతు లేని కుటుంబాలకు చెందిన మహిళలు దారుణంగా అత్యాచారాలకు గురయ్యారని ఐదుగురు న్యాయ మూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొందంటే, బెంగాల్‌లో నెలకొన్న అథోగతి పరిస్థితులకు ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. ఎప్పుడు ఏ రాజకీయ, మత లేదా మరే ఇతర హింసాకాండ చోటుచేసుకున్నా ముందుగా బలయ్యేది మహిళలే! మహిళల సమానత్వంపై గొంతులు చించుకునే సోకాల్డ్ ‘‌ఫెమినిస్టులు’, లెఫ్టిస్టులు…ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న రాష్ట్రంలోనే ఇటువంటి ఘోరాలు జరుగుతుంటే కిమ్మనరేం?

హింసా ప్రవృత్తికి కారణమేంటి?

బెంగాల్‌లో  హింసా ప్రవృత్తి పెరగడానికి కారణ మేంటి? ‘ఎంతోకాలంగా సైద్ధాంతికతే చోదకశక్తిగా కలిగిన సమాజం ఇప్పుడు గుర్తింపు ఆధారిత స్థితికి పరిణామం చెందడమే ఈ హింసకు కారణం. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ గుర్తింపు కోసం పాల్పడే దుశ్చర్యలు హింసా ప్రవృత్తిని మరింతగా ప్రజ్వరిల్ల జేస్తూవచ్చాయి. ప్రస్తుతం ఇది ఒక సిద్ధాంతం, నియమాలు, విలువలకు ఎటువంటి ఏవిధమైన ప్రాధాన్యత లేని దశకు చేరుకుంది’ అని విశ్లేషకులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వంపై అధికంగా ఆధారపడటం, అట్టడుగుస్థాయిలో రాజకీయ కార్యకర్తల దురుసు స్వభావంతో పాటు దశాబ్దాలుగా ఒకే పార్టీ అధికారంలో కొనసాగడం కూడా ఈ దుస్థితికి కారణమని నిపుణుల అంచనా. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, అభివృద్ధి కుంటుపడటంతో గ్రామాలు, సెమీ అర్బన్‌ ‌ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా తమ రోజువారీ సంపాదన కోసం పార్టీలపై ఆధారపడుతూ వచ్చారు. దీన్ని అలుసుగా తీసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ప్రజల నిస్సహాయతను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. దీనికితోడు రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు విపరీ తంగా ఉండటం హింస వేగంగా విస్తరించడానికి కారణమవుతున్నాయి.

ఎన్‌.‌సి.ఆర్‌.‌బి. డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే బెంగాల్‌ ‌దే అగ్రస్థానం. ఇక్కడ పోలీసువ్యవస్థలోకి కూడా రాజకీయ చీడ ప్రవేశించడం అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా ఉండటానికి మరోకారణం. సీపీఎం కాలంలో ప్రారంభమైన ఈ దుర్గతి, టీఎంసీ అధికారంలోకి వచ్చాక పరిపూర్ణస్థాయికి చేరింది. హింసా ప్రవృత్తిని ప్రవేశపెట్టినపాపం వామపక్షాలదైతే, దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసి అన్ని ప్రాంతాల్లోకి విస్తరించిన ఘనత మాత్రం టీఎంసీదే.

ఇంతకీ ముఖ్యమంత్రి మమతా అంత ఆదరా బాదరా చర్యలు తీసుకోవడానికి కారణం ఏమిటి? బొగ్తుయి ఉదంతంలో హతులు, హంతకులు ఇద్దరూ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీవారే. పైగా ముస్లింలలోని రెండు వర్గాల గలాటా ఇది. ఇది మమతకు పచ్చి వెలక్కాయ గొంతులో పడేసింది. టీఎంసీ మార్కు రాజకీయ  హింసకు ఇదొక కొత్త కోణం. అయినా ఆమె నిస్సిగ్గుగానే ప్రకటనలు ఇస్తున్నారు. బెంగాల్‌కు ఉన్న మంచి పేరును చెడగొట్టడానికేనని ఆమె విరుచుకుపడుతున్నారు. చిత్రంగా ఉదారవాదులు, స్వయం ప్రకటిత పత్రికా రచయితలు ఈసారి కష్టపడి పెదవి విప్పారు. స్వాతి చతుర్వేది, సాక్షి జోషి ఘోరం జరిగిపోయిందంటూ వాపోయారు. ధైర్యం చేసి మమతా బెనర్జీ పాలకురాలిగా విఫలమయ్యారని కూడా తీర్మానించారు. ఇంత జరిగినా కూడా బాధితు లకు అక్కడ రక్షణ లేదు. బొగ్తుయి సజీవ దహనం ఉదంతంలో చనిపోయిన ఒక వ్యక్తి తల్లి మఫిజా బీబీ అన్న మాటలు విని మమత సిగ్గుపడాలి. అరెస్టయిన కొందరు, తాము బెయిల్‌పై విడుదలై రావడం ఖాయం, ఈ కేసులో నిజాలు బయటపెట్టిన అందరినీ చంపేయడం ఖాయం అని బెదిరించి మరీ వెళ్లారట. ఇదే మఫిజా చెప్పిన మాట. కాబట్టి మమ తకూ, ఆమె పార్టీకి రాజకీయ సమాధి కడితే తప్ప అక్కడ శాంతి నెలకొల్పడం సాధ్యం కాదు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE