– ఎం.వి.ఆర్. శాస్త్రి
‘‘1947 ఆగస్టు 15న దిల్లీ ఎర్రకోటలో సుభాస్ చంద్రబోస్‌ని మర్డర్ చేశారు!’’
‘‘దానికి రుజువేమిటి?’’
‘‘ఓ పుస్తకంలో అలా రాసి ఉంది. అదొక్కటే రుజువు.’’
‘‘ఆ పుస్తకం ఎవరు రాశారు? ఎవరు పబ్లిష్ చేశారు?ఎంతమంది చదివారు?’’
‘‘ఆ పుస్తకం రాసింది నేనే! దానికి పబ్లిషరు, పాఠకుడు కూడా నేనే!!’’
‘‘స్వాతంత్య్ర పోరాటకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పందోల అనే ఊరిదగ్గర విమాన ప్రమాదం జరిగింది. దానిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. 1.సుభాస్ చంద్రబోస్ 2. హబిబుర్ రహమాన్ 3. హిట్లర్ ! తరవాత బోస్ సన్యాసం తీసుకుని అక్కడే స్థిరపడి 1977లో మరణించాడు’’
ఏమిటివి? పిచ్చివాళ్ల ప్రేలాపనలా? కాదు. నేతాజీ మిస్టరీని ముచ్చటగా మూడోసారి అధికారికంగా దర్యాప్తు చేసిన జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఆరేళ్లపాటు చెవులు రిక్కించి శ్రద్ధగా ఆలకించిన వింత సాక్షుల వెర్రి కథనాలలో ఇవి మచ్చుకు రెండు.
సుభాస్ చంద్ర బోస్ పుట్టి నూరేళ్లు దాటాక, విమాన ప్రమాదంలో ఆయన మరణించి అర్ధ శతాబ్దం గడిచాక, 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్టుగా సర్కారువారే వేసిన రెండు విచారణ సంఘాలు తేల్చాక – నేతాజీ మరణించాడా? లేదా? మరణిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎలా? మరణించకపోతే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమిచేస్తున్నాడు – అని ఎన్నో కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఇంకో ఎంక్వయిరీ కమిషన్ వేయటమే నగుబాటు. ఆ పనికిమాలిన కమిషన్ పనిచేసిన తీరు, పొడిగింపుల మీద పొడిగింపులు తీసుకుని పరిశీలించి, పరిశోధించి చివరికి అది కనిపెట్టిన మహాసత్యాలు మరీ హాస్యాస్పదం.
ఈ మూడో నెంబరు ఎంక్వయిరీ ఫార్సు కథ, కమామిషు ఏమిటంటే- అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను మరణానంతరం నేతాజీకి ఇవ్వదలచినట్టు నేతాజీ 95వ జన్మదిన సందర్భంగా పివి నరసింహారావు ప్రభుత్వం 1992 జనవరి 23న ప్రకటించింది. అంతకు పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వాలు నేతాజీకి తగిన గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చేశాయన్న నింద దానివల్ల తొలగుతుందని పివి ఆలోచన. బోస్ కుటుంబం ఆ నిర్ణయాన్ని స్వాగతించి అవార్డును స్వీకరిస్తే, తరువాయి అడుగుగా జపాన్ నుంచి నేతాజీ అవశేషాలనూ మెల్లిగా దేశానికి తీసుకురావచ్చునని ఆయన ఉద్దేశం. ఆయన ఊహించని రీతిలో ఆ ఎత్తు బెడిసికొట్టింది.
జాతీయ మహానేతకు లేటుగా అయినా సముచిత గౌరవం ఇచ్చారని మెచ్చుకోకపోగా క్షమించరాని మహాపరాధమేదో చేసినట్టు ఎక్కడెక్కడివారూ పివి మీద పడ్డారు. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడన్న కథనాన్ని తామూ ఆమోదించినట్టు లోకాన్ని నమ్మించటానికే ఈ కొత్త ఎత్తు వేశారని బోస్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ‘‘ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే అత్యున్నత పురస్కారాన్ని మొట్టమొదట మా నాన్నకే ఇవ్వవలసింది. అన్ని బాపతుల శాల్తీలకూ ఇచ్చాక ఇప్పుడు దానిని ప్రకటించటం నా తండ్రి ఔన్నత్యాన్ని అవమానించ టమే- అని దేశం వెలుపల నేతాజీ కుమార్తె అనిత బాధపడింది. నేతాజీకి ‘భారతరత్న’ను ప్రకటించట మంటే పాత గాయాలు కెలకటమే.. అని నేతాజీ సొంత పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ వారు, దేశమంతటా ఎందరో బోస్ అభిమానులు ఆగ్రహించారు. అసలు నేతాజీ మరణించినట్టు రుజువు చేయకుండా మరణానంతర పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారు అని ఉత్సాహవంతుడైన ఒక న్యాయవాది కోలకతా హైకోర్టులో రిట్ వేశాడు. అందులో గొప్ప జాతీయ ప్రాధాన్యం ఉన్నదని హైకోర్టు కనిపెట్టి ఆ కేసును సుప్రీం కోర్టుకు ఫొర్వార్డ్ చేసింది.
అనుకోని ప్రతిఘటనకు బిత్తరపోయిన పివి ప్రభుత్వం నేతాజీకి ‘‘మరణానంతర’’ పురస్కారం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రకటించిన కొద్దిరోజులకే ఉపసంహరించుకుంది. మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతానా అని ఆ లిటిగెంటు ప్రభుత్వం వెంటపడ్డాడు. బోస్ ఎప్పుడు, ఎక్కడ మరణించాడు అన్నది ప్రభుత్వం దేశానికి చెప్పాలి. లేదా 1945 ఆగస్టు 18 నుంచి అయన కదలికల వివరాలు బయటపెట్టాలి. తెలియకపోతే దర్యాప్తు చేసి తెలుసుకుని చెప్పాలి – అంటూ అతగాడు కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఆ కేసు మీద చాలా శ్రద్ధ పెట్టాడు. ఐదేళ్లు విచారణ చేసి చేసి చివరికి 1997లో సర్వోన్నత న్యాయస్థానం తేల్చినది ఏమిటంటే ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలామంది సెంటిమెంట్లు గాయపడ్డాయి. అయితే తదుపరి చర్య తీసుకోకుండా ప్రభుత్వమే అవార్డు ప్రతిపాదన ఉపసంహరించు కున్నది కాబట్టి మరణానంతరం పురస్కారాన్ని ఇస్తున్నట్టు ప్రకటించటం సరైనదా కాదా అన్ని విషయంలోకి ఇప్పుడు వెళ్లనవసరం లేదు. వివాదానికి మూలమైన సదరు పత్రికా ప్రకటన రద్దు అయినట్టుగా భావించవలెను అని! అసలు ప్రకటనే రద్దు అయినందున దాని ఈకలు పీకిన వ్యాజ్యమూ అలా సమసిపోయింది.
అప్పటికి పివి ప్రభుత్వానికి నూకలు చెల్లి, దేవెగౌడ అధికారనిద్ర కూడా అయి, ఇందర్‌కుమార్ గుజ్రాల్ గిరీ నడుస్తున్నది. కొత్త జమానాలో రక్షణ మంత్రి ములాయం సింగ్ యాదవ్! పివి లాగే అతడికీ బోస్ అంటే భక్తి మెండు. ఆ అభిమానం కొద్దీ నేతాజీ అస్థికలను, భస్మాన్ని దేశానికి తీసుకు రావాలను కుంటున్నట్టు ఒకపరి నోరు జారాడు. దాని మీద కందిరీగల తుట్టె కదిలింది. అనకూడనిదేదో మంత్రి అన్నట్టు, వినకూడనిదేదో తాము విన్నట్టు చాలా మంది గుండెలు బాదుకుని గావుకేకలు పెట్టారు. ‘‘నేతాజీ మరణించినట్టు రుజువు ఏమీ లేనప్పుడు ఆయన మరణించాడని ఊహించటమేమిటి? ఎక్కడినుంచో చితాభస్మం పట్టుకొస్తామనటమేమిటి? నాన్సెన్స్! దీనిమీద గవర్నమెంటును కోర్టుకీడుస్తాం’’ అని ఎగిరిపడ్డారు బోస్ పార్టీ వారు. ములాయం యాదవ్ ప్రకటన వెలువడిన మూడోనాడే మళ్లీ ఒకరు కోలకతా హైకోర్టు తలుపు తట్టారు.
ఆ విన్నపాన్ని ఆలకించిన మీదట ‘‘జపాన్ లోని రెంకోజీ మందిరంలోని చితాభస్మాన్ని స్వీకరించే ముందు ప్రభుత్వం దానికి సంబంధించిన పూర్తి వివరాలను, సాక్ష్యాలను సేకరించి అది నిజంగా నేతాజీకి చెందినదే అని ద్రువపరచుకోవాలి. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి’’ అని చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా, జస్టిస్ ఘోష్‌లు 1998 ఏప్రిల్ 7న తీర్పు ఇచ్చారు. అంతే కాదు. ‘‘బోస్ మృతికి సంబంధించి ప్రభుత్వ వైఖరి సందిగ్ధంగా ఉన్నది. ఈ వివాదాన్ని అంతమొందిం చటం కోసం అవసరమైతే స్పెషల్ కేసుగా దీనిపై చట్టప్రకారం ఎంక్వైరీ కమిషను వేయాలి.’’ అని ఇంకో ప్రజాహిత వ్యాజ్యం మీద అదే నెల 30వ తేదీన చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా, జస్టిస్ భట్టాచార్యలు ఇంకో తీర్పు చెప్పారు.
అప్పటికి గుజ్రాల్ ప్రధానిత్వం ఊడింది. అటల్ బిహారీ వాజపేయి సెకండ్ ఇన్నింగ్సు అప్పుడే మొదలైంది. కోర్టు తీర్పు మీద ఏమి చెయ్యాలని దాదాపు సంవత్సరం మల్లగుల్లాలు పడిన మీదట కొత్తగా ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నట్టు 1999 ఏప్రిల్ 14న ప్రభుత్వం నోటిఫికేషన్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సిఫారసుమీద సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముఖర్జీ చైర్మన్‌గా ఏకసభ్య కమిషన్ నియమితమైంది.
అలా మొదలైంది ముచ్చటైన మూడో ఎంక్వైరీ తమాషా. అంతకు ముందు రెండు ఎంక్వైరీలు అప్పుడున్న ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలు ఆశించి, కావాలని వేసినవి. కాబట్టి వాటి మామూలు పనికి సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచిపెద్దగా ప్రతిబంధకాలు లేవు. మూడో దానికి ఆ ప్రాప్తమూ లేదు. వెనుకటి ప్రభుత్వంనుంచి వారసత్వంగా సంక్రమించిన తలనెప్పి అన్నట్టే ఎన్‌డీఏ ప్రభుత్వం ముఖర్జీ కమిషనును నిరాదరించింది. మొదట ప్రకటించిన ప్రకారం కమిషన్ ఆరు నెలల్లో పని ముగించాలి. కాని పని చేయటానికి ఒక ఆఫీసుగాని, సెక్రెటరీ గాని అవసరమైన నిధులు గాని లేకుండానే ఆరు నెలలు గడిచాయి. ప్రభుత్వం వెంటపడి, పడి కనీస వసతులు సమకూర్చుకునే సరికి ఇంకో ఆరునెలలు తిరిగాయి. అటుమీద కమిషన్ పనికి సంబంధించి పబ్లిసిటీ ఇవ్వటానికి ప్రభుత్వ ఆధీనంలోని ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ప్రాణం ఒప్పలేదు. సమాచార ప్రసార శాఖల మంత్రి అరుణ్ జైట్లీకి కమిషన్ చైర్మన్ ఘాటైన లేఖ రాశాక కానీ సర్కారీ మీడియా వైఖరి మారలేదు.
ముఖర్జీ కమిషన్ పని మొదలు పెట్టే సరికి నేతాజీ కనుమరుగై అర్ధ శతాబ్దం దాటింది. ప్రత్యక్ష సాక్షుల్లో చాలామంది అప్పటికి ఈ లోకంలోనే లేరు. వారు బతికుండగా జరిగిన విచారణలలో వారు ఇచ్చిన సాక్ష్యాలే మిగిలాయి. ఆయా సాక్ష్యాలు, వెనకటి విచారణలలో సేకరించిన పత్రాలు, పరిశీలించిన ఎగ్జిబిట్లు తాజా విచారణకు చాలా అవసరం. బహిరంగ ఎంక్వైరీలకు సంబంధించినవి కాబట్టి అవేవీ అతి రహస్యాలు కావు. గవర్నమెంటే చేయిస్తున్న మరో ఎంక్వైరీ నిమిత్తం వాటిని అందజేయటానికి అభ్యంతరం ఉండనవసరం లేదు. కాని షా నవాజ్ కమిటీ రికార్డులు మాయమయ్యా యని, ఖోస్లా కమిషన్ కాగితాలు కనపడటంలేదని, వాటికోసం తెగ వెతుకుతున్నామని సర్కారీ అధికారులు భలే కథలు చెప్పారు. ఏ ఫైలు పంపించ మని కోరినా అది ‘టాప్ సీక్రెటు… బయట పెట్టకూడదు.. ప్రభుత్వ రహస్యాలు కాబట్టి వాటిని వెల్లడించటం ప్రజా ప్రయోజనాలకు హానికరం.. ఇతర దేశాలతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు కాబట్టి బయటపెట్టలేము – అంటూ బ్యురాక్రసీకి అలవాటైన షరామామూలు సాకులతో ఎగనామం పెట్టేవారు. లేదా.. ‘‘కావాలంటే మీరు చూడండి. కాని బయట పెట్టకండి. చూసి వెనక్కి పంపెయ్యండి.’’ అనేవారు. అవసరమైన పత్రాలను బహిర్గతం చేయలేకపోతే పబ్లిక్ ఎంక్వైరీ నడిచేదేలా- అని ముఖర్జీ జుట్టు పీక్కున్నాడు.
చిత్రమేమిటంటే – వాజపేయి ప్రధానమంత్రి అయ్యాక కూడా తైవాన్ విషయంలో ప్రభుత్వం పాత పాటే పాడింది. తైవాన్ ప్రభుత్వాన్ని తాము ఆధికారికంగా గుర్తించడం లేదు కనుక ముఖర్జీ కమిషన్ అక్కడికి వెళ్లడానికి అనుమతించలేమని సర్కారు వారు యథాపూర్వంగా బ్రేకువేశారు. ఏమైనా తాను అక్కడికి వెళ్లవలసిందేనని కమిషన్ పట్టుపడితే నిధుల మంజూరుకు ప్రభుత్వం నిరాకరించింది. దానిగురించి ఫారిన్ మినిస్టరు యశ్వంత్ సిన్హాను ముఖర్జీ కలుద్దామనుకున్నాడు. అవి 2004 జనరల్ ఎన్నికల రోజులు. ఎలక్షన్లు అయ్యేదాకా మిమ్మల్ని కలవటానికి తీరికలేదని మంత్రి చెప్పాడు. ఎన్నికల తరవాత ఆ మంత్రే లేడు. ప్రభుత్వమే మారి పోయింది. కొత్త యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్‌ను పట్టుకుని జస్టిస్ ముఖర్జీ తైవాన్ అయితే వెళ్లగలిగాడు. వెళ్లి ఊడబొడిచింది ఏమీ లేదన్నది వేరే సంగతి.
ప్రధానమంత్రి ఎవరైనా, పవరు ఏ పార్టీది అయినా ప్రభుత్వ బ్యురాక్రసీ సాధారణంగా ఒకే మూసలో వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నుంచి కోరిన ప్రకారం ఫైళ్లు అందలేదు కనుక, చెప్పిన పనులు చేయకుండా నడిమి అధికారులు సతాయించారు కాబట్టి ఆ సహాయనిరాకరణ అంతా ప్రభుత్వ నాయకులే కావాలని చేయించారని అనుకోనవసరం లేదు. సమస్య తమ దృష్టికి వచ్చినప్పుడు అద్వానీ, అరుణ్ జైట్లీ, జశ్వంత్ సింగ్ వంటి మంత్రులు చప్పున స్పందించి, తమ పరిధిలో తాము చేయగలిగింది బాగానేచేశారు.
ప్రభుత్వానికి నాయకుడు అటల్ బిహారీ వాజపేయి. స్వాతంత్య్రానికి ముందునుంచీ నేతాజీకి కాంగ్రెస్, నెహ్రూ చేసిన మోసాలు, ద్రోహాలు ఆయనకు బాగా తెలుసు. తైవాన్ తో దౌత్య సంబంధాలు లేవన్న మిషతో వెనకటి దర్యాప్తు సంఘాలను ప్రమాద స్థలానికి వెళ్ళనివ్వకుండా నెహ్రూ, ఇందిర ప్రభుత్వాలు అడ్డుపడితే అది తగదు అని ప్రతిపక్ష నాయకుడిగా గట్టి వ్యతిరేకత తెలిపింది వాజపేయే. తన హయాంలో తన ప్రభుత్వమూ అదే తప్పు చేస్తున్న సంగతి ఆయన దృష్టిలో పడితే దానిని తప్పక సరిదిద్దేవాడే. నేరుగా ప్రధానమంత్రి స్థాయిలో సమస్యలను తేల్చుకునే ప్రయత్నం జస్టిస్ ముఖర్జీ ఒకసారయినా చేసిన దాఖలాలు లేవు.
జస్టిస్ ముఖర్జీ లౌక్యానికి బదులు ఎంతసేపూ దర్పాన్నే చూపాడు. తన ఆజ్ఞను పాటించకపోతే మీ దుంప తెంచుతానంటూ అధికారుల మీద ఎగిరిపడి వారిని అనవసరంగా దూరం చేసుకున్నాడు. తన ముందు ఏ అధికారి ఏరకమైన సమాచారం ఇవ్వదలిచినా, ఏ పత్రం చూపించదలచినా దాని వెంబడి కనీసం జాయింట్ సెక్రెటరీ ర్యాంకు అధికారి ఇచ్చిన అఫిడవిటు విధిగా దాఖలు చెయ్యాలని జడ్జిగారి రూలు. దాంతో సాక్ష్యం ఇద్దామని అనుకున్న జూనియర్ అధికారులు కూడా అది తమ నెత్తికి ఎక్కడ చుట్టుకుంటుందోనని బెదిరి పారిపోయారు.
జస్టిస్ ముఖర్జీ ప్రయోజకత్వానికి సంబంధించి మెచ్చుకోవలసింది పెద్దగా ఏమీ లేదు. ఆరునెలలలో పని ముగించటానికి ఒప్పుకున్నవాడు ఆరేళ్లకు కూడా విచారణ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేలేక పోయాడు. ప్రభుత్వం సహకరించకపోయినా సొంతంగా 131 మంది సాక్షులను విచారించి, 730 ఫైళ్లు, డాక్యు మెంట్లు, 105 పుస్తకాలు పరిశీలించి జపాన్ నుంచి రష్యా దాకా అనేక దేశాల్లో తిరిగి కమిషన్ బోలెడు శ్రమపడ్డట్టు చెప్పుకోవటమేగాని ముఖర్జీ సమయంలో అత్యధిక భాగం పనికిమాలిన పనులకే చెల్లిపోయింది.
సుభాస్ చంద్ర బోస్ సోవియట్ సైబీరియాలో నిర్బంధంలో ఉన్నట్టు తనకు రష్యాలో ఎవరో చెప్పారని, ఫలానా రష్యన్ ఆర్కైవ్స్‌లో ఫలానా పత్రాలలో దానికి సంబంధించిన రుజువులు దొరుకు తాయని తెగ ప్రచారం చేసి పూరవీ రాయ్ అనే పరిశోధకురాలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టిం చింది. జస్టిస్ ముఖర్జీ ఆమె మాటను పట్టుకుని రష్యా వెళ్లి స్పెషల్ డిటెక్టివ్ వర్క్ చేశాడు. మన ప్రభుత్వం ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని కదిలించి, ఆమె చెప్పిన ఆర్కైవ్స్‌ను ఓపెన్ చేయించి చూస్తే దొరికినవి పత్రికల క్లిప్పింగులు, చిల్లర సమాచారాలు మాత్రమే!
దీనిని మించినది గుమ్నామీ బాబా ప్రహసనం. ఫైజాబాద్‌లోని రామ్ భవన్‌లో ఒక సాధువు చాలా ఏళ్లు ఉన్నాడట. అతడి పేరు, ఊరు ఎవరికీ తెలియదు. కాబట్టి గుమ్నామీ బాబా అని పిలిచేవారు. అతడు ఎప్పుడూ తెర వెనుక నుంచే మాట్లాడేవాడు. తన మొగం ఎవరినీ చూడనిచ్చేవాడు కాదు. నేను చచ్చినవాడిని అంటూ ఏమిటేమిటో మాట్లాడేవాడు. 1985లో అనామకంగా మరణించాడు. సుభాస్ చంద్ర బోస్ ఫామిలీ ఫోటోలు అతడి దగ్గర ఉండేవట. బోస్ వాడిన వస్తువులలాంటివి అతడూ వాడేవాడట. అతడి చేతిరాతా బోస్ దస్తూరీ లాగే ఉండేదట. ఐఎన్‌ఎలో పనిచేసిన బోస్ పూర్వ సహచరులతో అతడు నేతాజీలాగే మాట్లాదేవాడట. అతడే తమ నేతాజీ అని వారూ నమ్మారట. ఇంకేం? ఆ గుమ్నామీ బాబానే నేతాజీ అని అనుజ్‌ధర్ లాంటి తెలివిగలవాళ్లు నమ్మారు. వారి మాటలూ, రాతలూ జస్టిస్ ముఖర్జీ కూడా వెర్రిపప్పలా నమ్మేశాడు. ఆ అతి రహస్యాన్ని భేదించేందుకు జర్నలిస్టు అనుజ్‌ధర్ వెంట అతడు తీసుకు వెళ్ళిన చోటికల్లా వెళ్లాడు. ఫైజాబాద్‌లో కొలువు దీరి బోలెడు విచారణలు జరిపాడు. చేతిరాత నిపుణుల చేత దస్తూరీ పరీక్షలు చేయించాడు. అనామక బాబా వాడిన కట్టుడు పళ్ల వంటి వాటి మీద డీఎన్‌ఏ పరీక్ష చేయించి, అది నేతాజీ డిఎన్‌ఏ అవునో కాదో తేల్చటానికి మీరు తలా ఒక మిల్లీ లీటరు రక్తం ఇవ్వండని బోస్ రక్త సంబంధీకులను జస్టిస్ ముఖర్జీ ఆదేశించాడు. అలా పరీక్షల మీద పరీక్షలు, పరిశోధనల మీద పరిశోధ నలు ఏళ్ల తరబడి కోట్ల ఖర్చుతో చేయించి, అందరి సమయం వృధా చేసి, చివరికి అంతా ఉత్తదేబీ గుమ్నామీ బాబా నేతాజీకాదు- అని తేల్చాడు.
మాన్య న్యాయమూర్తి ముఖర్జీ మహాశయుడు తన స్థాయికి తగని చిల్లర పనులు ఇలా అనేకం చేశాడు. బ్యురాక్రసీ తన సహజ శైలిలో సహాయ నిరాకరణ చేస్తే దానిని తెలివిగా తన దారికి తెచ్చుకోవటం మానేసి, ప్రభుత్వ వ్యవస్థ మొత్తం మీద అలిగాడు. ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వ యంత్రాంగం ప్రమేయం లేకుండా దేశాంతరంలో తన కార్యం సాధించాలని ఉబలాట పడ్డాడు. ప్రభుత్వం వల్ల కానిపని ఒక పత్రికవాడి వల్ల అవుతుందని తలచి పోయిపోయి జర్నలిస్టు అనుజ్‌ధర్ చేతిలో పడ్డాడు. ఆ మీడియా వాడి ద్వారా తైవాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, కావలసిన భోగట్టా రాబట్టటానికి అనధికార మార్గాలను ఆశ్రయించాడు. విమానప్రమాదం భోగట్టా ఏదీ తమ దగ్గర లేదని అటునుంచి సమాధానం వస్తే, దాన్ని బట్టి అసలు విమాన ప్రమాదమే అబద్ధం అని అసంబద్ధ నిర్ణయం చేశాడు. ప్రమాదంలో గాయపడ్డ నేతాజీకి తామే చికిత్స చేశామని డాక్టర్లు చెప్పినా సరే, ప్రమాదం జరిగిన సమయంలో వారు లేరు కాబట్టి, ప్రమాదం జరిగినట్టు డాక్యుమెంటు ఏదీ లేదు కాబట్టి ప్రమాదం అబద్ధం! డాక్టరు చెప్పింది అబద్ధం. కాలిన గాయాలకు నిలువెల్లా బ్యాండేజి కట్లతో మరణించిన వాడి ముఖం గుర్తుపట్టేలా లేదు కనక ఆ శవం నేతాజీది కానే కాదు- అని కొట్టి పారేయగలిగిన మహా న్యాయమూర్తి జస్టిస్ ముఖర్జీ.
వాజపేయి గద్దె నెక్కగానే పని మొదలెట్టిన ముఖర్జీ కమిషన్ వాజపేయి ఐదేళ్ల టర్ము మొత్తం గడిచి, కేంద్రంలో ప్రభుత్వం మారినా ఇంకా పని మధ్యలోనే ఉన్నాడు. కొత్తగా వచ్చిన యూపీఏ సర్కారు వాళ్లు మరీ ముదురు. వాజపేయి హయాంలో దిగువ అధికారుల మాట ఎలా ఉన్నా కేంద్ర మంత్రులు కమిషన్ పట్ల చాలా మర్యాద చూపేవారు. మన్ మోహన్ జమానా వేరు. కొత్త హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్ జస్టిస్ ముఖర్జీని పిలిచి కుర్చీ అయినా చూపకుండా నిలబెట్టే మాట్లాడి అవమానించాడు. 2005మే తరవాత కమిషన్ గడువు పొడిగించేది లేదని ఆర్ధికమంత్రి చిదంబరం చేడగొట్టాడు. మళ్లీ ఎలాగో ఇంకో ఎక్స్‌టెన్షన్ సంపాదించి ఆదరాబాదరా తైవాన్, జపాన్, రష్యాలలో తిరిగి, జస్టిస్ ముఖర్జీ ఎట్టకేలకు విచారణ ముగించాడు. 2005 నవంబరు 8న ఆయన మహా నివేదికను సమర్పించగా సోనియాగారి మన్మోహన్ సర్కారు దానిని 2006 మే 17న పార్లమెంటు ముందు పెట్టి, దానిని తిరస్కరిస్తున్నట్టు ఒక్కముక్కలో చెప్పి చెత్తబుట్టలో పడేసింది.
సర్కారువారు అడిగిన ప్రశ్నలు, ఆరున్నర ఏళ్ల పాటు మిస్టరీ కొండను తవ్వి తవ్వి చివరికి జస్టిస్ ముఖర్జీ కమిషను వారు వాటికి ఇచ్చిన జవాబులు ఏమనగా-
- ప్ర. నేతాజీ సుభాస్ చంద్రబోస్ బతికు న్నాడా? మరణించాడా?
జ. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణించాడు.
- ప్ర. ఆరోపించబడినట్టుగా అతడు విమాన ప్రమాదంలో మరణించాడా?
జ. ఆరోపించిన ప్రకారం అతడు విమాన ప్రమాదంలో మరణించలేదు.
- ప్ర. జపాన్ మందిరంలో ఉన్న బూడిద నేతాజీకి చెందినదేనా?
జ. నేతాజీది కాదు.
- ప్ర. మరేదైనా చోట ఆయన ఇంకేదైనా విధంగా మరణించాడా? అయితే, ఎప్పుడు? ఎలా?
జ. గట్టి సాక్ష్యం లేనందున సానుకూల సమాధానం ఇవ్వలేం.
1945 ఆగస్టు 18న విమాన ప్రమాదమే జరగక పొతే. అందులో నేతాజీ మరణించకపోతే మరి నేతాజీ ఏమయ్యాడు? ఎక్కడ దాక్కున్నాడు? ముప్పావు శతాబ్దం తిరిగినా ఆయన అజాపజా భూప్రపంచంలో ఎక్కడా కానరాలేదేమి ? నేతాజీని ఏ కాకి ఎత్తుకు పోయింది ? ఏ లోకపు చెట్టు తొర్రలో దాచిపెట్టింది? అది కనిపెట్టాలని కోరుతూ మళ్ళీ ఎవడో కేసు వేస్తాడు. ఆరా తియ్యమని మళ్లీ ఏ కోర్టో ఎప్పుడో ఆర్డరు వేస్తుంది. దాని మీద ముఖర్జీ కాకపొతే ఓ బెనర్జీ, అతడి తరవాత ఇంకో చటర్జీ ఎంక్వైరీలు చేస్తూనే ఉంటారు. మనం గుడ్లప్పగించి చూస్తూనే ఉంటాం.
మిగతా వచ్చేవారం