– డా।। గోపరాజు నారాయణరావు
‘‘హుప్..!’’ గుండెల నిండా దట్టించిన ఊపిరిని బుస కొడుతున్నట్టు వదిలిపెడుతూ, ఎత్తి పట్టుకున్న నిలువెత్తు గునపాన్ని సర్రున భూమిలోకి దింపాడా యువకుడు. వెంటనే రెండు పిడికిళ్లు గునపం మధ్య నుంచి పైకొసకు తీసుకుపోయి నేల వైపు వంచాడు, శక్తికొద్ది. గునపం మొనకి తగిలిన వేరు ముక్కలై పోయి నేల నుంచి బయటకు వస్తోంది. గునపాల పోట్లు, సర్రు సర్రు మంటూ మట్టిని ఎత్తిపోసే పారల రవరవలు, ఠంగుమంటూ రాళ్లను పైకి పెళ్లగిస్తున్న వంకర గునపాల శబ్దాలు, కొంచెం అవతల చదును చేసిన నేల మీద తట్టలలో నుంచి ఎగిరొచ్చి రెండుమూడు అడుగుల పరిధిలో దట్టంగా పరుచుకుంటున్న తడి, పొడి ఎర్ర కంకర మెత్తటి ధ్వని, మట్టి బుంగల సన్నటి మూతుల నుంచి గడగడ మంటూ జారే నీటి శబ్దం… ఒకదానితో ఒకటి, ఒకదాని వెంట ఒకటి కలసిపోయి వినిపిస్తున్నాయి, అక్కడంతా. లంబసింగి-నర్సీపట్నం రోడ్డు నిర్మాణం పని అది. ఘాట్ రోడ్డు పని. ఫర్లాంగు దూరం కూడా సమంగా లేదు. అంతా ఎగుడూ దిగుడూ. అయినా, కాలుతున్న అడవిని అర్పుతున్నంత వేగంగా, వడివడిగా కదులుతున్నాయి కూలీల కాళ్లూచేతులు. అసలు రెండో రోజు జరుగుతున్న పనిలా లేదు. అన్నీ సమకూడి, అంతా అలవాటుపడిన వారం రోజుల తరువాత కనిపించే పొందిక, నైపుణ్యం ఆ పనిలో కనిపిస్తున్నాయి. కానీ వాళ్ల ముఖాల నిండా భీతి. వాళ్ల శరీరాలని వాళ్లే హింసించుకుంటున్నారు, పంటి బిగువున. ఆ రోజుతో అయిపోయేది కాదు. ఇంకా పదమూడు రోజులు. ఆ కఠోర సత్యం వాళ్లందరికీ తెలుసు. ఆ మాట తలుచుకుంటే గుండెలు అవిసిపోతాయి. అందుకే ఆలోచించడం కూడా మానేశారు. కష్టపడుతున్న శరీరం నుంచి చెమట చిందితే, నోటి వెంట పాట ఉరుకుతుంది వాళ్లకి. ఒంటిని పిండేస్తున్న కష్టాన్ని ఆ పాటే మరిపిస్తుంది. ఆ క్షణంలో మాత్రం వాళ్లు గొంతులు అణచిపెట్టుకున్న సంగతి తెలుస్తూనే ఉంది. వాళ్లంతా అలా యంత్రాల్లా ఎందుకు పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. కొంచెం అవతల ఓ చెట్టు కింద నిలబడి ప్రతి కూలీని డేగ కళ్లతో చూస్తున్నాడతడు. ఒంటి మీద ఖాకీ యూనిఫారమ్. తుమ్మ దుంగ మీద ఖాకీ బట్టలు ఆరేసినట్టు ఉంది రూపం. నలభయ్ ఐదేళ్లుంటాయి. పేరు బాస్టియన్. అల్ఫ్ బాస్టియన్. అక్కడి వాళ్లకి బేస్టీను దొర. గూడెం డిప్యూటీ తహసీల్దారు.
ఎడం భుజం మీద వేలాడుతోంది నల్లటి కొరడా. కాలికి కొండరాళ్లు తగిలి అరికాళ్లు పాదాలు ఒరుసుకున్నా, చిట్లినా ఎవ్వరూ ఆగరు. నేలలో పొంచి ఉన్న ఏ చెట్టు వేరో రాసుకుని గోళ్లు లేచిపోయినా ఆగి చూసుకోరు. ఆయాసంతో రొప్పుతున్నా ఒకింత సేద తీరదామన్న ఆలోచనకీ రారు.
ఆగితే ఆ కొరడాకి ఒళ్లు అప్పగించాలి. అది శరీరానికి శిక్ష. మనసుకీ ఉంటుంది శిక్ష- బాస్టియన్ బూతులతో. నూట ఆరుగురు కూలీలు. అందులో నలభయ్ మంది వరకు ఆడవాళ్లే. అంతా విశాఖ మన్యవాసులు.
కొండవాళ్లు. చాలామంది మగవాళ్ల మొలలకి చిన్న గుడ్డ తప్ప మరేమీ లేదు. ఆడవాళ్లు సంప్రదాయ కంగా చీర ధరించి ఉన్నారు. ఎవరికీ జాకెట్లు గానీ, కాళ్లకు చెప్పులు గానీ లేవు. అక్కడక్కడ కొద్దిమంది తప్ప అందరూ ఎముకల గూళ్లని చెబితే అతిశయోక్తి కాదు. చింతపల్లి, తరువాత రాజుపాకల గ్రామం దాటాక కాస్త దిగువన కనిపించే చిట్రాళ్లగొప్పు ఊరి శివార్ల నుంచి ఈ దశ రోడ్డు పని మొదలైంది. చిట్రాళ్లగొప్పు నుంచి నర్సీపట్నం దిశగా లంబసింగి,
డౌనూరులకి నిర్మిస్తున్నారు కొత్త రోడ్డు. కొండ సంత అన్న పేరున్న ఊరికి మరో పేరే డౌనూరు. ఇది ఇంగ్లిషోడు కల్పించిన పేరు.
డౌన్ లో ఉన్న ఊరు. డౌనూరయింది. ఇక్కడ నుంచి దిగువన ఉన్న నర్సీపట్నానికి కూడా రోడ్డు వేస్తున్నారు. అక్కడ వేరే బృందం ఆ పనిలో ఉంది. నర్సీపట్నం అంటే ఇక మన్యానికి గుమ్మంలాంటిది. సేవడి కూకింది… సేవడి… అంటే సాయంత్రం ఆరుగంటల వేళ. ఎంత అలసిపోయారో వాళ్ల ముఖాలే చెబుతున్నాయి. అలసి సొలసిన ప్రతి శరీర భాగం బాధతో మూలుగుతోంది.
ఆ తూర్పు కనుమల మీద నుంచి వెళ్లలేక వెళ్లలేక అన్నట్టు వెలుగు నెమ్మదిగా వెళుతోంది. ఆ వెలుగూ, దానితో పాటు వెచ్చదనం బలహీనపడుతుంటే చలిగాలి పొంచి ఉన్న పులిలా లేస్తోంది. చుట్టూ ఉన్న కొండలు సాయం సంధ్యలో పచ్చదనాన్ని వదిలేసి వేరే రంగులోకి మారుతున్నాయి. గిరుల మీద నుంచి సంజ కెంజాయి ఆ లోయలోకి కూడా జారుతోంది. అదిగో, కిష్టయ్య ఆ నల్లగుర్రాన్ని కళ్లెం పట్టుకుని తీసుకువస్తున్నాడు. అంటే బేస్టీను దొర వెళ్లిపోతున్నాడు. బాస్టియన్ దగ్గర బంట్రోతు కిష్టయ్య. పూర్తి పేరు ద్వారం కిష్టయ్య. ఖాకీ నిక్కరు, పొట్టి చేతుల గుడ్డ బనీను వేసుకుని ఉంటాడు ఎప్పుడూ. వయసు ముప్పయ్ లోపే. అప్పుడే బట్టతల వచ్చేసింది. అతడి అరిచేతులు, పాదాలు ఒక్కసారి చూసినా మరపునకు రావు. అంత బండగా ఉంటాయి – ఏదో జంతువు అవయవాలు గుర్తుకు తెస్తూ. తనకి అప్పగించిన ప్రధాన బాధ్యత అదే అన్నట్టు కీచుగొంతుతో అరుస్తూ, వీలైనప్పుడల్లా చేయి చేసుకుంటూ ఉంటాడు, కొండవాళ్ల మీద. గుర్రం అటు పోగానే ఆ మాట వినిపిస్తుంది, ఓవర్సీయర్ సంతానం పిళె నోటి నుంచి. అది ఏ నిమిషంలో వస్తుందా అని వాళ్ల చెవులు రిక్కి ఉన్నాయి. ఆ మాట- ‘ఇంగ పోండి, రేపు ప్రొద్దుటే రాండి!’ రాళ్లూ రప్పలతో, చెట్ల మొదళ్ల అవశేషాలతో తగిలిన దెబ్బలనే కాదు, బాస్టియన్ దాష్టీకంతో ఒంటి మీద పడిన దెబ్బల తీవ్రతని చూసుకోవడానికి కూడా వాళ్లకి అప్పుడే అవకాశం. తట్టాబుట్టా, గునపాలు, పారలు అక్కడే ఓ చెట్టు కిందకి చేరుస్తున్నారు మొగవాళ్లు. ఆడవాళ్లు ఎగువకి నడుస్తున్నారు, ఆ క్షణంలో ఆకాశంలో వేగంగా పోతున్న పక్షుల గుంపుల్లాగే. ఎవరి పిల్లలు వాళ్ల తల్లుల దగ్గరకి చేరుతున్నారు. దూరంగా ఎక్కడో నెమళ్ల క్రేంకారాలు. పక్షుల అజలడి, అరుపులు కొమ్మల్లో, గూళ్లలో క్రమంగా ఒదిగిపోతున్నాయి. రేయిలోకి, అది తెస్తున్న మౌనంలోకి ఒదిగిపోతోంది విశాఖ మన్యం.
* ****
రాత్రి నుంచీ మండుతున్న నెగళ్లు శాంతిస్తు న్నాయి. కూలిన చెట్ల మొదళ్ల దగ్గర చిగుళ్లు మొలిచి నట్టు, అటు నెగళ్లు చల్లారుతుంటే ఇటు చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవు తోంది, చిరుజ్వాలలతో. బొంతలు, గొంగళ్లు కప్పుకున్న ఆడవాళ్లు, కొందరు మగవాళ్లు చిన్నగా మండుతున్న ఆ నెగళ్ల నుంచే నిప్పు తీసుకువెళ్లి పొయ్యిలు రాజేస్తున్నారు. కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే అక్కడ. నర్సీపట్నం- చింతపల్లి దారిలో ఉన్న లంబసింగి దగ్గరి కొండవాలు అది. కొద్దిపాటి ఎగుడు దిగుళ్లు ఉన్నా, ఎప్పుడో పోడు సేద్యం కోసం చదును చేసిన నేల. చిన్న మైదానంలా ఉంది ఆ ప్రదేశం. రోడ్డు పనికి మన్యం నలుమూలల నుంచి వచ్చిన కొండవాళ్ల విడిది అదే. చుట్టూ ఈత, జీలుగు, మద్ది, వేప, పనస, మామిడి వంటి చెట్లే. ఇక, కొండ అంచున ఉందా చింతచెట్టు. మహావృక్షం. భూమి నుంచి పొడుచుకుని వచ్చిన దాని వేళ్లు గాలికి కదులుతున్న నెగళ్ల మంటల వెలుగులో ఒళ్లు విరుచుకుంటున్న కొండచిలవల్లా కనిపిస్తూ ఉంటాయి. బాగా విస్తరించిన కొమ్మలతో ఆ మొత్తం ప్రదేశానికి గొడుగు పట్టింది చింతచెట్టు. ఈ కాలంలో కురిసే బుగ్గిమంచు మంచునైనా ఆపుతుందని దాని కింద చేరారు రోడ్డు కూలీలు. చలి కొరికేస్తోంది. బాడ్డం నెల మంచు పలచబడింది గానీ, చల్లదనాన్ని తగ్గించుకోలేదు. ఎంత వేసవి అయినా పది డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత లంబసింగి ప్రత్యేకత. ఆ నెగళ్లే లేకపోతే బిగుసుకుపోతారు మనుషులు. ఒక వృత్తం గీసి, దాని మీదే వెలిగించినట్టు ఆ
స్థలం చుట్టూ పదో పన్నెండో నెగళ్లు… అన్నింటిలోని కొరకంచులు సమీపంలోని తాజంగి లోయ నుంచి నిరంతరాయంగా వీచే గాలితో ఇంకా కణకణమంటూనే ఉన్నాయి- నిప్పురవ్వలు రువ్వుతూ, చిటచిటమని చిన్నగా శబ్దిస్తూ. ఆ నెగళ్లే అడవి జంతువుల నుంచి కూలీలకి రక్షణ గోడ. బాడ్డం (ఫిబ్రవరి) నెల. దానిని గుర్తు చేస్తున్నట్టు బాడ్డం చెట్లు పూశాయి. ఎర్రటి పూలు. వాటి చుట్టూ పక్షులు చేరి అల్లరి మొదలుపెట్టాయి, చిన్నగా అరుస్తూ. ఆ నెలలో వికసించే ఆ అందమైన పూలచెట్టు పేరునే
నెలకి కూడా పెట్టుకున్నారు వాళ్లు. – చాటలో ఉన్న కొర్రలని చెరుగుతోందామె నెమ్మదిగా. రెండుసార్లు చేట ఊపింది. అందులో ఏదో లయ. పక్కనే ఉన్నాడామె భర్త. పేరు ఉగ్గిరంగి రామన్న. నోట్లోంచి వేప్పుల్ల బయటకి తీసి పదం అందు కున్నాడు. ‘‘గవ్వల చేటలు-మువ్వల రోకలి మువ్వల రోకలి-ముందు నడవవాలె గవ్వల చేటలు- గన్నెదుడవవాలే…’’ దగ్గరగా ఉన్న అందరూ వాళ్ల చెవులు అటు వైపు ఒగ్గారు.
పల్చటి మంచు రాశి మధ్య నుంచి మంద్రంగా వస్తోంది పాట. అసలు అడవే అతడి పాట కోసం ఇంత సేపూ మౌనంగా ఉందేమోననిపిస్తుంది. రాళ్లను కూడా కరిగించే గొంతు.
రామన్న అడుగులలోను లయ ఉంటుంది. చిందు కోసం జట్టులోకి చొరబడుతున్నట్టే అనిపి స్తాయి అతడి పాదాల కదలికలు. గెడ్డం, జులపాలు ఆ కోల ముఖానికి చాలా అందంగా ఉంటాయి. నల్లగా ఉన్నా చక్కని మొహం. కొండసంతలో ప్రత్యేకంగా కొనుక్కుంటాడు, ఆ తువాళ్లు. మోకాళ్లు దిగి ఉంటాయి. సన్నటి ఎర్రగళ్ల తుండుగుడ్డలు.
దాని మీద నల్లటి గొంగడి వేసుకుని ఉంటాడు. సొంతూర్లో ఉంటే ఎప్పుడూ పిల్లంగోవి మొలలో ఉండవలసిందే. మన్యవాసులలో అతడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. ‘వన ఎరిగినవాడు’ అంటారంతా. అంటే శాస్త్రం తెలిసినవాడు. వాళ్ల కుటుంబంలో ఇంతకు ముందు రెండు తరాల వాళ్లు-తండ్రి, తాత- శివసారులు. అంటే కొండవాళ్ల పూజారులు. గొరవలి అని కూడా అంటారు. పాట సాగుతూనే ఉంది. నెగళ్లు, పొయ్యిల నుంచి వస్తున్న కాంతిని కొండల వెనుక ఎక్కడో పొడుస్తున్న పొద్దు కొద్దికొద్దిగా ఆవరిస్తోంది. ఆ వింత కాంతిలోనే కనిపిస్తున్నాయి- పందుల గుడిసెలను మరిపిస్తున్న గూళ్లు. నాలుగ యిదు అడుగుల ఎత్తు, ఐదారు అడుగుల వెడల్పు. అంతే పొడవూ ఉన్న గూళ్లు అన్నీ. నలభయ్ వరకూ ఉంటాయి, కొద్దికొద్ది దూరంలో. అందులో చాలా వరకు ఆ చెట్టు కిందనే ఉన్నాయి. వాడిపోయినా ఇంకా పచ్చగా, పచ్చిగానే ఉన్నాయి వాటి మీద కొమ్మలతో సహా కప్పిన దట్టమైన ఆకులు. కొందరు ఆ ఆకుల మీద తాటాకు చాపలు, ఈతాకు చాపలు కూడా కప్పారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చిన వాళ్లు. ఆ గుడిసెల మధ్యన, ఇంకో ఏడో ఎనిమిదో నెగళ్లు కూడా కాలుతున్నాయి అక్కడక్కడ. అందుకే కొంచెం వెలుతురుతో, కాస్తంత వెచ్చగా ఉందా ప్రాంతం.
ఆ నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలుపెట్టింది సన్యాసమ్మ. ఐదేళ్లది, ఆమె కూతురు ఏరి తెచ్చిన చితుకులు. రాజుకోవడం మొదలు పెట్టింది పొయ్యి. లేచి వెళ్లి తన గూడులో ఉన్న కుండని తీసుకువచ్చి దాని మీద పెట్టి, నీళ్లు పోసింది. చింది చేతి మీద పడ్డాయి. మంచు బిందువులతో పోటీ పడుతున్నాయి కుండలో నీళ్లు, రాత్రి తెచ్చి పెట్టుకున్నవి. చలితో జలదరించింది ఒళ్లు. కుండ పైన చట్టి పెట్టింది. తల మీదుగా కప్పుకున్న గొంగడిని మరింత బిగించుకుందామె. ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది. అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది. దేనికీ బెదరదు. మగవాడితో సమంగా పని చేయ గలదని పేరుంది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు. ఇంకొందరు ఇంకా గొంగళ్ల కింద, గోనె పట్టాల కింద ముడుచుకుని పడుకునే ఉన్నారు ఆ గుడిసెలలో. శీతాకాలంలో జంతుజాలం ఒకదాని కొకటి శరీరాలని దగ్గరకి చేర్చి పడుకున్నట్టు గూడులో ఒకే గొంగడి కింద నిద్రపోతున్న ఇద్దరు పిల్లల మీద పడుతోంది పొయ్యిలో మంట వెలుగు. కూతుర్నే చూస్తోంది సన్యాసమ్మ. అప్పుడే వచ్చాడు భర్త మాతే లచ్చన్న దొర. దొబ్బసింగి గ్రామం నుంచి వచ్చారు వాళ్లు. ఎక్కడి నుంచో విరిచి తెచ్చిన వేప పుల్ల ఆమెకు ఇస్తూ అడిగాడు. ‘‘ఏంటి చూస్తన్నావ్!’’ ‘‘రేత్రంతా బేస్థను దొర పేరే కలవరించింది !’’ బాధగా,
జాలిగా చెప్పింది సన్యాసమ్మ, జీరగొంతుతో. వెంటనే ఆవలిస్తూ ఆమె చెప్పింది, ‘‘అసలు నిద్ర పోనివ్వలేదు!’’
నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే, గూడు లోపలి నుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఒంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుల్ల నములుతున్నాడు లచ్చన్న దొర. ‘‘చూస్తా ఉండు!’’ అని చెప్పి గూడు లోపల కూర్చుని వీపు మీద వేలాడు తున్న తల వెంట్రుకలని ముందుకు తీసుకుంది. దుమ్ము పట్టేసి ఉన్నాయి. ఒక్కసారి దులిపింది. చిన్న సీసాలో నుంచి ఆముదం తీసుకుని మాడు మీద వేసుకుని నాలుగసార్లు అరిచేత్తో సుతారంగా బాదుకు దంది. ఆదరాబాదరా చేతులకంటిన ఆముదాన్ని వెంట్రుకలకి చివరికంటా పట్టించి కొప్పు చుట్టు కుంది. అన్నం వార్చి, తరువాత మూకుడు పెట్టి, సొరకాయ బుర్రలో ఉంచుకున్న నూనె పోసి పనస గింజలు వేయించింది. బేడ తీసుకుని నూనె, ఉప్పు, కారం ఇస్తున్నాడు షావుకారు, అక్కడికే వచ్చి. అంతా అతడి దగ్గరే కొనుక్కుంటున్నారు. మధ్యాహ్నం పిల్లలు తినడానికి మండిసం (మూకుడు)లో ఇంకొన్ని గింజలు కూడా వేయించింది. బాగా వెలుగు వస్తుండగా అన్నం సర్దిన సత్తుగిన్నెలు, మట్టిముంతలు పట్టుకుని అంతా బయలుదేరారు రోడ్డు పనికి. వెనకాలే పిల్లలు.
‘‘హలో… డాక్టర్ మూర్తి! ఎప్పుడూ రాక? ఎలా ఉన్నారు?’’ అన్నాడు బాస్టియన్, మొహం మీదకి నవ్వు తెచ్చుకుంటూ. మళ్లీ తనే అన్నాడు, అంతకంటే ముఖ్య విషయం అయినట్టు, ‘‘అబ్బే…! డాక్టర్లని ఎలా ఉన్నారని అడగడం నాకే ఎబ్బెట్టుగా ఉంది. పోనీ… ఇంకోరకంగా పలకరిస్తాను. నన్ను వెంటాడు తున్నారా?’’ అన్నాడు బాస్టియన్, నవ్వుతూనే. లంబసింగిలోనే గప్పీ దొర బంగ్లా దాటి కొంచెం ముందుకు వెళ్లిన తరువాత కుడి వైపున కొంచెం ఎత్తులో కనిపిస్తుంటుంది ప్రభుత్వ అతిథిగృహం. ఎడమ పక్కన ఎత్తయిన ప్రదేశంలో కట్టారు. అది కృష్ణదేవిపేటకు వెళ్లే దారి కూడా. రెండేసి గదులు, ముందు చిన్న వరండాతో పట్టణాలలో కనిపించే మూడు భాగాల ఇల్లులా ఉంది. పైన సిమెంట్ రేకులు వేశారు. బాట దగ్గర నుంచి అతిథి గృహానికి తీసుకు పోయే సన్నటి దారి కనిపిస్తుంది ముందు. కొన్ని గజాలు నడిచిన తరువాత మెట్లు మొదలవుతాయి. పది వరకు ఉంటాయి మెట్లు.
మెట్ల తరువాత కనిపించే మొదటి వాటా నుంచి వచ్చి బయటకు వెళ్లడానికి కిందకి దిగుతున్నాడు బాస్టియన్. మొదటి రెండుమూడు మెట్ల మీదే ఉన్నాడతడు. బయటనుంచి వచ్చి మెట్లెక్కుతున్నారు, డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి. పరధ్యానంగానే మెట్లెక్కుతున్న డాక్టర్ మూర్తి చటుక్కున తలెత్తి చూసి, రెండు చేతులు జోడించి నమస్కరించాడు, ఎంతో సంస్కారంతో. ‘‘నమస్కారం బాస్టియన్ గారూ! నేను మొన్ననే వచ్చాను. కానీ, మీ దర్శనం ఇప్పుడే. ఆ చివరి వాటాలోనే దిగాను. బావున్నారు కదా!’’ తెల్లగా పొడుగ్గా ఉంటారాయన. సన్నగా ఉన్నా, వంగిపోయి నడవరు. ఎప్పుడూ మల్లెపూవులాంటి తెల్లటి దుస్తులే ధరిస్తారు. చక్కగా షేవింగ్ చేసుకున్న మొహంతో, మూతి మీద సన్నటి మీస కట్టుతో, టక్ చేసుకుని, పాలిష్ చేసిన షూతో సదా హుందాగా కనిపిస్తారు. బెంగాలీ బాబుల్లా మధ్య పాపిడితో దట్టమైన జులపాలు. ముప్పయ్ సంవత్సరాలలోపు ఉంటుంది వయసు.
(ఇంకా ఉంది)