వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన
‘పద్మ గ్రహీతలు వీరే!’ ఎర్రని అక్షరాలలో ఉన్న శీర్షిక మొదటి పేజీలో. వరుసగా పద్మ అవార్డుల విజేతల ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక ఫొటో, దాని కింద ఉన్న పేరు చూడగానే సుధామయి కళ్లు పెద్దవయ్యాయి.
పట్టలేని దుఃఖంతో సుధామయి హృదయం బరువెక్కింది.
**********
‘‘అమ్మా.. చూడు.. బుజ్జి కుక్కపిల్లలు. ఎంత బావున్నాయో!’’ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న జనని చుట్టూ మూడు కుక్కపిల్లలు.
‘‘ఛీ… ఛీ.. తరిమెయ్యి. వీధికుక్క పిల్లలవి. ఇల్లంతా గలీజ్ చేస్తాయి. కాళ్లకీ, చేతులకి అడ్డం తగులుతూ విసిగిస్తాయి. వాటిని వాళ్లమ్మ దగ్గర వదిలేసి రా.. పో..!’’ చీదరించుకున్నాడు మధుసూదన్.
‘‘ప్లీజ్ నాన్నా… పెంచుకుందాం… పాపం… వీళ్లమ్మ కారు కింద పడి చచ్చిపోయింది. నేను చూశాను. కాసిని పాలు పోస్తే చాలు.. అవే పెద్దవు తాయి.’’ ముంచుకొస్తున్న ఏడుపును మింగి అంది జనని.
‘‘కానీ.. ఎలా తల్లీ? ఎంత సేవ చేయాలో తెలుసా? చూడు.. కొంచెం పాలన్నం పెట్టమను అమ్మని. తర్వాత దూరంగా విడిచేసి రా…’’
తండ్రి మాటలు నచ్చలేదు జననికి. అలిగింది. బ్రతిమిలాడింది. నచ్చజెప్పింది. ఆఖరికి అయన ఒప్పుకునేలా చేసింది.
సుతిమెత్తని మనసు జననిది. కరుణ ఆమె సహజ గుణం. తన పాకెట్ మనీతో బ్రెడ్డూ, బిస్కెట్లూ కొని జంతువులకి పెట్టేది. ఆకలిగా ఉన్న పేద పిల్లలు కనిపించినా, అడుక్కునే వాళ్లు కనిపించినా, తన కోసం తీసుకెళ్లిన లంచ్ వాళ్లకి ఇచ్చేసేది. వయసుతో పాటే జనని మనసు కూడా ఎదిగింది.
**********
ఆ రోజు, మిట్ట మధ్యాహ్నం కాలింగ్ బెల్ చప్పుడుకి లేచి వచ్చిన సుధామయి ఎదురుగా హృదయానికి హత్తుకున్న పసిబిడ్డతో జనని కనిపించేసరికి గుండె ఝల్లుమంది. తల్లిని తోసుకుంటూ లోపలికొచ్చింది జనని. తల్లి చేష్టలుడిగి చూస్తూండగానే, పాపకి స్పాంజ్ స్నానం చేయించి, ఒళ్లు తుడిచి, చిన్న లంగోటీని చుట్టింది. పాపాయికి చెంచాతో పాలు పట్టింది. తల్లిని కూర్చోబెట్టి.. తాను ఉదయం కాలేజీకి బస్సులో వెళ్తున్నప్పుడు సనత్ నగర్ బస్టాప్ దగ్గరున్న చెత్తకుండీ పక్కన పడి ఉన్న పసిపాప కీచుగా ఏడుస్తూ కనిపించడం, మూగిన జనం మాటలు తప్ప చేతలేవీ చేయకపోవడంతో, బిడ్డ తల్లిదండ్రులను కనుగొనే వరకూ, తానే పోలీస్ స్టేషన్‌లో అండర్ టేకింగ్ ఇచ్చి సంరక్షణ బాధ్యతల్ని తీసుకోవడం గురించి వివరంగా చెప్పింది జనని. ‘‘బుద్ధుందా నీకసలు? ఇదేమన్నా కుక్క పిల్లా, పిల్లి పిల్లా పెంచుకోవడానికి? కూతురి ఒళ్లో ఉన్న బిడ్డను లాక్కోబోయింది సుధామయి.
‘‘అయ్యో…బొడ్డూడని పసి కందు. జాలి లేదా అమ్మా నీకు?’’ తీక్షణంగా అంది జనని.
జనని తండ్రి మధుసూదన్, అక్క సుమిత్రలతో సహా ఎవరికీ ఈ పని నచ్చలేదు. సోషల్ వెల్ఫేర్ శిశు విహార్‌లో అప్పగించేయమని పట్టుబట్టారు.
‘‘ఏమిటీ క్రూరత్వం? మనం ఒక్క బిడ్డకి అన్నం పెట్టి, చదువు నేర్పేంత స్థోమత లేని వాళ్లమా?’’ జనని ఆవేదన.
ఇంట్లో వాళ్లందరూ ఒకటి, జనని ఒక్కతే మరొకటిగా తయారయ్యారు.
జననిది అలవిమాలిన మానవత్వం అని, సమాజంలో తమకి చెడ్డపేరొస్తుందనీ, కుటుంబ సభ్యుల భయం.
మానవులుగా పుట్టి, మానవత్వం లేకుండా ఉండడమేమిటి అనేది జనని బాధ.
వాదోపవాదాలు, తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి.
‘‘కళ్లే తెరవని పసికూనకి ఏం తెలుసు? దాని తప్పేంటి? మనం తల్చుకుంటే ఆనాథలు లేని ప్రపంచం రాదా?’’ జనని మాటలకి సమాధానం చెప్పే శక్తీ, అభిరుచీ, ఏటికి ఎదురీదే సాహసమూ లేవు ఆ తల్లిదండ్రులకి.. అందుకే జనని తత్త్వం వాళ్లకి మింగుడు పడలేదు.
ఫలితం…. పాపతో ఇల్లు వదిలింది జనని.
ఇది జరిగి ఇప్పటికి ఎనిమిదేళ్లు.
**********
‘‘నాకు తెలుసులే నీ బాధ. నీ కూతురికి ‘పద్మశ్రీ’ వచ్చింది. ఇవాళ ఆఫీసులో కూడా ఇదే టాపిక్. నన్ను మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెడ్ ఆఫీస్ నుంచీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించాడు. కారణమదేనా?’’ ఏడ్చినట్లున్న భార్యని అడిగాడు మధుసూదన్.
‘‘ఇంత పెద్ద అవార్డు పొందిన బిడ్డని మనం కాదనుకున్నాం. చూడాలనిపిస్తోంది.’’
‘‘ఈరోజు చెప్పుకోవడానికి గొప్పగానే ఉంది. అప్పటి పరిస్థితేంటి? నలుగురూ ఎన్ని రాళ్లు రువ్వే వాళ్లు? ఎన్ని దుష్ప్రచారాలు జరిగి ఉండేవి? మాట్లాడుదాం లే.. ఇప్పుడది సెలెబ్రిటీ….బిజీగా ఉండుంటుంది.’’ ఇంతలో మోగిందతని ఫోను.
లండన్ నించీ, పెద్దకూతురు సుమిత్ర ఫోన్.
‘‘నాన్నా… వెంటనే టీవీ పెట్టండి. టీవీ ఫోర్ ఛానెల్. ‘జనని ఇంటర్వ్యూ వస్తోంది.’’ టీవీ ఆన్ చేసాడు మధుసూదన్.
అప్పటికే జననిని పరిచయం చేయడం అయిపోయినట్లుంది. మూర్తీభవించిన ఆత్మ విశ్వాసంతో హుందాగా ఉంది జనని..
‘‘అనాథలను, సొంత పిల్లల్లాగా చూస్తున్న మీకు కష్టమనిపించడం లేదా?’’
‘‘ఇష్టమయినది సాధించాలంటే కష్టించాల్సిందే. అన్నట్లు, మీరన్నారే, ‘అనాథలు!’ అంటే ఏమిటి?’’ చిరునవ్వుతో ప్రశ్నించింది జనని.
‘‘ఎవరూ లేని వాళ్లు’’
‘‘ఎవరూ లేకుండా ఎవరైనా ఎలా పుడతారండీ? సొంతవాళ్లు కాదనుకుంటేనే అనాథలవుతారు.’’
‘‘కాస్త వివరణ ఇవ్వగలరా?’’ అడిగింది యాంకర్.
‘‘చూడండీ…తొమ్మిది నెలలు మోసి, చావుకి సిద్ధపడి, బిడ్డని కని మరో జన్మనెత్తుతుంది స్త్రీ. ఆ తల్లికి బిడ్డ భారం అవుతుందా? కాదు. కానీ, చుట్టూ ఉన్న సమాజానికి వెరచి, ఆమె బిడ్డను వదిలేందుకు సిద్ధపడుతుంది. గుండెని బండగా మార్చి అనుబంధాన్ని త్రెంచుకుంటుంది. రోజుకి ఎందరు పసికూనలు చెత్త కుప్పల్లో, రైలు పట్టాల మీద, చెరువుల్లో, బావుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో? ఊపిరితో ఉన్నప్పుడే వీధి కుక్కలు, ఊరపందులు ఆ పసి ప్రాణాల్ని పీక్కు తింటున్నాయి! ఊహిస్తూంటేనే బాధనిపిస్తుంది.’’
‘‘ఇలా జరగడానికి కారణమేమిటంటారు?’’
‘‘ఎన్నో! వంచకుల్ని నమ్మి మోసపోయి గర్భవతులైన అమాయకురాళ్లు పుట్టిన బిడ్డలని సమాజానికి భయపడి వీధులపాలు చేస్తున్నారు. అలాగే, ఆడపిల్లని కంటే భార్యల్ని వదిలేసే ప్రబుద్ధులు, అత్తలూ ఉన్నారు. ఏ పాపం తెలియని బిడ్డల్ని వదిలించుకుంటున్నారు.’’
‘‘జననిగారూ…..సమాజ సేవకు లభించిన గుర్తింపు కదా ఇది….. పద్మశ్రీ పొందుతున్నందుకు ఆనందంగా ఉందా? మాకైతే గర్వంగా ఉంది.’’
‘‘లేదండీ…బాధగా ఉంది.’’
ఖంగు తిన్నట్లయింది వ్యాఖ్యాతకి.
‘‘అదేంటి? మీరు పద్మ భూషణ్ లాంటిది ఆశించారా? మీ సేవలకి, ఈ పద్మశ్రీ చిన్న పురస్కారమేమో కదూ…’’
నవ్వింది జనని.
‘‘మన ధర్మం మనం నిర్వర్తించేందుకు ఏ గుర్తింపు, అవార్డులు అవసరంలేదు. అయితే, ఈ అవార్డు మరింత మందిలో స్ఫూర్తిని నింపి, అనాథరహిత సమాజ స్థాపన దిశలో కొందరు ఆలోచించినా చాలు. మనిషికి ఉండాల్సిన మొదటి లక్షణం మానవత్వం. అంటే జాలి, కరుణ, క్షమ, పరోపకారం. కానీ, చిత్రంగా చదువున్నా, సంస్కారం లేని మనుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. విజ్ఞానం పెరిగిన కొద్దీ సున్నితమైన భావాలు మృగ్యమై, స్వార్థం, సంకుచితత్వం నానాటికీ పెరిగిపోతోంది. నేనే సమాజం అనుకోవడం తప్ప, సమాజంలో నేను అనే భావన కొరవడుతోంది. తోటి ప్రాణుల పట్ల అంకితభావం, బాధ్యత ఉండాలి అనే ఇంగిత జ్ఞానం తగ్గి, ఎవరో, ఏదో అనుకుంటారనే పిరికితనం మంచి పనులకి ముందడుగు వేయనీయట్లేదు.’’
సుధామయి మధుసూదనరావులిద్దరికీ వీపు మీద చరిచి నట్లున్నాయి జనని పలుకులు.
‘‘దీనికి మీరు సూచించే పరిష్కారం?’’
‘‘పరిష్కారాలు సూచించేటంత పెద్దదాన్ని కాదు. అయినా నాకు తోచింది చెప్తాను. చూడండీ…ఎవరికి వారు, తమకు నచ్చిన రీతిలో నీతి తప్పకుండా జీవించే స్వేచ్ఛ ఉండాలి. అనుకోని పరిస్థితులే కానీయండి, అనూహ్యమైన సందర్భాలే కానీయండి, అనాలోచిత చర్యలే కానీయండి.. వాటి వలన అవాంఛిత సంతానం కలిగితే ఇలా వీధుల పాలు చేసే అవసరం రాకుండా, ధైర్యంగా బిడ్డను పెంచుకునేందుకు అవకాశముండాలి. చట్టసవరణలు జరగాలి. సమాజం కూడా సహకరించాలి. కనీసం, ఆ పిచ్చి తల్లుల్ని అసహ్యించుకోకుండా, వెలివేయకుండా వాళ్ల మానాన వాళ్లని బ్రతకనిచ్చి, పుట్టిన బిడ్డలకు బ్రతుకునిస్తే చాలు. బిడ్డను పెంచడం తల్లి బాధ్యత, హక్కు కూడా. అందుకు సమాజం, అంటే మనం చేయూతనివ్వడం కనీస ధర్మం.’’ ఉద్వేగంతో అంది జనని.
‘‘జనని గారూ! మీరు, మీ మిత్రులతో కలిసి స్థాపించిన ‘అమ్మ’ ఫౌండేషన్ గురించి చెప్పండి. తమ పిల్లల్ని పెంచుకుంటూ, స్వయం ఉపాధిని ఎంచుకున్న తల్లులూ, తల్లులు తెలియని పిల్లలూ మీకు జేజేలు పలుకుతున్నారు. మిమ్మల్ని ‘అమ్మా’ అనే పిలుస్తున్నారు, భావిస్తున్నారు. ఈ ప్రస్థానం వైపు ప్రయాణించిన వైనం మా ప్రేక్షకులకి స్ఫూర్తినిస్తుంది, చెప్తారా?’’
కూతురు తమ గురించి ఏమని చెప్తుందో అని కళ్లు పెద్దవి చేసి చూస్తున్నారు సుధామయి, మధుసూదన్.
మొదలుపెట్టింది జనని.
‘‘లోకం పోకడ పూర్తిగా తెలియని, తల్లి కానీ తల్లిగా ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పందొమ్మిదేళ్ల అమ్మాయిని ఎలా స్వీకరిస్తుందో, నన్నూ అలాగే స్వీకరించిందీ సమాజం. కాదు. తిరస్కరించింది అనాలేమో! మా అమ్మా నాన్న కూడా సమాజంలోని వారే కనుక వారిని నేనెప్పుడూ తప్పుపట్టను.’’
‘హమ్మయ్య…’ అనుకున్నారు సుధామయి, మధుసూదన్‌లు.
‘‘అప్పట్లో నాకర్థమయ్యేది కాదు. కుక్క పిల్లల్నీ, పిల్లి పిల్లల్నీ పెంచుకుంటాం. అందంగా ఉన్నాయని పక్షుల్నీ పెంచుతాం. లాలిస్తాం. పాలిస్తాం. కానీ మనుషుల దగ్గరికొచ్చేసరికి పుట్టు పూర్వోత్తరాలు, కుల గోత్రాలు పట్టించుకుంటాం. ఎందుకిలా అని. తర్వాత్తర్వాత తెలిసింది నాకు. ఆ పక్షులు, జంతువులూ ప్రేమనిస్తాయి, ప్రేమని పొందుతాయి తప్ప మరింకేం అడగవు. కానీ, మనిషి అలా కాదు. నోరుంది. చేతన ఉంది. ఆలోచించి వివేచించి ప్రవర్తించే వివేకం ఉన్న బుద్ధిజీవి మనిషి. స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, స్వలాభం కూడా మనిషి రక్తంలో కలిసి ఉన్నాయి. ఇవి దుర్గుణాలా, సద్గుణాలా అనే తర్కం ఉదయించింది నాలో. మొదటగా దొరికిన పాప ‘స్వీయ’ని ఎత్తుకుని బయటికి వచ్చేసినప్పుడు నా దగ్గరున్నవి కేవలం పదివేలు, ఓ స్కూటీ.. అంతే! అదృష్టవశాత్తూ, నన్నర్థం చేసుకున్న స్నేహితు లున్నారు. ఇద్దరు క్లాస్‌మేట్స్ ఫ్లాట్‌లో అద్దెకుండేవాళ్లు. కొన్నాళ్ల పాటు నేనూ అక్కడే ఉన్నాను. పాపని ‘బేబీ కేర్ సెంటర్’లో ఉంచి స్వయం ఉపాధి వెతుక్కు న్నాను. అది ఏమిటంటే, నాన్న నాకిచ్చిన స్కూటీతో, టూ వీలర్ డ్రైవింగ్ క్లాసులు తీసుకోవడం. చదువును పక్కన పెట్టేశాను. సమయం నా చేతిలోనే ఉండడం, చాలినంత డబ్బు మిగలడం తద్వారా పాపను చూసుకోవడం.. బాగానే జరిగింది కొన్నాళ్లు. తర్వాత నా స్నేహితురాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక, ఇరుగు పొరుగు ఫ్లాట్ ఓనర్స్, నేనుంటున్న ఫ్లాట్ యజమానికి కంప్లైంట్ ఇచ్చారు. అందులో, ఒంటరి అమ్మాయిని కదా, నన్ను ఆశించి భంగ పడ్డవాళ్లు కూడా ఉన్నార్లెండి.’’ నవ్వింది జనని.
‘‘అచ్చు సినిమా కథలా ఉంది మేడం. చెప్పండి.. ఆ తరువాత….’’ ఆసక్తిగా అడిగింది వ్యాఖ్యాత.
‘‘ఏముందీ? ఫ్లాట్ యజమాని ఈ ఫ్లాట్‌ని అమ్మదల్చాను, ఖాళీ చేసెయ్యమన్నాడు. నేనాయనకు క్లియర్ చేశాను. ‘అయ్యా…నన్ను ఖాళీ చేయించాలి అనుకుని అమ్మదలిచాను అని అబద్ధం చెప్పవద్దు. నేనే తప్పూ చేయలేదు. చేయను. నా ఆశయం ఇది.’ అని. ఆయన నిజంగానే అమ్ముతానన్నారు. అయితే నేనే కొంటాను అన్నాను. ఆ సరికే నేను స్వంతంగా డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసుకుని నలుగురు శిక్షకులని కూడా చేర్చుకున్నాను. అంతేకాదు, మరో ఇద్దరు పిల్లలకి తల్లినయ్యాను.’’
‘‘అవునా! మీకు పెళ్లయిందా?’’ వ్యాఖ్యాతతో పాటు సుధామయి దంపతులు కూడా నిర్ఘాంత పోయారు జనని మాటలకి.
‘‘ఏం? మీరు సంపాదించిన నా ప్రొఫైల్‌లో ఇది లేదా?’’ నవ్వేసింది జనని.
బిక్కమొహం వేసింది వ్యాఖ్యాత.
‘‘మరేం లేదు. తల్లులు వదిలేసిన మరో ఇద్దరికీ తల్లిగాని తల్లిని అయ్యాను. వాళ్లని బడిలో చేర్చేటప్పుడు మరో సమస్య. ‘తండ్రెవరు?’ అని. తల్లి, తండ్రి ఇద్దరూ నేనే అని నిరూపించుకోవడానికి మళ్లీ పోరాటం తప్పలేదు. గెలిచాననుకోండి.’’
‘‘ఒక్కటి చెప్పండి. మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా మేడం? ఎవ్వరూ ముందుకు రాలేదా? మీరే వద్దనుకున్నారా?’’
‘‘అదో ఎపిసోడ్. చాలా మంది ముందుకొచ్చారు. నా మీద జాలి, పిల్లల మీద సానుభూతి, నా సంస్థల పట్ల ఆకర్షణ.. వీటిలో వేటి కోసం వాళ్లు నన్నూ, నా సంసారాన్నీ అంగీకరిస్తున్నారో నేను అంచనా వేయలేకపోయాను. అయినా, పెళ్లెందుకు? చక్కని సంసారం, చల్లని సంతానం. ఆ తరువాత ఒకరికొకరు ఆసరా! అంతేగా? ఇవన్నీ, నాకు పెళ్లి కాకుండానే అమిరాయి. నేను స్థాపించిన సంస్థ ‘స్వేచ్ఛ’లో పాతిక మంది తల్లులున్నారు. అందరూ మగాడి మోసానికి బలైన వాళ్లే! మేం వాళ్లని ధైర్యంగా, స్థైర్యంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా తీర్చిదిద్దాం. ఇక ‘అమ్మ’ సంస్థ నిరాదరణకు గురయిన పిల్లలకి సరైన శిక్షణని, పోషణని ఇస్తోంది. నాతో పాటు నడుస్తున్న నా నలుగురు మిత్రుల, నా ఆశయాన్ని ఆదరిస్తున్న స్వచ్ఛంద సంస్థల సహకారం ఇంతింతా అని చెప్పలేను. నిజానికి ఈ పద్మశ్రీ వాళ్లదే!’’ జనని కళ్లు వర్షిస్తున్నాయి.
అసంకల్పితంగా, కన్న కూతురికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు మధుసూదన్.
‘‘ఆఖరుగా….మీ సందేశం?’’
‘‘అయ్యో! సందేశాలిచ్చేంత గొప్ప వ్యక్తిని కాదు. మనిషి మనిషిగా జీవించాలన్న ఆశ నాది. ఒంటరి తల్లులకు గౌరవంగా బ్రతికే అవకాశం రావాలి. వారి పిల్లలకి భవిష్యత్తు ఉందన్న భరోసా కావాలి. అప్పుడే అనాథ అన్న పదం అన్ని నిఘంటువుల నుంచీ తొలగుతుంది. ఊపిరున్నంతవరకూ ఆ లక్ష్యం కోసమే పని చేస్తాను.’’ ప్రేక్షకుల వైపు తిరిగి నమస్కరించి, స్పష్టంగా చెప్పింది జనని.
చెమర్చిన కళ్లతో ఒకరిని ఒకరు అభినందించు కున్నారు సుధామయి, మధుసూదన్‌లు..
********
‘‘నీ ఉన్నతిని చూస్తున్న మేమెంత సంతోషంగా ఉన్నామో తెలుసా తల్లీ! మా మీద కోపం లేదు కదూ….’’ తండ్రి మాటలకి నవ్వింది జనని.
‘‘మీకు నేను థాంక్స్ చెప్పాలి నాన్నా, ఆ రోజు ఇంట్లో నుంచీ బయటికి వచ్చే పరిస్థితి మీరు కల్పించక పోయి ఉంటే, లోకం తెలియని చాలా మంది అమ్మాయిల్లాగే జీవితం రంగుల కల అని నమ్ముతూ ఉండేదాన్ని. కంటేనే కాదు అమ్మ, దయ గల హృదయం ఉన్న ప్రతి అమ్మాయి ‘అమ్మే’ అని తెలిసేది కాదు. అన్నట్లు, నాన్నా నాకు తెలియదని నువ్వు అనుకుంటున్న నిజం ఒకటి చెప్పనా!’’
గుండెలు వేగంగా కొట్టుకున్నాయి దంపతులకి.
‘‘చెప్పనా నాన్నా!’’ అడిగింది జనని.
‘‘ఊ’’ అన్నాడు మధుసూదన్.
‘‘నువ్వూ అనాథవే నాన్నా….’’
అదిరి పడ్డాడు మధుసూదన్.
భార్య వంక భయంగా చూసాడు.
‘‘పెళ్లయినప్పుడు బామ్మ, తాతయ్య భిలాయ్‌లో ఉన్నారట. చాలా రోజులు వాళ్లకి పిల్లల్లేరట. ఒక రోజు తాతయ్య రాత్రి షిఫ్ట్ పూర్తి చేసి ఇంటికొస్తుంటే, ఏడుస్తున్న నువ్వు తుప్పల్లో దొరికావట. తెచ్చి పెంచుకున్నారట.. మరో ఉద్యోగం వెతుక్కుని సికింద్రాబాదొచ్చి, ‘నువ్వు వాళ్ల బిడ్డవే’ అని అందరికీ చెప్పారట. నువ్వు దొరికిన వేళా విశేషం, చిన్నాన్న, అత్తా వెంట వెంటనే కలిగారట వాళ్లకి. నిజం కాదా నాన్నా?’’
అవాక్కయ్యాడు మధుసూదన్.
తనకి తప్ప ఎవరికీ తెలియని రహస్యం ఇది. ఎలా తెలిసింది?
సుధామయి ప్రశ్నార్థకంగా చూస్తోంది.
‘‘ఈ విషయం బామ్మ చెప్పింది నాన్నా! మిమ్మల్ని వాళ్లు తెచ్చుకోకపోతే, పెంచి పెద్ద చేయకపోతే ఈ రోజు అక్కా, నేను పుట్టే వాళ్లమా? ఇన్ని పురాణాలు చదివారు మీరు! శకుంతల, కర్ణుడు లాంటి వారిని ఎవరో ఒకరు పెంచుకోకపోతే పురాణాలే లేవుగా? ఆలోచించండి నాన్నా!’’
తల వంచుకున్నాడు మధుసూదన్.
– కె.హెచ్. సాయిభరద్వాజ