‘పాకిస్తాన్‌కు చేటు చేయగలిగే శక్తి ఈ భూమి మీదనే లేదు’- ఇది ఆ దేశ తొలి గవర్నర్‌ ‌జనరల్‌, ‌పాక్‌ ‌నిర్మాత మహమ్మదలీ జిన్నా ప్రగల్భం. అది ఆయన భారత్‌ను ఉద్దేశించి చేసినదేనని వేరే చెప్పక్కరలేదు. అలాంటి కుత్సిత చర్యకు భారత్‌ ‌పాల్పడదని కచ్చితంగా తెలిసినా, భేషజంతో జిన్నా ఆ వ్యాఖ్య చేశారని చెప్పడం తొందరపాటు కాదు. జిన్నా సృష్టించిన ఆ అసహజ దేశం నిత్యం అస్థిరత అనే వ్యాధితోనే బాధపడుతోంది. మనుగడ, ఉనికి ఆ దేశానికి జీవన్మరణ సమస్యలు. నాడు అమెరికా, నేడు చైనా చేతులలో ఆడే తోలుబొమ్మ నేతలు దేశంలో  సుస్థిరతకు చిరునామా లేకుండా చేస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల పాకిస్తాన్‌ ‌చరిత్రలో మూడు దశాబ్దాలు మిలటరీ పాలన కిందే ఆ దేశం ఉండిపోయింది. భారత వ్యతిరేకత, కశ్మీర్‌ ‌మీద మొసలి కన్నీళ్లు అజెండాగా  నాయకులు ఏలికలవుతున్నారు. పురోగమనం కాదు, ఉగ్రవాదమే తమకు ప్రధానమని వారు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ఉగ్రవాద మూకల స్వర్గమని ప్రపంచమంతా ఈసడిస్తున్నా పట్టని దేశమది. అవే భారత వ్యతిరేక నినాదాలు, అవే అబద్ధాలు, అవే ప్రేలాపనలు. ఏడున్నర దశాబ్దాల వైఫల్యం గురించి ఎవరికీ పట్టడం లేదు. సైనిక జోక్యంతో, తుపాకీ గొట్టం కింద పనిచేసే ప్రభుత్వానికి ఎప్పుడూ ఊపిరాడని పరిస్థితే అక్కడ. ఐఎస్‌ఐ అనే నిఘా సంస్థ చేస్తున్న నాటు వైద్యం సదా వికటిస్తూనే ఉంది. ప్రజా నాయకులు, సైన్యం, ఐఎస్‌ఐ ‌కలసి పాకిస్తాన్‌ను రెండు వందల సంవత్సరాల వెనక్కి నడిపిస్తున్నారు. మతోన్మాదమే సర్వరోగ నివారిణి అని నమ్ముతున్న ప్రజలు అనుసరిస్తున్నారు.

ఏప్రిల్‌ ‌మొదటి పక్షంలో పాకిస్తాన్‌లో జరిగిన రగడ దేశాన్ని అలా దశాబ్దాల వెనక్కి నెట్టే పరిణా మమే. ముల్లూ పోయి కత్తీ వచ్చే ఢాం ఢాం ఢాం అన్నట్టు, ఇమ్రాన్‌ఖాన్‌ అనే అసమర్థ నేత అవమానకర పరిస్థితులలో పదవీచ్యుతుడయ్యాడు. కుటుంబ పాలనా ప్రతినిధి, పచ్చి అవినీతిపరుడు షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రధాని పదవికి ఎగబాకాడు. మళ్లీ అవే కారుకూతలు- కశ్మీర్‌లో రక్తం పారుతోంది… 370 రద్దు తప్పిదం.. కశ్మీరీల పోరుకు మద్దతిస్తాం. కాబట్టి పాకిస్తాన్‌ను వేరెవరో చెరచనక్కరలేదు. ఎవరో ధ్వంసం చేయనక్కరలేదు. ఆ పనిని నేతలూ, వాళ్ల నినాదాలని గుడ్డిగా నమ్మే ప్రజలూ కలసే చిర కాలంగా సాగిస్తున్నారు.

నానాటికీ తీసికట్టు

‘1947లో పాకిస్తాన్‌ ‌స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన విదేశీ కుట్ర మీద ఇప్పుడు మళ్లీ కొత్త స్వాతంత్య్రోద్యమం మొదలవుతుంది’ అని నిన్నటి దాకా దేశ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఎలా అంటాడు? అక్కడే అతడి వైఫల్యం సుస్పష్టం. అలాంటి విఫల పాలకుడు ఇమ్రాన్‌ఖాన్‌. ‌కానీ ఇమ్రాన్‌ ‌చేసిన ప్రకటన అక్కడ ప్రస్తుతం అధికారం చేపట్టిన ప్రధానికి హెచ్చరికగానే చెప్పాలి. స్వపక్షం, విపక్షం, ఆఖరికి ఆ దేశ సుప్రీంకోర్టు కూడా ఛీకొట్టిన తరువాత పదవి దిగిన ఇమ్రాన్‌ 2018‌లో ‘కొత్త పాకిస్తాన్‌’, ‘అవినీతి రహిత పాకిస్తాన్‌’ ‌నినాదాలతో దేశాన్ని హోరెత్తించి అధికారంలోకి వచ్చాడు. నాడు అంతా అతడికే అనుకూలంగా ఉంది. దేశాన్ని సమూలంగా మార్చేస్తానని నమ్మబలికాడు. తన విధానాలకు మానవీయ కోణం ఉంటుందని చెప్పాడు. పాక్‌ ‌ప్రజలు దైవ సమానుడిగా కొలిచే ఈ క్రికెట్‌ ‌తారడు నెమ్మదిగా రాజకీయవేత్తగా మారాడు. క్రికెటర్‌గా సంపాదించిన అపార కీర్తిని రాజకీయాలకు పెట్టుబడిగా మలుచుకోగలిగాడు. అందుకు కొన్నేళ్లు శ్రమించాడు. పాకిస్తాన్‌ను ఏలుతున్న రెండు కుటుంబాలను (భుట్టోలు, షరీఫ్‌లు) మట్టి కరిపించి అధికారంలోకి వచ్చాడు. అవినీతి వ్యతిరేకత గురించి ఆకర్షణీయమైన నినాదాలు ఇచ్చాడు. పాటలు రాయించుకుని, వాటిని పాడించుకుంటూ భారీగా ఊరేగింపులు జరిపాడు. సామాజిక మాధ్యమాల నిండా తానే అయ్యాడు. ప్రధానిగా ఆయన వేసిన తొలి అడుగులు చూసి ఐదేళ్లూ అధికారంలో ఉండడం ఖాయమని ప్రజలు నమ్మారు. అదే జరిగితే పాకిస్తాన్‌ ‌చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఏర్పడేది. కానీ సంప్రదాయాన్ని పాకిస్తాన్‌ ‌రాజకీయ వ్యవస్థ మారనివ్వలేదు. ఈ 22వ ప్రధాని కూడా అవమానకరంగానే, మిగిలిన అందరి ప్రధానుల మాదిరిగానే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయకుండానే ఇంటిముఖం పట్టాడు. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి పాకిస్తాన్‌ ‌ప్రధానిగా చరిత్రలో అదనపు ఖ్యాతిని కూడా దక్కించుకున్నాడు. తొలి ప్రధాని లియాఖత్‌ అలీని పట్టపగలు, వేదిక మీద కాల్చేశారు. ఇప్పుడు మాత్రం అలా జరగలేదు. పాకిస్తాన్‌ ‌సైన్యాధ్యక్షుడు జనరల్‌ ‌ఖమర్‌ ‌జావెద్‌ ‌బాజ్వాతో వైరం పెట్టుకుని మరీ ఇతడు రాజకీయం నడిపాడు. అయినా జుల్ఫీకర్‌ అలీ భుట్టోకు పట్టిన గతి ఇతడికి పడుతుందని అనుకొనే పరిస్థితి లేదు. ఆ మేరకు ఇమ్రాన్‌ ఇప్పటికి అదృష్టవంతుడు.

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇమ్రాన్‌ ‌సొంత పార్టీ పాకిస్తాన్‌ ‌తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (‌పీటీఐ) సభ్యులే కొందరు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. అలాంటి స్థితిలో ఏప్రిల్‌ 3‌న ఇమ్రాన్‌ ‌పాక్‌ ‌జాతీయ సెంబ్లీని రద్దు చేశాడు. అది కూడా, తన మీద విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి పలాయనం చిత్తగించడానికే. దీనితో ఈ చర్య వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్‌ 7‌న సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ ‌నిర్ణయాన్ని తోసిరాజని పార్లమెంటును పునరుద్ధరించింది. ఆయన అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనాలని కూడా ఆదేశించింది. ఏప్రిల్‌ 10 అర్థరాత్రి జరిగిన ఓటింగ్‌లో ఇమ్రాన్‌ ఓడిపోయారు.

ఇంటా బయటా సమస్యలే

పాకిస్తాన్‌కు సమస్యలు కొత్తకాదు. కానీ ఉగ్ర వాదులను మేపడం వంటి కొన్ని సమస్యలను ఆ దేశమే భద్రంగా కాపాడుకుంటూ వస్తోంది. ఇక అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఏ దేశానికైనా తప్పని సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఇప్పుడు పాక్‌ను చుట్టుముట్టాయి. ఆ సమస్యలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యో ల్బణం, కరెన్సీ విలువ పతనం, అసాధారణ రీతిలో పెరిగిన విదేశీ రుణం, అవినీతి కారణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోనంత సంక్షోభంలో పడిపోయింది. పాకిస్తాన్‌లో వివిధ ప్రావిన్స్‌లలో జరిగిన ప్రజాధన దుర్వినియోగం వ్యవస్థకు బెడదగా మారింది. ప్రధానంగా ఇది పంజాబ్‌లో కనిపిం చింది. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి మీద వెల్లువెత్తిన ఆరోపణలే పాకిస్తాన్‌ ‌తాజా రాజకీయ సంక్షోభానికీ, అంతిమంగా ఇమ్రాన్‌ ‌పదవీ చ్యుతికీ దారితీశాయని చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభానికి కూడా పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌కారణమన్న అభిప్రాయం ఉంది. దీనికి ఉక్రెయిన్‌ ‌యుద్ధంతో వచ్చిన కష్టాలు తోడయ్యాయి. నిజానికి పాకిస్తాన్‌ ఆదాయమంతా ఆ దేశం సమకూర్చుకునేది కాదన్నది ఒక సత్యం. ఎక్కువ విదేశీ రుణాలతోనే గడుపుకుంటూ ఉంటుంది. చైనా-పాకిస్తాన్‌ ఆర్థిక నడవా (సీపీఈసీ) దేశం మీద విదేశీ రుణభారాన్ని మరింత పెంచింది. ఇప్పుడు చైనా కొత్తగా రుణం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.

సైన్యం మద్దతు ఉపసంహరించుకున్న తరువాత ఇమ్రాన్‌ ‌పదవి నుంచి దిగిపోవాలని పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌-‌నవాజ్‌, ‌పీటీఐలోని కొందరు, జమాయిత్‌ ఉలేమా ఇ ఇస్లామీ (ఎఫ్‌) ‌కార్యకర్తలు ఆందోళన ఆరంభించారు. ఇందులో పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌-‌నవాజ్‌ ‌పార్టీకి చెందిన షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌నిన్నటి దాకా పాకిస్తాన్‌లో విపక్ష శిబిరానికి నాయకునిగా ఉన్నారు. ఈయన మాజీ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌సోదరుడే. కొత్త ప్రధాని ఆయనే.

ఇమ్రాన్‌ ‌ప్రభుత్వ నిర్వహణలో నిభాయింపు ప్రదర్శించలేకపోయారు. సొంత పార్టీవారినే దూరం చేసుకున్నారు. ఇమ్రాన్‌కు అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియదని ఆయన రాజకీయ ప్రత్యర్థుల ప్రగాఢ నమ్మకం. తన పార్టీని తానే హైజాక్‌ ‌చేశాడని కొందరి భావన. ఇప్పుడు తనను, తన పార్టీని రక్షించుకోవడానికి ఎక్కడో దాగాడని విమర్శలు వస్తున్నాయి. ఇమ్రాన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌తో పోల్చడం పరిపాటి. ట్రంప్‌ ‌మాదిరిగానే తాను మాత్రమే దేశాన్ని రక్షించగలననీ, విపక్షాలన్నీ అవినీతి మయమనీ ఇమ్రాన్‌ అదేపనిగా వ్యాఖ్యానించేవాడు. పాక్‌ ‌ప్రజలను, తాలిబన్‌ను, దేశీయ ఉగ్రవాదులను, అఫ్ఘాన్‌ ‌తాలిబన్‌ను సంతోషపరచడానికి 9/11 విధ్వంసకుడు, అల్‌కాయిదా స్థాపకుడు ఒసామా బిన్‌ ‌లాడెన్‌ను మృతవీరుడు అని పొగిడి, ఇటు దేశంలో విపక్షాల చేతనే కాదు, అంతర్జాతీయ మీడియా చేత కూడా ఛీ అనిపించుకున్నాడు. ఇమ్రాన్‌ ‌హయాంలో దేశంలో 30 శాతం వ్యాపారం పతనమైందని విమర్శ ఉంది. అయితే దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించిన ప్రధాన పార్టీలు పాకిస్తాన్‌ ‌ముస్లింలీగ్‌ -ఎన్‌, ‌పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (పీపీపీ) మాత్రం దేశానికి ఏం ఒరగబెట్టాయి అన్న ప్రశ్నతో ఆ వ్యాపార పతనం విషయం ఎవరూ ప్రస్తావించలేకపోతున్నారు.


సైనిక నియంతలు, అల్పాయుష్షు ప్రధానులు

భారత్‌ ‌మీద ‘వేయేళ్ల యుద్ధం’ ప్రకటించారు బెనజీర్‌ ‌భుట్టో. మార్చి 13,1990న పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌కు వచ్చినప్పుడు కశ్మీర్‌ ఉ‌గ్రవాదులకు మద్దతుగా ఆ పాకిస్తాన్‌ ‌ప్రధాని ఈ మాట అన్నారు. నిజానికి నిన్న మొన్న ప్రమాణం చేసిన 23వ పాక్‌ ‌ప్రధాని, లేదా 1947 నాటి తొలి ప్రధాని లియాఖత్‌ అలీ ఖాన్‌ ‌మనసులో ఉన్నదాన్నే బెనజీర్‌ ‌వ్యక్తం చేశారు. భారత్‌ ‌మీద నిరంతర యుద్ధం నుంచి అంతర్జాతీయ వేదికల మీద భారత్‌ను తూర్పార పట్టడం వరకు ఎన్ని చేసినా ఆ దేశ ప్రధానులు పదవిలో ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఐదేళ్ల పాటు పూర్తిగా అధికారంలో కొనసాగడానికి అలాంటి మాటలు ఏ ఒక్కరికీ ఉపకరించ లేదు.

వజీర్‌ ఏ ఆజమ్‌ అని పిలిచే ప్రధాని పదవి పాక్‌ ‌ప్రభుత్వానికి ఇరుసు వంటిది. కానీ అక్కడ ప్రధానుల నియామకమంతా ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణించడానికే అన్నట్టు ఉంటుంది. ప్రథమ ప్రధాని లియాఖత్‌ అలీ ఖాన్‌. ఇతడు నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో ఆర్థికమంత్రి. కాంగ్రెస్‌కు అండగా ఉన్న పారిశ్రామికవేత్తలను సంవత్సరం పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల ఇతడి పదవీకాలమే అక్కడ రికార్డు. జిన్నాయే నియమించాడు. అయితే పదవిలో ఉన్నప్పుడే లియాఖత్‌ను అక్టోబర్‌ 16, 1951‌న ఒక సభలో ప్రసంగిస్తుండగా హత్యకు గురైనారు (గవర్నర్‌ ‌జనరల్‌ ‌జిన్నా 1948లో ప్రయాణంలో ఉండగా అస్వస్థుడై వైద్యం అందక మరణించిన సంగతిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ప్రధాని లియాఖత్‌). ‌రావల్పిండి వద్ద కంపెనీ బాగ్‌లో దాదాపు లక్షమందితో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఛాతి మీద రెండుసార్లు కాల్చాడు. అతడెవరో ఇప్పటి వరకు తెలియలేదు. లియాఖత్‌ ‌సహా, 1960లో అధ్యక్ష తరహా పాలన వచ్చేవరకు ఏడుగురు ప్రధానులు పనిచేశారు. 1958లో నాటి అధ్యక్షుడు ఇస్కందర్‌ ‌మీర్జా రాజ్యాంగాన్ని రద్దు చేసి, అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెట్టాడు. 1947 పని చేసిన ప్రధానులు వీరే- లియాఖత్‌ అలీ ఖాన్‌ (ఆగస్ట్ 14,1947-అక్టోబర్‌ 16, 1951), ‌ఖ్వాజా నజీముద్దీన్‌ (అక్టోబర్‌ 17, 1951-ఏ‌ప్రిల్‌ 17,1953), ‌మహమ్మద్‌ అలీ బోర్గా (ఏప్రిల్‌ 17,1953-ఆగస్ట్ 12,1955), ‌చౌధురి మహమ్మద్‌ అలీ (ఆగస్ట్ 12, 1955-‌సెప్టెంబర్‌ 12, 1956), ‌హుసేన్‌ ‌షహీద్‌ ‌సుహ్రావర్ది (సెప్టెంబర్‌ 12, 1956- అక్టోబర్‌ 17,1957), ఇ‌బ్రహీం ఇస్మాయిల్‌ ‌షాంద్రిగర్‌ (అక్టోబర్‌ 17, 1957- ‌డిసెంబర్‌ 16,1957), ‌సర్‌ ‌ఫిరోజ్‌ ‌ఖాన్‌ ‌నూన్‌ (‌డిసెంబర్‌ 16, 1957-అక్టోబర్‌ 7, 1958), ‌నూరుల్‌ అమిన్‌ (‌డిసెంబర్‌ 7, 1971-‌డిసెంబర్‌ 20, 1971), ‌జుల్ఫీకర్‌ అలీ భుట్టో (ఆగస్ట్ 14, 1973 – ‌జూలై 5,1977), మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌జునేజా (మార్చి 24,1985-మే 29, 1988), బెనజీర్‌ ‌భుట్టో (డిసెంబర్‌ 2, 1988 – ఆగస్ట్ 6, 1990/ అక్టోబర్‌ 19, 1993-‌నవంబర్‌ 5,1996), ‌నవాజ్‌ ‌షరీఫ్‌ (‌నవంబర్‌ 6, 1990-‌జూలై 18, 1993/ఫిబ్రవరి 17, 1997-అక్టోబర్‌ 12, 1999/ ‌జూన్‌ 5, 2013-‌జూలై 28, 2017), మీర్‌ ‌జఫారుల్లా ఖాన్‌ ‌జామాలి (నవంబర్‌ 23,2002-‌జూన్‌ 26,2004), ‌చౌధురి షుజాత్‌ ‌హుసేన్‌ (‌జూన్‌ 30, 2004- ఆగస్ట్ 26, 2004), ‌షౌకత్‌ అజీజ్‌ (ఆగస్ట్ 28, 2004- ‌నవంబర్‌ 15, 2007), ‌యూసుఫ్‌ ‌రజా జిలాని (మార్చి 25, 2008-జూన్‌ 19, 2012), ‌రజా పర్వేజ్‌ అ‌ష్రాఫ్‌ (‌జూన్‌ 22,2012-‌మార్చి 24, 2013), షహీద్‌ ‌ఖాకున్‌ అబ్బాసి (ఆగస్ట్ 1, 2017-‌మే 31, 2018), ఇమ్రాన్‌ (ఆగస్ట్ 18, 2018-ఏ‌ప్రిల్‌ 10, 2022), ‌మొయిన్‌ ‌మహమ్మద్‌ ‌షెహబాజ్‌ ‌షరీఫ్‌ (ఏ‌ప్రిల్‌ 11, 2022-).

‌రాజ్యాంగాన్ని పునరుద్ధరించిన తరువాత జడ్‌ఏ ‌భుట్టో అధ్యక్ష పదవి వీడి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నియమించిన సైన్యాధ్యక్షుడు జనరల్‌ ‌జియా ఉల్‌ ‌హక్‌ ‌తరువాత కుట్రతో అధికా రాన్ని చేజిక్కించుకుని సైనిక పాలన విధించాడు. 1977లో భుట్టోను ఉరి తీశాడు. ఏ ప్రధాని ఐదేళ్లు వరసగా అక్కడ పదవిలో లేరు. ముగ్గురు మాత్రం మూడేళ్లు పనిచేశారు. నవాజ్‌ ‌షరీఫ్‌ ‌మూడుసార్లు ప్రధానిగా ఎన్నికైనా ఎప్పుడు ఐదేళ్లు పూర్తి చేయలేదు. బెనజీర్‌ను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండుసార్లు ప్రధాని అయ్యారు. మూడు ప్రజా ప్రభుత్వాలను పాకిస్తాన్‌ ‌సైన్యం కూదోసింది. 1958లో ఫిరోజ్‌ ‌నూన్‌ ‌ప్రభుత్వాన్ని జనరల్‌ ‌యాహ్యాఖాన్‌ ‌తొలగించాడు. 1977లో జియా ఉల్‌హక్‌ ‌జడ్‌ఏ ‌భుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. జనరల్‌ ‌పర్వేజ్‌ ‌ముషార్రఫ్‌ 1999‌లో నవాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. పాకిస్తాన్‌కు నలుగురు సైన్యాధ్యక్షులు దేశాధ్యక్షు లుగా పనిచేశారు. ఇంకా చెప్పాలంటే ఆ దేశ 75 ఏళ్ల చరిత్రలో 32 సంవత్సరాలు సైన్యాధ్యక్షులే పాలించారు. జనరల్‌ ‌జియా 1978-88, జనరల్‌ ‌యాహ్యాఖాన్‌ 1969-1971, ‌జనరల్‌ ‌ముషార్రఫ్‌ 2001-2007. ఆయూబ్‌ ‌ఖాన్‌ అధ్యక్షుడైనాక ఫీల్డ్‌మార్షల్‌గా తనకు తాను పదోన్నతి కల్పించు కున్నాడు. ఆ దేశం పుట్టాక తొలి సాధారణ ఎన్నికలు జరపడానికి 23 సంవత్స రాలు పట్టింది. అవే 1971నాటి ఎన్నికలు. ఆ ఎన్నికల ఫలితాలు అంతిమంగా బంగ్లా విభజనకు దారి తీశాయి. ఆ దేశంలో ఈ అత్యున్నత పదవి ఎంత విలువ లేనిదంటే, మొత్తం 18 పర్యాయాలు ప్రధానిని తొలగించారు. ఇందుకు వేర్వేరు కారణాలు. కొందరు అవినీతి ఆరోపణలతో ఉద్వాసనకు గురైనారు. కొందరు సైనికాధికారుల ఆదేశాల మేరకు రాజీనామాలు సమర్పించారు. కొందరిని సైనిక కుట్రతో తొలగించారు. వీరు కాక అపద్ధర్మ ప్రధానులు కూడా ఉన్నారు.


తోడు సైన్యమే

ఇమ్రాన్‌ ‌కొత్త పాకిస్తాన్‌ ‌నినాదం కేవలం ఎన్నికల ఆకర్షణ. అతడు అధికారంలోకి వచ్చినది సైన్యం సహకారంతోనే. దీనికి తోడు ఐఎస్‌ఐ ‌సాయం అండ కూడా ఉంది. ఇంత బలమైన మద్దతు ఉన్నా ఎందుకు పదవి వీడాడు? ఆ రెండు కూడా కాడి పడేశాయి. ఇమ్రాన్‌ ‌కుప్పకూలాడు. పాక్‌ ‌ప్రభుత్వ పతనంలోని కీలక అంశం ఇదే. పాక్‌ ‌సైనిక చరిత్ర తెలిసిన వారు ఎవరైనా ఈ పరిణామానికి ఆశ్చర్యపోరు. అది పాక్‌ ‌సైనిక నైజం. ఇమ్రాన్‌ ‌ప్రభుత్వాన్ని విశ్లేషకులు హైబ్రీడ్‌ ‌రెజీమ్‌ అని పిలిచారు. అంటే అటు నియంతృత్వం కాదు. అలా అని ప్రజాస్వామ్యం కూడా అందులో లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పీఠం మీద కూర్చోపెట్టినది అక్షరాలా సైన్యమేనని ఇటీవల ఆయన పార్టీ నుంచి ఫిరాయించిన ఒక నాయకుడు చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్‌ ‌కోసం ఆ పదవిని ఖాళీ చేయించినది కూడా సైన్యమే. అంతకు ముందు అధికారంలో ఉన్న నవాజ్‌ను ప్రధానిగా అనర్హుడిని చేసి అవినీతి ఆరోపణలతో విచారించడానికి కారణం, సైన్యంతో అతడికి ఉన్న సంబంధాలు చెడిపోయిన ఫలితమే. షరీఫ్‌ ‌కూడా మొదట ఒక సైనిక జనరల్‌ ఆ‌శ్రయంతోనే ప్రధాని అయ్యారు. తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభమయ్యే సరికి కథ అడ్డం తిరిగింది. దేశం విడిచిపోవలసి వచ్చింది. కానీ ఇమ్రాన్‌ అలా కాదు. సైన్యంతో విభేదించడం ఆయన ఉద్దేశంగా కనిపించడం లేదు. తనదీ, సైన్యానిదీ విధాన రూపకల్పనలలో ఒకే అభిప్రాయమని బాహాటంగానే ప్రకటించాడు. చిత్రంగా సైన్యమే ఇమ్రాన్‌ ‌పాలన పట్ల పెదవి విరిచింది. మొదటి నుంచి సైన్యంతో ఇమ్రాన్‌ ‌సాగించిన బంధం పౌర సమాజంలోని రాజకీయ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఆ బంధం వల్లనే జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల గల్లంతు పర్వం మొదలయింది. కానీ ఇందులో ప్రభుత్వ ప్రమేయం కాని, నిఘా వర్గాల ప్రమేయం కాని లేదని ఆ రెండు వ్యవస్థలు ప్రకటించాయి. అయితే దోషి ఎవరు? అది ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు నేషనల్‌ అసెంబ్లీలో పూర్తి బలం లేకున్నా ఇమ్రాన్‌ ‌మనుగడ ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇందులోని రహస్యం తెలియాలంటే పాకిస్తాన్‌ ‌జర్నలిస్ట్ ‌కమ్రాన్‌ ‌యూసుఫ్‌ ‌బీబీసీకి చెప్పిన విషయం గమనించాలి. ఇమ్రాన్‌ ‌ఖాన్‌కు మద్దతు ఇచ్చే విధంగా విపక్షాలను మలిచిందీ, అవి మద్దతు కొనసాగించేటట్టుగా చేసినదీ సైన్యమే. అటు అధికార పీటీఐనీ, ఇటు విపక్షాలనీ సైన్యం కట్టడి చేసి ప్రభుత్వం నడవడానికి దోహదం చేసింది. చివరికి ప్రధాని పదవి వ్యవహారంలో సైన్యం తటస్థంగా ఉంటుందని ప్రకటించడంతోనే విపక్షాలన్నీ ఒక్కసారిగా ఎదురు తిరిగాయి. ఇక్కడ నుంచి ఇమ్రాన్‌ ‌పతనం ప్రారంభమైంది.

నిజానికి పాకిస్తాన్‌ ‌సైన్యం ఈ వ్యవహారంలో ఊగిసలాట వంటిదే ప్రదర్శించింది. ఇమ్రాన్‌కు పదవి కట్టబెట్టినదే సైన్యమేనన్నది బహిరంగ రహస్యం. కానీ నాడు అఫ్ఘాన్‌ ‌పరిణామాలు, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం తెచ్చిన రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంతో పాక్‌లో వచ్చిన పరిణామాల నేపథ్యంలో తాము తటస్థంగా ఉంటామని సైన్యం ప్రకటించింది. అయినప్పటికీ ఇంతకాలం నుంచి లేని వ్యతిరేకత, ఇమ్రాన్‌ ‌వ్యతిరేక ఆందోళనలు ఇప్పుడు జరుగుతున్నాయంటే అందుకు సైన్యం నుంచి పరోక్ష సంకేతం అందడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశాధినేతలు, వ్యవస్థల అధిపతుల మధ్య రగడ కూడా ఇదే సమయంలో పతాక స్థాయికి చేరుకుంది. గతేడాది జరిగిన ఐఎస్‌ఐ ‌చీఫ్‌ ‌నియామకం దగ్గర నుంచి జనరల్‌ ‌బాజ్వాకు, దేశాధ్యక్షునికి మధ్య దూరం పెరిగింది. దీనితో బాజ్వాకు, ఇమ్రాన్‌కు మధ్య కూడా దూరం పెరిగింది. చాలా వ్యవహారాలతో పాటు విదేశాంగ విధానంలో కూడా సైన్యానికీ, ఇమ్రాన్‌కీ మధ్య అంతరం పెరిగింది. ఉక్రెయిన్‌ ‌విషయంలో ఇమ్రాన్‌ది ఒక దారి, జనరల్‌ ‌బాజ్వాది ఒక దారి అయ్యాయి. రష్యా సేనలు ఉక్రెయిన్‌ ‌సరిహద్దును దాటగానే ఇమ్రాన్‌ ఆ ‌దేశం వెళ్లి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ పర్యటనను సమర్థించుకున్నారు. కానీ కొన్ని వారాల తరువాత జనరల్‌ ‌బాజ్వా యుద్ధం ఆగిపోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక దశలో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా దాయాది దేశం భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగు పడాలని జనరల్‌ ‌బాజ్వా ప్రతిపాదించినప్పటికీ ఇమ్రాన్‌ ‌నీళ్లు నమిలారు. కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు ఇలాంటి ప్రతిపాదన తీసుకువచ్చినా సైన్యం అందుకు సిద్ధంగా ఉండేది కాదు.

ఒక దశలో ఇమ్రాన్‌ ‌పాలన మీద దృష్టి సారించాలని ఒక ప్రయత్నం చేశాడు. కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాడు కూడా. కానీ అతడు చేసిన రాజకీయ తప్పిదాలు ఇంతకంటే చాలా పెద్దవి. ఉదాహరణకు జనసాంద్రత ఎంతో ఎక్కువగా ఉండే పంజాబ్‌ ‌ప్రాంతానికి అనుభవం లేని ఒక అస్మదీయుడిని ముఖ్యమంత్రిగా నియమించాడు. అతడే ఉస్మాన్‌ ‌బుజ్దార్‌. ‌దీని మీద విమర్శలు వెల్లు వెత్తాయి. కానీ అతడు ఉంటే ఇమ్రాన్‌ ‌ప్రభుత్వానికి శుభం జరుగుతుందని, తొలగిస్తే అరిష్టమేనని ఇమ్రాన్‌ ఆధ్యాత్మిక గురువు/భార్య హెచ్చరించడం వల్లనే అతడిని కొనసాగించాడని వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితులలోనే ఇమ్రాన్‌ ‌మీద విమర్శలతో పాటు, ఆయనకు అండగా ఉన్న పాక్‌ ‌సైన్యాధ్యక్షుడు ఖమర్‌ ‌జావెద్‌ ‌బాజ్వా, ఐఎస్‌ఐ అధిపతి లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌ఫయాజ్‌ ‌హమీద్‌ల మీద కూడా విపక్షాలు విమర్శలు తీవ్రం చేశాయి. ఆ రెండు వ్యవస్థలకు కూడా ఇదొక గడ్డు స్థితి. ఎందుకంటే విపక్షాల విమర్శకు రెండువైపులా పదును ఉంది. అసలు ఇలాంటి మనిషిని మీరెందుకు ప్రధాని పదవిలో కూరోబెట్టారు అన్నదే ఆ విమర్శ. ఈ దశలోనే ఇమ్రాన్‌ ‌పాలనా సామర్థ్యం మీద సైన్యం కూడా పెదవి విరవవలసి వచ్చింది. ముఖ్యంగా పంజాబ్‌ ‌విషయంలో ఇమ్రాన్‌ ‌వేసిన తప్పటడుగులు సైన్యాన్ని కలవరపెట్టాయి. ఈ అంశాల మీద జనం బాహాటం గానే సైన్యాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే జనర• బాజ్వాకీ, ఐఎస్‌ఐ ‌చీఫ్‌ ‌జనరల్‌ ‌ఫయాజ్‌కు మధ్య దూరం పెరిగింది. ఎందుకంటే జనరల్‌ ‌బాజ్వా తరువాత ఆ పదవిలోకి రావాలని ఫయాజ్‌ ‌కాచుకుని ఉన్నాడు. తానే తరువాతి సైన్యాధ్య క్షుడినని అఫ్ఘానిస్తాన్‌ అధికారులకు ఆయన చెప్పాడని వార్తలు వచ్చాయి కూడా. జనరల్‌ ‌బాజ్వాను తొలగిం చాలని అవిశ్వాసం మీద చర్చ జరుగుతుండగానే అందుకు ఇమ్రాన్‌ ‌ప్రయత్నించాడన్న వార్త కూడా సంచలనం రేపింది. కానీ ఈ పరిణామాలలో ప్రజాస్వామ్యం బలపడుతున్న క్రమాన్ని దర్శిస్తున్నారు జమ్ముకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. అక్కడ ప్రజాస్వామ్యం వేళ్లూనుతున్నదని ఆమె ప్రకటించడం విశేషం.

ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రయత్నం ఇప్పటిది కాదు. పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (పీపీపీ) ఇందుకు తొలి ప్రయత్నం చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి పీఎంఎల్‌ (ఎన్‌)‌ను అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవలసిందిగా 2021 చివరిలోనే కోరింది. అవిశ్వాస తీర్మానం పెట్టి ఇమ్రాన్‌ను దించడానికి తగినంత బలం విపక్షాలకు ఉందని పీపీపీ ప్రముఖుడు ఖుర్షీద్‌ ‌షా నిరుడు సెప్టెంబర్‌లోనే ప్రకటించారు. అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నంతో చివరికి ఏప్రిల్‌ 8‌న కార్యరూపం దాల్చింది. మూడేళ్ల ఏడు మాసాల తరువాత ఇమ్రాన్‌ ‌పదవి నుంచి వైదొలగ వలసి వచ్చింది.

అమెరికా మీద తిరుగుబాటు, అఫ్ఘానిస్తాన్‌లో ఏదో సాధిద్దామని ఉత్సాహపడి వెనక్కి వచ్చిన నేపథ్యంలో ఇమ్రాన్‌ ‌పదవీచ్యుతుడయ్యాడు. అమెరికాకు దూరమై రష్యా, చైనాలకు దగ్గరవుతున్న సమయం కూడా ఇదే. కాబట్టి పాకిస్తాన్‌లో జరిగిన ఈ మార్పు అంతర్జాతీయ సంబంధాల మీద ఎలా ఉంటుందో కొందరు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఐఎస్‌ఐకీ, అఫ్ఘానిస్తాన్‌ ‌తాలిబన్‌కి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. పాక్‌ ‌సైన్యానికీ, తాలిబన్‌కీ మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. తాలిబన్‌ను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులలో కొందరు పాక్‌ ‌సైనికులు మరణించారు కూడా. 2021 నుంచి కాల్పుల విరమణ అమలు జరుగు తున్నప్పటికీ చరిత్రలో మున్నెన్నడూ లేని స్థాయిలో భారత్‌-‌పాక్‌ ‌సంబంధాలు పతనమైన సమయం ఇదే. భారత్‌లో మైనారిటీలకు రక్షణ లేదంటూ ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌భారత్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీ మీద అనేకసార్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే కశ్మీర్‌ ‌సమస్య పరిష్కారం కోసం భారత్‌ ‌సిద్ధంగా ఉంటే తాము కూడా సిద్ధం కాగలమని ఇటీవల పాక్‌ ‌సైన్యం ప్రకటించడం విశేషం. పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఎవరిదైనా చైనా సంబంధాలలో మార్పు ఉండదని ఆ దేశం ప్రకటించింది. కొత్త ప్రధాని షెహబాజ్‌ ‌కూడా ఇదే ప్రకటించారు. షెహబాజ్‌ అత్యుత్సాహం

ఇవి చాలవన్నట్టు కొత్త ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పీఠం ఎక్కుతూనే చైనా ఆప్త దేశమనీ, కశ్మీర్‌లో ఆజాదీ పోరాటానికి మద్దతు ఇస్తామని ప్రకటించి భవిష్యత్తు రూపం ఏదో చెప్పేశాడు. ఏప్రిల్‌ 12‌న పాకిస్తాన్‌ 23‌వ ప్రధానిగా ఎన్నకైన షెహబాజ్‌ ‌వెంటనే జాతీయ అసెంబ్లీలో మాట్లాడాడు. అసలు రెండు దేశాల మధ్య ఆది నుంచి కూడా సత్సంబంధాలు లేనేలేవని చెప్పాడు. ఇది సత్యమే అయినా, కొత్తగా ప్రధాని అయిన వ్యక్తి నోటి నుంచి రావడం వింతే. కొత్త ప్రధాని భారత్‌తో సత్సంబంధాలు కోరుకోవడం లేదని అర్థమవుతుంది. మాజీ ప్రధాని నవాజ్‌ ‌సోదరుడు ఇతడు. వీరి తండ్రి ప్రస్తుత కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందినవారే. విభజన సమయంలో పాకిస్తాన్‌ ‌వెళ్లిపోయారు. ఇప్పుడు కాళిదాసు కవిత్వం కొంత తన పైత్యం కొంత అన్నట్టు కశ్మీర్‌ ‌లోయ రక్తంతో ఎర్రగా మారిందని అంటున్నాడు షెహబాజ్‌. ‌పైగా కశ్మీర్‌ ‌సమస్య పరిష్కారానికి భారత ప్రధాని మోదీ చొరవ చూపాలని అనడం కొత్త ప్రధాని తొలి ప్రసంగంలోనే వాచాలతను ఆశ్రయించారని అర్ధమవుతుంది. అంతేకాదు, కశ్మీర్‌ ‌సమస్యను ప్రతి అంతర్జాతీయ వేదిక మీద ప్రస్తావిస్తూనే ఉంటానని కూడా అతడు చెప్పేశాడు.

షెహబాజ్‌లో అత్యుత్సాహం కాస్త ఎక్కువే. ఈయనతో దేశాధ్యక్షుడు అరిఫ్‌ అలీ ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ అధ్యక్షుడు ‘అనారోగ్యం’ తో విధులకు దూరంగా ఉన్నారు. దీనితో సెనేట్‌ ‌చైర్మన్‌ ‌సాదిక్‌ ‌సంజ్రానీ ప్రమాణ స్వీకారం చేయించారు. షెహబాజ్‌ ‌ప్రధానిగా ఎన్నిక కావడంతో పాకిస్తాన్‌ ‌రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి చల్లబడినట్టే. కానీ ఇది తుపాను ముందు ప్రశాంతత మాత్రమే. నవాజ్‌ ‌షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ‌ముస్లింలీగ్‌ (ఎన్‌) ‌పార్టీకి ప్రస్తుతం షెహబాజ్‌ అధ్యక్షుడు. ఇతడి మీద, ఇతడి తనయుడి మీద కూడా కేసులు ఉన్నాయి. అవి ఏప్రిల్‌ 27‌న విచారణకు రానున్నాయి. అదొక కత్తి వేలాడుతూనే ఉంది. అలాగే ఈ పార్టీతో మిగిలిన పాకిస్తాన్‌ ‌పక్షాలు ఎంత కాలం కలసి ఉంటాయో ఎవరూ చెప్పలేక పోతున్నారు. జాతీయ అసెంబ్లీలో పీఎంఎల్‌ (ఎన్‌) ‌బలం కేవలం 86. ఒక ప్రధానిని గద్దె దించడానికి ఏర్పడిన ఈ కలయిక ఎంతకాలం కొనసాగుతుంది? ఇంకా చిత్రం నాడు ఇమ్రాన్‌ 176 ఓట్లతో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు షెహబాజ్‌కు వచ్చిన ఓట్లు 174. ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమి లేదా పార్టీకి ఉండవలసిన బలం 172. అంత అంచున షెహబాజ్‌ ఉన్నాడు.

ఇమ్రాన్‌ ‌పయనం ఎటు?

షెహబాజ్‌ను విపక్షాలు ఎన్నుకునే కార్యక్రమాన్ని ఇమ్రాన్‌ ‌పార్టీ సభ్యులు బహిష్కరించారు. కానీ వారు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ఇస్లామాబాద్‌, ‌కరాచీ, పెషావర్‌, ‌క్వెట్టా వంటి పెద్ద నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలలో కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఇదంతా ఇమ్రాన్‌ను పదవి నుంచి దింపినందుకు నిరసనే. ఇమ్రాన్‌ ‌మంత్రిమండలిలో పనిచేసిన షేక్‌ ‌రషీద్‌ ‌పంజాబ్‌లో ఏర్పాటు చేసిన సభకు భారీగానే జనం వచ్చారు. అక్కడ చౌకీదార్‌ ‌చోర్‌ ‌హై వంటి నినాదాలు వినిపించాయి. ఇది సైన్యాన్ని ఉద్దేశించి చేసినదని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇమ్రాన్‌ను సైన్యం మోసం చేసిందన్న భావన పీటీఐ కార్యకర్తలలో ఉంది. అంతకుముందే ఇమ్రాన్‌ ‌తాను జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చట్టసభలలో తాను దొంగలతో కలసి కూర్చోనని ఆయన చెప్పడం విశేషం. తన పార్టీ సభ్యులు కూడా రాజీనామాలు చేస్తారని ఆయన సంకేతించారు కూడా. ఇమ్రాన్‌ ఉన్నది మూడేళ్లే అయినా పాకిస్తాన్‌కు ఎనలేని అపకీర్తి తెచ్చి పెట్టారు. కశ్మీర్‌ ‌విషయంలో, ఆర్టికల్‌ 370 ‌రద్దు గురించి ప్రపంచ వేదికల మీద ప్రస్తావించిన కొలదీ ఆయన చుట్టూ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదానికి కేంద్రం మీ దేశం కారణం కాదా అంటూ వచ్చిన విమర్శలకు ఆయన జవాబు చెప్పుకోవలసి వచ్చింది.

ఇమ్రాన్‌కు ఇప్పటికీ పాకిస్తాన్‌ ‌యువతరంలో ఆకర్షణ ఉంది. వచ్చే ఎన్నికలలో ఆయన ఒక శక్తిగా మిగిలిన పార్టీలను ఎదుర్కొనగలరనే చెప్పాలి. అమెరికా వ్యతిరేకత ఆయనకు చేటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఇమ్రాన్‌కు విస్తృత అవకాశాలు కూడా ఉన్నాయి. మొదట షెహబాజ్‌పై ఉన్న కేసులు ఇమ్రాన్‌కు పెద్ద ఆయుధం. ఒకవేళ తాత్కాలికంగా వాటి నుంచి కొత్త ప్రధాని ఊరట కల్పించుకున్నా, దేశ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించుకు రావడం అంత సులభం కాదు. మూడుసార్లు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రిగా పనిచేసిన షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రధానిగా ఎంత కాలం కొనసాగగలరనేది త్వరలోనే తేలిపోతుంది. ఐదేళ్లయితే ఆయన ఆ పదవిలో ఉండరు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE