సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌చైత్ర శుద్ధ  తదియ

04 ఏప్రిల్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం భారత్‌. ‌సాంస్కృతిక వైవిధ్యం మన దేశ ప్రత్యేకత. కానీ ఈ ప్రత్యేకతలను కాపాడుకుంటున్నామా? కోల్పోయే వాతావరణాన్ని సృష్టిస్తున్నామా? మొదట దీని మీద నిష్పాక్షికమైన దృష్టి ఉండాలి. వైవిధ్యాన్ని కాపాడుతున్నామంటూనే, కోల్పోయే పరిస్థితిని శరవేగంగా తెస్తున్న కొన్ని సమూహాలూ, రాజకీయపక్షాలూ దేశ మౌలిక లక్షణం మీద దాడి చేస్తున్నాయి. మైనారిటీల హక్కులు అంటే మెజారిటీ ప్రజల హక్కును పణంగా పెట్టడం కాదన్న ఇంగిత జ్ఞానం ఆ పార్టీలకు లోపించింది. హిందు వులు 4 శాతమే ఉండి, వేరే మతం వారు 96 శాతం ఉన్నా, హిందువులనే మెజారిటీలుగా జమెయ్యడం అలాంటి పార్టీల చలవే. ఇదే వింతల్లోకెల్లా వింత.

భారత్‌లో మెజారిటీలు హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, జూడాయిజం, బహాయిజం పాటించే వారంతా మైనారిటీలు. ఇందులో హిందూ జనాభా తగ్గడం వాస్తవం. ఇంతకీ ఎంత శాతం ఉంటే మైనారిటీలు? దీని మీద స్పష్టత లేదు. కానీ ఈ హోదా మారుతున్న సమీకర ణలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. 2011 జనగణన దేశంలోని అన్ని రాష్ట్రాలలోను హిందువులు అధిక సంఖ్యాకులు కారని చాటిన సంగతి విస్మరించలేనిది. హిందువులు కొన్నిచోట్ల అచ్చంగా మైనారిటీలు. అయినా, వారు హిందువులు కాబట్టి అక్కడ జనాభాలో 4శాతమే ఉన్నా మెజారిటీలే. వినడానికి వింతగా, వికృతంగా ఉన్నా ఇది నిజం.

 ఈ అంశం మీద కాస్త ఆలస్యంగానే అయినా సుప్రీంకోర్టు కేంద్రం చేత మంచి మాట చెప్పించింది. హిందువులు అధిక సంఖ్యాకులు కాకుంటే, అల్ప సంఖ్యాక వర్గాల వారికి కేంద్రం ఇచ్చే పథకాలకు దూరంగా ఉండిపోతే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారికి అల్ప సంఖ్యాక వర్గ హోదా ఇవ్వవచ్చునని మార్చి 28న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను చూస్తే, 10 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు. 2011 జనగణన ప్రకారం ఆ రాష్ట్రాలలో హిందువుల జనాభా ఇది: లద్దాక్‌/1‌శాతం, మిజోరం/ 2.75, లక్షద్వీప్‌/2.77, ‌కశ్మీర్‌/ 4, ‌నాగాలాండ్‌ /8.74, ‌మేఘాలయ/11.52, అరుణాచల్‌/29.24, ‌పంజాబ్‌/38.40, ‌మణిపూర్‌/31.39. అయినా ఇక్కడి హిందువుల• మైనారిటీలకు కల్పించే ప్రయోజనాలకు దూరంగా ఉండిపోయారని, ఆ ప్రయోజనాలు అందేటట్టు కేంద్రాన్ని ఆదేశించా లని న్యాయవాది అశ్వినికుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన వ్యాజ్యంతో డొంక కదిలింది. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం ఆయా రాష్ట్రాలోని మైనారిటీల విద్యా హక్కు విషయాన్ని ప్రధానంగా విచారించింది. అంటే హిందూధర్మం, జూడాయిజం, బహాయిజం అనుసరించే వారు ఇక విద్యా సంస్థలను నెలకొల్పి నిర్వహించుకోవచ్చు. ఇదొక కీలక మలుపు. ఈ కదలికకు దోహదం చేసిన ఉపాధ్యాయ అభినందనీయులు.

 మైనారిటీ విద్యాసంస్థల జాతీయ కమిషన్‌ ‌చట్టం 2004లోని 2(ఎఫ్‌) ‌విభాగం చెల్లుబాటును న్యాయవాది అశ్వినికుమార్‌ ‌సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మత, భాషా మైనారిటీలను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి హోదా కల్పించవచ్చునని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ తాజాగా స్పష్టం చేసింది. అలాంటి చొరవ కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ఉదాహరణలూ ఉన్నాయి. యూదులను మైనారిటీలుగా గుర్తించింది మహారాష్ట్ర. ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, తుళు, లామని, హిందీ, కొంకణి, గుజరాతీలను భాషా మైనారిటీలుగా కర్ణాటక ప్రకటించింది. కాబట్టి ఇలాంటి హక్కు అన్ని రాష్ట్రాలకు వర్తించాలని అశ్వినికుమార్‌ ‌వాదన. హిందువులు అల్ప సంఖ్యాకులుగా ఉంటే ఆ హోదా కల్పించడం మీద తమ విధానం గురించి, అసలు మైనారిటీలను గుర్తించడానికి జాతీయ మైనారిటీ కమిషన్‌ ‌చట్టం, 1992 కేంద్రానికి ఇస్తున్న అధికార పరిధి మీద తమ విధానం ఏమిటో నాలుగు వారాలలో కోర్టుకు నివేదించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. చర్చ్ ‌పరిధిలోని పాఠశాలలు, ముస్లింల మదర్సాల మాదిరిగానే హిందువులకు కూడా పాఠశాలలు నడుపుకొనే హక్కు ఉండాలని అశ్వినికుమార్‌ ‌వాదించారు. నిజానికి ఇలాంటి హక్కును మైనారిటీ పరిధిలోకి వచ్చే అందరికీ ఇస్తూ 2002లోనే టీఎంఏ పాయ్‌ ‌వర్సెస్‌ ‌కర్ణాటక కేసులో సుప్రీంకోర్టుతీర్పు ఇచ్చింది.

ఇతర మతాలవారు డెబ్బయ్‌ ‌శాతం ఉన్నచోట కూడా హిందువులను మెజారిటీలుగా పరిగణించడం మీద వివాదం చిరకాలంగా ఉన్నదే. హిందు వులు 50 శాతం కంటే తక్కువ ఉన్న ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో వారికి మైనారిటీ హోదా ఇచ్చే అంశం గురించి జాతీయ మైనారిటీ కమిషన్‌ 2017‌లోనే త్రిసభ్య సంఘం నియమించింది. మైనారిటీల సంస్థల కోసం కేంద్రం రూ.4,700 కోట్లు ఖర్చు చేస్తుంటే, హిందువులు నడిపే సంస్థలకు అలాంటి వెసులుబాటు ఏమీ లేదని, ఈ అంశం మీద వైఖరి ఏమిటని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 29, 2020న కేంద్రాన్ని అడిగింది కూడా.

మెజారిటీ, మైనారిటీ; మైనారిటీ అంటే జనాభాలో ఎంత శాతం, ఆ శాతం దాటిపోతే తరువాత చర్య ఏమిటి వంటి అంశాల మీద ఒక విధానం అత్యవసరం. ఎందుకంటే ఒక మతం మైనారిటీ హోదా మెజారిటీ జనాభాను అధిగమించేందుకు దోహదం చేస్తున్న మాట వాస్తవం. మెజారిటీ జనాభాను అధిగమించాలనుకోవడం వెనుక కొన్ని ప్రత్యేక ఉద్దేశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం. సుప్రీంకోర్టు తాజాగా తేల్చిన ఈ విషయం ఒక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక మేరకు నివారించేదే అయినా, దేశం మొత్తం మీద మైనారిటీ, మెజారిటీ లెక్కల చుట్టూ తిరుగుతున్న కీలకాంశాలను సుప్రీంకోర్టు పరిశీలించాలి. ఒకరి మైనారిటీ హోదా మెజారిటీల సాంస్కృతిక మూలాలలను తుంచే విధంగా తయారు కాకూడదు కదా!

About Author

By editor

Twitter
YOUTUBE