దేవాదాయ ధర్మాదాయ, విద్యా రంగాల్లో సరికొత్త అధ్యాయానికి కర్ణాటక శ్రీకారం చుట్టనుంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని బసవరాజు బొమ్మై ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వాస్తవాలను వక్రీకరిస్తూ సాగిన విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాల్లో మార్పులు తీసుకురానుంది. విద్యారంగంలో చరిత్రకు సంబంధించి ఒకవైపును మాత్రమే విశ్లేషిస్తూ సాగిన బోధనకు తెరవేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. విద్యార్థులకు నైతిక విలువలను బోధించేందుకు పవిత్ర హిందూ మత గ్రంథమైన భగవద్గీతను ప్రామాణికంగా తీసుకునేందుకు చర్యలు చేపట్టనుంది. అదే విధంగా హిందూమత ఆలయాల వద్ద అన్యమతస్తుల వ్యాపార నిర్వహణపై కూడా సర్కారు నిషేధం విధించింది. సహజంగానే లౌకికవాదం పేరుతో, రాజ్యాంగం పేరుతో ప్రభుత్వ విధానాలను తప్పుపట్టేందుకు విపక్ష కాంగ్రెస్‌, ‌జనతాదళ్‌ (‌సెక్యులర్‌) ‌ముందుకు వస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. నిర్ణయాలను సహేతుక కోణంలో కాకుండా రాజకీయ కోణంలో చూడటమే వాటి లక్ష్యంగా మారడం విచారకరం.


వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భగవద్గీతలోని ముఖ్యాంశాలను ‘మోరల్‌ ‌సైన్స్’ ‌పాఠ్యాంశంగా తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రపంచం కార్పొరేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏ రంగంలో చూసినా లాభం, నష్టం అంశాలే కీలకంగా మారాయి. ఈ దిశగానే ప్రపంచం నడుస్తోంది. లాభం సాధించిన వాడిని విజేతగా, నష్టం పొందిన వాడిని పరాజితుడిగా చూసే విధానం నానాటికీ విస్తరిస్తోంది. ఈ క్రమంలో విలువలు, నీతి, నిజాయితీ వంటి అంశాలు వెనకబడి పోతున్నాయి. ఇదే ధోరణి మన్ముందూ కొనసాగితే పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. సక్రమ మార్గంలో సాధించని గెలుపు అసలు గెలుపే కాదన్నది అందరూ అంగీకరించే విషయం. అందుకే భావిభారత పౌరుల్లో నైతిక విలువలు పెంపొందిం చేందుకు కర్ణాటక సర్కారు నడుం కట్టింది. విమర్శలకు వెరవకుండా ముందుకు సాగుతోంది. భగవద్గీత ప్రధానాంశంగా ‘మోరల్‌ ‌సైన్స్’ ‌పాఠ్యాం శంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని గుజరాత్‌ ‌ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు మార్చి 17న గుజరాత్‌ ‌విద్యా శాఖ మంత్రి జితు వాఘానీ స్పష్టం చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న కర్ణాటక ఆ బాటలోనే సాగేందుకు సిద్ధమవుతున్నట్లు శాసనమండలిలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బి.సి. నగేష్‌ ‌వెల్లడించారు. రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాల్లోని ముఖ్యాంశాలను పిల్లలకు బోధించడం ద్వారా వారిలో మానవీయ విలువలు, నైతిక విలువలు, సంప్రదాయాలు, వ్యవహారశైలి మెరుగుపడతాయని ఆయన వివరించారు.

ఈ నిర్ణయంపై సహజంగానే విపక్ష కాంగ్రెస్‌ ‌ధ్వజమెత్తింది. ప్రభుత్వం మతాన్ని వాడుకుంటోందని పీసీసీ చీఫ్‌ ‌డీకే శివకుమార్‌, ‌మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య తదితరులు నిరసించారు. జాతిపిత మహాత్మాగాంధీ తన జీవితంలో గీతా ప్రాధాన్యాన్ని ఎన్నోసార్లు వివరించారు. క్లిష్ట సమయాల్లో గీత తనకు మార్గదర్శిగా, దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొనడాన్ని అందరూ గమనించాలి. భగవద్గీత అన్నది కేవలం హిందువులకు సంబంధించినది కాదని, సమస్త మానవాళిలో స్ఫూర్తిని నింపే గ్రంథమని వివిధ రంగాలకు సంబంధించిన అనేకమంది ప్రముఖులు పేర్కొనడం హస్తం పార్టీ పెద్దలకు తెలియదని అనుకోలేం. అయినప్పటికీ వారు విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఒక్క భగవద్గీత మాత్రమే కాదు, అన్యమత పవిత్ర గ్రంథాల్లోని అంశాలను సైతం పాఠ్యాంశాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం గమనార్హం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏకపక్షంగా లేదు. అన్ని వర్గాలతో చర్చిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొనడాన్ని గుర్తించాలి.

టిప్పుపై ప్రచారానికి తెర..

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ‌పాఠ్యాంశంపై సమీక్షించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది. టిప్పు సాహసాలను పాఠ్యాంశాల్లో ఘనంగా వర్ణించిన తీరుపై ఇప్పటికే పలు హిందూ మత సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బి.సి. నగేష్‌ ‌స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించడం, ఏదేని మతాన్ని లక్ష్యంగా చేసుకుని కీర్తించడం, లేదా కించపరిచే పాఠాలను తొలగించేందుకు వెనకాడ బోమని ఆయన చెప్పారు. ఇందుకు సమగ్ర చర్చ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. 1750-1799 మధ్యకాలంలో టిప్పు సుల్తాన్‌ ‌మైసూరు రాజ్యాన్ని, సమీపంలోని శ్రీరంగ పట్టణాన్ని పాలించారు. ఆ సమయంలో ఆయన మతమార్పిళ్లకు పాల్పడ్డారు. హిందూ మత ఆలయాల విధ్వంసానికి పాల్పడ్డారు. హిందువులను వేధించారు. వారి పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరించారు. టిప్పు తండ్రి హైదర్‌ అలీ సైతం ఇదేవిధంగా వ్యవహరించారు. తండ్రి బాటలోనే టిప్పు ప్రయాణం సాగింది. ఈ చేదు నిజాలను విస్మరించిన నాటి పాలకులు ఆయనను కీర్తిస్తూ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడంపై పలు హిందూ మత సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇంతకుముందున్న కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని సిద్ధరామయ్య సర్కారు ముస్లిం ఓటుబ్యాంకు కోసం టిప్పును ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాక ఏటా ఆయన జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న జరపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్క టిప్పూనే కాదు మొఘల్‌ ‌చక్రవర్తులపై గల పాఠ్యాంశాలను సైతం సమీక్షించాలని బొమ్మై సర్కారు నిర్ణయించింది. మొఘలుల స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని తీర్మానించినట్లు కర్ణాటక పాఠ్య పుస్తక పునః రచనా సమితి అధ్యక్షుడు రోహిత్‌ ‌చక్రతీర్థ తెలిపారు. అయిదు దశాబ్దాలకు పైగా పాలించిన మేటి హిందూ రాణి చెన్న బైరాదేవికి సంబంధించిన పాఠ్యాంశాలకు చోటు దక్కలేదు. అందువల్ల చరిత్రకు సంబంధించిన అసమానతలను సరిదిద్దే కార్యక్రమాన్ని తమ కమిటీ చేపడుతోందని చక్రతీర్థ వివరించారు.

వాస్తవానికి యుడియూరప్ప హయాంలోనే ఇందుకు బీజం పడింది. ఏ మాత్రం చారిత్రక ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికగా రూపొందించిన టిప్పూ పాఠ్యాంశాలపై సమీక్షించాలని రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి మండలి సర్కారును కోరింది. దీనిని పరిశీలించాలని నాటి యుడియూరప్ప సర్కారు సమీక్ష సమితికి ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత పాఠ్యాంశాలకు సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని సమీక్ష సమితి అధ్యక్షుడు రోహిత్‌ ‌చక్రతీర్థ తేల్చిచెప్పారు. తాజాగా బొమ్మై ప్రభుత్వం టిప్పు సుల్తాన్‌ ‌పాఠ్యాంశంపై సమీక్షించాలని నిర్ణయించింది. ఈ విషయంపై హస్తం పార్టీ ఎప్పటిలాగానే తన సహజధోరణిలో స్పందించింది. చరిత్ర మార్చరాదని, టిప్పు సుల్తాన్‌ ‌చరిత్ర కల్పిత గాథ కాదంటూ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టిప్పు సుల్తాన్‌కు ‘మైసూరు పులి’ అని ఎవరు బిరుదు ఇచ్చారన్న విషయమై లండన్‌లోని గ్రంథాలయం పుస్తకాలను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. నాటి బ్రిటిష్‌ ‌పాలకులే ఆ బిరుదు ఇచ్చారన్నారు. ఇది చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదు. టిప్పు చరిత్రపై భారతదేశ గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప లండన్‌లోని గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న వాదనలో హేతుబద్ధత లేదు. కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయంలో టిప్పూ పేరిట ‘సలాం మంగళహారతి’ కార్యక్రమం నిర్వహించేవారు. దీనిని ఇప్పుడు నిషేధించారు. మైసూరు ప్రాంతంలోని కొన్ని దేవాలయాల్లోనూ ఈ పద్ధతికి త్వరలో తెరపడనుంది.

రాష్ట్రంలోని హిందూ దేవాలయాల వద్ద అన్యమతస్తుల వ్యాపార కార్యకలాపాలపై నిషేధం విధించాలని సర్కారు నిర్ణయించింది. హిందూ ఆలయాల వద్ద ఆ మతానికి సంబంధించిన వారే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. దీనిపైనా విపక్షాలు ఒంటికాలిపై విమర్శలకు దిగాయి. వాస్తవానికి ఇది ఇప్పటికిప్పుడు బొమ్మై సర్కారు తీసుకున్న నిర్ణయం కాదు. కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. ‌కృష్ణ గతంలో తీసుకున్న నిర్ణయమిది. అప్పట్లో ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ చట్టానికి సవరణలు చేశారు. నాటి కాంగ్రెస్‌ ‌సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ఎవరూ తప్పుపట్టలేదు. దానినే భాజపా సర్కారు కొనసాగించాలని నిర్ణయిస్తే మాత్రం లౌకికవాద పార్టీలమని చెప్పుకునే నాయకులు నిరసనలు వ్యక్తం చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఈ రెండు నాల్కల ధోరణి వల్ల తాత్కాలికంగా రాజీకయ లబ్ధి పొందవచ్చు. అంతేతప్ప దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇవ్వదు. ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు.

హిందూమత చరిత్రకు సంబంధించి మరికొన్ని వక్రీకరణలూ ఉన్నాయి. వేదిక కాలంలో పూజలు, యజ్ఞాలకు ఆవు నెయ్యి, పాలు వినియోగించడం వల్ల ఆహార కొరత ఏర్పడింది. అందువల్లే ప్రత్యామ్నాయ ఆహారాన్ని భుజించే విధంగా జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయని కొన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించారు. అప్పట్లో ప్రజలకు సంస్కృతం అర్థంకాలేదన్న విషయాన్ని పేర్కొన్నారు. ఇవన్నీ చరిత్రకు వక్రభాష్యాలే అని వేరే చెప్పనక్కర్లేదు.

అనేక పాశ్చాత్య దేశాలు సైతం హిందూ సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఆకర్షితులవుతున్న నేపథ్యంలో స్వదేశంలోని కొందరు కుహనా లౌకికవాదులు అందుకు భిన్నంగా మాట్లాడటం ఆందోళన, ఆవేదన కలిగించే విషయం. వివిధ రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ప్రజాతీర్పు వస్తున్నప్పటికి విపక్షాలు తమ పంథాను మార్చుకోవడానికి ఎంతమాత్రంగా సిద్ధంగా లేవు. అన్ని మతాలను ఆదరించే, గౌరవించే సంప్రదాయం ఒక్క భారత్‌లో తప్ప మరే దేశంలో లేదన్న సంగతిని వారు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE