రాష్ట్రంలో కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలపెంపుతో ప్రజలు, పారిశ్రామిక రంగం, రైతాంగం, ఆక్వారంగం తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంది. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచకపోవడంతో కరెంటు కొరత ఏర్పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర విద్యుత్‌సంస్థల ఉత్పత్తి సామర్థ్యం పెంచడంపై చూపడంలేదు. ఉత్పత్తి సంస్థలకు రూ. వేల కోట్లు బకాయి పడడం, బొగ్గు పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం, బొగ్గును కనీస స్థాయిలో నిల్వచేసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైంది. రాష్ట్రాన్ని లోటు విద్యుత్ రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చివేసింది. దక్షిణ భారతదేశంలో ఉన్న మొత్తం విద్యుత్ కొరతలో 90శాతం ఏపీలోనే ఉండటం శోచనీయం. పవర్ హాలిడేలు ప్రకటించి పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేస్తూ లక్షలాది మందికి జీవనోపాధి దూరంచేసి రోడ్డున పడేస్తున్నారు. వ్యవసాయానికి నీటి సరఫరాని రెండు గంటలు తగ్గించారు.
విద్యుత్ కోత సమస్యగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగు తోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కోతలు అమలు చేస్తున్నారు. ఉదయం రాత్రనే తేడా లేకుండా రోజుకు 10 నుంచి 15 గంటలపాటు కరెంటు తీసేస్తున్నారు. ఆసుపత్రులకు సైతం విద్యుత్ సరఫరాను గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. గర్భిణులు, అత్యవసర చికిత్స కోసం చేరిన రోగులు ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు లాంతర్లు, కొవ్వొత్తులు ఉపయోగించి చదువుకోవాల్సి వస్తోంది. మరోపక్క పవర్ హాలిడేతో చిన్నతరహా పరిశ్రమలు కుదేలౌతున్నాయి. కరోనాతో చితికిపోయిన పరిశ్రమలు తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నమయంలో విద్యుత్ కోతలు విధించడంతో ఉత్పత్తి ఆగిపోతోంది. ఒక పక్క ఉత్పత్తి తగ్గిపోవడం మరోవక్క కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో చిన్నతరహా పరిశ్రమలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయా నికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రబీ పంటల సాగుపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావం చూపుతు న్నాయి. నీటి తడులు లేక కూరగాయ పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో డీజిల్ ఇంజిన్‌ను అద్దెకు తెచ్చి పంటను కాపాడు కుంటున్నారు. వేడిమి ప్రభావంతో ఇప్పటికే పొలంలో పగుళ్లు బారాయి. కరెంటుకోతతో హోటళ్ల నిర్వాహ కులు, పిండి మిల్లుల యజమానులు, చిరు వ్యాపారులు, జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో 2014లో అధికారం చేపట్టిన భాజపా విద్యుత్ కొరత లేకుండా పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 24×7 విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ కూడా ఒకటి. 2014-2019 మధ్యకాలంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో యూనిట్ రూ.4.64 వరకూ ఒప్పందాలు చేసు కున్నాయి. అయితే 2019లో అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసుకున్న పవన, సౌరవిద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దుచేసింది. కొనుగోలు చేయడం నిలిపివేసింది. ఆ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సగం ధర చెల్లిస్తోంది. కరెంటు కొనుగోలు చేయకుండానే ఏటా దాదాపు రూ.4000 కోట్ల మేర చెల్లింపులు జరిపినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
థర్మల్ విద్యుత్ కేంద్రాల పట్ల నిర్ల్యక్షం
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తిని పూర్తి స్థాయిలో చేపట్టకపోవడమే విద్యుత్ కొరతకు కారణం. రాష్ట్రంలో పలు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ వీటిని నడపడం కంటే, బయట కరెంటు కొనడమే చౌక అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు యూనిట్ రూ.2.40కే దొరుకుతుందని, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో యూనిట్‌కు 3.65 నుంచి 4.25 దాకా ఉంటుందనే నెపంతో కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య, నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కుదించేసింది. ఇలా 47 శాతం విద్యుత్తు ప్రైవేటు కంపెనీల నుండి కొనుగోలు చేస్తోంది. ఇది కాకుండా ప్రతిరోజు స్వల్పకాలిక కొనుగోళ్లు చేస్తున్నారు. పవర్ మార్కెట్ నుంచి అత్యవసరాల మేరకు విద్యుత్‌ను యూనిట్ రూ. 10 నుంచి రూ. 20 వరకు కొనుగోలు చేస్తున్నారు. బొగ్గు కొనుగోళ్లు ఆపేయడంతో పాటు, బకాయిలు చెల్లించకపోవడంతో మహానది, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ బొగ్గు సరఫరాను దాదాపు నిలిపి వేశాయి. ఇదిలా ఉంటే థర్మల్ కేంద్రాల నిర్వహణకు అవసరమైన బొగ్గును నాలుగు నెలలకు సరిపడా ప్లాంట్లలో నిల్వచేసుకోవాలి. గతంలో కనీసం నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలనే నిబంధనను ఇటీవల 15 రోజులకు మార్చారు. ప్రస్తుతం థర్మల్ కేంద్రాల్లో ఒకటిన్నర రోజుకు మాత్రమే బొగ్గు నిల్వలున్నాయంటున్నారు. థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలను ఉంచక పోవడం కూడా కొరతకు కారణం. ఇక ప్రైవేటుగా విద్యుత్ కొనడమే కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను 25 ఏళ్ల పాటు ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు కట్టబెట్టడానికి మంత్రివర్గం తీర్మానం చేసింది. రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నింటిని లీజులిచ్చేసే అవకాశం లేకపోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
పవర్ హాలిడే ప్రకటన
విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెర గడంతో ఏప్రిల్ 8 నుంచి పవర్ హాలిడే అమలు చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రకటించింది. పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని, వారంలో ఒకరోజు పవర్ హాలిడే అమలవుతుందని, ఆదివారం సెలవు కావడంతో రెండురోజులు పవర్ హాలిడే అమలు చేయాలని పేర్కొంది. అలాగే వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటల విద్యుత్‌ను ఏడుగంటలకు కుదించింది. పరిశ్రమలకు సంబంధించి సాయంత్రం ఆరుగంటల నుండి ఉదయం వరకు విద్యుత్ వాడకం నియంత్రించాలని తెలిపింది. కరోనా దెబ్బతో నష్టాల్లో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు పవర్ హాలీడే వల్ల తీవ్రంగా నష్టపోతామని, కరెంటు కోత విధించరాదని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు ప్రారం భించారు. అకాల వర్షాలు, భారీ వరదలతో రాయల సీమలో 13 లక్షల ఎకరాల్లో పంట కొట్టుకు పోయిందని, ఆ నష్టాలను పూడ్చుకునేందుకు మరోసారి పంటలు వేశామని, అవి చేతికొచ్చే సమయంలో విద్యుత్తు కోతలతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆక్వాకు సమస్యలు
ఆక్వా రైతులకు కరెంటు కష్టాలు మొదల య్యాయి. విద్యుత్తు కోతలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని అక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. ఈ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగవుతు న్నాయి. ముఖ్యంగా వనామి రకం రొయ్యల చెరువుల్లో కరెంటుతో నడిచే ఏరియేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో ఏరియేటర్లు పనిచేయక, ఆక్సిజన్ అందక టన్నుల కొద్దీ రొయ్యలు మృత్యువాతపడుతున్నాయి. ఆక్వా సాగుదారులు లక్షల రూపాయల్లో నష్టాన్ని చవిచూస్తు న్నారు. రొయ్య పిల్లలను కాపాడు కోవడానికి ఏరియే టర్ల నిర్వహణకు డీజిల్ మోటార్లను వినియోగించాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది.
ఛార్జీల భారం
మరోవైపు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను కూడా పెంచింది. గృహ వినియోగ దారులపై రూ. 4300 కోట్లకు పైగా భారాన్ని మోపింది. అందులో టారిఫ్ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్ వసూళ్లు రూ.2,900 కోట్లు. రాష్ట్రంలోని కోటి 70 లక్షల విద్యుత్ వినియోగించే కుటుంబాలపై ఈ భారం పడింది. మరో 20 లక్షల మంది వినియోగదారులపై పరోక్ష భారం తప్పదు. గత 20 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వమూ 50 యూనిట్ల లోపు వాడుకునే పేదల జోలికి రాలేదు. ఈ ప్రభుత్వం మాత్రమే 30 యూనిట్లలోపు వాడుకునే నిరుపేదలను కూడా వదలలేదు. పేదలు, దిగువ మధ్యతరగతి లక్ష్యంగా ఈ ఛార్జీలు పెంచింది. 30 యూనిట్ల లోపు వాడుకునేవారిపై 30 శాతం, 75 యూనిట్లు వాడేవారిపై 44 శాతం, 125 యూనిట్ల లోపు వాడుకునే వారిపై 45 శాతం వరకు వడ్డించింది. ఈ ఛార్జీల పెంపు ద్వారా రూ. 1,400 కోట్ల భారం ప్రజలపై పడుతుంది. ఇదే కాకుండా ట్రూ అప్ చార్జీల పేరుతో 2014-19 వరకు వాడుకున్న విద్యుత్‌పై మరో రూ. 2900 కోట్ల భారం వేశారు. 36 నెలల పాటు నెలకు రెండు భారాలు కలిపి యూనిట్‌కు 68 పైసల నుండి రూపాయి ఎనభై పైసల వరకు ఛార్జీలు పెరుగుతాయి.
ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో ఏర్పడిన విద్యుత్తు సంక్షోభానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని పాలనారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సరైన ప్రణాళికతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఉంటే ఈ రోజు ఇంతలా విద్యుత్తు సంక్షోభం ఉండేది కాదు. అలవి కాని ఎన్నికల ప్రణాళికను పెట్టుకుని.. ఇక ఏ ప్రజా అవసరంతోనూ మాకు పనిలేదు, సంబంధం లేదనేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. విద్యుత్ రంగమే కాదు నిర్మాణరంగం, సాంకేతికరంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా దెబ్బతినని రంగం అంటూ ఈ రాష్ట్రంలో ఏదీ లేదు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్