ఏ‌ప్రిల్‌ 23 అం‌తర్జాతీయ పుస్తక దినోత్సవం

పుస్తకం అంటేనే ప్రపంచం. సర్వకాలాలూ సకల లోకాలూ అందులోనే. మరి అటువంటప్పుడు, పుస్తకానికి ఓ దినోత్సవం ఏమిటి, ఎందుకు? మనిషి అన్నాక అభిరుచి/ఆసక్తి ఉండాలి. అవి లేకుంటే అసలు జీవితమన్నదే వృథా. భాష, సాహిత్యం, కళ, శాస్త్రాలపైన అనురక్తి అంటూ ఉంటే – చదవడం ఒంటపడుతుంది. చదివే ఆ పుస్తకాల ముందూ వెనకా ఏముందో తెలుసుకుంటే వ్యక్తికి వికాసం, జాతికి ప్రకాశం వద్దన్నా వస్తాయి. మల్లెల గుబాళింపులా నక్షత్రాల మిలమిలలా మదిని హత్తుకుంటుంది చదువు. అదిగో, ఆ విద్య సమాంలో ఉంటుంది. సమాజ సురూపమే పుస్తకం. నువ్వూ, నేనూ వెరసి మన అందరికీ పుస్తకమే సమస్తమనేది అందుకే. దీనికి అనుదినమూ పర్వదినోత్సవమే! ఐక్యరాజ్యసమితి కనుసన్నల్లోని విద్య-శాస్త్ర-సాంస్కృతిక విభాగం గ్రంథాలతోపాటు వాటి రచయితలూ, కవులను స్మరిస్తుంటుంది. రచనల్ని సృజించే వారి జనన మరణాలు రెండూ సమ ప్రాధాన్యమంటోంది. మిగతా రోజులతో పోలిస్తే, ఏటా ఏప్రిల్‌ 23‌వ తేదీన ఆ ప్రత్యేకతను గుర్తించింది యునెస్కో. విశ్వవిఖ్యాత గ్రంథకర్తలు షేక్‌స్పియర్‌, ‌వర్డస్‌వర్త్, ‌మరెందరినో గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవ ప్రకటన చేసింది. ఇదంతా పాతికేళ్లపై నాటి మాట. అంతర్జాతీయం నుంచి ప్రాంతీయం దాకా పుస్తకాలు పుస్తకాలే, వాటి రూప నిర్మాతలు సమాన ప్రాధాన్యమున్నవారే. ప్రపంచ పుస్తక రాజధానుల పేర్లను ప్రకటించడం ఐదేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. మనసుపెట్టి చూడాలేకానీ- ఏ పుస్తకానికైనా పరిధీ పరిమితీ ఉంటాయా! అది ఎనలేనిదీ ఎల్లలు కనిపించనిదీ!!

వ్యక్తిత్వానికి అద్దం, జీవనానికి అర్థం -నడవడిక. అది బాగుంటే నల్లేరుమీద నడక, లేకుంటే నిరంతర నరకయాతన. ఆ నడవడిని శాసించేది చదువైతే, పాటించేది మన చేతుల్లోని మంచి పుస్తకం. చదువూ సంస్కారం, విద్యాబుద్ధులు వంటి పదబంధాల అర్థతాత్పర్యాలు పుస్తకాల్లోనే లభిస్తాయి. అమ్మ లాలన, నాన్నలా పాలన, గురువుగా హితబోధన, ఆప్తమిత్రంగా అనుశీలన అన్నారందుకే. ‘వ్యక్తి చక్కబడిన వర్థిల్లు జగమెల్ల’ అని సుగుణజాల కృతికర్త అభిభాషణ. తనను తాను తెలుసుకోవాలన్నా, సహచరుల్లా తెలియజేయాలన్నా పుస్తకాలే ఏకైక మార్గాలు. కనిపెట్టి చూస్తే… మెదడును పాడుచేసే, శరీరాన్ని క్షీణపరిచే, ఏ దిక్కూ మొక్కూ లేకుండా చేయగలిగే చెడ్డ పుస్తకాలూ బోలెడన్ని గుట్టలుగా పడి ఉన్నాయిప్పుడు. వాట న్నింటినీ పక్కకునెట్టి, మనకూ తోటివారికీ మేలు కలిగించే పుస్తక నేస్తాన్ని ఎంచుకోవడమే విజ్ఞత. ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇంకా ఎన్నెన్నో ఇప్పటికీ మన మదిగదిని ఆక్రమించాయి. వాటిల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడేవాటిని ఇలా చూసి అలా పక్కకి వెళ్లిపోవడం కాదు, చదువంటే. చూడటం, చదవడం ఏనాడూ ఒక్కటి కాలేవు. అక్షరాల వెంట చూపులు పరుగులు తీయడమే పుస్తకపఠనం అనిపించుకోదు. కళ్లతో చూసేవి మనసు లోపలికి చేరినప్పుడే చదివినట్లు లెక్క. మిగతావన్నీ కట్టలు కట్టిన మాటల మూటలే. వాటిని విప్పి చూడకుండా మనం ఏదీ తెలుసుకోలేం. ఆ కారణంగానే – పుస్తకాన్ని చూడటం కన్నా, ఆసాంతం చదవడమే అన్ని విధాలా మిన్న. వేలికొసల కదలికలన్నీ పఠనాలు కావు, కాలేవు. పుస్తకాన్ని చదవడమంటే పేజీల్ని అటూ ఇటూ తిప్పడం కాదు; వాటి లోపల ఉన్న దేమిటో పట్టుకోగలగటం. నిజానికి ఇప్పటికీ ఎక్కువసేపు పుస్తకాల్ని చూసేది మనవాళ్లే. చదివేది మాత్రం కొద్దిమందే. ‘చదివేస్తాం, ఎవరైనా ఏదైనా మా చేతికిస్తే’ అనే వాళ్లూ చుట్టూరా ఉన్నారు. ‘కొని చదవరాదా?’ అంటే; ‘అబ్బో! చాలా కష్టం’ అంటూ జేబులు తడుముకునే వాళ్లు కనిపిస్తుంటారు. ఇలాంటివాళ్లకి ఎన్ని పుస్తక దినోత్సవాలు వచ్చి వెళ్లినా ఒక్కటే!!

కొని చదవరాదా?

ఆరుద్ర ఏనాడో తేల్చి చెప్పినట్లు – విజ్ఞానం వికసించిన మూడో కన్ను, వివేకం మనిషికున్న ఏకైక దున్ను. అంతటి విద్య, ప్రజ్ఞ, సృజన ఎప్పుడూ సామాజిక సాంస్కృతిక స్థితిగతులమీదే ఆధారపడి ఉంటాయి. ఆ విశాల కోణాన్ని అవలోకించినప్పుడు.. గ్రంథ రచన, ప్రచురణ, పంపిణీలు కీలకమని ఐరాస సంస్థ విఫులీకరిస్తోంది. రాయగానే సరిపోదు. దానికి ముద్రణ భాగ్యం కలిగించాలి. ప్రచురించడంతోనే అయిపోదు, వాటిని చదువరుల చేతుల దాకా తీసుకెళ్లాలి. రెండు చేతులా పుస్తకం పట్టుకున్నంత మాత్రాన, చదివేసినట్లు అనుకోకూడదు. ఈ లోకానికి ఆ లోకం జతచేరినప్పుడే, పాఠకుడు స్పందిస్తాడు. అనుభూతిని తనలోనే మిగుల్చుకోడు- తెలిసిన అందరికీ పంచుతాడు. అదీ పుస్తక ప్రయోజనమంటే! దినోత్సవం మహోత్సవంగా కొనసాగడమన్నా అదే. నానా రకాల కారణాల మూలాన, ముద్రణల జోరు తగ్గి ఈ-బుక్స్ ‌జోరు పెరిగిపోయింది. వీటితో అన్నీ, అందరికీ వెంటవెంటనే అందుబాటులోకి వస్తు న్నాయన్నది వాస్తవమే అయినా – పఠన ఉపయోగం ఏ మేర అన్నది ఇంకా చర్చనీయ అంశమే. రోడ్డుకు అటూ ఇటూ పుస్తకాల వరస కనిపిస్తున్నా; ప్రదర్శనల పేరిట ఏటేటా రోజుల తరబడి కొలువు దీరుతున్నా; కొనుగోళ్లు పరిమితమనేది బహిరంగ రహస్యం. గ్రంథాలయాల సంఖ్య తగ్గింది; వచ్చివెళ్లే వారి లెక్కా తప్పుతోంది. విపణిలో కొనుగోలు దారులు తగ్గిపోయారు, వారిలోని పఠనాభిలాషా అంతంత మాత్రమే. ‘కొని చదివేవారు ఉండాలేకానీ, ఎన్ని పుస్తకాలైనా ముద్రిస్తాం’ అంటున్నవారున్నారు. నిత్యజీవితంలో ఉపకరించనివి ఎన్ని ఉన్నా లాభ మేమిటని సామాన్యుడి ప్రశ్న. ఈ అన్ని స్థితిగతుల వ్యాప్తినీ పరిగణనలోకి తీసుకున్న యునెస్కో ‘హక్కులు – బాధ్యతలు’ ప్రచార కృషిని తాజాగా విస్తృతం చేసింది. కొని చదివే అలవాటు పెంచడానికి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. చదువుతో సమాజహితం, ఆ చదువే గౌరవ పాత్రమని వేనోళ్ల చాటుతోంది. కాదనేవారు ఎవరుంటారు?

చూసైనా నేర్చుకోలేమా…

విద్యను సంపాదించడానికి ముందుగా కావా ల్సింది గ్రహించే స్వభావం. అదే కోవలో, పుస్తకం చదవడానికి ప్రధానంగా ఉండాల్సింది అక్షరానురక్తి. కల్పవృక్షం లక్ష్యాలు, అక్షయపాత్ర లక్షణాలు ఆ అక్షరాల్లోనే దాగి ఉంటాయి. ఎందరు ఎంతగా వినియోగించినా, తరగని కరగని గని అది. ఎవరి బాల్యమైనా మొదలయ్యేది ఇంటి నుంచే కదా! మాటలు పాటలు పాఠాలు కలబోసిన శక్తి కేంద్రమది. అక్కడి నుంచి వృద్ధాప్యం చివరిదాకా కొనసాగే జీవనయానాన్ని రసభరితం చేసేది పుస్తక పఠన మొక్కటే. ప్రతి సంవత్సరమూ జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో ఉత్సవాలు ఎలా వస్తాయో అలానే తిరిగి వెళ్లిపోతుంటాయి. కాలం ఆగేది కాదు. జ్ఞాన తృష్ణా ఎన్నటికీ తీరదు. వీటన్నింటినీ అన్వయించి మనిషిని ఎప్పటికీ మనిషీగానే నిలబెట్టేది పుస్తకమే! అదంటూ లేని ఇల్లు నిర్జీవదేహంతో సమానమని చెప్తుంటారు. పురోగతికి ఉపకరించే మాధ్యమాలు పుస్తకాలు. అందువల్లనే ప్రపంచ దేశాల్లోని పౌర గ్రంథాలయాల సంఖ్య 3.4 లక్షలకు చేరుకుంది. సింగపూర్‌లోనైతే వాటి నిర్వహణకు నిధులు ఏటేటా పెరుగు తుంటాయి. ‘బాగా చదవండి, మీ తోటివారితో చదివించండి’ అంటూ నిర్వాహక సంస్థలు విస్తృత ప్రచారాలు జరుపుతుంటాయి. రష్యాకి చెందిన మాస్కో గ్రంథశాల ఆ దేశీయుల దృష్టిలో జాతి సంపద. బ్రిటిష్‌ ‌భాండాగారంలో తెలుగు తాళపత్ర గ్రంథాలన్నీ ప్రదర్శిస్తున్నారు. విదేశాల్లో అంతటి సమాదరణ నెలకొంటే, మన ఇంటి మాటేమిటి? పుస్తకాలు, గ్రంథాలయాలు, ఉత్సవాలు, నిధులు, నిర్వహణలు, సమాదరణలు… వీటి ఊసే పాల కులకు పట్టదు. దినోత్సవాలు, వారోత్సవాల్లో తప్ప; పుస్తకాల ప్రసక్తి అంటూ ఉంటే ఒట్టు!! ఇక ఇంకెక్కడి పుస్తక వేడుకలు? రాజకీయాల రణగొణుల నడుమ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ఏనాడో అట కెక్కిన గ్రంథాలు అక్కడి నుంచి ఇంకా దిగి రానంటున్నాయి. గ్రంథాలయాలకు రాజకీయ జాడ్యం అంటుకుని; ఉత్సవాల తేదీలే మరిచి పోయేలా చేస్తున్నాయి.

మార్పుతోనే తీర్పు

ఎవరు ఎన్ని చెప్పినా, ఎందరు ఎన్నెన్ని రాసినా పుస్తక ఫలితాన్ని ఆవిష్కరించలేరు. నిర్వచనానికి అందని, ఏ కొలమానానికీ, అంతుచిక్కని గొప్పతనం అందులో ఉంది. ఇన్ని చదివామని చెప్పడానికో, ఇన్నిన్ని మా బీరువాల్లో చేరాయని చాటడానికో కొందరు ప్రాధాన్యమిస్తుంటారు. ఏ పుస్తకం చదివి ఎటువంటి ప్రభావం పొందారో చెప్పమంటే మటుకు తటపటాయిస్తుంటారు. మరికొన్ని ఇళ్లల్లో పుస్తకాలే కనిపించవు. ఎన్నో రకాల అలంకరణలు లోపలా వెలుపలా ధగధగలాడుతున్నా ఏం లాభం? అసలైన అలంకారం లోపించినప్పుడు, అందం, ఆనందం రమ్మన్నా రావు. పైపై మెరుగులూ నగిషీలూ రాజ్యం చేస్తున్నంత కాలమూ పుస్తకాలన్నీ మౌన మునుల్లా మిగిలి ఉంటాయన్న మాట. ఇది ఏ సంస్కృతికి, నాగరికతకు నిదర్శనమో ఎవరికి వారే ఆలోచించు కోవాలి. ఫలానా వాటిని చదివి తీరండని ఎవ్వరూ ఆదేశాలివ్వరు. చదవరానివి చదవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని గతంలో హెచ్చరికలు చేసేవారు. ఇప్పుడైతే అటువంటివేవీ కనపడవుగాక కనపడవు. ఎక్కడ ఏది తెరిచినా ‘భాషా జ్ఞానం’ మురుగులా పారుతోంది.

మీ చేతిలోని శాశ్వత ఆయుధం (సాధనం)లో తెలుగు అని కొట్టి చూడండి. ముందుగా ప్రత్యక్ష మయ్యేవి తప్పుడు కథలే! బూతులూ రోతలూ పేట్రేగుతున్న ఈ పాడుకాలంలో మంచి పుస్తకాల ఇంగితం ఎవరికి కావాలి? ఇటు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ దినోత్సవాలు ఎందుకు, ఎవరికోసం అన్నవే సగటు మనిషిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రశ్నలు. అలా అని, జవాబులు లేని ప్రశ్నలుండవు. ఎన్నింటికైనా సమాధానమివ్వగలిగిన సత్తా, సత్తువ పుస్తకాలకే ఉంటాయి. చూసే/చదివే రీతుల్లో అంతరాలున్నాయి కానీ; అక్షరరక్ష ఎక్కడికిపోతుంది? చదువులతో ఎవరిని వారు తీర్చిదిద్దుకుంటే లోకాన్నే ఉద్ధరించినంత! మరి మీరేమంటారు?

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE