ఏప్రిల్ 6 బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
స్వతంత్ర భారతదేశ చరిత్ర చెప్పాలంటే ఇక బీజేపీకి ముందు, తరువాత అని చెప్పాలి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి నుంచీ ‘భారతీయ’ ఆత్మకు సుదూరమే. ఆ లోటును బీజేపీ భర్తీ చేసింది. అందుకే భారత్ మాతాజీ కీ జై ఇవాళ సర్వాంగీకార నినాద మైంది. బీజేపీతో మైనారిటీలకు రక్షణ ఉండదని, మత ఘర్షణలు జరుగుతాయని అదేపనిగా విమర్శించిన వారు గతం కంటే ఇప్పుడే దేశంలో శాంతి భద్రతలు సుభిక్షంగా ఉన్న సంగతిని గమనించినా వాస్తవం చెప్పలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం, సంస్కృతి, ధార్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలకు సమస్థానం ఇచ్చేది బీజేపీ మాత్రమే నని ఇప్పుడు భారతీయులంతా గుర్తిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. అత్యంత ప్రతికూల వాతావరణంలో, విష ప్రచారాల నడుమ నాలుగు రాష్ట్రాలు బీజేపీనే వరించాయి.
జాతీయవాదం కోసమే జనసంఘ్
భారతీయ జనతా పార్టీకి మాతృక భారతీయ జనసంఘ్. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సర్‌సంఘచాలక్ మాధవ సదాశివ గోళ్వ్కర్ (గురూజీ) ప్రేరణతో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించినదే జనసంఘ్. దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ సహా ఎంతో మంది స్వయంసేవకులు జనసంఘ్‌లో చేరారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం జరిగిన ఉద్యమంలో డాక్టర్ ముఖర్జీ అమరుడయ్యారు. జనసంఘ్ అయినా బీజేపీ అయినా జాతీయ సమైక్యతను రాజకీయ నినాదంగా చూడలేదు.
కమ్యూనిస్ట్ సోవియట్ నమూనాతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పంచవర్ష ప్రణాళికలను జనసంఘ్ వ్యతిరేకించింది. ‘స్వదేశీ ఆర్థిక వ్యవస్థ’కు పిలుపునిచ్చింది. ఇందులో ఆర్థిక ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ ఉన్నాయి. డా. ముఖర్జీ తర్వాత జనసంఘ్‌ను నడిపించిన దీన దయాళ్ ఉపాధ్యాయ దీన్ని ‘అర్థాయణం’ (ఆర్థిక పరిమాణం) అని పిలిచారు. పాశ్చాత్య సోషలిజం, క్యాపిటలిజం చర్చల్లో చిక్కుకున్న రాజకీయాలకు జనసంఘ్ కొత్త దిశానిర్దేశం చేసింది. పండిట్ దీనదయాళ్ 1965లో విజయవాడలో జరిగిన జాతీయ సదస్సులో ‘ఏకాత్మతా మానవతా వాదం’ అనే సంపూర్ణ భారతీయ తత్వశాస్త్రాన్ని రూపొందించారు.
పంచనిష్టలతో బీజేపీ
వ్యక్తులు, సంస్థల కన్నా దేశం ముఖ్యమని విశ్వసించింది జనసంఘ్. దేశంలో నిరంకుశ పాలనకు బాహాటంగా తెగించిన ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమం ఎన్నో రాజకీయ మార్పులు తెచ్చింది. దారుణ నిర్బంధం తరువాత కొన్ని విపక్షాలు విలీనమై కాంగ్రెస్ పార్టీపై పోరా టానికి పిలుపునిచ్చాయి. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వం వహించారు. జనతా పార్టీ పుట్టింది. ప్రజాభిమతాన్ని బట్టి జనసంఘ్ అందులో విలీనమైంది. 1977 లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కానీ రెండేళ్లకే కుప్పకూలింది. ద్వంద్వ సభ్యత్వం వివాదంతో మాజీ జనసంఘ్ వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధాన్ని వదులుకోవాలని సోషలిస్టులు వాదించారు. ఫలితం జనతా పార్టీలో చీలిక. పూర్వపు జనసంఘ్ నేతలు, ఇంకొందరు ఏకాభిప్రాయం కలవారు ఏప్రిల్ 6, 1980న బీజేపీని స్థాపించారు.
బీజేపీ ప్రస్థానాన్ని గమనిస్తే జాతీయవాదం పునాదిగా ‘పంచనిష్ట’ సూత్రాలు స్పష్టంగా కనిపి స్తాయి. 1) జాతీయవాదం, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత 2) ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత. 3) గాంధేయ సోషలిజం పట్ల నిబద్ధత.. గాంధీజీ నమ్మిన సామాజిక-ఆర్థిక అంశాలు, దోపిడి లేని సమసమాజ భావనలు ఇందులో ఉన్నాయి. 4) సర్వ ధర్మ సమభావన అనే అసలైన లౌకికవాదంపై నిబద్ధత.. 5) విలువలతో కూడిన రాజకీయాలు. దీన్‌దయాళ్ ‘ఏకాత్మతా మానవతావాదం’ పార్టీ ఆశయంగా కొనసాగించాలని 1985 నాటి జాతీయ సమావేశాల్లో నిర్ణయించారు. మోదీ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు అదే ప్రేరణ.
సాంస్కృతిక జాతీయవాదం
భారతదేశానికి విశిష్టమైన సంస్కృతి ఉన్నది. ఎన్నో దాడులకు, ఆక్రమణలకు లోనైనప్పటికీ ఈ సంస్కృతిని దురాక్రమణదారులు దూరం చేయలేకపోయారు. ప్రపంచాన్నే కుటుంబంగా భావించాలని చెప్పిన సనాతన భారతీయ సంప్రదాయంలో మొత్తం ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు అనేకం. మన ప్రజల మనోభావాలను గౌరవించాలి. సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు, విశ్వాసాలకు, చరిత్రకు విలువ ఇవ్వాలి. ఇవి మాత్రమే జాతీయవాదాన్ని బలంగా నిలబెడతాయి. కులాలతోనో, మతాలతోనో పార్టీలు సాగవనీ, ప్రజల మనోభావాలే జాతీయవాదాన్ని నిర్దేశిస్తాయని బీజేపీ నమ్మకం. అలా బీజేపీ దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది
రామమందిర ఉద్యమం
స్వతంత్ర భారత దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమాలు రెండు. మొదటిది రాజకీయో ద్యమం. అదే ఎమర్జెన్సీ వ్యతిరేకత పోరాటం. రెండోది సాంస్కృతికోద్యమం. అది అయోధ్యలో రామజన్మ భూమి విముక్తి. ఈ రెండు ఉద్యమాల్లోనూ కీలకంగా ఉన్నది జనసంఘ్, ఆపై బీజేపీలు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన చోట ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారు. ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని, అక్కడ భవ్యమంది రాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నా కాంగ్రెస్, రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కేవలం ముస్లింల ఓట్ల కోసం, సెక్యులరిజం పేరుతో ప్రజల మనోభావాలను గుర్తించలేదు. అయోధ్య ఉద్యమానికి బాహాటంగా మద్దతు పలికినది బీజేపీ మాత్రమే. ఇది దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అడ్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేపట్టారు. రథయాత్ర బిహార్ చేరుకోగానే నాటి జనతాదళ్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాత్రను అడ్డుకొని అడ్వానీని అరెస్టు చేయించారు. దీంతో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ నేతృత్యంలోని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసినా, పార్టీ నాయకులపై తప్పుడు కుంభకోణాల అభియోగాలు మోపినా బీజేపీ తలొగ్గలేదు. అయోధ్య ఉద్యమానికి ముందు లోక్‌సభలో బీజేపీ బలం కేవలం 2 సీట్లు. అందులో ఒకరు హన్మకొండ నుంచి పీవీపై గెలిచిన సి. జంగారెడ్డి. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా బీజేపీ రామమందిర నిర్మాణ ఉద్యమానికి మద్దతు కొనసాగింది. సుప్రీం కోర్టు తుది తీర్పు రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి అనుకూలంగా రావడంతో అన్ని సమస్యలకు ముగింపు లభించింది. మూడు దశాబ్దాల తరువాత భవ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది భారతీయుల విజయగాథ.
ఆర్టికల్ 370 రద్దు
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీతో పాటు ఎంతో మంది చేసిన పోరాటాలు, త్యాగాలకు నిజమైన నివాళి ఇది. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మోదీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు. ఆగస్టు 5, 2019న ఆ రాష్టాన్ని జమ్ముకశ్మీర్, లద్దాక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని కూడా స్పష్టం చేశారు.ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, కొన్ని రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులు తప్ప దేశ ప్రజలంతా స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దయి మూడేళ్లయింది. ఆ ఆర్టికల్ ఎత్తేస్తే వేర్పాటు వాదం మరింత విజృంభిస్తుందని, భారత్‌కు కశ్మీర్ శాశ్వతంగా దూరం అవుతుందనే వాదనలు అవాస్తవాలు అని తేలిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లో కేంద్రం నేరుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఓవైపు కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించినా పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. పర్యాట కులు 20 నుంచి 25 శాతం వరకు పెరగడటంతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. దీని ఫలితంగా 20 శాతం మందికి ఉపాధి కూడా లభించింది. వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పూర్వ వైభవం సంతరించుకుందని డ్రై ఫ్రూట్ వ్యాపారులు చెబుతున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం
బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మరో సాహసో పేతమైన నిర్ణయం పౌరసత్వ సవరణ చట్టం. 1955 పౌరసత్వ చట్టంలో సవరణ తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు డిసెంబరు 9, 2019న పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీర్మానం ఆమోదింపజేసి చట్టరూపం ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుండి భారతదేశానికి వలస వచ్చే ఆ దేశాల్లోని మైనారిటీలకు భారత పౌరసత్వం లభించేందుకు మార్గం సులువైంది. మతపరమైన ఒత్తిళ్లను తప్పించుకుని భారత్ వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చట్టం ఇది. అయితే విపక్షాలు రాజకీయ ఓటుబ్యాంకు కోసం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు. సీఏఏ (జాతీయ పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌ఆర్సీ (జాతీయ పౌర పట్టిక), ఎన్‌ఆర్పీ (జాతీయ జనాభా పట్టిక)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇదంతా ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా ప్రచారం చేశారు. ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ను నెలల తరబడి ఆందోళనా కేంద్రంగా మార్చారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
కాశీ విశ్వనాథ్ కారిడార్
కాశీ అనగానే ప్రతి హిందువు మనసు పులకి స్తుంది. అత్యంత ప్రాచీన వారసత్వం కలిగిన నగరం. గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన అద్భుతం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్త హిందువుల హృదయాలను పులకింపజేసింది. కాశీ సుందరీ కరణతోపాటు విశ్వనాథుని ఆలయం- గంగానదిని కలుపుతూ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు ఫేజ్-1ను మోదీ ప్రారంభించారు. గతంలో మూడు వేల చదరపు అడుగులుగా ఉన్న ఆలయ విస్తీర్ణాన్ని ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు పెంచారు. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులతో సహా 75 వేల మంది భక్తులు సులభంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ కొత్త కాంప్లెక్స్ గొప్ప భవనం మాత్రమే కాదు. సనాతన సంస్కృతికి ప్రతీక. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులను పూలు జల్లి సత్కరించారు.
త్రిపుల్ తలాక్ రద్దు
ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టంకన్నా ముందుగా మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయం త్రిపుల్ తలాక్ రద్దు. 2017లోనే ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్‌సభ డిసెంబర్ 27, 2018న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ముస్లిం మహిళకు ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. త్రిపుల్ తలాక్ రద్దును ముస్లిం మహిళలంతా హర్షించినా, కొన్ని ఛాందస సంస్థలు, ఓటు బ్యాంకు రాజకీయులు తీవ్రంగా వ్యతిరే కించాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని వాదించాయి. ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సైప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్, అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. ఆ జాబితాలో తాజాగా భారతదేశం చేరింది.
ఉమ్మడి పౌరస్మృతి
తాజాగా కర్ణాటకలో హిజాబ్ గొడవను చూస్తుంటే ఉమ్మడి పౌరస్మృతిని వీలైనంత త్వరగా తేవాలన్న చర్చ మొదలైంది. దీనిని కేంద్రం తీసుకు వస్తుందా? ఇప్పుడు అందరి దృష్టి ఈ విషయం మీద ఉంది. ఒక దేశంలో నివసించే ప్రజలందరికీ ఒకే న్యాయం ఉండాలి. కుల, మత, జాతి, వర్గాలకు అతీతంగా పౌరులు అందరూ చట్టం ముందు సమానులేనని డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్పష్టం చేసింది. అంబేడ్కర్‌తో పాటు అల్లాడి కృష్ణస్వామి, కెఎం మున్షి సార్వత్రిక పౌరస్మృతిని ప్రవేశపెట్టాలని వాదించారు. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆర్టికల్ 44 ప్రకారం దేశమంతా ఒకే స్మృతి ఉండాలి. అయినా దేశంలో 80 శాతం మంది పౌరులు ఒకే పౌరస్మృతి పాటిస్తుంటే ఒక వర్గం మాత్రం ప్రత్యేక స్మృతిని కొనసాగించాలని కోరుకుంటోంది.
1985లో షాబానో కేసులో సుప్రీంకోర్టు భారతదేశంలో సార్వత్రిక పౌరస్మృతిని తక్షణం ప్రవేశపెట్టాలని తీర్పునిచ్చింది. కాని కాంగ్రెస్ సంకుచిత ప్రయోజనాల కోసం ఈ తీర్పును పార్లమెంట్ చట్టంతో తప్పించింది. సార్వత్రిక పౌరస్మృతి ఒక కలగానే మిగిలిపోకూడదని, దేశంలోని పౌరులందరికీ ఒకే స్మృతి ఉండాలని జస్టిస్ ప్రతిభాసింగ్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగ సభ చర్చలు, సుప్రీం కోర్టు తీర్పులు, అంబేడ్కర్ ఆశయాల ప్రకారం ఈ దేశంలో మహిళలు, మతపరమైన మైనారిటీలు సహా అణగారిన వర్గాలందరికీ రక్షణ లభించాలంటే సార్వత్రిక పౌరస్మృతిని అమలులోకి తీసుకురావడం అనేది తక్షణ అవసరం.
పూర్తి మెజారిటీతో మరిన్ని
అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. కాశీ విశ్వనాథ్ కారిడార్.. ఆర్టికల్ 370 రద్దు.. జాతీయ పౌరసత్వ చట్ట సవరణ.. విషయం ఏదైనా బీజేపీ తీసుకున్న నిర్ణయాలు సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ఇతర రాజకీయ పార్టీలు ప్రజల మనోభావాలను అణచివేస్తుంటే, బీజేపీ వారి మనోగతాన్ని గౌరవిస్తోంది. ఈ దిశగా ఉమ్మడి పౌరస్మృతి కూడా త్వరలో అమల్లోకి వస్తుందని ఆశిద్దాం. దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని, మత మార్పిడులపై నిషేధం విధిస్తూ చట్టం తీసుకురావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీకి పార్లమెంటులోని ఉభయ సభల్లో సంపూర్ణమైన మెజారిటీ ఉండాలి. గతాన్ని గమనిస్తే అటల్ బిహారీ వాజపేయి హయాంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకున్నా మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా భాగస్వామ్య పక్షాలు, ప్రతిపక్షాల వత్తిడి ఉండేది.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఉభయ సభల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంటే మరింత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్