తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి నిర్మాణానికి పూనుకుని, పెద్దఎత్తున ఘర్షణకు దిగి భౌతికదాడులు చేసిన క్రైస్తవ మతఛాందసులను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు. తమ మత విశ్వాసాలను కాపాడుకోవడానికి చావుకైనా సిద్ధం అయ్యారు. ఢీ అంటే ఢీ అనేలా శత్రువులపై తలపడ్డారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా అదరలేదు, బెదరలేదు. ఈ సమస్య శాశ్వతంగా తొలగించుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తాహతుకు మించి లక్ష్యం ఉన్నా మడమ తిప్పలేదు. అందరూ కలసి రూ. 24 లక్షలు సేకరించి చర్చి నిర్మించే స్థలాన్ని కొనుగోలుచేసి తమ మతధర్మాన్ని కాపాడుకోగలిగారు. కటిక పేదలైనా తమ మతాచారాలను కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధపడిన ఈ సంచారజాతుల వారిని చూసి ప్రలోభాలకు గురై మతం మారిపోతున్న కొందరు హిందువులు సిగ్గుపడాలి. ఇది హిందువులను జాగృతం చేసే స్ఫూర్తివంతమైన సంఘటన.

ఏడుకొండల స్వామి నెలకొన్న తిరుపతి పట్టణానికి ఆనుకుని ఓటేరు పంచాయతీ పరిధిలో నక్కలవారి కాలనీ ఉంది. ఇక్కడ నక్కలవాళ్లుగా పిలిచే 200 సంచారజాతుల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు షెడ్యూల్డ్ ‌తెగలకు చెందినవారు. వీరి ఆరాధ్యదైవం వీరభద్రస్వామి. కాలనీలో వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆలయ పూజారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, పౌర్ణమికి ఉత్సవం, అన్నదానం జరుగు తుంది. వీరు హిందువులే అయినా హిందూధర్మ శాస్త్రాలపై అవగాహన లేదు. కాని తరతరాలుగా వస్తున్న ఆరాధనా పద్ధతులను పాటిస్తూనే కొనసాగుతున్నారు. ఆ కాలనీలో ఇదే వర్గానికి చెందిన ఒక కుటుంబం దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకుని కాపురం ఉంటోంది. వారికి ఇద్దరమ్మాయిలు. ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి. ఇద్దరు పిల్లలకు ఈ స్థలాన్ని రెండు భాగాలు చేసి కట్నంగా ఇచ్చారు. ఇక్కడే వచ్చింది సమస్య. ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ప్రలోభాలకులోనై చర్చి ఫాస్టరుగా మారాడు. గుడికి ఎదురుగా ఉన్న మొత్తం స్థలాన్ని ఈ చర్చి ఫాస్టరు సొంతం చేసుకున్నాడు. ఆ కాలనీలో క్రైస్తవులు ఎవరూ లేరు. కాని పక్క గ్రామం నుంచి కొందరు క్రైస్తవులను తీసుకొచ్చి మతమార్పిడి ఎజెండాకు పూనుకున్నాడు. రోజూ ప్రార్థనల పేరుతో మైకులు పెట్టి ఇబ్బంది పెట్టడం, శుక్రవారాల్లో ఆలయంలో పూజలు జరుగుతుంటే కూటాలు పెట్టి విగ్రహారాధన తప్పని చెప్పడం, హిందూ దేవుళ్లను దూషించడం, పౌర్ణమి రోజుల్లో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఇబ్బంది కలిగేలా వాహనాలు వీధుల్లో నడిపి విస్తళ్లలో దుమ్ము, ధూళి పడేలా దుర్మార్గపు పనులు చేయిస్తున్నాడు.

ఈ రెచ్చగొట్టే పనులను భరించలేని గ్రామస్తులు ఫాస్టరు దుశ్చర్యలను ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అతడు వినలేదు సరికదా తన కార్యక్రమాలు ఆపనని, అక్కడ చర్చి కడతానని సవాల్‌ ‌చేస్తూ, తన వెంట ఉన్న వారితో కలసి గ్రామస్తులతో ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణలు.. దూషణల నుంచి దాడుల వరకు వెళ్లాయి. ఎంతటి రక్తపాతం జరిపైనా శవాలపై చర్చి కడతానని,  పూజారి తలనరికి దాని మీద చర్చి నిర్మిస్తానని ఫాస్టరు హెచ్చరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ తీవ్రమైన వ్యాఖ్యలతో రగిలిపోయిన గ్రామస్తులంతా సంఘటితమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని పోలీసులు కూడా గ్రామస్తులకు న్యాయం చేయలేదు. దాంతో పెద్దలే పంచాయితీ చేశారు. తాను క్రైస్తవ మత ప్రచారం ఆపనని, కావాలంటే తన స్థలం కొనుక్కోవాలని చెప్పాడు. ఇక ఏం చేయలేని గ్రామస్తులంతా చందాలు వేసుకుని రూ.12 లక్షలు విలువచేసే 2 అంకణాల స్థలాన్ని అతడు చెప్పిన ధర రూ.24 లక్షలకు కొన్నారు. వాడి పీడ విరగడ చేసుకున్నారు. ఈ సంఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు. హిందువులుగా పుట్టి మతధర్మాలు తెలీకపోయినా, తమ ఆరాధ్యదైవానికి నిత్యం పూజలు చేస్తూ, ఆచారాలను కాపాడుకుంటూ, తమ విశ్వాసాలను అడ్డుకునే ప్రయత్నం జరిగితే అంతా కలసికట్టుగా ఎదుర్కొని విజయం సాధించారు. అనేకమంది కళ్లు తెరిపించారు.

సొంతలాభం కోసం మతాలు మారిపోతున్న ఈ తరుణంలో ప్రలోభాలకు లొంగక, ఒత్తిడిని భరించి, తమ సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకోవడంలో సోదరులైన ఈ సంచారజాతుల వారు చూపిన తెగువ, ధైర్యం, సాహసం మనకు స్ఫూర్తిదాయకం.

రెచ్చిపోతున్న మతఛాందసవాదులు

ఆంధప్రదేశ్‌లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులు, హిందూధర్మంపై దాడులు కొనసాగుతున్నాయి. మత మార్పిడులు గతంలోనూ జరిగినా ఇప్పుడు తీవ్రం అయింది. గతంలో హిందువులపై బహిరంగ దాడులకు రావడానికి జంకేవారు. కాని ఈ మూడేళ్లలో పరిస్థితి మారింది. హిందువులపై బహిరంగ దాడులు పెరిగాయి. కొండ బిట్రగుంట, అంతర్వేదిలో ఆలయాల రథాలు దగ్ధం చేశారు. పిఠాపురంలో పలు ఆలయాల్లో విగ్రహాలను పగలగొట్టారు. రామతీర్థంలో రామచంద్రుడి విగ్రహాన్ని నరికివేశారు. ఇలా దాదాపు 100కు పైగా ఆలయాలను హిందూ వ్యతిరేక మతోన్మాదులు ధ్వంసంచేశారు. ఈ సంఘటనలతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనిని అర్ధం చేసుకుని తక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూశాక హిందువులు హతాశులయ్యారు. రథాలను తగులబెట్టినవారు పిచ్చివాళ్లని పేర్కొనడం, రాముడి విగ్రహం నరికివేసిన వారిని పట్టుకోకపోవడం వంటి చర్యలు పుండుమీద కారం చల్లిన చందంగా రగిలిపోయారు.

ప్రకాశం జిల్లా పెద్దరవీడు గిరిజన చెంచు గూడెంలో కమ్యూనిటీ ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా చర్చి కట్టేందుకు ఫాస్టర్లు ప్రయత్నిస్తే స్థానిక హిందువులు అడ్డుకున్నారు. దీంతో ఆ మతంవారు మారణాయుధాలు, రాళ్లతో దాడిచేసి హిందువులను తీవ్రంగా గాయపరిచారు. జనవరిలో ఆత్మకూరులో ముస్లిం మతోన్మాదులు అక్రమ మసీదు నిర్మాణం చేపట్టి హిందువులు ఎంత అడ్డుకున్నా వినకపోవడమే కాక అడ్డుపడుతున్న భాజపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిని హత్యచేసేందుకు పథకం పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవే కాదు, ఇంకా బయటకు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో మూడేళ్లుగా పలు ఆలయాలను తొలగిస్తున్నారు. కాని చర్చిలు, మసీదుల జోలికి మాత్రం వెళ్లడం లేదు.

తితిదే డబ్బును వాడు కుందామని ప్రయత్నించి భంగపడ్డారు. తితిదే బోర్డు సభ్యులుగా అనర్హులను నియమించారని హిందూ సంస్థలు, భాజపా పెద్దఎత్తున ఆరోపణలు చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, అరాచకాలున్నాయి. హిందూధర్మంపై ఇన్ని దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏ మాత్రం స్పందించడం లేదు. దీనిని బట్టి ఆయన కావాలనే తమకు ప్రాధాన్యం తగ్గిస్తున్నట్లు హిందువులు భావిస్తున్నారు.

క్రైస్తవానికి ప్రోత్సాహం!

వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని కించపరుస్తూ.. క్రైస్తవ, ముస్లిం మతాలను ప్రోత్సహిస్తూ మత వివక్షకు పాల్పడుతోంది. వైకాపా ఎమ్మెల్యేల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో సీట్లు తెచ్చుకుని గెలిచిన వారిలో 90 శాతం మంది క్రైస్తవ మతం స్వీకరించినవారేనని, దీని వల్ల నిజమైన ఆయా వర్గాల్లోని హిందువులకు అన్యాయం జరుగుతుందని భాజపా ఆరోపిస్తూ, ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఈ విషయం వైకాపాకు తెలుసు. కాని ఓటుబ్యాంకు కోసం క్రైస్తవులు, ముస్లింలకు అనుకూలంగా ప్రవర్తి స్తుంది. చర్చిలు కట్టడానికి ప్రభుత్వం నిధులిస్తోంది. చర్చి ఫాదర్లకు, ముస్లిం ముల్లాలకు నెలనెలా జీతాలి స్తోంది. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు కూడా వీరికి అనుకూలంగా పనిచేస్తున్నారు. దీంతో మతమౌఢ్య క్రైస్తవ, ముస్లిం ముఠా రెచ్చిపోతున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE