– పాణ్యం దత్తశర్మ

కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. కానీ ఆమె చూడనే చూసింది.

‘‘మీరు… మీరు ఏడుస్తున్నారా?’’ అన్నది ఆశ్చర్యంగా. సమీప బంధువులు చనిపోయినపుడు కూడా ఆయన కంటతడి పెట్టడం ఆమె చూడలేదు.

‘‘ఏం లేదులే పద వెళదాం’’ అన్నాడు. శ్రీపతి కారు డ్రైవ్‌ ‌చేస్తూంటే ముందు సీట్లో అతని ప్రక్కనే కూర్చుందామె.

‘‘నర్మదా! ఇదేమీ పెద్ద విషయం కాదు. గుండె తీసి గుండె కొత్తది పెడుతున్నారు. బ్రెయిన్‌లో రక్తనాళాలు చిట్లితే, సరిదిద్దుతున్నారు. ఏం కాదు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా!’’ అన్నాడు రోడ్‌ ‌వైపు చూస్తూ.

అతని వైపు ప్రేమగా చూసిందామె. తన తలను అతని భుజానికానించుకుని పడుకుంది. ‘‘నేనున్నాను కదా!’’ ఆమాట టానిక్‌లా పనిచేసింది. డజన్ల కొద్దీ కీమోలతో సమానమది.

ఇంటికి వచ్చారు. బయట పదార్థాలేవీ తినకపోవడం మంచిదని చెప్పాడు డాక్టరు. నర్మద బెడ్‌ ‌రూంలో పడుకుంది.

కాసేపటి తర్వాత లేచి, రాత్రి తినడానికేం చేయమంటారు?’’ అనడిగింది. శ్రీపతి భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘డోన్ట్ ‌బాదర్‌. ‌రెస్టు తీసుకో నేను చేస్తాను’’ అని బలవంతంగా పడుకోబెట్టాడు.

పెళ్లయిన తర్వాత మానేశాడు గాని, అంతకు ముందు వంట చేయడం వచ్చతనికి. బెండకాయలు తరిగి కూర చేశాడు. చింతపండు లేకుండా కేవలం టామోటాలతో చారు కాచాడు. భార్యను లేపి, డైనింగ్‌ ‌టేబుల్‌ ‌వద్దకు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు.

‘‘కూర, చారు చాలా బాగున్నాయి’’ అన్నదామె.

‘‘బెండకాయలు ఇంకొంచెం మగ్గి ఉంటే బాగుండేది’’ అన్నాడు భర్త. నర్మద నవ్వింది.

‘‘మీరు చేసిన వంటనైనా ఒప్పుకోరా?’’

‘‘నేను నిస్పక్షపాతిని!’’ అన్నాడు గంభీరంగా, ఆమె మళ్లీ నవ్వింది.

రెండు కీమోలు ముగిశాయి. మొదటిది అంత ప్రభావం చూపలేదు గాని, రెండవదాని తర్వాత సైడ్‌ ఎఫెక్టస్ ‌కనబడసాగాయి. ఒక రోజంతా పొత్తి కడుపులో నొప్పి అని బాధపడిరది. ఒకరోజు ఎడమ భుజం తీవ్రమయిన నొప్పని విలవిలలాడిది. మరోరోజు వీపు అంతా లాగేస్తుంది. చేతులు వెనక్కు ఎత్తి జడవేసుకోలేకపోతూంటే శ్రీపతి జడ వేశాడామెకు.

జుట్టంతా వెనక్కు దువ్వి నూనె రాసి, మూడు పాయ లుగా జడ అల్లాడు. ‘‘డన్‌! ‌చూశావా నీ కంటే• కూడా బాగా వేశాను!’’ అన్నాడు. నర్మద నవ్వింది. భుజాలు, వీపు నొప్పి భర్తతో జడ వేయించుకున్న ఆనందంలో తగ్గినట్లనిపించింది.

శ్రీపతి పెట్టిన లీవ్‌ అయిపోయింది. ఆ రోజు ఆమెకు టిఫిన్‌ ‌పెట్టి ఆఫీసుకు వెళ్లాడు. వెళ్లిన గంటలోనే ఇంటికి వచ్చాడు. అతని ముఖం సంతోషంతో వెలిగి పోతోంది!

‘‘నర్మదా! మనకొక గుడ్‌ ‌న్యూస్‌!’’ అన్నాడు చేతిలో కాగితాన్ని చూపుతూ. ‘‘ఏమి టండీ అది?’’ అన్న దామె ఆసక్తిగా భర్తను చూస్తూ..

‘‘నాకు వి.ఆర్‌. ‌శాంక్షన్‌ అయింది. రేపట్నుంచి ఆఫీసు లేదు. నీతోనే ఉంటా హ్యాపీగా’’

‘‘నర్మద నిరుత్తరురాలైంది. ‘‘వి.ఆర్‌. ‌తీసుకున్నారా?’’ అన్నది బాధగా.

‘‘వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు శ్రీపతి. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.

‘‘నీకంటే నాకు ఉద్యోగం ముఖ్యంకాదు నర్మదా’’ అన్నాడు ప్రేమగా.

‘‘మనకేం ఇబ్బంది లేదు. మన పెన్షన్‌ ‌మనకు వస్తుంది. రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకేం?’’

భర్త గుండెల్లో తలదాచుకుందామె.

మరొక కీమో తర్వాత ఇంటికి వచ్చారు. మరునాటి నుండే నర్మద జుట్టు దువ్వుతుంటే పెచ్చులు పెచ్చులుగా ఊడసాగింది. తలలో వెంట్రుకలకు దుళ్లలో సలుపు. దువ్వుకోవాలంటే దుర్భరమైన బాధ. డా. బాజిరెడ్డి గారికి ఫోన్‌ ‌చేశాడు శ్రీపతి. ఆయన సమస్యను విని ఇలా చెప్పాడు-

‘సైడ్‌ ఎఫెక్టస్‌లో ఇది కూడా ఒకటి. జుట్టు అట్టలు కట్టేస్తుంది. నరాలు లాగేస్తాయి. బార్బర్‌ను పిలిచి గుండు చేయించండి. ఆమెకు రిలీఫ్‌గా ఉంటుంది’’

నర్మదతో ఎలా చెప్పాలా అని మధనపడ్డాడు. కానీ తప్పదు. ఇదీ ట్రీట్‌మెంట్‌లో ఒక భాగమనుకుంటే సరి.

కానీ అతడు ఊహించినట్లుగా నర్మద ఏమీ రియాక్ట్ అవలేదు. ‘‘ఈ నరకయాతన కన్న అదే మంచిది’’ అన్నది.

‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సుఖం లేదు’’ అని నవ్వాడు శ్రీపతి. నర్మద కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.

మర్నాడు ఉదయం వీధి చివరనున్న బార్బర్‌ ‌షాపుకు వెళ్లాడు. పరిస్థితి వివరించి ఒకతన్ని వెంటపెట్టుకుని వచ్చాడు. వరండాలో ఒక ప్లాస్టిక్‌ ‌కుర్చీలో కూర్చుని గుండు చేయించుకుంది నర్మద.

‘‘స్నానం చేస్తాను’’ అని లోపలికి వెళ్లింది.

అతన్ని ఉండమని చెప్పి, లుంగీ కట్టుకుని, మీద టవలు కప్పుకుని, అదే కుర్చీలో కూర్చున్నాడు. తనకూ గుండు చేయమన్నాడు.

బార్బర్‌ ఆశ్చర్యపోయాడు. ‘‘మీకెందుకు సార్‌!’’ అనడిగాడు. ‘‘అది నీకెందుకు?’’ అన్నాడు నవ్వుతూ శ్రీపతి.

‘‘సమజయింది సార్‌! అమ్మకు గంత బీమారొచ్చి గుండు సేపించాల్సొ చ్చిందని నీవు భి చేపిచ్చుకుంటున్నవ్‌. ‌గట్లుండాలె ప్యారన్నంక’’ అన్నాడు బార్బరు.

తానూ గుండు చేయించుకున్నాడు. ఇష్టంగా పెంచుకున్న మీసాలతో సహా తీయించేశాడు. అతనికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వచ్చాడు. స్నానం చేసి తలతుడుచుకుంటూ బయటకు వచ్చింది నర్మద. ‘‘మీరన్నట్లు హాయిగా ఉందండీ!’’ అంటూ భర్త వైపు చూసి నివ్వెరపోయింది.

‘‘మీరు… మీరెందుకు…’’ అంటూనే తన కోసం అతడు చేసిన త్యాగం అర్థమై కళ్లు నీటి చెలమలవుతుండగా అతన్ని అల్లుకుపోయింది.

ప్రేమగా ఆమె తల నిమురుతూ అన్నాడు శ్రీపతి. ‘‘నీకు లేని జుట్టు నాకెందుకు నర్మదా! ఒక ఆడదానికి జుట్టు ఎంత అందాన్నిస్తుందో, దాన్ని పోగొట్టుకోవాలంటే ఎంత వేదనననుభవిస్తుందో నాకు తెలుసు. నీకు మోరల్‌ ‌సపోర్టుగా ఉండటానికే నేనూ చేయించుకున్నాను.’’

కొన్ని నెలలపాటు నరకం చవిచూసింది నర్మద. ఏదీ సరిగ్గా అరిగేది కాదు. విరోచనాలు, వాంతులయ్యేవి. నీరసపడిపోయేది. ఒక పెద్ద గిన్నె నిండా పల్చని మజ్జిగ చేసి. అందులో కొద్దిగా నిమ్మకాయ పిండి, ఉప్పువేసి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రిజ్‌లో ఉంచేవాడు. రెండు గంటలకొకసారి ఆమెతో తాగించేవాడు.

వంట చేయడంలో నిష్ణాతుడయ్యాడు. ఏం చేయమంటావని ఆమెనే అడిగేవాడు. అన్నీ బాగా కుదిరినా తానే వంకలు పెట్టి ఆమెను నవ్వించేవాడు. పిక్కలు లాగేస్తున్నాయండీ అంటే నువ్వుల నూనె రాసి ఒత్తేవాడు.

నర్మద కిదంతా కలలా ఉంది. ముప్ఫై సంవత్సరాలుగా తన చేతితో మంచినీళ్లు కూడా తీసుకొని తాగని ఈ మనిషి. ఉద్యోగం మానేసి తనవెంటే తిరుగుతూ, తనక్కావలసినవన్నీ సమకూరుస్తూ, పల్లెత్తు మాట అనకుండా ప్రేమానురాగాలను పంచుతూ ఉంటే తన జన్మ ధన్యమైనట్లుగా ఉందామెకు.

‘‘పాపిష్టి దాన్ని మీతో నానా చాకిరీ చేయించుకుంటున్నాను’’ అంటే ‘‘పిచ్చిదానా ఈ ముప్ఫై సంవత్సరాలుగా నీవు నాకు చేసిన చాకిరీ ముందు ఇది ఏమాత్రం? అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు. నాకు వచ్చి ఉంటే నీవు చేయవా? నాకు నీవు, నీకు నేను. మన వైవాహిక జీవితంలో నీ మీద ప్రేమను ఎప్పుడూ చూపలేకపోయాను. ప్రేమను ప్రదర్శించడం నాకు రాదు కూడా. అయినా ఇంకెన్నాళ్లులే నీవు రికవర్‌ అయిన తర్వాత మళ్లీ నా విశ్వరూపం చూపించనూ’’

నర్మద మళ్లీ మళ్లీ నవ్వింది అతని మాటలకు.

మధ్యలో కూతురు, అల్లుడు, మనవడు.. వచ్చి నెలరోజులుండి వెళ్లారు. వాళ్లు వచ్చి వెళ్లిన తర్వాత మరింత నిబ్బరం వచ్చింది నర్మదకు.

సంవత్సరం గడిచింది. మళ్లీ టెస్టులు చేయించి, పరిశీలించి డాక్టర్‌ ‌బాజిరెడ్డి గారన్నారు- ‘‘కంగ్రాజ్యులేషన్స్ అమ్మా! నేనూహించిన దానికంటే త్వరగా రికవర్‌ అవుతున్నారు. రొమ్ములో గడ్డ కూడా పరిమాణంలో గణనీయంగా తగ్గింది. అదే కొనసాగితే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. మనుపటి కంటే కీమో ఫ్రీక్వెన్సీ తగ్గించినా బాగానే ఉన్నారు. సైడ్‌ ఎఫెక్టస్ ‌కూడా బాగా తగ్గాయి. ఈ లెక్కన మరో నాలుగయిదు నెలల్లో మీరు మామూలుగా అయిపోతారు. ఆల్‌ ‌ది బెస్ట్.’’

‘‘‌మీ శ్రీవారు అందించిన సహకారం గొప్పదమ్మా! కీమో జరుగుతున్నంత సేపూ గంటలకొద్దీ మీ వద్దే కూర్చుని మీ చేతిలో చెయ్యి వేసుకుని ఉండే వాడాయన. అటువంటి భర్త దొరకడం మీ అదృష్టం’’

‘‘మీరనుకున్నంత మంచివాడిని కాదండీ నేను డాక్టరుగారూ’’ అన్నాడు శ్రీపతి సీరియస్‌గా. ‘‘ఆమెకు పూర్తిగా నయం అయిన తర్వాత ఇంతకింత బదులు తీర్చుకుంటా.’’

నర్మదతో పాటు డాక్టరు గారు కూడా హాయిగా నవ్వేశారతని మాటలకు. తన ఆత్మ సఖుని వైపు ప్రేమనంతా నింపుకున్న కళ్లతో చూసిందామె.

About Author

By editor

Twitter
YOUTUBE