ఏప్రిల్‌ 14 అం‌బేడ్కర్‌ ‌జయంతి

రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసి, ఒక నూతన రాజకీయ చింతనలోకి  ప్రపంచం ప్రవేశించిన కాలంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వలస పాలనలు, రాచరికాలు కాలగర్భంలో కలసిపోతున్న కాలంలో భారత్‌ ‌ప్రజాస్వామ్య యుగంలో ప్రవేశించింది. ఇందుకు అవసరమైన సుస్థిర రాజ్యాంగం అనే తొలి సోపానాన్ని అమర్చినవారే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌. ‌భారత్‌ ‌సార్వభౌమాధికారం కలిగిన దేశంగా స్వతంత్ర రాజ్యాంగంతోనే ఆవిర్భవించింది. తరువాత ఏడున్నర  దశాబ్దాలుగా ఆ రాజ్యాంగమే భారత వ్యవస్థను నడిపిస్తున్నది.


అంబేడ్కర్‌ ‌రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షులు. ఎస్‌సీలు,మహిళలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారు. సంఘ సంస్కర్త. స్వాతంత్య్రానంతర తొలి ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖను నిర్వహించారు. బొంబాయి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎలిఫెన్‌స్టన్‌ ‌కళాశాలలో ప్రవేశం పొందిన తొలి ‘అంటరాని’ వ్యక్తి అంబేడ్కర్‌ ‌కావడం విశేషం. అక్కడ నుంచి 1913లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతిశాస్త్రంలో, లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్ ‌నుంచి అర్ధశాస్త్రంలో డాక్టరేట్లు సాధించారు.

అంబేడ్కర్‌ అభిమానులుగా చెప్పుకునే వారు రెండు ప్రధాన అంశాలను సౌకర్యంగా మరుగు పరుస్తూ ఉంటారు. ఈ పని ఆయన ఆశయానికీ, విజ్ఞతకీ అపచారమని కూడా వీరు భావించలేకపోతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370‌ని అంబేడ్కర్‌ ‌వ్యతిరేకించారు. అలాగే ఉమ్మడి పౌరస్మృతిని ఆయన సమర్థించారు. ఆయన ఆలోచనలే గెలిచాయని ఇటీవల ఆర్టికల్‌ 370 ‌రద్దు విషయంలో రుజువైంది. ఆ ఆర్టికల్‌ ‌కారణంగా కశ్మీర్‌ ‌భారత్‌ ‌నుంచి విడిపోయేటంత ప్రమాదం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను రద్దు చేయడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. వేర్పాటువాదం తగ్గుముఖం పట్టింది. ఇక ఉమ్మడి పౌరస్మృతిని కూడా భారతదేశం ఏర్పాటు చేసుకుంటే అంబేడ్కర్‌ ఆశయం నెరవేర్చినట్టవుతుంది.

ఉమ్మడి పౌరస్మృతి ఇవాళ్టి ‘అవసరం’ అని నవంబర్‌ 18, 2021‌న అలహాబాద్‌ ‌హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని కూడా ఆ న్యాయస్థానం ఆదేశించింది. ఆనాడు రాజ్యాంగ పరిషత్‌ ‌పెద్దలు అభిప్రాయపడిన రీతిలోనే ఈ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశ సమైక్యతకు దోహదం చేయగలదని అలహాబాద్‌ ‌హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయం సక్రమంగా అందించేందుకు, అమలు పరిచేందుకు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని 2021లోనే ఢిల్లీ హైకోర్టు కూడా పిలుపునిచ్చింది. వాస్తవాల సంఘర్షణ నేపథ్యంలో ఇది అవసరమని ఒక విడాకుల కేసు వాదనలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యా నించింది. పిల్లి మెడలో గంట కట్టవలసినది ఎవరూ అన్న రీతిలోనే అంతా ఈ అంశం విషయంలో వ్యవహరిస్తున్నప్పటికీ అలాంటి స్మృతిని ఆచరణలోకి తేవలసిన బాధ్యత కేంద్రానికి ఉందని చెప్పింది. ఇదే అంశం మీద రాజ్యాంగ పరిషత్‌లో నవంబర్‌ 23, 1948‌న లోతైన చర్చ జరిగిన విషయం గుర్తుంచుకోవాలని కూడా స్పష్టం చేసింది. దేశంలో హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు వంటివారందరికీ ఎవరి చట్టాలు వారికి ఉన్నాయి. వీటన్నిటి స్థానంలో ఒక ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలన్న కోరిక నాడు రాజ్యాంగ పరిషత్‌ ‌చర్చలలో వ్యక్తమైంది.

రాజ్యాంగ పరిషత్‌ ‌పనిచేస్తున్నప్పుడు అనేక అంశాల మీద కీలకమైన చర్చలు జరిగాయి. కుల విభేదాలతో, అసమానతలతో ఉన్న భారత సమాజాన్ని అంబేడ్కర్‌ ‌సంస్కరించాలని ప్రగాఢంగా వాంఛించారు. ఇందుకు ఒక మార్గంగా ఆయన పౌరస్మృతిని ఎంచుకున్నారు. అలాగే పర్సనల్‌ ‌లా గురించి పట్టుబట్టే వర్గాలను ఆయన దూరంగా ఉంచారు. ముఖ్యంగా షరియత్‌ను సమర్థించే ముస్లిం ప్రతినిధి బృందాలను ఆయన ప్రోత్సహించలేదు. భారతదేశం మొత్తానికి వర్తించేటట్టు ఉమ్మడి పౌరస్మృతిని తెచ్చుకోవడానికి రాజ్యం పాటుపడాలని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ‌కూడా దేశ ప్రజలకు ఉమ్మడి పౌరస్మృతిని అందించేందుకు కృషి చేయాలనే చెప్పింది. ఇలాంటి ఒక ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఏమిటి? పాత స్మృతులు, మత గ్రంథాల ఆధారంగా, కుల కట్టుబాట్ల పునాదిగా వచ్చిన స్మృతులను ఆధునిక కాలంలో దూరంగా ఉంచడానికే. అంటే దేశం యావత్తు, ప్రజలంతా, కులమత భేదాలు లేకుండా ఒక పౌరస్మృతి కిందకు వస్తారు. కానీ ఈ ప్రయత్నం మైనారిటీల ధోరణి కారణంగా వాస్తవ రూపం దాల్చలేదు. మరీ ముఖ్యంగా ముస్లింలు ఛాందస వైఖరి తీసుకున్నందున ఈ ఆలోచనకు కూడా ఎవరూ వెళ్లే సాహసం చేయలేదు. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యుడైన నజీరుద్దీన్‌ అహ్మద్‌, ఇం‌కొందరు ఆయా మతాల వారి అనుమతి లేకుండా అవి చెప్పే చట్టాల జోలికి వెళ్లరాదని గట్టిగా వాదించారు. ఇప్పటికి ఉమ్మడి పౌరస్మృతి విషయంలో దేశంలో డోలాయ మాన స్థితి కొనసాగుతున్నది. అలాగే వివాహం, విడాకులు, దత్తత అంశాలతో కూడిన హిందూ కోడ్‌ ‌బిల్లును కూడా ఆనాడు కొందరు హిందువులు కూడా వ్యతిరేకించిన మాట నిజం. కానీ ఇందులో హిందూ వ్యవస్థలో రావలసిన కొన్ని సంస్కరణల కోసమే అంబేడ్కర్‌ ఈ ‌ప్రయత్నం చేశారు. పురాతన కాలానికి చెందిన స్మృతులను అలా ఆచరిస్తూ వెళితే మహిళలకు విపరీతమైన అన్యాయం జరుగుతుందని అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. వారు వివక్షకు గురి కావడమే కాదు, హక్కులు లేనివారిగా మిగిలి పోతారని ఆయన ఆవేదన చెందారు.

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా రాజ్యాంగ పరిషత్‌ ‌చర్చలలో అంబేడ్కర్‌, ‌కేఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి ఉమ్మడి పౌరస్మృతి అవసరమనే వాదించారు. ఒక దేశ సామాజిక ఔన్నత్యాన్ని ఉమ్మడి పౌరస్మృతి నిలబెడుతుందని మున్షి వాదించారు. ఉమ్మడి పౌరస్మృతి దేశవాసుల మధ్య ఐక్యతా స్పృహను కలిగిస్తుందని అల్లాడి అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్లాడి వాదనలను సమర్థిస్తూనే ఇంకొన్ని అంశాలను కూడా అంబేడ్కర్‌ ‌చెప్పారు. నిజానికి ఉమ్మడి పౌరస్మృతి కొత్తగా తెచ్చేది ఏమీ ఉండదని, ఇప్పటికే అది అమలులో ఉన్నదని చెప్పారు. వివాహ వ్యవస్థ, వారసత్వం చట్టాలు ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యాలని అన్నారు. అసలు ఉమ్మడి పౌరస్మృతి లేకుంటే ప్రభుత్వం తీసుకురాదలచిన సంస్కరణలకు చోటు ఉండదని కూడా ఆయన హెచ్చరించారు. ఆర్టికల్‌ 35‌కు పలువురు ముస్లిం సభ్యులు చేసిన సవరణల పట్ల కూడా అంబేడ్కర్‌ ‌తీవ్రంగానే స్పందించారు. వాయువ్య భారతంలో 1935 వరకు అసలు షరియా లేనేలేదని, హిందూ చట్టాలనే అక్కడ పాటించారని, ఈ సంగతి సభ్యులు మరచిపోయారని కూడా అంబేడ్కర్‌ ‌చెప్పవలసి వచ్చింది. 1939లోనే కేంద్ర చట్టం వచ్చిన తరువాతే ముస్లింలను హిందూ చట్టం నుంచి మినహాయించారని చెప్పారు.

ఉమ్మడి పౌరస్మృతితో వివిధ వర్గాల మధ్య ద్వేషం పెరుగుతుందని ముస్లిం సభ్యులు చేసిన వాదనను అల్లాడి కృష్ణస్వామి పూర్తిగా నిరాకరించారు. అలాంటి ద్వేషం పోగొట్టి దేశంలో ఒక ఐక్య వాతావరణం తీసుకురావడమే ఉమ్మడి పౌరస్మృతి ఆశయమని గుర్తు చేశారు. ఈ వాదోపవాదాలు ముగిసిన తరువాత రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతిని భాగం చేయాలని అత్యధికంగా ఓట్లు వేశారు. కానీ అది జరగలేదు. ఇందుకు మినహాయింపు గోవా. అక్కడ మాత్రం ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ స్మృతిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి అభ్యర్థి పుష్కర్‌సింగ్‌ ‌హామీ ఇచ్చారు కూడా. కాబట్టి ఈ అంశం దేశం మరిచిపోయే, పక్కనపెట్టే అవకాశం ఉండదు. అలాగే కర్ణాటకలో హిజాబ్‌ ‌వివాదం పతాకస్థాయికి చేరుకున్న సందర్భంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ ‌మాటలనే ఉటంకించింది. ‘మనం మత ఆదేశాలను విద్యాసంస్థల బయటనే విడిచిపెడదాం’ అని ఆయన అన్నారు. నిజానికి ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీకి చెంది ఉండడం, కర్ణాటకలో ప్రభుత్వం కూడా బీజేపీదే కావడం కేవలం యాదృచ్ఛికం. బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ఈ ఎన్నికలలో లేదా హిజాబ్‌ ‌వివాదం నేపథ్యంలో స్వీకరించినది కాదు. కోర్టు తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ కర్తవ్యంగా కూడా ఉమ్మడి పౌరస్మృతి నిర్మాణం ఇప్పటికి మిగిలే ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE