కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రుడో ఎట్టకేలకు దిగివచ్చారు. చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. తన అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన నిరసనను అణచివేసేందుకు విధించిన అత్యవసర పరిస్థితి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రజాందోళనకు భయపడి వెనక్కి తగ్గారు. తద్వారా తాను తీసుకున్న నిర్ణయం తప్పని పరోక్షంగా ఒప్పుకున్నారు. అయినప్పటికీ తన మొండివైఖరిని వీడలేదు. ఎమర్జెన్సీని రద్దు చేసినప్పటికీ ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొనడం ద్వారా నిరంకుశత్వాన్ని చాటారు.

గత ఏడాది భారత్‌లో రైతుల ఆందోళనలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రుడో ఇప్పుడు తన దేశం దగ్గరకు వచ్చేసరికి మాట మార్చడం విశేషం. ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అయినా అది కెనడా ఆంతరంగిక విషయమన్న భావనతో భారత్‌ ‌సహా ఏ దేశమూ, ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మనదేశంలో రైతుల ఆందోళనల సందర్భంగా జస్టిన్‌ ‌ట్రుడో ఈపాటి సంయమనం పాటించలేకపోయారు. విషయాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోలేక పోయారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న కనీస దౌత్య మర్యాదలను పాటించ లేకపోయారు. తద్వారా తన స్థాయిని తానే తగ్గించు కున్నారు. అంతిమంగా అభాసుపాలయ్యారు.

వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా కెనడాలో ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో గత నెలలో జస్టిస్‌ ‌ట్రుడో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. ఆందోళనలో భాగంగా ట్రక్కు డ్రైవర్లు సరిహద్దు దేశమైన అమెరికాకు వస్తువుల సరఫరాను నిలిపే శారు. వాహనాలను ఆపివేశారు. శాంతియుతంగానే తమ ఉద్యమాన్ని కొనసాగించారు. అయినప్పటికీ ట్రుడో ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారన్న అపఖ్యాతిని మూట గట్టుకున్నారు.

భారత్‌లో రైతుల ఆందోళన సందర్భంగా నాడు ట్రుడో చేసిన అనుచిత వ్యాఖ్యలపై మనదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యం, చర్చల గురించి ఇతరుల నుంచి చెప్పించుకునే పరిస్థితి తమకు లేదని పేర్కొంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న కనీస సంప్రదాయాన్ని జస్టిన్‌ ‌ట్రుడో విస్మరించారంటూ ఖండించింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు రోజుల తరబడి రహదారులను స్తంభింపజేసినా భారత ప్రభుత్వం ఎక్కడా తొందరపడలేదు. కొన్ని సార్లు ఆందోళనలు దారి తప్పి వ్యవహరించినా సంయమనమే పాటించింది. ఆందోళనకారులు భారత పౌరులేనని, వారి డిమాండ్లు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, పోలీసులు సంయమనం పాటించాలని సూచించింది. చివరికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు ఆందోళనకారులు ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేసినా ప్రభుత్వం ఉదారంగానే వ్యవహరించింది.

ఒక్క రైతుల ఆందోళనే కాదు, ఇతర ఉద్యమాల సమయంలోనూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో సంయమనం, సహనం పాటిం చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ- సిటిజన్‌షిప్‌ ఎమెండ్మెంట్‌ ‌యాక్ట్), ‌జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ- నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్), ‌జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) ‌సందర్భంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సమయంలోనూ కేంద్రం ఎక్కడా తొందరపాటు చర్యలకు ఉపక్రమించలేదు. ఉద్యమాల వెనక కొన్ని స్వార్థపూరిత రాజకీయ పార్టీల హస్తం ఉన్నప్పటికీ ప్రభుత్వం సహనం వహించింది. ఆయా పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టినప్పటికీ బాధ్యతాయుతంగానే వ్యవ హరించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే, ఆందోళన వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందన్న వాస్తవానికి అనుగుణంగానే వ్యవహరించింది. వారి అభిప్రాయాలను గౌరవించింది. ఏదో ఒక రోజున వాస్తవాలను గుర్తించి వారే వెనక్కి తగ్గుతారని భావించింది. అంతే తప్ప ట్రుడో మాదిరిగా తీవ్ర చర్యలకు పాల్పడలేదు. ఈ విషయాన్ని అంతిమంగా ప్రజలు గుర్తించారు. అంతర్జాతీయ సమాజం సైతం గుర్తించింది.

ప్రభుత్వ శాంతియుత ధోరణికి మరో అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. సీఏఏ చట్టం సందర్భంగా దేశ రాజధానిలోని షాహిన్‌బాగ్‌లో నెలల తరబడి ఆందోళన కొనసాగినా శాంతియుతంగానే వ్యవ హరించింది. ప్రజా ఉద్యమాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి గల గౌరవానికి పై రెండు ఘటనలు నిలువెత్తు నిదర్శనం. ఇతర ప్రభుత్వాలకు భారతీయ జనతా పార్టీ సర్కారుకు గల తేడా ఇది. కెనడా అత్యవసర పరిస్థితి గురించి వందేళ్లకు పైగా చరిత్ర గల హస్తంపార్టీ, వామపక్షాలు, ఇతర జాతీయ పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE