ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను మన దేశానికి తరలించే విషయంలో కేందప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌ ‌ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఖర్కివ్‌ ‌నుంచి రైళ్ల ద్వారా బయటపడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆశలు నింపుతున్నాయి. మన విదేశాంగశాఖ రష్యా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఖర్కివ్‌, ఇతర నగరాల్లోని భారతీయుల తరలింపుపై దృష్టి కేంద్రీకరించింది. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదలచేసిన మొదటి ట్రావెల్‌ అడ్వైజరీ ప్రకారం మార్చి 3 నాటికి 17వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ ‌సరిహద్దుకు తరలినట్టు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తరలింపునకు ఉద్దేశించిన ‘ఆపరేషన్‌ ‌గంగ’ కోసం నడిపే విమానాల సంఖ్యను మరింతగా పెంచే అవకాశముంది. ఇదే సమయంలో భారతీయ వాయుసేన విమానాలను కూడా వినియోగిస్తుండటంతో తరలింపు మరింత వేగం పుంజుకుంది. యుద్ధం ఆరంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మోదీ పుతిన్‌తో మూడుసార్లు మాట్లాడారు. ప్రపంచ నాయకులతో మాట్లాడబోనని పుతిన్‌ ‌చెబుతున్న నేపథ్యంలో మోదీ మూడుసార్లు మాట్లాడటం నిజంగా విశేషం. కాగా, మార్చి 8 నాటికి యుద్ధం 13వ రోజుకి చేరుకుంది.

ప్రస్తుతం ఉక్రెయిన్‌ ‌పశ్చిమ ప్రాంతం గుండా ఇతర దేశాల్లోకి ప్రవేశించడం భారతీయ విద్యార్థులకు కష్టంగా మారింది. ఉక్రెయిన్‌ అధికారులు, సైన్యం వారిని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో తూర్పు వైపు రష్యా సరిహద్దు మాత్రమే తమకు భద్రమని భావిస్తున్నారు. ఈ కారణంచేతనే రష్యా భూభాగానికి చేరుకొని అక్కడినుంచి భారత్‌కు రావచ్చునన్నది వారి అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ రష్యా అధ్యక్షుడితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఆపరేషన్‌ ‌గంగను విజయవంతం చేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌, ‌సమీ తదితర యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తు న్నామని మార్చి 2న రష్యా రాయబారి మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్‌లోని వేర్వేరు సంక్లిష్ట ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులు భద్రంగా వెళ్లేందుకు వీలుగా సురక్షిత కారిడార్‌ ‌కోసం అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఇక్కడ భారత ఔన్నత్యాన్ని తెలుపుతూ, స్ఫూర్తిని నింపే ఒక సంఘటనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఉక్రెయిన్‌ ‌నుంచి పోలెండ్‌లోని బుఛారెస్ట్‌కు భారతీయ విద్యార్థులు చేరుకోవడానికి మన దేశ త్రివర్ణ పతాకమే ‘రక్షణ’గా నిలవడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అంశం. పాకిస్తాన్‌, ‌టర్కీకి చెందిన విద్యార్థులు కూడా భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని సరిహద్దులను దాటడం మన ఔన్నత్యానికి నిదర్శనం.

ఉక్రెయిన్‌ ‌సంక్షోభం మరో భారతీయ విద్యార్థి పరోక్ష మృతికి కారణమైంది. విన్నిట్సియా ప్రాంతంలో ఉన్న చందన్‌ ‌జిందాల్‌ ‌ప్రాణాలు కోల్పోయాడు. ఇతను పంజాబ్‌ ‌వాసి. జిందాల్‌ ‌సహజ కారణాలతోనే మృతి చెందాడని చెబుతున్నా ఈ విషయంలో చాలా రాద్ధాంతం జరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన రెండో విద్యార్థి చందన్‌ ‌జిందాల్‌. అం‌తకుముందు కర్ణాటకకు చెందిన నవీన్‌ ‌శంకరప్ప జ్ఞానగౌడార్‌ అనే మెడికల్‌ ‌విద్యార్థి మార్చి 1న రష్యా క్షిపణి దాడిలో మృతిచెందాడు. జిందాల్‌ ‌మృతికి విదేశాంగ శాఖ ట్విటర్‌ ‌ద్వారా సంతాపం తెలిపింది. అంతకుముందు శంకరప్ప తల్లిదండ్రులతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించి సానుభూతి తెలిపారు.

ఉక్రెయిన్‌ ‌యూనివర్సిటీల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ మిగిలిన కోర్సులను పోలెండ్‌ ‌యూనివర్సిటీల్లో పూర్తిచేసుకోవచ్చు. రోడ్డు రవాణా, పౌర విమానయానశాఖ సహాయమంత్రి వి.కె. సింగ్‌, ‌పోలెండ్‌కు చెందిన జెస్‌జౌ నగరంలోని రిజిడెంకీ హోటల్‌లో ఆరువందల మంది భారతీయ విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పోలెండ్‌కు చేరుకొని, ఉక్రెయిన్‌ ‌విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. మెడికల్‌ ‌కోర్సులు మధ్యలో వదిలేయాల్సి రావడంతో తీవ్రమైన వేదనలో ఉన్న వైద్య విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే అంశం. మనదేశంతో మంచి స్నేహ సంబంధాలున్న పోలెండ్‌ ఈ అవకాశాన్ని కల్పించిందని మంత్రి వెల్లడించారు.

ఆంక్షల వల్ల ఎవరికి నష్టం?

ఆంక్షలు విధించడం వల్ల ఆహారం, ఇంధన రంగాలు తీవ్ర సంక్షోభానికి గురవుతాయి. వీటి ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. ఆంక్షల వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను అంచనా వేసిన కొన్ని పశ్చిమదేశాలు ఇందుకు ఇష్టపడటంలేదు. అయినప్పటికీ యూఎస్‌, ‌యూకేలు మొండిగా ఆంక్షలతో ముందుకెళుతున్నాయి. కొన్ని యూరప్‌ ‌దేశాలు కూడా ఆత్మహత్యా సదృశమైన ఆంక్షలు విధించడానికే ముందుకెళుతుండటం వాటి మూర్ఖత్వానికి పరాకాష్ట. రష్యా, ఉక్రెయిన్‌లు ప్రపంచంలోనే గోధుమ, ధాన్యం, పొద్దుతిరుగుడు గింజలు అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశాలు. ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు ఇవి పెద్దఎత్తున ఎగుమతి అవుతాయి. ఒకవేళ ఈ సరఫరాలు నిలిచిపోతే ఈ ప్రాంతాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పటికే దశాబ్దకాలంలో ఎక్కువ ధర పలుకుతున్న ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించి నప్పుడు వీటి సరఫరాలపై ప్రభావం లేకపోయినా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటిన సంగతి గుర్తుంచు కోవాలి. తర్వాత రష్యా, ఉక్రెయిన్‌ల ఎగుమతులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈజిప్టు, టర్కీల విశ్వసనీయ ‘బ్రెడ్‌ ‌బాస్కెట్‌’‌గా ఇవి కొనసాగు తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా రసాయన ఎరువులను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా ఒకటి. వీటి సరఫరా దెబ్బతింటే ప్రపంచ వ్యాప్తంగా పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రష్యా నుంచి అల్యూమినియం, నికెల్‌, ‌పల్లాడియం, స్టీల్‌ ఉత్పత్తులపై విధించే నిషేధం పశ్చిమ దేశాలకే నష్టం. జేపీఎం మోర్గాన్‌ ‌వెల్లడించిన ప్రకారం శుద్ధిచేసిన రాగి, అల్యూమినియం, నికెల్‌ ‌లోహాల సరఫరాలో రష్యా వాటా 4 నుంచి 6 శాతం వరకు ఉంది. 2018లో రష్యాకు చెందిన ‘యునైటెడ్‌ ‌కో రసెల్‌ ఇం‌టర్నేషనల్‌ ‌పేజేఎస్‌సీ’పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ప్రపంచ అల్యూమినియం మార్కెట్‌లో పెనుసంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు స్విఫ్ట్ ‌చెల్లింపుల వ్యవస్థను కూడా రద్దు చేయడం వల్ల నిధుల సరఫరా మందగించి ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సహజవాయు సరఫరా ఆగిపోతే యూరప్‌ ‌దేశాల్లోని లోహ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో పడతాయి. వాటిల్లో ఇంధనంగా వాడేది సహజ వాయువు మాత్రమే. దీనిని యూరప్‌ ‌దేశాలకు చెందిన ప్రజలు శీతాకాలంలో ఇళ్లలో హీటర్లలో ఇంధనంగా వాడతారు. గ్యాస్‌ ‌సరఫరా నిలిచిపోతే ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు.

ఉక్రెయిన్‌ ‌సంక్షోభం కారణంగా సెమికండక్టర్ల కొరత మరింత పెరిగే అవకాశముంది. ఎందుకంటే సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు రష్యా-ఉక్రెయిన్‌ల నుంచే సరఫరా అవుతాయి. యుద్ధం వల్ల ఈ సరఫరాలు నిలిచిపోవడంతో కొనుగోలుదారులకు వాహనాలు అందుబాటులోకి రావడానికి మరింత జాప్యం తథ్యం. ఇదే సమయంలో వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఉక్రెయిన్‌ ‌సెమి కండక్టర్‌ ‌గ్రేడ్‌-‌నియాన్‌ను; సెన్సార్‌ ‌చిప్స్, ‌మెమొరీలో ఉపయోగించే పల్లాడియంను రష్యా సరఫరా చేస్తాయి. ప్రపంచ పల్లాడియం ఎగుమతుల్లో రష్యా వాటా 40 శాతం. ఇక రష్యా నుంచి చమురు, సహజవాయు సరఫరాకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదాన్ని అరికట్టే ఉద్దేశంతో అమెరికా తమ వద్ద ఉన్న ఇంధన నిల్వల్లో 30 మిలియన్‌ ‌బ్యారళ్ల చమురును తన 31 సహచర దేశాలకు అందించ డానికి నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ ‌మేరకు ప్రకటన విడుదల చేశారు. మరి అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని ఉక్రెయిన్‌ ‌మంటల్లో చలికాచుకునే చర్య అనుకోవాలా? ఎందుకంటే ఆయా దేశాలకు తన చమురును ఊరికే ఇవ్వదు కదా!

భారత్‌ ‌వైఖరికి కారణం ఇదే!

చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో, ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు రష్యా ఆయుధాలు మాత్రమే కాదు, దౌత్యపరమైన మద్దతు కూడా మనకు అవసరం. అందుకే ఉక్రెయిన్‌ ‌సంక్షోభంలో పుతిన్‌పై విమర్శలు చేయకుండా భారత్‌ ‌జాగ్రత్త వహిస్తోంది. ఈ పరిస్థితిని అర్థంచేసుకొని అమెరికా తనపై ఒత్తిడి పెంచకూడదని కూడా భావిస్తోంది. అంతేకాదు, కశ్మీర్‌ ‌విషయంలో నరేంద్రమోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలకు రష్యా మద్దతు ఇచ్చింది. పుతిన్‌ ‌బాగా విశ్వసించేది భారత్‌ను మాత్రమే. చైనాతో ఎంత ప్రగాఢమైన స్నేహాన్ని కొనసాగించినట్టు కనిపించినా, అది ఒకస్థాయి వరకు మాత్రమే. ఎందుకంటే చైనా విశ్వసనీయ దేశం కాదు. దొరికే ప్రతి అవకాశాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసమే వినియోగిస్తుంది. ముఖ్యంగా 2040 లోగా వ్లాదివో స్టాక్‌ను, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ను కలిపేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చైనాను పుతిన్‌ ‌విశ్వసించడం చాలా కష్టం. అదీకాకుండా ఉక్రెయిన్‌ ‌విషయంలో నాటో దేశాల నిర్వాకం తెలిసిందే. వీళ్లను నమ్ముకొని ఆ దేశం విధ్వంసం అంచున నిలిచింది. ఇక ఆసియా-పసిఫిక్‌ ‌ప్రాంతంలో భారత్‌ ‌ప్రాధాన్యాన్ని గుర్తించిన అమెరికా.. ఉక్రెయిన్‌ ‌విషయంలో భారత్‌ ‌వైఖరిపై మరో సానుకూల కోణంలో ఆలోచించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. భారత్‌ ఎప్పుడూ విదేశీ ఒత్తిళ్లకు ఎంతమాత్రం లొంగని రీతిలో తన ప్రయోజనాలకు అనుగుణమైన విదేశాంగ విధానమే అనుసరిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌తో క్రమంగా బలపడుతున్న రక్షణ సహకారాన్ని అమెరికా ఒక్కసారిగా చాపచుట్టేస్తుందనుకోవడం కూడా సరికాదు. అందువల్ల మనదేశంపై కఠినవైఖరి అవలంబించాలంటే అమెరికా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

మార్చి 2న యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌పార్లమెంట్‌ ఉ‌క్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి సూతప్రాయంగా అంగీకరిస్తూ చేసిన తీర్మానం వల్ల ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క నగరం క్రమంగా రష్యా చేతుల్లోకి వెళ్లిపోతు న్నాయి. అనుకున్నంత వేగంగా కాకపోయినా, క్రమంగా ఇది కొనసాగుతోంది. ఆవిధంగా ఉక్రెయిన్‌ ‌రష్యా చేతుల్లోకి వెళ్లిపోతున్న తరుణంలో దాని నాటో సభ్యత్వం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు చెందిన ఖెర్సొన్‌ ‌పట్టణం రష్యా సైన్యం స్వాధీనంలోకి వెళ్లిపోయింది. దీన్ని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. 2,90,000 జనాభా ఉన్న ఈ పోర్ట్ ‌సిటీ స్వాధీనానికి ముందే మరో పోర్ట్ ‌సిటీ బెర్డియాన్‌స్క్ ‌రష్యా దళాల ముట్టడిలో ఉంది. కీవ్‌ ‌పట్టణం కూడా రష్యా చేతుల్లోకి వెళ్లే పరిస్థితి. కానీ రెండు రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ ‌సైన్యా లను తేలిగ్గా ఓడించి ముందుకు సాగుతున్నప్పటికీ నగరాల్లో ప్రజలు ఆయుధాలతో ముందుకు వస్తుండటం రష్యాకు తలనొప్పిగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ఉక్రెయిన్‌ ‌ప్రభుత్వం తమ దేశ ప్రజలకు ఆయుధాలిచ్చి వారిని కవచాలుగా ఉపయోగించుకుంటున్నదని దీన్నిబట్టి అర్థమవు తోంది. మనదేశ విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం కూడా ఇందులోనే భాగమని భావించాల్సి ఉంటుంది. అంతేకాదు అక్కడి ప్రజలు జాత్యంహంకార వైఖరిని ప్రదర్శిస్తుండటం విచారకరం. ఏమైనప్పటికీ యుద్ధం ముగింపు ఆలస్యం కావడం రష్యాకు పెను ఆర్థిక భారానికి దారితీస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE