‘శాసనసభ సమావేశాల ఆరంభ వేళ గవర్నర్ ప్రసంగం సభ్యులంతా వినడం సంప్రదాయం. అది శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు. చట్టసభ ఏదైనా ఈ సంప్రదాయాన్ని పాటించాలి. ఇలా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడం మా పార్టీ (కాంగ్రెస్) విధానం కాదని చెప్పదలుచుకున్నాను. ఇది సభా మర్యాదకు భంగం కూడా.’ మధ్యప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు జితూ ప్రసాద్ తాజా సమావేశాల ఆరంభానికి కొంచెం ముందు తాను వాటిని బహిష్కరిస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీని మీద ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పక్ష నాయకుడు కమల్‌నాథ్ స్పందన ఇది. పార్టీ ఏదైనా, సభా మర్యాదను ఇంత సమున్నతంగా నిలిపినందుకు శ్లాఘించ వలసిందే. అందుకే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్‌ను అభినందించారు. ఆంధప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలలో మార్చి 7 నాటి పరిణామాలు గమనించిన తరువాత కమల్‌నాథ్ మాటలలోని ఔన్నత్యం, విజ్ఞత అర్ధమవుతాయి. నాలుగు రాష్ట్రాలలోను ఆ తేదీనే శాసనసభ సమావేశాలు మొదలయినాయి. అన్నిచోట్ల గవర్నర్ వ్యవస్థ ఏదో రూపంలో వార్తలకెక్కింది.
గవర్నర్ ప్రసంగాన్నీ, అప్పుడప్పుడు రాష్ట్రపతి ప్రసంగాన్నీ విపక్షాలు నిరసించడం తెలిసిందే. అంతవరకు హక్కే కూడా. కానీ మార్చి 7 నాటి ఆంధప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ శాసనసభలలో గవర్నర్ ప్రసంగాల సందర్భంగా జరిగిన రగడ సర్వసాధారణ పరిణామమని భావించడానికి వీలుకాదు. అధికార, విపక్షాల నాయకులు చెబుతున్న కారణాలు ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ప్రారంభించగానే ‘రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గోబ్యాక్’ అంటూ తెలుగుదేశం సభ్యులు గందరగోళం సృష్టించారు. ప్రసంగ ప్రతులు చించివేశారు. ఇందులో మాజీ శాసనసభాపతి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. మరొక నేత అచ్చెన్నాయుడు ప్రసంగ ప్రతిని చింపి గాల్లోకి విసిరారు. తరువాత అధికార, ప్రతిపక్షాలకు జరిగిన సమావేశంలో మీరు అధికారంలో ఉండగా ఇలా చేయలేదా అని అచ్చెన్నాయుడు వైసీపీని ఉద్దేశించి అన్నారని వార్తలు వచ్చాయి. ఇంకా, చాలా రాష్ట్రాలలో ఇలాగే ఉంది కదా అని తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారని వార్తలు చెబుతున్నాయి. ఇలాంటి వాదనలు సరైనవేనా? సబబేనా?
తెలంగాణలో అసలు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఇటీవల గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ విభేదాలు తీవ్రమైనట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇది జరగడం ప్రాధాన్యం సంతరించుకోకుండా ఉండదు. అలాగే బీజేపీకీ కేసీఆర్‌కూ మధ్య అగాథం పెరిగింది. కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గవర్నర్ తమిళిసై ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేయడమూ తెలిసిందే. ఇదొక పార్శ్వమైతే, గవర్నర్ ప్రసంగం లేకుండా సమావే శాలు ఏమిటని ప్రశ్నించినందుకు బీజేపీ సభ్యులు రాజాసింగ్, రఘునందనరావు, ఈటల రాజేందర్‌లను ఈ సమావేశాల వరకు బహిష్కరించడం మరొకటి. ప్రతిష్టాత్మక హుజూరాబాద్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలిచి వచ్చిన రాజేందర్‌కు ఇవే తొలి సమావేశాలు. గవర్నర్ ప్రసంగం అంశం మీదే కాంగ్రెస్ సభ్యులూ వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేనందున ప్రభుత్వ విధానాలను విమర్శించే అవకాశం ప్రతిపక్షాలు కోల్పోయాయని కాంగ్రెస్ నాయకుడు భట్టివిక్రమార్క చెప్పడం సహేతుకమే. ఇక పశ్చిమ బెంగాల్‌లో కథ మరొక రకంగా ఉంది. అక్కడ విపక్షంలో బీజేపీ ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగిన హింస గురించి చర్చించాలని సభ్యులు పట్టు పట్టి, గవర్నర్ జగదీప్‌థన్‌కర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అంతే. చిత్రం ఏమిటంటే, గవర్నర్ అంటే ఏమాత్రం గౌరవం లేని మమతా బెనర్జీ, బీజేపీ సభ్యుల రగడతో ఆపేసిన ప్రసంగాన్ని కొనసాగించవలసిందని రెండు చేతులూ ఎత్తి ఆయనను వేడుకోవడం!
ఇదంతా చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద కక్ష, తాము ఆడమన్న విధంగా ఆడకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు మోకాలడ్డడమా అన్న దురహంకారం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
గవర్నర్లు, రాష్ట్రపతి ప్రసంగాలను నిరోధించిన చరిత్ర అన్ని పార్టీలకు ఉంది. లేదా ఆ ప్రసంగాలు ప్రభుత్వం చెప్పించిన కాకమ్మ కథలని విమర్శించడమూ మామూలే. కానీ ఈ క్రమంలో సభా మర్యాదలు మంట గలిస్తే ఎలా? ప్రసంగ ప్రతులు చింపి గవర్నర్ మీదకి విసరడం సరైనదేనా? ఇవన్నీ ఫెడరల్ వ్యవస్థను బలహీనపరిచేవే. ప్రతి రాష్ట్రంలోను పొంచి ఉన్న వేర్పాటువాద శక్తుల గొంతు పెంచేవే. పైగా ఈ దుందుడుకుతనం ప్రాంతీయ పార్టీలలోనే ఎక్కువ. కానీ కేరళలో సీపీఎం గవర్నర్ పట్ల చూపుతున్న వైఖరి మరీ హేయం. నిజానికి 1959లో కేరళలో నంబుద్రిపాద్ ప్రభుత్వాన్ని నాటి రాష్ట్ర గవర్నర్ బూర్గుల రామకృష్ణరావు, నెహ్రూ, ఇందిరల సలహాతో సస్పెండ్ చేసిన నాటి నుంచి, ఆరు దశాబ్దాల నుంచి గవర్నర్ వ్యవస్థ మీద వివాదాలు ఉన్నాయి. కొందరు గవర్నర్లు ఆ వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారిన సంగతీ నిజం. అలా అని ముఖ్యమంత్రులంతా పులుకడిగిన ముత్యాలు కాదు కదా! ప్రజలు ఎన్నుకుంటే వచ్చాం అంటూ రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించినవారు లేరా? వారి చర్యలు చట్ట విరుద్ధమేనంటూ కోర్టులు తేల్చడంతో జైళ్లకు వెళ్లిన ముఖ్యమంత్రుల మాటేమిటి? అసలు గవర్నర్‌కు హక్కులే లేవనీ, రాష్ట్రాలలో రబ్బరు స్టాంపులనీ భావించడం ప్రజాస్వామ్యం కాదు. గవర్నర్ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థలో అంతర్భాగం. దీనిని కాదంటే కుదరదు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. గవర్నర్ వ్యవస్థను చులకన చేసే సంస్కృతికి ఎంత తొందరగా స్వస్తి పలికితే అంత మంచిది.